సంత అంటే పక్కా భవనాల్లో కాకుండా ఆరుబయట వ్యాపారం జరిగే ప్రదేశం. [1] సంతలు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో జరిగినప్పటికీ, పట్టణాల్లో కూడా జరుగుతూంటాయి. ప్రధానంగా భారత ఉపఖండంలో సంతలు ఎక్కువగా జరుగుతాయి. [2] ప్రతి వారం ఏదో ఒక నిర్దుష్టమైన రోజున సంతలు జరుగుతాయి. వాటిని వారపు సంతలు అని కూడా అంటారు. జరిగే రోజును బట్టి శనివారం సంత, గురువారం సంత అని కూడా అంటారు. జరిగే ప్రదేశం పేరున కూడా సంతల పేర్లుంటాయి. వారంలో ఒకటి కంటే ఎక్కువ రోజుల్లో కూడా సంతలు జరగడం కద్దు.

నెల్లూరు జిల్లా యల్లాయపాళెం అనే గ్రామం సంతలో ఒక వ్యాపారి దుకాణం

సంతలో వివిధ రకాలైన వస్తువులు అమ్మకానికి లభిస్తాయి. సాధారణంగా విశాలమైన బహిరంగ ప్రదేశంలో సంతలు జరుగుతాయి. వ్యాపారులు తమ సామగ్రిని ఎడ్లబళ్ళమీద, లారీల్లో లేదా స్వయంగా మోసుకొని సంతకు తెస్తారు. ఉదయాన్నే డేరాలు వేసుకొని దుకాణాలు తెరుస్తారు. వ్యవసాయదారులు తాము పండించిన ధాన్యాలు, కూరగాయలు, పండ్లు మొదలైనవి అమ్మకానికి తెస్తారు. కొందరు వ్యాపారులు చిన్న పిల్లలకోసం ఆట వస్తువులు, తినుబండారాలు కూడా తెచ్చి అమ్ముతారు. సంతలో సామాన్యంగా రోజూ గ్రామంలో దొరకని వస్తువులు కూడా కొనుక్కొనే అవకాశం కలుగుతుంది.

ఆ గ్రామానికి చెందినవారే కాకుండా చుట్టుప్రక్కల గ్రామాలవారు కూడా ఉత్సాహంగా సంతకు వస్తారు. తాము తెచ్చిన వస్తువులను అమ్మివేసి తమకు కావలసిన వస్తువులను కొనుక్కొంటారు. ప్రాచీనమైన వస్తు మార్పిడి పద్ధతి దీని నుంచే మొదలయ్యంది. దూర ప్రాంతాలకు వెళ్ళి కొనుక్కొనే వాటి కంటే సంతలో దొరికే వస్తువుల ధరలు సాధారణంగా తక్కువగా ఉంటాయి. ఆవులు, గేదెలు, ఎడ్లు, దున్నలు మొదలైన పెంపుడు జంతువుల అమ్మకాలు, కొనుగోళ్ళు కూడా సంతల్లో జరుగుతాయి. నిర్దుష్టమైన వస్తువుల కోసమే ప్రత్యేకంగా జరిగే సంతలు కూడా ఉంటాయి. ఉదాహరణకు పశువుల సంత, చేపల సంత, బత్తాయి పడ్ల సంత మొదలైనవి. తెలంగాణ లోని కామారెడ్డిలో మోటారుసైకిళ్ళకు కూడా వారపు సంత జరగడం విశేషం. [3]

సంత నిర్వహణకు ఆ గ్రామ పంచాయితీ కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తుంది. గుడారాలకు స్థలాలు కేటాయిస్తుంది. ఇందుకోసం కొంత రుసుం వసూలు చేస్తుంది. సంతలో చెట్లు నాటి నీడ కల్పిస్తుంది. ఇలా నాటిన చెట్లు ఒక తోట లాగా కనిపిస్తుంది. దీనిని 'సంతోట' (సంత+తోట) అంటారు. వర్షం వస్తే సరుకులు తడిసిపోకుండా కొన్ని షెడ్డులు కూడా నిర్మిస్తుంది. సంతలో దొంగతనాలు, అక్రమ వ్యాపారాన్ని నిరోధించడానికి పోలీసులకు గ్రామ యువజన సంఘం సభ్యులు తోడ్పడతారు.

ఇన్ని విధాలుగా గ్రామంలో అందరికీ ఉపయోగపడే సంత గురించి అందరూ ఎదురుచూస్తుంటారు.

కట్టంగూర్‌లో పశువుల సంత

రకాలు మార్చు

  • సంతలో దొరికే ప్రధాన వస్తువును బట్టి సంతకు పేరు రావచ్చు. ఉదాహరణకి చేపల సంత, పశువుల సంత
  • సంత జరిగే వారాన్ని బట్టి, ఆదివారం సంత, శుక్రవారం సంత ..
  • సంత జరిగే ఊరు లేక స్థలాన్ని బట్టి, ఉదాహరణకి లింగంపల్లి సంత

ఇంటర్ నెట్ లో సంతలు మార్చు

ఇక్కడ కొనడం/అమ్మడం తో పాటు, వేలంపాటలు కూడా ఉంటాయి.

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. "Haat". Oxford Dictionary. Archived from the original on July 20, 2012.access date March 2015
  2. Crow, B., Markets, Class and Social Change: Trading Networks and Poverty in Rural South Asia, Palgrave, 2001, [Glossary] p. xvii
  3. Telugu, 10TV; madhu (2020-02-23). "కామారెడ్డిలో బైక్‌ల సంత గురించి తెలుసా". 10TV Telugu. Archived from the original on 2023-01-06. Retrieved 2023-01-06.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
"https://te.wikipedia.org/w/index.php?title=సంత&oldid=3795563" నుండి వెలికితీశారు