జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు

గేయ రచయిత, పేరడీలకు ప్రసిద్ధుడు

జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు ప్రముఖ తెలుగు కవి, ప్రముఖ సినీ గేయ రచయిత.[2] సుమారు 600కి పైగా పాటలు రాశాడు. తెలుగు అధికార భాషా సంఘ మాజీ సభ్యుడు. పేరడీలు పాటలు రాయడంలో ప్రసిద్ధుడు.[3] తెలుగు శంఖారావం పేరుతో తెలుగు భాష మీద పాటలు రాశాడు.[1] 2005లో రాజేంద్ర ప్రసాద్ కథానాయకుడిగా పెళ్ళాం పిచ్చోడు అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు ప్రజాదరణ పొందిన ఉత్తమ చిత్రంగా నంది పురస్కారం లభించింది.

జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
JonnavithulaRamalingeswaraRao.jpg
జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
జననంజొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
(1959-07-07) 1959 జూలై 7 (వయస్సు: 60  సంవత్సరాలు)[1]
కృష్ణలంక, విజయవాడ
ఇతర పేర్లుజొన్నవిత్తుల
చదువుభాషా ప్రవీణ, ఎం. ఏ తెలుగు
వృత్తిసుప్రసిద్ధ కవి ,
సినీ గేయ రచయిత,
తెలుగు అధికార భాషా సంఘ మాజీ సభ్యులు
రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ
మతంహిందూ మతం
జీవిత భాగస్వామిశేషు కుమారి
పిల్లలు
 • లక్ష్మీ సువర్ణ
 • లక్ష్మీ అన్నపూర్ణ
 • మాణిక్య తేజ
తల్లిదండ్రులు
 • సుబ్బారావు (తండ్రి)
 • లక్ష్మీనరసమ్మ (తల్లి)

తెలంగాణా విడిపోయినప్పుడు కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నవనిర్మాణ దీక్షకై ప్రత్యేక గీతం రాశాడు. జొన్న విత్తుల రాసిన గీతాన్ని వందేమాతరం శ్రీనివాస్‌ గానం చేశాడు.[4] ఆయన భారతీయ జనతా పార్టీలో చేరాడు. నరేంద్ర మోడి విధానాలతో బీజేపీ పార్టీ వైపు ఆకర్షితుడైన తాను ఆ పార్టీలో చేరుతున్నట్లు జొన్నవిత్తుల తెలిపాడు.[5]

వ్యక్తిగత జీవితంసవరించు

జొన్నవిత్తుల స్వస్థలం విజయవాడ. వారిది పేద కుటుంబం. తండ్రి ఒక ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు. ఆయన పౌరాణిక నాటకాల్లో పాల్గొనేవాడు. సుమారు మూడువేల పౌరాణిక నాటకాలు వేశారాయన. ఆయన తాత గారికి ఆంధ్ర గంధర్వ అనే బిరుదుండేది.[6] అమ్మవైపు మేనమామ వరసయ్యే దైత గోపాలం సినిమాల్లో పాటలు రాసేవాడు. ఈయనకు ముందు తల్లికి ముగ్గురు పిల్లలు పురిట్లోనే చనిపోయారు. అప్పుడు ఆమె రామేశ్వరం వెళ్ళి సంతానం కోసం రామలింగేశ్వర స్వామిని ప్రార్థించింది. ఈయన గర్భంలో ఉండగా తెనాలికి సమీపంలో ఉన్న చిలుమూరులోని రామలింగేశ్వర స్వామి ఆలయంలో నలభై రోజుల పాటు 108 ప్రదక్షిణలు చేసింది. ఆ దేవుడి పేరుమీదుగా కలిగిన సంతానం కాబట్టి ఆయనకు రామలింగేశ్వర రావు అని పేరు పెట్టారు. ఈయన తర్వాత ఆ దంపతులకు మరో నలుగురు సంతానం కలిగారు.[7] చిన్నతనం నుంచి ఆయనలో కవితా ధోరణి ఉండేది. మున్నంగి పూర్ణచంద్రరావు ఈయనను అప్పట్లో బాగా ప్రోత్సహించేవాడు. భాషాప్రవీణ చదివాడు. అప్పుడే ఆయనకు పెద్ద సంస్కృత గ్రంథాలు చదివే అవకాశం కలిగింది. వ్యాకరణ పండితుడు మేడిచర్ల గోపాలకృష్ణమూర్తి, అవధాని కావూరి పూర్ణచంద్రరావు, శతావధాని పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ వంటి వారి పరిచయం కలిగింది.

భాషాప్రవీణ తర్వాత స్వాతి పత్రికలో సబ్ ఎడిటర్ గా చేరాడు. పదకొండు నెలలపాటు అక్కడ పనిచేసిన తర్వాత మద్రాసులోని ఏషియన్ లాంగ్వేజీ బుక్ సొసైటీ అనే సంస్థలో ఉద్యోగం వచ్చింది. కానీ చేరిన పదినెలలకే ఆ సంస్థ మూత పడింది.

కెరీర్సవరించు

చదువు అయిపోయిన తర్వాత 1985 లో ఆసియన్ లాంగ్వేజ్ బుక్ సొసైటీ అనే సంస్థలో ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగంలో భాగంగా చెన్నై వెళ్ళాడు. కొద్ది రోజులకు ఆ సంస్థ మూసేయడంతో ఆయన ఉద్యోగం పోయింది. ఒక మిత్రుడి ద్వారా నటుడు మురళీ మోహన్ తో పరిచయం అయింది. మురళీ మోహన్ ఇతన్ని దర్శకుడు కె. రాఘవేంద్ర రావుకు పరిచయం చేశాడు. ఆయన ఈయను విద్వత్తును గౌరవించి ఆయన తర్వాత సినిమా భారతంలో అర్జునుడులో అన్ని పాటలు రాసే అవకాశం కల్పించాడు. కానీ రచయితగా విడుదలైన మొదటి పాట మాత్రం రౌడీ పోలీస్ అనే చిత్రం లోనిది. తర్వాత జంధ్యాల, బాపు లాంటి దర్శకులు ఆయనకు అవకాశాలిచ్చి ప్రోత్సహించారు. ఆయన సినిమా ష్ గప్ చుప్ లో ఆయన రాసిన తిట్లదండకం బాగా ప్రాచుర్యం పొందింది. 1989లో వచ్చిన స్వరకల్పన అనే సినిమాలో కేవలం సప్తస్వరాలను మాత్రమే వాడి ఓ పాట రాశాడు. అది తెలుగులోనే మొట్టమొదటి ప్రయోగం. వంశీ సినిమా కోసం ఆయన సంస్కృతంలో రాసిన డిస్కో, జంధ్యాల సినిమాలకు రాసిన తిట్లదండకం, రూపాయి దండకం లాంటివి సినిమా పాటల్లో ఆయన చేసిన వినూత్నమైన ప్రయోగాలు. 1997లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన్ను తెలుగు అధికారభాషా సంఘం సభ్యుడి పదవినిచ్చాడు.

సినిమాల్లో రచయిత కాకమునుపే ఆయనకు పద్య రచయితగా గుర్తింపు ఉంది. ఆయన రాసిన కొన్ని పేరడీలు నచ్చి పురాణం సుబ్రహ్మణ్య శర్మ ఓ పత్రికలో ప్రచురించే వాడు. దేశమును ప్రేమించుమన్నా అనే గీతానికి పేరడీగా పెండ్లమును ప్రేమించుమన్నా అనే పేరడీ రాశాడు. అది మంచి గుర్తింపు సంపాదించి పెట్టింది. శ్రీశ్రీ రచనలకు పేరడీలు కట్టి ఆయన ముందే వినిపించాడు.

2005లో రాజేంద్రప్రసాద్ కథానాయకుడిగా పెళ్ళాం పిచ్చోడు అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. కానీ అది పెద్దగా విజయవంతం కాలేదు కానీ 2005లో కొత్తగా ప్రవేశ పెట్టిన ప్రజాదరణ పొందిన ఉత్తమ వినోదాత్మక చిత్రంగా నంది పురస్కారాన్ని అందుకుంది. 2011లో బాపు దర్శకత్వంలో వచ్చిన శ్రీరామరాజ్యంలో అన్ని పాటలు ఆయనే రాశాడు. జొన్నవిత్తుల టీవీ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉంటాడు. పద్యపఠనం, సామాజిక చర్చలు, పాడుతా తీయగా లాంటి కార్యక్రమాల్లో పలుమార్లు అతిథిగా పాల్గొన్నాడు. తెలుగు శంఖారావం పేరుతో ఆయన రాసిన పాటల్ని మంగళంపల్లి బాలమురళీకృష్ణ గానం చేశాడు.[8]

కుటుంబంసవరించు

ఈయన భార్య శేషు కుమారి. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు. ఇద్దరు ఆడపిల్లలు లక్ష్మీ సువర్ణ, లక్ష్మీ అన్నపూర్ణ కవలలు. ఒక అబ్బాయి మాణిక్య తేజ. అమ్మాయిలిద్దరూ ఇంజనీరింగ్ చదివారు. పాటలు పాడతారు. నాట్యంలో కూడా శిక్షణ తీసుకున్నారు.

రచనలుసవరించు

పేరడీలు[9]సవరించు

ఇరవై సంవత్సరాల వయసు నుంచి పేరడీలు రాయడం ప్రారంభించాడు. శ్రీశ్రీ రచన మహాప్రస్థానం, జంధ్యాల పాపయ్య శాస్త్రి రాసిన పుష్ప విలాపం లాంటి వాటికి పేరడీలు రాశాడు. తనికెళ్ళ భరణి దర్శకత్వంలో వచ్చిన మిథునం సినిమాకు రాసిన కాఫీ దండకం కూడా ప్రాచుర్యం పొందింది. జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు చేసిన కొన్ని పేరడీ అంశములను కొన్ని కింద ఇవ్వబడ్డాయి.

 • రాజకీయాలు
 • రాజకీయ నాయకుల పార్టీ ఫిరాయింపులు
 • వాతావరణ కాలుష్యము
 • అవినీతి
 • ఎన్నికలు
 • దొంగ స్వాములు
 • మూఢనమ్మకాలు
 • నదుల కాలుష్యము

శతకాలుసవరించు

ఈయన పది శతకాలు రచించాడు. అవి శ్రీరామలింగేశ్వర శతకం, బతుకమ్మ,[10] తెలుగమ్మ, సింగరేణి, తెలుగు భాష, నైమిశ వెంకటేశ, రామబాణం, కూచిపూడి, రామప్ప, ఆంగ్లంలో శ్రీరామలింగేశ్వర శతకం. 20 సంవత్సరాల వయసు నుంచి తల్లి సలహాతో తన పుట్టుకకు కారణమైన శ్రీరామలింగేశ్వరుని మీద పద్యాలు రాయడం ప్రారంభించాడు. వీటిలో మంచి పద్యాలను ఏరి శ్రీరామలింగేశ్వర శతకంగా ప్రచురించాడు. ఇవి సమకాలీన తెలుగు సాహిత్యంలో చాలా ప్రాచుర్యం పొందినవి.

సినిమా పాటలుసవరించు

ఇతర రచనలుసవరించు

మూలాలుసవరించు

 1. 1.0 1.1 "గీత స్మరణం". sakshi.com. సాక్షి. Retrieved 9 December 2016.
 2. యార్లగడ్డ, అమరేంద్ర (1 November 2018). "తెలుగు తల్లికి నా కానుకలవి". ramojifoundation.org. రామోజీ ఫౌండేషన్.
 3. Special, Correspondent. "Parody time, with Jonnavittula". thehindu.com. Kansturi and Sons. Retrieved 20 June 2016.
 4. ఆంధ్రజ్యోతి, ప్రతినిథి. "నవనిర్మాణ దీక్షకు జొన్నవిత్తుల ప్రత్యేక గీతం". andhrajyothy.com/. వేమూరి రాధాకృష్ణ. Retrieved 20 June 2016.
 5. బొజ్జా, కుమార్. "బీజేపీలో చేరిన సినీ గేయ రచయిత జొన్నవిత్తుల". telugu.filmibeat.com. filmibeat. Retrieved 20 June 2016.
 6. యం. డి, యాకుబ్ పాషా. "ఫెయిల్యూర్ స్టోరీ". telugucinemacharitra.com. సాక్షి. Retrieved 9 December 2016.
 7. వేమూరి, రాధాకృష్ణ. "ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఒకటవ భాగం". youtube.com. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి. Retrieved 8 December 2016.
 8. "తెలుగు శంఖారావం". koumudi.net. కౌముది. Retrieved 9 December 2016.
 9. జొన్నవిత్తుల పేరడీ - ముఖా ముఖి
 10. "బతుకమ్మ శతకం - జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు". siliconandhra.org. సిలికానాంధ్ర. Retrieved 9 December 2016.

బయటి లింకులుసవరించు