సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం

ఆంధ్ర ప్రదేశ్, తిరుపతి జిల్లా, శ్రీహరికోట లోని అంతరిక్ష కేంద్రం
(సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి దారిమార్పు చెందింది)

సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ - SDSC) లేదా షార్ (శ్రీహరికోట రేంజ్ - SHAR) ఇస్రో నిర్వహణలో ఉన్న ఉపగ్రహ ప్రయోగ కేంద్రం. ఇది ఆంధ్రప్రదేశ్‌లో పులికాట్ సరస్సు- బంగాళాఖాతాల నడుమ శ్రీహరికోట అనే ద్వీపంలో సుమారు 175 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. మొదట్లో షార్ గా పిలవబడిన ఈ కేంద్రాన్ని 2002 నుంచి మాజీ ఇస్రో ఛైర్మన్ సతీష్ ధావన్ పేరు మీదుగా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అని పిలుస్తున్నారు. భూమధ్యరేఖకు దగ్గరగా ఉండడం, ఇస్రో ఈ స్థలాన్ని ఎంచుకోవడానికి ఒక కారణం. రాకెట్ ప్రయోగ కేంద్రం భూమధ్య రేఖకు ఎంత దగ్గరగా ఉంటే భూమ్యాకర్షణను అధిగమించి పైకి వెళ్ళేందుకు రాకెట్‌కు అంత తక్కువ ఇంధనం ఖర్చౌతుంది. సరిగ్గా భూమధ్య రేఖ పైన అత్యంత తక్కువ ఇంధనం ఖర్చౌతుంది. శ్రీహరికోట 13 డిగ్రీల 43 సెకండ్ల అక్షాంశం మీద ఉంది. భౌగోళికంగా, సాంకేతికంగా, ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉన్న ఫ్రెంచి గయానాలోని కౌరు రాకెట్ ప్రయోగ కేంద్రం కేవలం ఏడు డిగ్రీల అక్షాంశంపై ఉండగా, శ్రీహరికోట కేంద్రం భూమధ్య రేఖకు అత్యంత దగ్గరగా ఉన్న కేంద్రాల్లో ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది.

సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (SDSC)
GSLV-F08 కదలగల ప్రయోగపీఠంపై, వాహన అమరిక భవనం నేపథ్యంలో
సంస్థ వివరాలు
స్థాపన 1 అక్టోబరు 1971; 53 సంవత్సరాల క్రితం (1971-10-01)
అధికార పరిధి భారత ప్రభుత్వం
ప్రధానకార్యాలయం India శ్రీహరికోట, తిరుపతి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
13°43′12″N 80°13′49″E / 13.72000°N 80.23028°E / 13.72000; 80.23028
కార్యనిర్వాహకులు పి. కున్‌హికృష్ణన్, సంచాలకుడు
Parent agency ఇస్రో
వెబ్‌సైటు
ISRO SHAR home page
పటం
పటం
పటం
సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం OSM గతిశీలం పటం

2021 ఆగస్టు నాటికి ఈ కేంద్రం నుంచి 689 ప్రయోగాలు జరిగాయి. ఇందులో 79 కృత్రిమ ఉపగ్రహాలు (శాటిలైట్లు), 539 రాకెట్లు ఉన్నాయి.[1]

చరిత్ర

మార్చు

1969 లో శ్రీహరికోట రాకెట్ కేంద్రంగా ఎంపికయింది. శ్రీహరికోట పేరు మీదుగా దానికి SHAR అని విక్రం సారాభాయ్ నామకరణం చేశాడు.[2] 1971 అక్టోబరు 9న రోహిణి-125 సౌండింగ్ రాకెట్ ను ప్రయోగాత్మకంగా పరీక్షించడంతో కేంద్రం కార్యకలాపాలు మొదలయ్యాయి.[3] 1969-1979 మధ్యలో ఈ కేంద్రంలో ఉపగ్రహ ప్రయోగం చేసేముందు జరపవలసిన పరీక్షలు చేసేందుకు అవసరమైన సౌకర్యాల ఏర్పాటుతో వేగంగా అభివృద్ధి చెందింది. ఇంకా అక్కడ పనిచేసే ఉద్యోగులకు కావలసిన ప్రాథమిక సౌకర్యాలైన ఇళ్ళు, విద్యుత్తు, టెలికమ్యూనికేషన్స్, ఆరోగ్య సౌకర్యాలు మొదలైనవంతా అభివృద్ధి చేశారు. అది మొదలు, చంద్రయాన్-1, మార్స్ ఆర్బిటర్ మిషన్‌తో సహా ఎన్నో ప్రయోగాలకు ఈ కేంద్రం వేదికైంది. ఇంతటి విశిష్టత కలిగిన శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం పేరును ఇస్రో మాజీ ఛైర్మన్ సతీష్ ధావన్ జ్ఞాపకార్థం 2002 సెప్టెంబరు 5న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్గా మార్చారు. ఇది భారతదేశంలోని ఏకైక ఉపగ్రహ ప్రయోగ కేంద్రం. ఇక్కడనుండి ఎన్నో PSLV, GSLV ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించారు. అసెంబ్లింగ్, టెస్టింగ్‌తో పాటు ప్రయోగాలకూ ఇది వేదికగా ఉంది. ఇప్పటిదాకా 575 సౌండింగ్ రాకెట్లనూ 42కు పైగా ఉపగ్రహాలనూ ప్రయోగించారు.

షార్‌లో ప్రస్తుతం రెండు లాంచి ప్యాడ్‌లు ఉన్నాయి. మొదటి వేదికను 1990ల్లో నిర్మించగా రెండోది 2005 లో ఉపయోగంలోకి వచ్చింది. ఈ రెండిటివల్ల ఏడాదికి 6 ప్రయోగాలను జరిపే సౌకర్యం ఉంది. ప్రస్తుతం మూడో వేదిక నిర్మాణం లో ఉంది. దీన్ని మానవ సహిత ప్రయోగాలకు అనువుగా నిర్మిస్తున్నారు.

ప్రయోగ వేదికలు

మార్చు

షార్‌లో ప్రస్తుతం రెండు ప్రయోగ వేదికలు ఉపయోగంలో ఉండగా ఎస్సెల్వీ లాంచ్ ప్యాడ్ అనే పాత వేదికను ప్రయోగాలనుండి విరమింపజేసారు. మూడవ వేదిక ప్రస్తుతం నిర్మాణంలో ఉంది.

మొదటి ప్రయోగ వేదిక

మార్చు

మొదటి ప్రయోగ వేదిక 1990 లలో ఉపయోగంలోకి వచ్చింది. దీన్ని పిఎస్‌ఎల్‌వి ప్రయోగాల కోసం తయారు చేసారు. తరువాత జిఎస్‌ఎల్‌వి ప్రయోగాలకు కూడా ఉపయోగించారు.

రెండవ ప్రయోగ వేదిక

మార్చు

రెండవ ప్రయోగ వేదిక 2005 లో ఉపయోగంలోకి వచ్చింది. ఇది ఆధునిక సాంకేతిక హంగులతో వివిధ రకాల రాకెట్ల ప్రయోగాలకు అనుగుణంగా సార్వత్రిక వేదికగా నిర్మించబడింది.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. correspondent, dc (2021-08-15). "Shar going strong after 689 missions: Director". Deccan Chronicle (in ఇంగ్లీష్). Retrieved 2022-03-25.
  2. Rao, P. V. Manoranjan; B. N. Suresh; V. P. Balagangadharan, eds. (2015). "4.1 The Spaceport of ISRO - K. Narayana". From Fishing Hamlet to Red Planet: India's Space Journey (in ఇంగ్లీష్). India: Harper Collins. p. 328. ISBN 9789351776901. Archived from the original on 2022-03-08. Retrieved 2022-03-22. ఈ కేంద్రానికి విక్రం సారాభాయ్ షార్ (SHAR - శ్రీహరికోట రేంజ్ అనే పేరుకు సంక్షిప్త రూపం) అని నామకరణం చేశాడు. చాలా మంది దీన్ని శ్రీహరికోట హై అల్టిట్యూడ్ రేంజ్ అని తప్పుగా భావించారు. సంక్షిప్త రూపాన్ని శర్ అని పలికితే బాణం అనే అర్థం కూడా వస్తుంది. బాణాన్ని ఎక్కుపెట్టినట్టు రాకెట్ ఎక్కుపెట్టడం అనే అర్థం కూడా వస్తుంది.
  3. "RH-125". Encyclopedia Astronautica. Retrieved 2022-03-25.