సింధు లిపి

(సింధూ లిపి నుండి దారిమార్పు చెందింది)

సింధు లిపి (లేదా హరప్పా లిపి) అనేది సింధు లోయ నాగరికత విలసిల్లిన రోజులలో వాడబడిన కొన్ని చిహ్నాల సముదాయం. ఈ లిపి క్రీ.పూ 3500 నుండి క్రీ.పూ 2000 వ వరకు ప్రాచుర్యంలో ఉంది. ఈ చిహ్నాలు ఉన్న శాసనాలు అత్యంత చిన్నవిగా ఉన్నాయి. అసలు ఈ చిహ్నాలు ఒక భాషను రాయడానికి వాడారా లేదా అనేది స్పష్టంగా తెలియరాలేదు. అసలు ఇది ఒక లిపి అనే విషయం కూడా వివాదాస్పదమే. ఎన్నో ఏళ్ళుగా కృషి చేస్తున్నా [1] ఈ లిపిని, దాని వెనుక ఉన్న భాషను ఛేదించలేక పోయారు. ఈ లిపిని వేరే భాషలో అర్థం చేసుకోవడానికి అవసరమైన ద్విభాషా శాసనాలు కూడా ఏమీ అందుబాటులో లేవు. చాలా కాలం పాటు ఈ లిపిలో మార్పులు కూడా రాలేదు.

చెక్కబడిన ఐదు “అక్షరాలను” సూచిస్తున్న ముద్ర.

ఈ చిహ్నాలను 1853వ సంవత్సరంలో అలెగ్జాండర్ కన్నింగ్‌హామ్ అనే పురాతత్వ శాస్త్రవేత్త మొట్టమొదటి సారిగా ఒక బొమ్మ రూపంలో ప్రచురించాడు. [2] అప్పటి నుండి ఈ చిహ్నాలు ముద్రితమై ఉన్న వస్తువులు 4,000 వరకు దొరికాయి. వీటిలో కొన్ని ఎక్కడో సుదూర ప్రాంతమైన మెసొపొటేమియా లో కూడా దొరికాయి. 1970 వ దశకం ప్రారంభంలో ఐరావతం మహదేవన్ అనే శాస్త్రజ్ఞుడు సుమారు 3,700 ముద్రలకు సంబంధించిన పాఠ్యాన్ని ప్రచురించాడు. అందులో 417 వేర్వేరు గుర్తులు, వివిధ రకాలైన నమూనాలలో అమర్చబడి ఉన్నాయి. ఒక్కో శాసనానికి సగటున ఐదు చిహ్నాలున్నాయి. అత్యంత పొడవైన దానిపై కేవలం 17 చిహ్నాలు మాత్రమే ఉన్నాయి. ఈ లిపి కుడి వైపు నుండి ఎడమ వైపుకు రాయబడుతుందని ఆయనే కనుగొన్నాడు. [3]

సింధు లిపి-బ్రాహ్మీ లిపి

మార్చు

భారతదేశ చరిత్రకు సంబంధించిన ఒక కాలాన్ని-అది అతి పురాతనమైన కాలం కూడాను-దాని గురుంచి తెలుసుకోవడానికి సింధులిపి ఒక ఆధారం. కాని సింధులిపి గురుంచి పూర్తి చిహ్నాలకు సంబంధించి జరిగిన పరిశోధనలు బహు స్వల్పమే. దక్షిణ భారతదేశంలో సానూర్ వద్ద, బెంగాల్ లో గంగానది ఒడ్డున ఉన్న చంద్రకేతుఘర్ వద్ద చరిత్రకు సంబంధించిన త్రవ్వకాలను 1935 వ సం.లో ప్రముఖ ఆర్కియాలగిస్ట్ ఎస్.కె.రే గారు పరిశోధించారు. చంద్రకేతుఘర్ ఒకప్పుడు గంగలో ఒక పాయసముద్రంలో పడుతూవచ్చిన స్థలంగా భావించబడినది. అందువలన ఇక్కడ రే గారు పరిశోధన వలన సింధులిపి సంబంధించిన కొన్ని శాసనాలు లభించినవి. భారతదేశ చరిత్రలో సింధునాగరికత ఒక కాలానికి సంబందించినది. ఆ తరువాత ఈచరిత్ర సంగతి ఏమో అంతు పట్టడంలేదు. మౌర్యులు మగధలో రాజ్యం కట్టుకున్న తరువాత నుంచీ తిరిగి చరిత్ర సంగతి అంతుపడుతున్నది. ఈ రెండుకాలాల మధ్య కాలంలో నడిచిన చరిత్ర సంగతి ఏమిటి? ఈ నడిమి కాలం దాదాపు 1000 సం.లుంటుందని చారిత్రుకులు భావిస్తున్నారు. సింధు నాగరికత క్రీ. పూ.1500 ప్రాంతంలో అంతమైపోయిందంటారు. కాని మన చరిత్ర క్రీ.పూ.300 కాలం దాటి మనకు ఆధారాలు శాసనాలు తక్కువగా లభ్యమవుతున్నాయి. మౌర్యుల కాలంలో బ్రాహ్మీ లిపి వాడుకలో ఉన్నది. బ్రాహ్మీ లిపి కి సింధు లిపి కి ఏమైనా సంబంధమున్నదా అన్న పరిశోధనకు శ్రీ. రేగారి త్రవ్వకాలలో దొరికిన మృణ్ముద్రలు, అశ్మముద్రలు వాటిపైన్ ఉన్న అక్షరాలు, సంజ్ఞలు చాలా వరకు చరిత్రకారులకు సహాయపడినవి. దీనికి సంబంధించి శ్రీ.రే గారు దాదాపు 30 పట్టికలు తయారు చేశారు.

మూలాలు

మార్చు
  1. (Possehl, 1996)
  2. Cunningham, Alexander (1875). "Harappa". Archaeological Survey of India: Report for the Years 1872-3. 5: 105–108.
  3. "Write signs for Indus script?". Nature India. 2009-05-31. Retrieved 2009-06-01.