సాగర ఘోష

తెలుగు పర్యావరణ పద్యకావ్యం

సాగర ఘోష అనేది గరికిపాటి నరసింహారావు రాసిన తెలుగు పద్య కావ్యం. ప్రపంచ చరిత్రను, జీవి ఉద్భవం నుండి ఆధునిక కంప్యూటరు ఉద్భవం దాకా క్లుప్తంగా చెప్పే కావ్యం ఇది. పది అధ్యాయాల ఈ పుస్తకాన్ని నాలుగేళ్ళ పాటు రచించాడు. వెయ్యి పైచిలుకు పద్యాలతో, అసలు వచనమన్నదే లేని కావ్యం ఇది. కవి ఈ కావ్యాన్ని శంకరాచార్యుని అంకితమిచ్చాడు. 2001 లో తొలిసారి ప్రచురించాడు.

సాగర ఘోష
పుస్తకం పై అట్ట
రచయిత(లు)గరికిపాటి నరసింహారావు
దేశంభారతదేశం
భాషతెలుగు
శైలిచరిత్ర, తాత్వికతల కలగలుపు
ప్రచురణ కర్తగరికిపాటి నరసింహారావు
ప్రచురించిన తేది
2001 మే
మీడియా రకంపుస్తకం
పుటలు376

మూలాంశం

మార్చు

ఈ కావ్యం ప్రపంచ చరిత్రను 10 అధ్యాయాల్లో వివరిస్తుంది. జీవి పుట్టుక నుండి కంప్యూటరు పుట్టుక దాకా ప్రపంచ చరిత్ర లోని వివిధ ముఖ్యమైన ఘట్టాలను క్లుప్తంగా ఛందోబద్ధ పద్యాల్లో రచించాడు. అయితే ఈ చరిత్ర, కవి పాఠకునికి చెబుతున్నట్లు కాక, సముద్రం కవికి చెబుతున్నట్లుగా ఉంటుంది. అంటే ఈ పుస్తకంలో కవి కూడా ఒక పాత్రే. సముద్రం మరొక పాత్ర. కవి, సముద్ర తీరాన వ్యాహ్యాళికి వెళ్ళి అక్కడ కూచుని ఉండగా, ఒక తరంగం ఒడ్డుకు వచ్చి అతని ఒడిలో కూచుంటుంది. ఆ తరంగం ఒళ్ళు జిడ్డుజిడ్డుగా ఉండడం చూసి ఆశ్చర్యపోయిన కవి అదేమిటి అలా ఉన్నావు అని ఆ తరంగాన్ని అడుగుతాడు. ఆ విధంగా వాళ్ళ సంభాషణ మొదలౌతుంది. ఆ తరంగం తన బాధ చెప్పడంతో మొదలుపెట్టి, ప్రపంచ చరిత్రను వివరిస్తుంది. అదే సాగర ఘోష కావ్యం. [1] ఈ కావ్యం అద్వైత సిద్ధాంతానికి అద్దం పట్టే విధంగా, సామాజిక భౌతిక పర్యావరణ అంశాలను స్పృశిస్తూ, అవసరమైన చోట్ల విమర్శిస్తూ సాగుతుంది. [2] కావ్యాన్ని అద్వైత సిద్ధాంత కర్త, శంకరాచార్యకే అంకితమిచ్చాడు.

ఈ పుస్తకం ఉపశీర్షిక "భౌతిక మానసిక పర్యావరణ పద్యకావ్యం".

ఆకృతి

మార్చు

ఈ గ్రంథాన్ని కవి, పది ప్రధానమైన అధ్యాయాలుగా విభజించాడు. అధ్యాయానికి "అంతరంగం" అని పేరు పెట్టాడు. తరంగం అంతరంగమే ఈ కావ్యం అని భావస్ఫోరకంగా ఉంది. ఆ అధ్యాయాల పేర్లు ప్రథమాంతరంగం, ద్వితీయాంతరంగం, తృతీయాంతరంగం,.. ఇలా నవమాంతరంగం వరకు ఉంటాయి. పదో అంతరంగాన్ని చివరి అంతరంగంగా సూచిస్తూ పరమాంతరంగం అని పేరు పెట్టాడు. ఒక్కో అంతరంగం లోనూ 108 పద్యాలుంటాయి. మొత్తం 1080 పద్యాలు. వీటన్నిటికీ ముందు కవి స్వీయాంతరంగం వస్తుంది. ఈ కావ్యాన్ని ఎలా రాసాడు, తన అనుభవాలేంటి అనేది వివరిస్తుంది అది. దానికి "ఆవిష్కరణ" అనే పేరు పెట్టాడు. ఈ ఆవిష్కరణలో ఉన్న 36 పద్యాలను కలిపితే కావ్యం లోని మొత్తం పద్యాలు వెయ్యి నూటపదహారు (1116). ఈ కావ్యాన్ని రాసిన అనుభవాన్ని వివరిస్తూ ఒక పద్యంలో కవి, "వేయి పద్యములల్లిన విసుగు రాదు" అంటాడు.

ఈ కావ్యానికి బేతవోలు రామబ్రహ్మం పీఠిక రాసాడు. జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ఒక్కో అధ్యాయాన్ని వివరిస్తూ విస్తారమైన పరిచయం రాసాడు. ఈ కావ్యాన్ని ఆది శంకరాచార్యునికి అంకితమిచ్చిన కవి, ఈ పుస్తక రచనలో తనకు తోడ్పడిన వారికి, తొలి పేజీలలో కృతజ్ఞతలు తెలుపుకున్నాడు.

పుస్తకం గురించి

మార్చు

"ప్రధానంగా ఇది పర్యావరణ పద్యకావ్యం. మనిషి భౌతిక పరిసరాలు అందంగానూ, ఆనందదాయకంగానూ తీర్చిదిద్దుకోవాలని, మనసులో స్వార్థాన్ని తగ్గించుకొని, పరమార్థం గురించి ఆలోచించాలని తెలియజెప్పే కావ్యం ఇది. ఆదిశంకరాచార్యుని అద్వైత సిద్ధాంత నేపథ్యంలో అన్ని దేశాల సాంస్కృతిక చరిత్రను పరిశీలించి, విశ్లేషించిన కావ్యం." -ఆంధ్రజ్యోతి దిన పత్రిక. [3]

ప్రచురణ వివరాలు

మార్చు

2001 మే లో ఈ పుస్తకం తొలి ప్రచురణ జరిగింది. కవి స్వయంగా ప్రచురించుకున్న ఈ పుస్తకాన్ని సామర్లకోటకు చెందిన రాంషా & శిరీషా పబ్లికేషన్సు వారు ముద్రించారు.

పుస్తకం గురించిన ఇతర ప్రచురణలు

మార్చు
  • ఈ కావ్యం లోని మొత్తం అన్ని పద్యాలను అర్థ వివరణతో సహా కవి స్వయంగా గానం చేసాడు. హైదరాబాదు లోని త్యాగరాయ గానసభలో జరిగిన కార్యక్రమంలో గరికిపాటి నరసింహారావు ఈ పద్యగానం చేసాడు. దీన్ని ప్రవచనం.కామ్‌లో వినవచ్చు. [4]
  • తలారి వాసు, కావ్యంలోని సామాజికాద్వైతపై పరిశోధన చేసి, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి 2010లో డాక్టరేట్ పట్టా పొందాడు. తన పరిశోధనా సారాంశాన్ని వివరిస్తూ "సాగర ఘోష కావ్యం - సామాజికాద్వైతం" అనే సిద్ధాంత గ్రంథం రాసాడు.

మూలాలు

మార్చు
  1. "అది ఒక మహాఫల ప్రదానం". Sakshi. 2022-01-28. Archived from the original on 2022-06-29. Retrieved 2022-06-29.
  2. "పుస్తక సమీక్షణం". Sakshi. 2013-09-29. Archived from the original on 2022-06-29. Retrieved 2022-06-29.
  3. "'సాగర ఘోష'.. పుస్తక పరిచయం". lit.andhrajyothy.com. Archived from the original on 2022-06-29. Retrieved 2022-06-29.
  4. సిరా, శ్రీ. "సాగర ఘోష: పుస్తక సమీక్ష - సిరాశ్రీ". gotelugu.com. Archived from the original on 2022-06-29. Retrieved 2022-06-29.

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=సాగర_ఘోష&oldid=3597724" నుండి వెలికితీశారు