గరికిపాటి నరసింహారావు

అవధాని, కవి, ప్రవచన కర్త

గరికిపాటి నరసింహారావు తెలుగు రచయిత, అవధాని, ఉపన్యాసకుడు. ఇతను దేశ విదేశాల్లో అవధానాలు చేశాడు. వాటిలో: ఒక మహా సహస్రావధానం, 8 అష్ట, శత, ద్విశత అవధానాలు, వందలాది అష్టావధానాలు ఉన్నాయి. పలు టెలివిజన్ ఛానెళ్ళలో వివిధ శీర్షికలు నిర్వహిస్తూ వేలాది ఎపిసోడ్ల పాటు పలు సాహిత్య, ఆధ్యాత్మిక అంశాలపై ప్రసంగాలు చేశాడు. వాటిలో 11 అంశాలను సీడీలుగా రూపొందించి విడుదల చేశాడు. పద్యకావ్యాలు, పరిశోధన, పాటలు వంటి వివిధ అంశాలపై గరికపాటి రాసిన 14 పుస్తకాలు ప్రచురితమయ్యాయి. ధారణా బ్రహ్మరాక్షసుడు, అవధాన శారద వంటి బిరుదులు, కళారత్న, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం, కొప్పరపు కవులు పురస్కారం తదితర పురస్కారాలు, కనకాభిషేకాలు, సువర్ణ కంకణాలు మొదలైన గౌరవాలు అందుకున్నాడు. భారత ప్రభుత్వంచే 2022లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నాడు.[1][2]

గరికిపాటి నరసింహారావు
జననం(1958-09-14)1958 సెప్టెంబరు 14
పశ్చిమ గోదావరి జిల్లా, పెంటపాడు మండలం బోడపాడు అగ్రహారం
వృత్తిఉపాధ్యాయుడు
ప్రసిద్ధిధారణాబ్రహ్మరాక్షసుడు
మతంహిందూ
భార్య / భర్తశారద
పిల్లలుశ్రీశ్రీ, గురజాడ
తండ్రిగరికిపాటి వెంకట సూర్యనారాయణ
తల్లివెంకట రమణమ్మ
వెబ్‌సైటు
http://srigarikipati.com

జీవిత విశేషాలు

మార్చు

నరసింహారావు పశ్చిమ గోదావరి జిల్లా, పెంటపాడు మండలం బోడపాడు అగ్రహారంలో వేంకట సూర్యనారాయణ, వేంకట రమణమ్మ దంపతులకు 1958, సెప్టెంబర్ 14వ తేదీకి సరియైన విలంబి నామ సంవత్సరం భాద్రపద శుద్ధ పాడ్యమినాడు జన్మించారు. వీరు ఎం.ఎ., ఎం.ఫిల్, పి.హెచ్.డి చేశారు.ఉపాధ్యాయ వృత్తిలో 30 సంవత్సరాలు పనిచేశారు. వీరు గతంలో కాకినాడ వాస్తవ్యులు.వీరి భార్య పేరు శారద. వీరికి ఇద్దరు కుమారులు. వీరికి తన అభిమాన రచయితల పేర్లు శ్రీశ్రీ, గురజాడ అని పేర్కొన్నారు. ప్రస్తుతం హైదరాబాదులో స్థిరపడ్డారు.

అవధానాలు

మార్చు

ఇతడు అవధానిగా సుప్రసిద్ధుడు. సుమారు 275 అష్టావధానాలు, 8 అర్థ శత, శత, ద్విశత అవధానాలు, ఒక మహా సహస్రావధానం దిగ్విజయంగా నిర్వహించాడు. మొదటి అవధానం 1992 సంవత్సరం విజయదశమి రోజు చేశాడు. 2009లో 8 కంప్యూటర్లతో హైటెక్ అవధానం నిర్వహించారు. 2006 వ సంవత్సరం బెంగుళూరు లోని ప్రయోగశాలలో అవధానం నిర్వహిస్తూండగా మేధో పరీక్ష చేయబడింది. యావదాంధ్ర దేశంలోనే కాక మనదేశంలోని వివిధ నగరాలతోపాటు అమెరికా, సింగపూరు, మలేషియా, లండన్, దుబాయి, బహ్రైన్, కువయిట్, అబుదాభి, దుబాయి, కతార్ మొదలైన దేశాలలో పర్యటించి అక్కడ అవధానాలు చేశారు.ఆయనకు భారత ప్రభుత్వం 2022లో పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది.

కొన్ని పూరణలు

మార్చు

దత్తపది

మార్చు
  • ఆకాశం, సూరీడు, యవ్వారం, నారాయుడు పదాలతో బాపు రమణల ప్రశస్తి [ఆధారం చూపాలి]
ఆకాశంబది యెర్రబారినది ఏ హత్యల్‌జొరంబారెనో
సోకుల్నేర్చిన బాపు కుంచియలతో సూరీడు నేరేడగున్‌
ఆకే చాకుగ తోచు నా బుడుగు, ఈ యవ్వార మెవ్వారిదో hi
నాకంబందున ముళ్ళుపూడె ఇటకా నారాయుడేవచ్చెనో!

వర్ణన

మార్చు
  • అమెరికాలో పెరిగిన ఒక తెలుగు అమ్మాయి, ఇండియాలో పెరిగిన ఒక తెలుగు అమ్మాయి లండన్‌లో కలిస్తే... [ఆధారం చూపాలి]
అమెరికా కన్య ఓ యంచు ననగ జనదు
ఇండియా కన్య వూరకే వుండబోదు
మౌన భాషణ లొక్కచో స్నానమాడ
లండనున చల్లబడ్డది గుండెమంట

ఆశువు

మార్చు
  • కుండలాలతో, గండ పెండేరాలతో, కళ్ళద్దాలతో, పట్టు పంచెలతో సర్వాలంకారాలతో ఉన్న అవధానిని కలలో చూసి, దిగ్గున లేచిన రసజ్ఞుని పరిస్థితి [ఆధారం చూపాలి]
పంచెగట్టిరి పద్యాలు పంచి ఇడిరి,
నాల్గుకన్నులు సంద్రాలు నాల్గు గాగ
ధారణా కంకణమ్ములు దాల్చినారు
మాయమైనారు కలలోనె గాయమయ్యె!
  • కార్యేషు మంత్రి కరణేషు .....కి పేరడీ
కార్యేషు మిక్సి శయనేషు సెక్సీ భరణే చ కూలి తరునీషు శూలి రూపేచ హీరో కోపేచ  జీరో షట్కర్మ కర్త కలి కాల భర్త

సమస్యాపూరణ

మార్చు
  • వధువుల్లేకనె లగ్నముల్‌కుదిరె ఏ వైనాలు చూపింతురో [ఆధారం చూపాలి]
వెధవల్‌బుట్టిరి వింతదేశమున నవ్వే వచ్చెడిన్‌విన్నచో
కథలున్‌గోడలకెక్కె యీ కళకు పక్కా సంస్థలున్‌లేచె యీ
సుధలీనేలను రోగ రూపమున సంక్షోభమ్ము పుట్టించునో
వధువుల్లేకనె లగ్నముల్‌కుదిరె ఏ వైనాలు చూపింతురో

రచనలు

మార్చు
  1. సాగరఘోష (పద్యకావ్యం)
  2. మనభారతం (పద్యకావ్యం)
  3. బాష్పగుఛ్ఛం (పద్య కవితా సంపుటి)
  4. పల్లవి (పాటలు)
  5. సహస్రభారతి
  6. ద్విశతావధానం
  7. ధార ధారణ
  8. కవితా ఖండికా శతావధానం
  9. మౌఖిక సాహిత్యం (పరిశోధన)
  10. పిల్లల బొమ్మల తెలుగు నిఘంటువు
  11. మా అమ్మ (లఘుకావ్యం)
  12. అవధాన శతకం
  13. శతావధాన భాగ్యం (సంపూర్ణ శతావధానం)
  14. శతావధాన విజయం (101 పద్యాలు)

టి.వి.కార్యక్రమాలు

మార్చు

ఇతడు అనేక టి.వి.ఛానళ్లలో కార్యక్రమాలు నిర్వహించాడు. వాటిలో కొన్ని:

  1. ఏ.బి.ఎన్. ఆంధ్రజ్యోతిలో నవజీవన వేదం
  2. ఓం టి.వి. (సి.వి.ఆర్.స్పిరిట్యుయల్)లో రఘువంశం
  3. భక్తి టి.వి.లో ఆంధ్ర మహాభారతం: 1818 ఎపిసోడ్లు
  4. భక్తి టి.వి.లో తరతరాల తెలుగు పద్యం
  5. దూరదర్శన్ సప్తగిరిలో మంచికుటుంబం
  6. ఈ.టి.వి-2 - చమక్కులు (తెలుగు వెలుగు)
  7. తెలుగు వన్ డాట్ కామ్ ఇంటర్నెట్ ఛానల్‌లో సాహిత్యంలో హాస్యం

సి.డి.లు, డి.వి.డి.లు

మార్చు

వివిధ సందర్భాలలో ఈయన చేసిన ప్రసంగాలు, ప్రవచనాలు, సాగరఘోష కావ్యపఠనం((1116 పద్యాలు x 20 గంటల వ్యాఖ్యానంతో సహా) సిడిలుగా డివిడిలుగా విడుదల చేయబడ్డాయి.

పురస్కారాలు

మార్చు

గరికపాటి నరసింహారావుకు పలు సాహిత్య, ధార్మిక సంస్థలు పురస్కారాలతో సన్మానించాయి. అవధానకళకి సంబందించి శతావధాన గీష్పతి, అవధాన శారద, ధారణ బ్రహ్మ రాక్షస, అమెరికా అవధానభారతి బిరుదులు పొందాడు

  1. 2011 సెప్టెంబరులో కొప్పరపు కవుల పురస్కారం
  2. తుమ్మల పీఠం పురస్కారం, గుంటూరు, 2012
  3. 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉగాది సందర్భంగా కళారత్న పురస్కారం[3][4]
  4. భారత ప్రభుత్వం 2022లో పద్మశ్రీ పురస్కారాన్ని అందించింది.[5]


గరికపాటి సాహిత్యంపై పరిశోధన

మార్చు

ఇతని సాహిత్యంపై ఇంతవరకు వివిధ విశ్వవిద్యాలయాలలో రెండు ఎం.ఫిల్, రెండు పి.హెచ్.డి పరిశోధనలు జరిగాయి.[ఆధారం చూపాలి]

ఆధారాలు

మార్చు
  1. ఎ. రామలింగశాస్త్రి (11 November 2005), "Rich entertainer", ది హిందూ, archived from the original on 29 నవంబరు 2014, retrieved 17 December 2014
  2. ఈరంకి వెంకటకామేశ్వర్, "తెలుగుతేజోమూర్తులు", సృజన రంజని అంతర్జాల తెలుగు మాసపత్రిక, సిలికానాంధ్ర, archived from the original on 15 మార్చి 2016, retrieved 17 December 2014
  3. భక్తి టీవీలో గరికపాటి గురించి

మూలాలు

మార్చు