సింధు లోయ నాగరికత
సింధు లోయ నాగరికత (క్రీస్తు పూర్వం" ). 2500-1750)[1] ప్రస్తుత భారత దేశం, పాకిస్తాన్ లోగల గగ్గర్ హక్రా, సింధు నదుల పరీవాహక ప్రాంతంలో విలసిల్లిన అతి ప్రాచీన నాగరికత. ఇది ప్రాథమికంగా పాకిస్థాన్‌లో గల సింధ్, పంజాబ్ ప్రావిన్సులలో, పశ్చిమం వైపు బెలూచిస్తాన్ ప్రావిన్సు వైపుకు కేంద్రీకృతమైనట్లు తెలుస్తుంది. ఇంకా ఆఫ్ఘనిస్తాన్, తుర్కమేనిస్తాన్, ఇరాన్ దేశాలలో కూడా ఈ నాగరికతకు సంబంధించిన శిథిలాలను వెలికి తీయడం జరిగింది. ఈ నాగరికతకు చెందిన హరప్పా నగరం మొదటగా వెలికి తీయుటచే ఇది సింధు లోయ హరప్పా నాగరికత అని పిలువబడుతున్నది. సింధు నాగరికత మెసొపొటేమియా, ప్రాచీన ఈజిప్టు కంచు యుగాలకు సమకాలికమైన అతి ప్రాచీన నాగరికతల్లో ఒకటి. అత్యంత అభివృద్ధి చెందిన దశగా గుర్తించబడిన నాగరికతను హరప్పా నాగరికతగా పేర్కొంటారు. ఈ నాగరికతకు సంబంధించిన తవ్వకాలు 1920వ సంవత్సరం నుండి జరుగుతున్నా అత్యంత ప్రాముఖ్యత కలిగిన వివరాలు మాత్రం 1999లోనే వెలువడ్డాయి.[2]
IVC ముఖ్యమైన స్థలాలు | |
ఇతర పేర్లు | హరప్పా నాగరికత |
---|---|
భౌగోళిక పరిధి | Basins of the Indus River, Pakistan and the seasonal Ghaggar-Hakra river, northwest India and eastern Pakistan |
కాలం | దక్షిణాసియాలో కంచుయుగం |
తేదీలు | సుమారు 3300 – 1300 BC |
ప్రాతినిధ్య స్థలం | హరప్పా |
ముఖ్యమైన స్థలాలు | హరప్పా, మొహెంజో దారో, ధోలావీరా, రాఖీగఢీ |
దీనికి ముందు | మెహర్గఢ్ |
దీని తరువాత | Painted Grey Ware culture Cemetery H culture |
ఈ నాగరికతనే ఒక్కోసారి సింధు ఘగ్గర్-హక్రా నాగరికత అని [3] లేదా సింధూ-సరస్వతి నాగరికతగా కూడా అభివర్ణిస్తారు. ఋగ్వేదంలో వర్ణించబడిన సరస్వతి నదిని ఘగ్గర్ హక్రా నదిగా గుర్తించడం వల్ల ఇలా పిలవబడుతున్నది.[4] కానీ భాష, ప్రాంతీయతల ఆధారంగా దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.[5]
సాంకేతికంగా బాగా అభివృద్ధి చెందిన పట్టణపు నాగరికత ఈ ప్రాంతంలో విలసిల్లినట్లుగా స్పష్టమైన చారిత్రక ఆధారాలు ఇక్కడి త్రవ్వకాల్లో దొరికాయి. ఇక్కడి మునిసిపల్ టౌన్ ప్లానింగ్ ప్రమాణాలను పరిశీలిస్తే వీరు పట్టణాలను అభివృద్ధి చేయడంలో సిద్ధహస్తులని, పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చేవారని తెలుస్తోంది. ఈ కాలంలో జీవించిన ప్రజలు పొడవు, ద్రవ్యరాశి, కాలాలను మొదలైన రాశులను చాలావరకు కచ్చితంగా కొలవగలిగినట్లు ఆధారాలున్నాయి. అనేక రకాలైన శిల్పాలు, ముద్రలు, పింగాణీ, మట్టి పాత్రలు, ఆభరణాలు, మానవశరీర శాస్త్రాన్ని వివరంగా విపులీకరించే అనేక టెర్రాకోట బొమ్మలు, ఇత్తడి వస్తువులు మొదలైనవి ఎన్నో త్రవ్వకాలు జరిపిన ప్రదేశంలో లభించాయి. సింధు లోయ ఆహారోత్పత్తిలో స్వయం సంవృద్ధి కలిగి ఉండేదని తెలుస్తోంది. మేర్గర్ ప్రజలు ఆ ప్రాంతంలోనే పండించిన గోధుమలు, బార్లీలు వాడినట్లు ఋజువైంది. 400కి (600 దాకా ఉండవచ్చునని కొద్దిమంది భావన) పైగా గుర్తులు వివిధ ముద్రల్లోనూ, పింగాణీ పాత్రలపైనా, ఇంకా కొన్ని వస్తువుల పైనా కనుగొనబడ్డాయి. ధోలావీరా పట్టణానికి లోగడ ఉన్న కోట ద్వారం వద్ద వేలాడదీసిన పలక మీద కొన్ని గుర్తులు ముద్రించబడి ఉన్నాయి.
" (క్రీస్తుపూర్వం) 1800 వచ్చేసరికి నెమ్మదిగా ఈ నాగరికత బలహీనపడటం మొదలైంది. క్రీస్తుపూర్వం 1700 శతాబ్దానికల్లా దాదాపు అన్ని నగరాలూ పాడుబడిపోయాయి. కానీ సింధు లోయ నాగరికత ఉన్నట్టుండి మాయమైపోలేదు. దీని ప్రభావాలు తరువాత వచ్చిన నాగరికతల్లో కనిపిస్తూనే ఉన్నాయి.
చారిత్రక సమకాలీనత
మార్చుసుమేరియన్ నాగరికత సుమారు క్రీ. పూ . 6000 నుండి క్రీ. పూ. 2000 వరకు వర్ధిల్లింది. క్రీస్తుపూర్వం. . 3000 ప్రాంతంలో వారు అక్షరాల వ్రాతకు అభివృద్ధి చేసినట్లనిపిస్తుంది. ఆ వ్రాతల రికార్డుల ప్రకారం వారు "మాగన్", "దిల్మన్", "మెలూహా" - అనే మూడు ప్రాంతాలతో వాణిజ్య సంబంధాలు కలిగి ఉండేవారు. వీటిలో మాగన్ అనేది ఈజిప్టు ప్రాంతమని, దిల్మన్ అనేది బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఒమన్ ప్రాంతమని చరిత్రకారులు అభిప్రాయం. మూడవది అయిన మెలూహా గురించి ఏకాభిప్రాయం లేదు. ఇది సింధు లోయ నాగరికతను సూచించే ప్రదేశమని ఒక బలమైన అభిప్రాయం ఉంది. "మే-లాహ్-హా" అనే సుమేరియన్ పదానికి, "మెటకమ్" (ఉన్నత స్థానం) అనే ద్రవిడ పదానికి, "మ్లేచ్ఛ" అనే సంస్కృత పదానికి, "మలాహా" (నావికుడు) అనే ఉర్ధు పదానికి సంబంధం ఉన్నదని ఒక అభిప్రాయం. ఇలా చూస్తే ఈ "మెలూహా" అనేది సింధునదీలోయలో వర్ధిల్లిన నాగరికతతో వారికున్న సంబంధాలను బట్టి సుమేరియన్ నాగరికత, సింధు లోయ నాగరికత ఒకే కాలానికి చెందినవి కావచ్చును. అయితే సింధు లోయ నాగరికత అంతమైన తరువాత "మెలూహా" అనే పదం వాడకం కొనసాగింది. ఆ తరువాతి సమయంలో అది ఈజిప్టు, ఆఫ్రికా ప్రాంతాలను సూచించినట్లు అనిపిస్తున్నది.
ఏలం అనే నాగరికత క్రీస్తుపూర్వం. 2700 కాలంలో ప్రస్తుత ఇరాన్ నైఋతి భాగంలో వర్ధిల్లింది. ఇది ఇతర నాగరికతలో సంబంధం లేనిదని ఒక అభిప్రాయం. మరొక ప్రతిపాదన ప్రకారం ఏలం-ద్రవిడ నాగరికత అనే విస్తృత నాగరికతలో "ఏలం" నాగరికత ఒక భాగం. ఆ విషయంలో సింధు లోయ నాగరికతను ఏలం నాగరికతతో పోల్చి పరిశీలిస్తున్నారు. (మాతృ) దేవతారాధన, "ఎద్దులతో క్రీడలు" అనే అంశాలలో సారూప్యత పరంగా మినోవన్ క్రీటె నాగరికతతో కూడా సింధు లోయ నాగరికతను పోలుస్తున్నారు.[6]
సింధూనదీలోయ నాగరికతలో అభివృద్ధి చెందిన హరప్పా నాగరికత దశ పురాతన సమీప ప్రాచ్యప్రపంచం కంచుయుగం ఆరంభ దశ నుండి కంచుయుగం మధ్యదశ వరకు సమకాలీనమైన నాగరికతగా అంచనా వేయవచ్చును. దీనికి సమకాలీనమైన నాగరికతలుగా భావించ బడుతున్న ఇతర నాగరికతలు
- పాత ఎలమైట్ కాలం
- మెసపుటేమియాలో ఆరంభ సుమేరియన్ నాగరికత కాలం నుండి మూడవ "ఉర్" పాలన కాలం వరకు
- , మినోవన్ క్రీటె నాగరికత
- , ఈజిప్టులో పురాతన రాజ్యకాలం నుండి మొదటి మధ్యంతర రాజ్యకాలం వరకు.
సింధులోయ నాగరికతలో వాడిన భాషను మాత్రం ఇప్పటిదాకా ధ్రువీకరించలేకుండా ఉన్నారు. అది ద్రవిడ భాష,[7][8] అది ఇండో ఇరానియన్, ముండా భాష, ఇంకా పురాతన నిహాలీ భాష సంబంధించిన కొన్ని పదాలను వీరు వాడి ఉండవచ్చునని భావిస్తున్నారు.[9]
త్రవ్వకాలు
మార్చుహరప్పా శిథిలాల గురించి 1842లో మొట్టమొదటగా ఛార్లెస్ మాసన్ అనే యాత్రికుడు బెలూచిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పంజాబ్‌లలో పర్యటించి అక్కడి స్థానికుల నుంచి సుమారు 13 కోసులు ( 25 మైళ్ళ) దూరం విస్తరించిన ఒక నగరాన్ని గురించి చెప్పారని తన రచనల్లో వర్ణించాడు. కానీ పురాతత్వ శాస్త్రజ్ఞులెవరూ దీనిని ఒక శతాబ్ద కాలంపాటు పట్టించుకోలేదు.[10] 1856లో బ్రిటీష్ ఇంజనీర్లైన జాన్, విలియం బ్రంటన్ ఈస్ట్ ఇండియన్ రైల్వే కంపెనీ కోసం కరాచీ నుంచి లాహోర్ వరకు పట్టాలు వేస్తున్నారు. జాన్ రైలు మార్గానికి కావల్సిన కంకర కోసం వెతుకుతున్నాడు. ఆ ప్రదేశానికి దగ్గరలో గల కొంత మంది ప్రాంతీయులు శిథిలావస్థలో ఉన్న బ్రహ్మినాబాద్ అనే నగరాన్ని గురించి చెప్పారు. దాన్ని సందర్శించిన జాన్ అందులో బాగా కాలిన దృఢమైన ఇటుకలు కనిపించాయి. రైలు మార్గం వేయడం కోసం కంకర కోసం వచ్చిన వాళ్ళకు శిథిలమైన ఆ నగరంపైనే రైలు మార్గంగా వేయడానికి అనుకూలంగా తోచింది.[11] కొద్ది నెలల తర్వాత ఇంకా ఉత్తరంగా జాన్ సోదరుడైన విలియం బ్రంటన్ వేయవల్సిన రైలు మార్గానికి దగ్గరలో ఇంకొక శిథిలమైన నగరం కనిపించింది. అందులో నుంచి ఇటుకలను తీసి చుట్టుపక్కల గ్రామస్థులు కొద్దిమంది తమ అవసరాలకు వాడుకుని ఉన్నారు. ఆ ఇటుకలే ఇప్పుడు కరాచీ, లాహోర్ రైలు మార్గానికి కంకరగా ఉపయోగపడ్డాయి.[11]
1872-75 మధ్య కాలంలో అలెగ్జాండర్ కన్నింగ్‌హామ్ మొదటి సారిగా హరప్పాకు సంబంధించిన ముద్రలను ప్రచురించాడు. అయితే వీటిలో లిపిని బ్రాహ్మీ లిపి అక్షరాలు అని (తప్పుగా) భావించాడు.[12] అర్ధ శతాబ్దం తర్వాత 1912 సం.లో జె. ఫ్లీట్ మరికొన్ని హరప్పా ముద్రలను కనుగొన్నాడు. దీన్ని కనుగొన్న ప్రోత్సాహంతో జాన్ మార్షల్ నేతృత్వంలో 1921-22 సం.లో రాయ్ బహదూర్ దయారామ్ సాహ్నీ, మధో సరూప్ వత్స్ మొదలైన వారు అప్పటి దాకా కనుగొనబడని హరప్పా శిథిలాలను కనుగొన్నారు. అలాగే రాఖల్ దాస్ బెనర్జీ, ఇ. జె. హెచ్ మాకే, జాన్ మార్షల్ మొహెంజో దారో శిథిలాలను కనుగొన్నారు. 1931 వచ్చేసరికి మొహెంజో దారో శిథిలాలను చాలావరకు వెలికి తీయగలిగారు. కానీ భారతీయ పురాతత్వ శాఖ ఆధ్వర్యంలో త్రవ్వకాలు మాత్రం కొనసాగాయి. స్వాతంత్ర్యానికి ముందు ఈ పరిశోధనల్లో పాల్గొన్న వారిలో అహ్మద్ హసన్ దనీ, బ్రిజ్‌బాసి లాల్, నాని గోపాల్ మజుందార్, సర్ మార్క్ ఔరెల్ స్టీన్ మొదలైన వారు ప్రముఖులు.
స్వాతంత్ర్యానంతరం భారతదేశ విభజన తర్వాత పురాతత్వ శాఖ కనుగొన్న చాలా వస్తువులు, అవి కనుగొన్న చోటు ఎక్కువ భాగం పాకిస్థాన్ లో ఉండడం మూలాన, పాకిస్తాన్‌కు వారసత్వంగా వెళ్ళి పోయాయి. తర్వాత కూడా పాకిస్థాన్ పురాతత్వ శాఖకు సలహాదారు ఐన సర్ మోర్టిమర్ వీలర్ ఆధ్వర్యంలో 1949 సం.లో త్రవ్వకాలు జరపారు. ఈ నాగరికతకు సంబంధించిన త్రవ్వకాలు పడమర వైపున బెలూచిస్థాన్ లోగల సుత్కాగన్‌దర్ వరకు, ఉత్తరం వైపున ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ లోగల "అముదార్య" లేదా "ఆక్సస్" నది వరకు జరిపారు.
యుగ విభజన
మార్చుహరప్పా నాగరికత ప్రౌఢ దశ సా. పూ. 2600 నుండి సా. పూ. 1900 వరకు కొనసాగింది. ఇంతకు ముందు దశను ఆరంభ హరప్పా దశ అని, తరువాతి దశను అనంతర హరప్పా దశ అని అంటారు. ఇవన్నీ కలిపి చూస్తే సింధు లోయ నాగరికత సా. పూ. 33వ శతాబ్దం నుండి సా. పూ. 14వ శతాబ్దం (అనగా సుమారు 2000 సంవత్సరాలు) కొనసాగిందని చెప్పవచ్చును. సింధులోయ నాగరికతను కాలమానం ప్రకారం విభజించడానికి "దశలు", "యుగాలు (Eras) అనే రెండు పదాలను వాడుతున్నారు.[13][14]
- మొదటిదైన ఆరంభ హరప్పా దశ - దీనినే యుగం "ప్రాంతీకరణ యుగం" అని కూడా అంటారు. ఇది క్రొత్త రాతి యుగపు రెండవ "మెహ్రగర్" కాలానికి సరిపోతుంది. మెహ్రగర్‌లో లభించిన అవశేషాలు సింధు లోయ నాగరికత పట్ల అవగాహనలో క్రొత్త వెలుగులకు దారి తీశాయని ఇస్లామాబాద్ ఆచార్యుడు "అహమ్మద్ హసన్ దని" అన్నాడు.[15]
- రెండవదైన ప్రౌఢ హరప్పా దశ - దీనినే యుగం "సమైక్యతా యుగం" అని కూడా అంటారు.
- చివరిదైన అనంతర హరప్పా దశ - దీనినే యుగం "స్థానికీకరణ యుగం" అని కూడా అంటారు.[15]
కాల ప్రమాణం (సా. పూ. ) | దశ | యుగం |
---|---|---|
5500-3300 | మెహర్గఢ్ II-VI (క్రొత్త రాతియుగపు పాత్రల కాలం) | ప్రాంతీకరణ యుగం |
3300-2600 | ఆరంభ హరప్పా (ఆరంభ కంచు యుగం) | |
3300-2800 | హరప్పా 1 (రావి దశ) | |
2800-2600 | హరప్పా 2 (కోట్ దిజి దశ, నౌషారో I, మెహ్రగర్ VII) | |
2600-1900 | ప్రౌఢ హరప్పా (మధ్య కంచు యుగం) | సమైక్యతా యుగం |
2600-2450 | హరప్పా 3A (నౌషారో II) | |
2450-2200 | హరప్పా 3B | |
2200-1900 | హరప్పా 3C | |
1900-1300 | అనంతర హరప్పా (సమాధుల కాలం, చివరి కంచు యుగం) | స్థానికీకరణ యుగం |
1900-1700 | హరప్పా 4 | |
1700-1300 | హరప్పా 5 |
భౌగోళిక విస్తరణ
మార్చుసింధు లోయ నాగరికత పశ్చిమాన పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ నుండి తూర్పున పశ్చిమ ఉత్తర ప్రదేశ్ వరకు, ఉత్తరాన ఈశాన్య ఆఫ్ఘనిస్తాన్ నుండి దక్షిణాన గుజరాత్ రాష్ట్రం వరకు విస్తరించింది.[16] భారతదేశంలోని గుజరాత్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలు, పాకిస్తాన్లోని సింధ్, పంజాబ్, బలూచిస్తాన్ ప్రావిన్సులలో అత్యధిక స్థలాలు ఉన్నాయి.[16] ఈ నాగరికీ విలసిల్లిన తరప్రాంతాలు పశ్చిమ బలూచిస్తాన్‌లోని సుట్కాగన్ డోర్ [17] నుండి గుజరాత్‌లోని లోథాల్ [18] వరకు వఉన్నాి. ఉత్తర ఆఫ్ఘనిస్తాన్లోని షార్టుగై వద్ద,[19] వాయవ్య పాకిస్తాన్లోని గోమల్ నది లోయలో,[20] జమ్మూ సమీపంలో మాండా వద్ద బియాస్ నదిపైన,[21] ఢిల్లీ నుండి 28 కిలోమీటర్ల దూరంలో అలమ్‌గిర్‌పూర్ వద్ద హిండన్ నదిపైనా సింధు లోయ స్థలాలను కనుగొన్నారు.[22] మహారాష్ట్రలోని దైమాబాద్, సింధు నాగరికతకు చెందిన అత్యంత దక్షిణాన ఉన్న ప్రదేశం. సింధు నాగరికత స్థలాలు నదీ లోయల్లో చాలా ఎక్కువగా ఉంటాయి. పురాతన సముద్రతీరంలో కూడా కొన్ని స్థలాలను కనుగొన్నారు.[23] బాలాకోట్ దీనికి ఒక ఉదాహరణ.[24] అలాగే ద్వీపాలలోకూడ కొన్ని ఉన్నాయి - ఉదాహరణకు ధోలావిరా.[25]
పాకిస్తాన్‌లో హక్రా ప్రవాహం మధ్య ఎండిపోయిన నది దిబ్బలు, భారతదేశంలో వర్షాలు పడినప్పుడు ప్రవహించే ఘగ్గర్ నది ప్రాంతాలలో అనేక "సింధులోయ" లేదా "హరప్పా" నాగరికతకు చెందిన శిథిలావశేష స్థలాలను కనుగొన్నారు.[26] - రూపార్, సోతి, రాఖీగఢీ, కాలిబంగన్, గన్వారివాలా వాటిలో కొన్ని స్థలాలు.[27] పాకిస్తాన్, భారతదేశపు సరిహద్దులలో "ఘగ్గర్ - హక్రా" ప్రాంతంలో విస్తరించి ఉన్న బాగొర్, హక్రా, కోటి దిజ్ వంటి జాతుల నాగరికత సంకీర్ణమే ఈ హరప్పా నాగరికత అని జె జి షాపెర్, డిఎ లీచెన్స్టీన్ అభిప్రాయపడ్డారు.[26][28] కొద్ది మంది పురాతత్వ శాస్త్రవేత్తల అభిప్రాయాల ప్రకారం ఎండిపోయిన ఘగ్గర్ హక్రా నది, ఉపనదుల పరీవాహక ప్రాంతాల్లో దాదాపు 500 హరప్పా ప్రదేశాలు బయల్పడినాయి.[29] సింధు, దాని ఉపనదుల తీరం వెంబడి కేవలం 100 ప్రదేశాలు మాత్రమే కనుగొనబడ్డాయి గనుక [30] ఈ నాగరికతను "సింధు-ఘగ్గర్-హక్రా నాగరికత" లేదా "సింధు-సరస్వతి నాగరికత" అని పిలవాలని కొంతమంది పురాతన చరిత్ర పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఈ భావాలలో కొన్ని రాజకీయ ఛాయలు కూడా ఉన్నాయి. ఈ విధమైన నామకరణం అనవసరమని, అశాస్త్రీయం కూడానని ఇతర పురాతన చరిత్ర పరిశోధకులు అంటున్నారు. ఒక కారణం: ఘగ్గర్-హక్రా ప్రాంతం ఎడారిమయమైనందున అక్కడి స్థలాలు చెదరకుండా నిలిచాయి. జనసమ్మర్దం ఉన్న సింధులోయలో జనావాసాల వలన, వ్యవసాయం వలన, మెత్తని మన్నువలన చారిత్రిక అవశేషాలు నాశనమైపోయాయి. మరొకటి: ఘగ్గర్-హక్రా ప్రాంతంలో లభించిన శిథిలావశేషాలను అతిశయంగా చెబుతున్నారు. అంతే కాక ఒకవాడు ఘగ్గర్, హక్రానదులు సిధు నదికి ఉపనదులు. కనుక "సింధు లోయ నాగరికత" అనే పదం మొత్తానికి వర్తిస్తుంది.[31] పురాతన శిథిలాల త్రవ్వకాలలో మొదట కనుగొన్న స్థలం పేరుమీద ఆ నాగరికతకు ఆ పేరు పెట్టడం సామాన్యం కనుక "హరప్పా నాగరికత" అనేది సముచితమైన పేరు.
సింధులోయ నాగరికతకు దక్షిణ భారత దేశంతో ఉన్న సంబంధాలు తెలిపే అవశేషాలు తాజాగా బయల్పడ్డా యి. కేరళలోని వాయనాడ్ జిల్లా ఎడక్కల్ గుహల్లో హరప్పా నాగరికతకు సంబంధించిన రాతి నగిషీలు లభించాయి. కర్ణాటకలోనూ, తమిళనాడులోనూ సింధులోయ నాగరికతకు సంబంధించిన అవశేషాలు ఎప్పుడో దొరికాయి. అయితే కేరళలో కొత్తగా లభించిన అవశేషాలతో హరప్పా నాగరికత దక్షిణ భారత దేశంలోనూ విలసిల్లిందని చెప్పే ఆధారాలు మరింత బలపడ్డాయని చరిత్రకారుడు ఎం. ఆర్. రాఘవ వారియర్ చెప్పారు. దీంతో కేరళ చరిత్ర లోహయుగానికి కంటే పురాతనమైనదని చెప్పడానికి ఆధారాలు లభించాయని చెప్పారు. కేరళ పురావస్తు శాఖ ఇటీవల జరిపిన తవ్వకాల్లో ఎడక్కల్ గుహల్లో ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న హరప్పా, మొహెంజో దారో సంస్కృతికి సంబంధించిన చిహ్నాలు లభించాయి. లభించిన ఆధారాల్లో 429 చిహ్నాలను ఇప్పటికి గుర్తించారు. జాడీని పోలిన కప్పును పట్టుకున్న మనిషి బొమ్మ హరప్పా సంస్కృతికి ప్రతిబింబంగా భావిస్తారు. ఇదేకాక సా. పూ. 2300 నుంచి సా. పూ. 1700 సంవత్సరం వరకూ విలసిల్లిన హరప్పా సంస్కృతికి సంబంధించిన లిపి ఇక్కడ బ యటపడిందని, తవ్వకాలకు నా యకత్వం వహించిన వరియెర్ చెప్పారు.[32]
పుట్టుక
మార్చుసింధు లోయ నాగరికత ఎలా ఉధ్బవించిందో తెలిపేందుకు చాలా సిద్ధాంతాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. మొదటగా దీనిని దక్షిణ ఆసియాను బాగా ప్రభావితం చేసిన, ఇండో యూరోపియన్ వలసల వల్ల ప్రభావితమైన వేదకాలపు నాగరికతలో మొదటి దశగా భావించారు. కానీ వేద కాలపు నాగరికతకు సంబంధించి ఎటువంటి విషయాలు కనుగొనలేకపోవడంతో దీన్నిశాస్త్రవేత్తలు ఆమోదించలేదు. జంతువుల చిత్ర పటాల్లో వేదాల్లో ప్రముఖంగా ప్రస్తావించిన గుర్రాలు, రథాలు కనిపించకపోవడం మొదలైనవి ఇందులో ప్రధానంగా చెప్పబడినవి. ఎముకలపై చేసిన విస్తృత పరిశోధనల ఆధారంగా గుర్రాలు కేవలం సా. పూ. రెండవ సహస్రాబ్దిలోనే ప్రవేశపెట్టబడినవని ఋజువైంది.[33][34] చివరగా సింధు నాగరికతలో కనిపించే పట్టణ జీవితానికి, వేదాల్లో వర్ణించిన గ్రామీణ జీవితానికి ఎటువంటి పొంతన కుదరలేదు.[35]
మరొక వివరణ "పూర్వ ద్రవిడ సిద్ధాంతం" (ప్రోటో-ద్రవిడియన్ సిద్ధాంతం) ద్రవిడ సంస్కృతిపై ఆధారపడి ఉంది.[36] దీన్ని మొదటి సారిగా రష్యా, ఫిన్లాండ్కు చెందిన పరిశోధకులు ప్రతిపాదించారు. వీరు ఈ నాగరికతకు సంబంధించిన చిహ్నాలు ద్రవిడ భాషల నుంచి రాబట్టవచ్చునని కొన్ని ప్రయత్నాలు చేశారు. ప్రస్తుతం ద్రావిడ భాషలు అధికంగా దక్షిణ భారతదేశం, శ్రీలంక ప్రాంతంలో ఉన్నాయి గాని కొద్ది భాషలు లేదా మాండలికాలు భారత దేశం ఇతర ప్రాంతాలలోను, పాకిస్తాన్‌లోను వినియోగంలో ఉన్నాయి. (బ్రహుయి భాష ద్రవిడ భాషా వర్గానికి చెందినది. దీనిని బెలూచిస్తాన్ ప్రాంతలో మాట్లాడుతారు. ) కనుక ఈ వాదానికి కొంత బలం చేకూరుతున్నది. ఫిన్నిష్ ఇండాలజిస్ట్ ఆస్కో పర్పోలా అభిప్రాయంలో సింధు లోయ నాగరికతలో వాడిన లిపి అన్ని చోట్లా ఒకే విధంగా ఉంది కనుక ఆ నాగరికత వివిధ భాషల సమ్మేళనం అనడానికి కారణం కనిపించదు. కనుక ద్రావిడ భాషల పురాతన రూపం సింధులోయ జనుల భాష అయి ఉండవచ్చును. ఈ పూర్వ ద్రవిడ సిద్ధాంతాన్ని కూడా ఇదమిత్థంగా ఆమోదించడానికి సరైన ఆధారాలు లభించడంలేదు. ఎందుకంటే పూర్వ ద్రవిడ సిద్ధాంతం ఏక భాషా సంపర్కంపైన ఆధారపడి ఉంది. మరే సాంస్కృతికమైన ఆధారాలు లభించలేదు.[35]
ఆరంభ హరప్పా నాగరికత దశ
మార్చుఆరంభ హరప్పా-రావి దశ (రావి నది పేరు మీద) సుమారు క్రీ. పూ 3300 నుండి క్రీ. పూ 2800 వరకు సాగింది. పశ్చిమాన ఉన్న ఘగ్గర్-హక్రా నదీ ప్రాంతంలోని నాగరికత (హక్రా దశ) ఈ సమయంలోనే వర్ధిల్లింది. ఆ తరువాత క్రీ. పూ 2800-2600 కాలం నాటి కోట్ డిజి దశ లేదా రెండవ హరప్పా నాగరికత దశ అంటారు. పాకిస్తాన్‌లోని సింధ్ ప్రాంతంలో మోహంజొ దారో సమీప ంలో కనుగొన్న శిథిలాల స్థలం పేరు మీద ఈ దశకు "కోట్ డిజి దశ" అనే పేరు వచ్చింది. మనకు లభించినవాటిలో అన్నింటికంటె పాతదైన సింధు లిపి సుమారు క్రీ. పూ. 3000 నాటికి చెందినది.[8]
పరిణతి చెందిన హరప్పా నాగరికత అవశేషాలు పాకిస్తాన్‌లోని రహమాన్ ఢేరి, ఆమ్రిల వద్ద లభించాయి.[37] కోట్ డిజి (రెండవ హరప్పన్) లో లభించిన అవశేషాలు ప్రౌఢ హరప్పా నాగరికతకు నాందిలా అనిపిస్తున్నాయి. ఇక్కడ కనుగొన్న కోట (citadel) ఆనాటి అధికార కేంద్రీకరణను, నగర జీవనా వ్యవస్థను సూచిస్తాయి. ఈ దశకు చెందిన అవశేషాలు కనిపించిన మరొక పట్టణం భారత దేశంలో హక్రానది ప్రాంతంలోని కాలిబంగన్.[38]
ఈ నాగరికతలో వివిధ స్థలాల మధ్య వాణిజ్యం సాగింది. ఒకచోట లభించే వస్తువుల ముడి సరుకులు సుదూర ప్రాంతంలోని మరొక స్థలంలోంచి వచ్చినట్లు కనిపిస్తుంది. ఉదాహరణకు పూసల తయారికి అవుసరమైన లపీస్ లజులీ. ఈ దశలో గ్రామీణులు బఠాణి, నువ్వులు, ఖర్జూరం, ప్రత్తి వంటి పంటల వ్యవసాయాన్ని, గేదె వంటి జంతువుల పెంపకాన్ని సాధించారు. అంతకు ముందు చిన్న చిన్న గ్రామాలుగా ఉన్న జనావాసాలు క్రీ. పూ 2600 నాటికి పెద్ద పట్టణాలుగా మారినట్లున్నాయి. "ప్రౌఢ హరప్పా నాగరికత దశ" ఇక్కడినుండి ఆరంభమైంది.
ప్రౌఢ హరప్పా నాగరికత దశ
మార్చుఆరంభం దశలో చిన్న చిన్న గ్రామాలలో విస్తరించిన ఈ సమాజం క్రీ. పూ. 2600 నాటికి నగరాలు కేంద్రాలుగా విస్తరించిన నాగరికతగా రూపు దిద్దుకొంది. ఈ నగరాలు సింధునది, దాని ఉపనదుల తీరాలలో అభివృద్ధి చెందాయి. ఇప్పటికి 1, 052 నగర, జనావాస స్థలాలను గుర్తించారు. ప్రస్తుత పాకిస్తాన్‌లో ఉన్న హరప్పా, మోహంజొదారో, ప్రస్తుత భారత దేశంలో ఉన్న లోథాల్ పురాతత్వ శాస్త్రజ్ఞులు కనుగొన్న ఇలాంటి నగరాల అవశేషాలు.
నగరాలు
మార్చుసాంకేతికంగా బాగా అభివృద్ధి చెందిన పట్టణపు నాగరికత ఈ ప్రాంతంలో విలసిల్లినట్లుగా స్పష్టమైన చారిత్రక ఆధారాలు ఇక్కడి త్రవ్వకాల్లో దొరికాయి. ఇక్కడి మునిసిపల్ టౌన్ ప్లానింగ్ ప్రమాణాలను పరిశీలిస్తే వీరు పట్టణాలను అభివృద్ధి చేయడంలో సిద్ధహస్తులని, పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చేవారని తెలుస్తోంది. హరప్పా, మొహంజో-దారోల్లోను, ఇటీవలే బయల్పడిన రాఖీగఢీ లోనూ పట్టణ రూపకల్పనను పరిశీలిస్తే ప్రపంచంలో మొట్టమొదటి పరిశుభ్రతా వ్యవస్థ ఇక్కడే ఆరంభమైనట్లు ఋజువౌతుంది. ఒక నగరంలో ఒక్కో ఇల్లు లేదా కొన్ని ఇళ్ళ సమూహం దగ్గర్లో ఉన్న ఒక బావి నుంచి నీళ్ళు పొందేవారు. స్నానాలకోసం కేటాయించబడినదనిపించే ఒక గదినుండి వాడిన నీరు డ్రైనేజి కాలువల గుండా బయటికి వెళితుంది. ఈ డ్రైనేజిలపై కప్పు వేసి ఉంచారు. అవి వీధుల వెంట సమాంతరంగా వెళుతున్నాయి. ఇళ్ళ వాకిళ్ళు లోపలి నడవాలలోకి లేదా చిన్న సందులలోకి మాత్రమే అభిముఖంగా ఉన్నాయి. కొన్ని గ్రామాలలో గృహ నిర్మాణం హరప్పా నిర్మాణాలను నాగరికతను పోలి ఉంది.[39]
పురాతన సింధులోయ నాగరికతలో నిర్మించిన ఈ మురుగు నీరు, డ్రైనేజి వ్యవస్థ ఆ కాలంలో మధ్య ప్రాచ్యంలో గాని మరెక్కడైనా గాని నిర్మించిన డ్రైనేజి విధానాలకంటే చాలా అభివృద్ధి చెందినది. హరప్పా నాగరికతలో కొట్టవచ్చినట్లు కనిపించే అంశాలు - వారి నౌకాశ్రయాలు, ధాన్యాగారాలు, గోడౌనులు, ఇటుకల అరుగులు, దృఢమైన ఇటుకలతో నిర్మించిన బలమైన గోడలు. వారి కట్టడాలలో పెద్దపెద్ద గోడలు బహుశా వరదలనుండి, దాడులనుండి రక్షణకు ఉపయోగపడి ఉండవచ్చును.
ఈ నిర్మాణాలలో కేంద్ర స్థానంగా కనిపించే కోట లేదా ఉన్నత ప్రాసాదం (citadel) లక్ష్యం ఏమిటో స్పష్టంగా తెలియడంలేదు. సమ కాలీన నాగరికతలైన మెసపుటేమియా, పురాతన ఈజిప్టులలో ఉన్నట్లుగా హరప్పా నాగరికతలలో పెద్ద పెద్ద నిర్మాణాలు ఏవీ కనిపించడం లేదు. రాజ భవనాలు, ఆలయ గోపురాలు, సైన్యాగారాలు, మతసంస్థలు వంటి పెద్ద పెద్ద కట్టడాలు హరప్పా నాగరికతలో కనిపించవు. ఉన్నవాటిలో పెద్ద కట్టడాలు ధాన్యాగారాలు అనిపిస్తున్నాయి. ఒక్కచోట మాత్రం పెద్ద నిర్మాణం బహిరంగ స్నానట్టం అనిపిస్తున్నది. ఇక ఈ కోటలకు పెద్ద గోడలు ఉన్నాగాని అవి సైనిక ప్రయోజనాలకు ఉద్దేశించినట్లుగా కనిపించడంలేదు. బహుశా అవి వరద ప్రవాహాలను నిరోధించడానికి కట్టినవి కావచ్చును.
నగరాలలో జనులు అధికంగా వాణిజ్యం లేదా చేతిపనులపై ఆధారపడినట్లు అనిపిస్తుంది. ఒక విధమైన వృత్తి అవలంబించేవారు ఒక స్థానంలో ఉండినట్లుంది. ముద్రికలు, పూసలు వంటి వస్తువుల తయారీకి వాడిన ముడిసరుకులు స్థానికంగా లభించేవి కాదు. వీటిని సుదూర ప్రాంతాలనుండి దిగుమతి చేసుకొంటూ ఉండాలి. ఇక్కడ త్రవ్వకాలలో లభించిన వస్తువులలో ఆసక్తికరమైనవి కొన్ని - అందమైన, కొలిమిలో కాల్చిన ఫేయీన్స్ పూసలు - స్టియటైట్ ముద్రలు - ఈ ముద్రలపై జంతువుల, వ్యక్తుల (దేవతల?) బొమ్మలు, వ్రాతలు ఉన్నాయి. ఈ వ్రాత (సింధు లోయ నాగరికత లిపి)ని ఇంతవరకు చదవడం సాధ్యం కాలేదు. ఈ ముద్రికలు వాణిజ్య సామగ్రిపై ముద్రలు వేయడానికో, ఇతరాలకో వాడి ఉండవచ్చును.
కొన్ని ఇళ్ళు మిగిలిన ఇళ్ళకంటే కాస్త పెద్దవిగా ఉన్నప్పటికీ, మొత్తమ్మీద సింధులోయ నాగరికతకు చెందిన ఇళ్ళన్నీ దాదాపు సమ స్థాయిలో ఉన్నాయనిపిస్తుంది. అన్ని ఇండ్లకూ సమంగా నీటిపారుదల వ్యవస్థ కలపబడి ఉంది. అప్పటి సమాజంలో సంపద విషయంలో వ్యత్యాసాలు అంతగా లేవనిపిస్తుంది. వ్యక్తులు ధరించే ఆభరణాలు మాత్రం సమాజంలో వారి స్థాయిని సూచిస్తూ ఉండవచ్చును.
లోథాల్
మార్చులోతాల్ లేదా లోధాల్ సింధు లోయ నాగరికతకు చెందిన అత్యంత ప్రముఖ నగరాలలో ఒకటి. దీనిని 1954 లో గుజరాత్ లో కనుగొన్నారు. ఇది ఆ కాలపు ముఖ్యమైన ఓడరేవు నగరాలలో ఒకటి.
లోతాల్ లేదా లోధాల్ అనే గుజరాతీ మాటకు 'శవాల దిబ్బ' అని అర్ధం. మొహెంజో దారో అనే సింధీ మాటకుకూడా అర్థం అదే. ఈ దిబ్బ అహ్మదాబాద్ కు 75 కిలోమీటర్ల దూరంలో కాంబే సింధుశాఖ మొగలో ఉంది. సా. పూ. 2450 సం. లనాడు ఇక్కడ ఒక చిన్న గ్రామం ఉండేది. దానిలోనివారు మట్టి మిద్దెలు, మట్టి ఇటుకలతో కట్టిన ఇళ్ళలో నివసించేవారు. తరచుగా వచ్చే వరదల వలన దెబ్బ తగలకుండా పల్లెచుట్టూ మట్టికట్ట కట్టినట్టు కనిపిస్తుంది. గ్రామంలోని ప్రజలు బహుశా వ్యవసాయం, చేపలు పట్టడం, వాటి వ్యాపారం నమ్ముకున్న సరళ స్వభావులయి ఉంటారు. విలువైన రాళ్ళపూసలు తయారు చెసేవారు. అభ్రక మిశ్రమం లాగా మెరిసే ఎర్రటి మట్టితో పాత్రలు సిద్ధపరిచేవారు. పాత్రల నమూనాలు, వాటిపై చిత్రపు పనులు హరప్ప పాత్రల కంటే భిన్నమైనవి.
వ్యాపారం కోసం సముద్రాలపై తిరిగే హరప్పా ప్రజలు, లోధాల్ రక్షణ గల ఓడరేవు కావడం, దానికి ఆనుకొని ఉన్న భూభాగం పత్తి, గోధుమ, వరి పండే సారవంతమైన భూభాగం కావడం గుర్తించి, సింధు ఉప్పుకయ్య నుంచి లోధాల్‌కు తరలి వచ్చారు. అక్కడి నుండి మరికొంత దిగువకు కిం ఉప్పుకయ్య లోని భగత్రావ్ వరకు వచ్చారు.
వరద పోటు నుండి తట్టుకొనేందుకు గాను పట్టణాన్ని ఒక వ్యవస్థతో నిర్మించారు. మెరక మీద ఉన్న స్థలం, పల్లంలో ఉన్న స్థలం ఈ రెంటినీ విడదీసి పెక్కు విశాలమైన బాటలతో కలిపే ఏర్పాట్లు, ఎత్తైన ప్రహరీ గోడలు నిర్మించారు.
ఈ నగరపు పారిశుధ్యపు పద్ధతులు అద్భుతమైనవి. వీధిలోని మరుగు కాలువలకు ఇండ్ల స్నానాగారాల నుండి వచ్చే మురుగు తూములను కలిపారు. ఈ మురుగు కాలువలు కొన్ని కప్పి ఉండేవి. కొన్ని కప్పకుండానూ ఉండేవి. మురికి చెత్తను వడజేసే పెద్దజాడీలను అడపాదడపా పరిశుద్ధంచేసే ఏర్పాట్లు ఉన్నాయి. వాటికి మ్యాన్‌హోల్స్ ఇప్పటి లానే ఏర్పరిచారు.
కెంపులు, స్ఫటికాలు, పచ్చలు రాతిచిప్పలు మొదలయిన రాళ్ళు లోధాల్ నుంచే సుమేరియన్ నగరాలకు ఎగుమతి అయ్యేవి. లోధాల్ దిగువ పట్టణంలో బజార్లలో ఆలి చిప్పల గాజులు, రాగి పాత్రల కార్ఖానలు బహిరంగంగానే ఉన్నట్టు ఆధారాలు దొరికాయి. పట్టణం ఉత్తరపు చివర ఆరు ఇటుకలు పేర్చిన కుండ కొలుములున్న రాగికార్ఖానాలు కనిపించాయి. పలువురు తాంరకారులు ఒకేచోట పని చెసినట్టు తెలియుచున్నది.
లోధాల్ ప్రజలు చేసిన అతిముఖ్యమైన సేవ, ఓడరేవు నిర్మాణం. 219 X 37 మీటర్ల స్థలాన్ని తవ్విన తర్వాత చదును చేసి, ఆవంలో కాలిన ఇటుకలతో చుట్టు ఒక మీటర్ ఎత్తయిన గోడ కట్టారు. ప్రవాహం రావడం, మొదలయిన ప్రమాదాలను ఆలోచించి ఈ నిర్మాణం జరిగింది. పెద్ద వరదలు వచ్చినప్పుడు పడవలు ఈరేవులోకి వెళ్ళడానికి ఉత్తరపు గట్టున దాదాపు 13 మీటర్ల వెడల్పు ద్వారమొకటి ఏర్పాటు చేశారు. పడవలు ఒక కాలువ ద్వారా ఈద్వారం చేరుతాయి. రేవులో నీరు ఎక్కువయినప్పుడు చెరువు నీరు మరవసారి వెళ్ళిపోయేటట్టు దక్షిణపు గట్టున మరవ కట్టడం కూడా లోధాల్ వాస్తు శాస్త్రజ్ఞల అపూర్వ ప్రతిభ. ఈవిధంగా నీరు నిలువ చేసే ఏర్పాట్లు జరిగాయి. రేవుగోడలోని రంధ్రాలను బట్టి, లంగరు వసేవని తెలుస్తున్నది. క్రీ. పూ. 2000 సం.కు పూర్వం నది ఈరేవును పాడుచేసి, మరొక వైపుగా పారింది. కాని ప్రజలు మరొక కాలువ తవ్వి తూర్పు గట్టున ద్వారం ఏర్పాటు చేసారు. ఇక్కడ నుండి మెసపాటెమియా (ఇరాక్) లోని ఉర్, బ్రాక్, హమ్మా, కిష్, లగష్ మొదలయిన పట్టణాలకు రత్నాలను ఎగుమతి దిగుమతి చెసేవారు.
ఇక్కడ ఒక పెద్ద కోష్ఠాగారము (ware house) కూడాకలదు. వీటిని కొందరు ధాన్యాగారం నిలువ కొరకు వాడేవారందురు.
లోధాల్ ప్రజలు ఏదో రకపు అగ్నిపూజ జరుపుతున్నట్లు ఆధారాలు ఉన్నాయి. దిగువ పట్టణంలోని పెక్కు ఇండ్లలలోని బూడిద ఉన్న ఇటుకల గుంటలు, కొండబొచ్చెలు, త్రికోణాకారమయిన అగ్ని కుండలాలు కనిపించాయి. వీరికి పశువులను బలి ఇచ్చే పద్ధతి ఉన్నట్లు తెలియుచున్నది. ఒకటవ వీధిలోని ఒక ఇంట్లో చెక్కిన ఆవు ఎముకులు, బంగారపు పతకం, రంగువేసిన పెంకు ముక్కలు, మాంసపురంగు పూసలు, బూడిద కనిపించాయి.
ఇక్కడి ప్రజలు మృతులను పాతిపెట్టేవారు. అయితే వీరు ఇద్దరు ముగ్గురులని కలిపి ఖననం చేసేవారు. సతీ సహగమనం లానే భావించవచ్చును.
క్రీ. పూ. 1900 లో తరచు వరదలు రావటం వలన ఈ నగరం శిథిలం అయినట్లు శాస్త్రకారుల అభిప్రాయము. ఆర్యుల దండయాత్ర వలన అని మరి కొందరి అభిప్రాయము.
సైన్సు
మార్చుఈ కాలంలో జీవించిన ప్రజలు పొడవు, ద్రవ్యరాశి, కాలాలను మొదలైన రాశులను చాలావరకు కచ్చితంగా కొలవగలిగినట్లు ఆధారాలున్నాయి. అయితే సింధు లోయకు చెందిన వివిధ ప్రాంతాలలో విధమైన కొలతలు ఉన్నట్లుగా ఇప్పటికి లభించిన ఆధారాలను బట్టి అనుకోవచ్చును. లోథాల్‌లో దొరికిన దంతపు కొలబద్ద ప్రకారం వారు కొలిచిన అతి చిన్న కొలత సుమారు 1.704 మి. మీ.కు సరిపోతుంది. కంచు యుగంలో ఇంతకంటే చిన్న కొలమానం ఎక్కడా వాడలేదు. హరప్పా ఇంజినీర్లు తమ కొలతలకు దశాంశ విధానాన్ని వాడినట్లు తెలుస్తున్నది.
బరువులను కొలవడానికి వాడిన షడ్భుజాకారపు కొలమానాలు కూడా దశాంశ విధానాన్నే సూచిస్తున్నాయి. వారు వాడిన బరువులు కచ్చితంగా 4:2:1 నిష్పత్తిలో ఉన్నాయి. 0.05, 0.1, 0. 2, 0.5, 1, 2, 5, 10, 20, 50, 100, 200, 500 యూనిట్ల బరువు కొలమానాలు వాడారు. ఒక్కొక్క యూనిట్ సుమారు 28 గ్రాములు బరువుంది. తరువాతి కాలంలో (క్రీ. పూ. 4వ శతాబ్దం) కౌటిల్యుని అర్ధశాస్త్రంలో చెప్పబడిన కొలమానాలు లోథాల్‌లో లభించిన కొలమానాలకు సరిపోతాయి.[40]
హరప్పా కాలంలో కొన్ని ప్రత్యేకమైన పరికరాలను కనుగొన్నారు. ఉదాహరణకు కనుచూపుమేర కనబడే ప్రదేశాన్ని, నీటి లాకు కొలవడానికి వుపయోగించే పరికరం. అంతే కాకుండా తమదైన కొన్ని లోహపు తయారీ ప్రక్రియల ద్వారా రాగి, కంచు, సీసం, తగరం వంటి లోహాలు తయారు చేశారు. హరప్పా ఇంజనీర్ల సాంకేతిక ప్రతిభ ఆశ్చర్యం కలిగిస్తుంది. సముద్రపు ఆటుపోట్లను జాగ్రత్తగా అధ్యయనం చేసి నౌకాశ్రయాలను నిర్మించారు. అయితే లోథాల్ వద్ద "నౌకాశ్రయం" అనబడే నిర్మాణం లక్ష్యం ఏమిటో అన్న విషయంపై భిన్నాభిప్రాయాలున్నాయి. బనావాలి వద్ద బంగారం నాణ్యతను తెలుసుకోవడానికి ఉపయోగపడే గీటురాయి బయల్పడింది.[41]
2001లో పాకిస్తాన్ ప్రాంతంలో మెహ్రాఘర్ శిథిలాలలో లభించిన రెండు మానవ అవశేషాల పరిశీలన వలన హరప్పా నాగరికతలో ఆది దంతవైద్యానికికి సంబంధించిన విజ్ఞానం ఉండేదని తెలుస్తున్నది. బ్రతికి ఉన్న మానవుల పండ్లలో డ్రిల్ చేయగలగడం అనే పరిజ్ఞానం క్రొత్త రాతియుగం నాగరికతలో ఈ ఒక్కచోటే కనిపిస్తున్నది. 9 మంది వ్యయోజనుల పుర్రెలలో పండ్లపై రంధ్రాలు చేసి దానిపై మూతనుంచినట్లు (drilled molar crowns) కనిపించాయి. ఈ అవశేషాలు 7, 500-9, 000 ఏళ్ళ క్రితానివని అంచనా వేశారు.[42]
కళలు, సాంప్రదాయాలు
మార్చుఅనేక రకాలైన శిల్పాలు, ముద్రలు, పింగాణీ, మట్టి పాత్రలు, ఆభరణాలు, మానవశరీర శాస్త్రాన్ని వివరంగా విపులీకరించే అనేక టెర్రాకోట బొమ్మలు, ఇత్తడి వస్తువులు మొదలైనవి ఎన్నో త్రవ్వకాలు జరిపిన ప్రదేశంలో లభించాయి. నాట్యం చేస్తున్న నర్తకుల వివిధ భంగిమల స్వర్ణ విగ్రహాలు, టెర్రాకోట ప్రతిమలు, శిలా విగ్రహాలు అప్పటి నృత్య శైలిని సూచిస్తున్నాయి. ఇంకా ఆవులు, ఎలుగుబంట్లు, వానరాలు, శునకాలు మొదలైన టెర్రాకోట బొమ్మలు కూడా లభించాయి. జాన్ మార్షల్ మొట్టమొదటి సారిగా మొహంజో-దారోలో నృత్య భంగిమలో నిల్చున్న ఒక నర్తకి ఇత్తడి విగ్రహాన్ని చూడగానే సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాడు.
“ | … ఈ విగ్రహాలను చూసినపుడు అవి చరిత్ర పూర్వ యుగానికి చెందినవని నేను నమ్మలేకపోయాను. ఈ బొమ్మల ద్వారా పురాతన కళ, సంస్కృతులకు సంబంధించి మనకున్న అభిప్రాయాలు పూర్తిగా తల్లక్రిందులవుతాయి. గ్రీకుల హెల్లెనిస్ట్ నాగరికత కాలం వరకూ ఇలాంటి విగ్రహాలు నమూనాలు ఎవరూ రూపొందించలేదని అంతకుముందు మనం అనుకొన్నాం. అందువల్ల ఎక్కడో ఏదో పొరపాటు జరిగి తరువాతి తరానికి చెందిన ఈ బొమ్మలు అంతకు ముందటి మూడువేల యేండ్ల క్రిందటి నాగరికతలో భాగంగా మనకు దొరికాయనుకొన్నాను.. .. ఈ బొమ్మలలో చూపిన శరీర సౌష్టవత కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. తరువాతి చాలా కాలానికి రూపొందిన గ్రీకు శిల్పకళనూ ఈ సింధులోయ తీరపు నాగరికులు ముందే ఊహించారా? . | ” |
నత్త గుల్లలపై నగిషీలు, పింగాణీ సామానులు, మెరుగులు దిద్దిన స్టీటైట్ పూసలు వంటి చాలా హస్తకళలు హరప్పా నాగరికత అన్ని దశలలోనూ, అనేక స్థలాలలో లభించాయి. వీటిలో కొన్ని పనులు ఇప్పటికీ భారత ఉపఖండంలో చేయబడుతున్నాయి.[43] అప్పుడు దొరికిన కొన్ని అలంకరణ సామగ్రులు (దువ్వెనలాంటివి) యొక్క రూపాంతరాలు ప్రస్తుత భారతదేశంలో కూడా వాడకంలో ఉన్నాయి.[44] క్రీ. పూ. 2800 - 2600 నాటి కొన్ని టెరాకొటా యువతుల బొమ్మలలో తల పాపిడిలో ఎరుపు రంగు గీతలు దిద్ది ఉన్నాయి.[44] మొహెంజో దారోలో లభించిన ముద్రికలలో కొన్నింటిపై పద్మాసనంలో ఉన్న బొమ్మ (పశుపతి?), తల్లక్రిందులుగా ఉన్న మనిషి బొమ్మ ఉన్నాయి. కొన్ని ముద్రలలో చిత్రించబడిన బూర లాంటి పరికరం, లోథాల్ లో లభించిన రెండు శంఖం లాంటి వస్తువులు అప్పట్లో వారు తంత్రీ వాద్యాలను వాడి ఉండవచ్చునని నిరూపిస్తున్నాయి. పాచికలలాంటి అనేక ఆట వస్తువులు, బొమ్మలు వారు వాడినట్లు తెలుస్తున్నది.[45]
రవాణా, వాణిజ్యం
మార్చువీరి ఆదాయం ఎక్కువగా వ్యాపారం మీదనే ఎక్కువగా ఆధారపడినట్లు తెలుస్తోంది. బాగా అభివృద్ధి చెందిన రవాణా సౌకర్యాలు ఇందుకు బాగా సహకరించేవి. ఇందులో ముఖ్యమైనవి ఎడ్లబండ్లు, పడవలు. ఇవి దక్షిణాసియా దేశాలలో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ పడవలు చిన్నవిగా ఉండి చుక్కాని సహాయంతో నడిచేవి. వీటి అడుగు భాగం సమతలంగా ఉండేది. వీటిని పోలిన పడవలను ఇప్పటికీ సింధు నదిలో గమనించవచ్చు ; కానీ సముద్రాలలో కూడా ఇటువంటి పడవలను నడిపినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. భారతదేశ పశ్చిమ ప్రాంతానికి చెందిన గుజరాత్ రాష్ట్రంలో లోథాల్ అనే తీర పట్టణంలో పడవలను నిలిపేందుకు ఏర్పాటు చేసిదిగా భావిస్తున్న ఒక పెద్ద కాలువను పురాతత్వ శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. వ్యవసాయానికి ఉపయోగించబడిన విశాలమైన కాలువల సముదాయాన్ని ఫ్రాంక్‌ఫర్ట్ అనే శాస్త్రజ్ఞుడు కనుగొన్నాడు.
క్రీ. పూ. 4300–3200 నాటి చాల్కోలితిక్ కాలం (రాగి యుగం)లో సింధులోయ నాగరికతలోని పింగాణీ పనులు దక్షిణ తుర్కమేనిస్తాన్, ఉత్తర ఇరాన్ పనిముట్లతో సారూప్యతను కలిగి ఉండడంవలన ఆ నాగరికతల మధ్య రాకపోకలు, వ్యాపార సంబంధాలు ఉండవచ్చుననే సూచనలు లభిస్తున్నాయి.క్రీ. పూ. 3200–2600 నాటి ఆరంభ దశ హరప్పా నాగరికతకు చెందిన ముద్రికలు, మట్టి పాత్రలు, బొమ్మలు, ఆభరణాల లోని సారూప్యత కారణంగా వారికి మధ్య ఆసియా, ఇరానియన్ పీఠభూమి ప్రాంతాలతో భూమార్గంలో రవాణా, వర్తక సంబంధాలున్నవని అనుకోవచ్చును.[46] అనేక ప్రాంతాలలో లభించిన పనిముట్లు బట్టి వర్తక సంబంధాల ద్వారా మొత్తం సింధులోయ నాగరికత, ఆఫ్ఘనిస్తాన్‌లోని కొంత భాగం, పర్షియా తీర ప్రాంతం, ఉత్తర, పశ్చిమ భారత దేశం, మెసపొటేమియాల నాగరికతలను ఆర్థికంగా ఏకీకృతం చేశాయనవచ్చును.
హరప్పా, మెసపుటేమియా నాగరికతల మధ్య విస్తారమైన సముద్రపు వర్తకం ఉండేదనీ, అది అధికంగా "దిల్మన్" (ప్రస్తుత బహ్రయిన్, పర్షియన్ సింధు శాఖ) ప్రాంతానికి చెందిన మధ్యవర్తుల ద్వారా సాగేదనీ తెలుస్తున్నది.[47] దుంగలతో చేసిన తెప్పలపై అమర్చిన తెరచాప పడవల ద్వారా ఈ వర్తకం సాగేది. పాకిస్తాన్‌కు చెందిన అనేక సముద్రపు తీర రేవులు, గుజరాత్‌లోని లోథాల్ వంటి పెద్ద రేవులు ఈ వర్తకానికి కేంద్రాలుగా వర్ధిల్లాయి. సముద్రంలో నదులు కలిసే చోట ఏర్పడిన లోతు తక్కువ రేవులు ఇలాంటి వ్యాపారాలకు ముఖ్యమైన స్థలాలు.
వ్యవసాయం
మార్చు1980వ దశకం తర్వాత జరిపిన కొన్ని పరిశోధనల ఆధారంగా సింధు లోయ ఆహారోత్పత్తిలో స్వయం సంవృద్ధి కలిగి ఉండేదని తెలుస్తోంది. మేర్గర్ ప్రజలు ఆ ప్రాంతంలోనే పండించిన గోధుమలు, బార్లీలు వాడినట్లు ఋజువైంది.[48] వారు ఎక్కువగా పండించే ధాన్యం బార్లీలే. పురాతత్వ శాస్త్రజ్ఞుడు జిమ్ ష్రాఫర్ మెహ్రాఘర్ గురించి ప్రస్తావిస్తూ ఆహారోత్పత్తి దక్షిణాసియాలో దేశీయంగా ఆవిష్కరించబడిన అద్భుతంగా అభివర్ణించాడు. అప్పటి పట్టణ నాగరికతను, క్లిష్టమైన సామాజిక వ్యవస్థను దేశీయమైన సమాచారం సహాయంతోనే కాక వివిధ సంస్కృతుల ఆధారంగా అంచనా వేశారు. డొరియన్ ఫుల్లర్ లాంటి కొంతమంది మాత్రం మిడిల్ ఈస్ట్ కు చెందిన గోధుమలు దక్షిణాసియా దేశాల వాతావరణానికి అలవాటు పడడానికి సుమారు 2000 సంవత్సరాలు పట్టిఉండవచ్చునని సూచనప్రాయంగా తెలిపాడు.
సంకేత లిపి
మార్చు400కి (600 దాకా ఉండవచ్చునని కొద్దిమంది భావన [49] )పైగా గుర్తులు వివిధ ముద్రల్లోనూ, పింగాణీ పాత్రలపైనా, ఇంకా కొన్ని వస్తువుల పైనా కనుగొనబడ్డాయి. ధోలవిరా పట్టణానికి లోగడ ఉన్న కోట ద్వారం వద్ద వేలాడదీసిన పలక మీద కొన్ని గుర్తులు ముద్రించబడి ఉన్నాయి. సాధారణంగా ఈ శాసనాలు నాలుగు లేదా ఐదు అక్షరాలకు మించవు. వీటిలో చాలా అక్షరాలు చిన్నవిగా ఉన్నాయి. ఒకే తలం మీద చెక్కిన శాసనాల్లో అన్నింటికన్నా పొడవైనది కేవలం ఒక అంగుళం (2. 54 సెం. మీ) పొడవుండి 17 గుర్తులను కలిగి ఉంది. ఒకే ఘనం పై మూడు తలాల మీద చెక్కిన 26 గుర్తులుగల ఒక శాసనం, ఇప్పటిదాకా లభించిన కృతుల్లోకెల్లా అన్నింటికన్నా పొడవైనదిగా గుర్తించబడింది.
ఈ శాసనాల ఆధారంగా సింధు సమాజం విద్యావంతమైనదిగా భావించినా, నవీన విద్యా విధానంలో వీటికి సమాంతరంగా ఎటువంటి వ్యవస్థా లేకపోవడంతో పలువురు భాషా శాస్త్రవేత్తలు, పురాతత్వ శాస్త్రవేత్తలు అనుమానం వ్యక్తం చేశారు. దీన్ని పాక్షికంగా ఆధారం చేసుకుని ఫార్మర్, స్ప్రోట్, విజెల్ రాసిన వివాదాస్పద పత్రం సింధు లిపి భాషను సంకేతీకరించలేదనీ కేవలం ఇతర తూర్పు దేశాల సంకేత లిపిని మాత్రమే పోలి ఉన్నదని వాదించారు.[50] ఇంకా కొద్దిమంది ఈ గుర్తులను కేవలం ఆర్థికపరమైన లావాదేవీలను నిర్వహించడానికి మాత్రమే వాడారని భావిస్తున్నారు. కానీ వీరు అదే గుర్తులు విస్తృతంగా వాడబడిన పూజ సామాగ్రిపై ఎందుకు ఉన్నాయన్న సంగతి మాత్రం వివరించలేక పోయారు. వేరే ఏ నాగరికతలోనూ ఇలా పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేయబడిన శాసనాలు లభించలేదు.[51]
ఇప్పుడు వాడుకలోలేని కొన్ని పురాతన శాసనాల ఛాయాచిత్రాలను పర్పోలా, అతని సహోద్యోగులు సంకలనంచేసిన అనే పుస్తకంలో[52] ప్రచురించబడ్డాయి. ఈ పుస్తకం చివరి భాగమైన మూడవ భాగంలో 1920, 1930 లో కనుగొనబడిన, తస్కరించబడిన కొన్ని వస్తువుల ఛాయాచిత్రాలను పొందుపరచగలరని భావిస్తున్నా దీని విడుదల కొన్ని ఏళ్ళ తరబడి ముద్రణకు నోచుకోకుండా ఉండిపోయింది.
మతం
మార్చుసింధు ప్రజలు ఎక్కువగా అమ్మతల్లిని అంటే శక్తిని ఆరాధించేవారు. పశుపతి అనే పురుష దేవుడిని కూడా కొలిచేవారు. పశుపతిని ముద్రిక ద్వారా తెలుసుకోవచ్చు. ఒక వేదికపై కూర్చున్న ముఖాల మూర్తి, ఆ వేదికను ఆవరించి ఏనుగు, పులి, ఖడ్గ మృగం, మహిషం ఉండేవి. రావి చెట్టు, స్వస్తిక్ గుర్తు, జంతువులు, చెట్లు, సర్పాలను కూడా పూజించేవారు. మూపురంతో కూడిన ఎద్దు వీరికి ఇష్టమైన జంతువు. లింగపూజ వీరితోనే ప్రారంభమైంది. జంతువులను బలిచ్చేవారు. వీరికి తెలియని జంతువు గుర్రం. వేదాల ఆధారంగా శివారాధన, శక్తి పూజ, లింగారాధన వంటివి సింధు నాగరికత వారసత్వాలుగా చెప్పుకోవచ్చు.[53]
ఇక్కడ చాలా వరకు దేవతా విగ్రహాలు [54] కనపడడం వలన హరప్పా ప్రజలు ఫలవంతమైన భూమిని సూచించే అమ్మవారిని పూజించినట్లుగా భావించారు. కానీ ఎస్. క్లార్క్ అనే శాస్త్రజ్ఞుడు ఈ వాదనను వ్యతిరేకించాడు.[55] కొన్ని సింధు లోయ ముద్రలు స్వస్తిక్ గుర్తు కలిగి ఉన్నాయి. ఈ గుర్తు దీని తర్వాత వచ్చిన కొన్ని మతాల్లో, పురాణాల్లో ముఖ్యంగా హిందూ మతంలో ఎక్కువగా ప్రాముఖ్యాన్ని కలిగి ఉంది. హిందూ మతానికి సంబంధించిన కొన్ని ఆధారాలు ప్రాచీన హరప్పా సంస్కృతికి ముందు కూడా ఉన్నాయి.[56][57].
శివలింగాన్ని పోలిన కొన్ని గుర్తులు కూడా హరప్పా శిథిలాల్లో కనిపించాయి.[58][59]
వీరి చిహ్నాలు చాలా వరకు జంతువుల్ని కలిగి ఉండేవి. వీటిలో ముఖ్యమైనది పద్మాసనంలో కూర్చున్న ఒక బొమ్మ, దాని చుట్టూ ఉన్న వివిధ జంతువులు. శివుడి రూపమైన పశుపతి విగ్రహంగా దీన్ని భావిస్తున్నారు.[60][61].[62]
మొదట్లో హరప్పా ప్రజలు చనిపోయిన వారిని ఖననం (పూడ్చడం) చేసేవాళ్ళు. కానీ తరువాతి కాలంలో శవాల్ని దహనం చేసి ఆ బూడిదను పాత్రల్లో పోసి ఉంచేవారు. ఋగ్వేద కాలంలో కూడా చనిపోయినవారిని ఖననం లేదా దహనం చేసేవారు.
హరప్పా తదనంతరం
మార్చుసామాన్య శక పూర్వం" (సా. పూ లేదా సా. శ. పూ ) 1800 వచ్చేసరికి నెమ్మదిగా ఈ నాగరికత బలహీనపడటం ఆరంభించింది. సా. పూ. 1700 శతాబ్దానికల్లా దాదాపు అన్ని నగరాలూ పాడుబడిపోయాయి. కానీ సింధు లోయ నాగరికత ఉన్నట్టుండి మాయమైపోలేదు. దీని ప్రభావాలు తరువాత వచ్చిన నాగరికతల్లో కనిపిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతపు పురాతత్వ సమాచారం ప్రకారం, హరప్పా తదనంతర సమాజం కనీసం సా. పూ. 1000-900 వరకూ కొనసాగి ఉండవచ్చునని చరిత్రకారుల భావన.[63] ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో మాదిరిగానే ఇక్కడ కూడా సంస్కృతులు ఒకదాని వెంబడి మరొకటి కొనసాగినట్లు పురాతత్వ శాస్త్రజ్ఞులు నొక్కి చెబుతున్నారు.[63]
ఈ నాగరికత బలహీనపడటానికి ప్రధాన కారణం వాతావరణం మార్పే అయి ఉండవచ్చు. సా. పూ. 1800 వచ్చేసరికి సింధు లోయ ప్రాంతం చల్లగానూ, తేమ రహితం కావడం ప్రారంభించింది. ఋతుపవనాలు బలహీనపడటం కూడా ఒక కారణం. ఇది కాకుండా ఇంకో ముఖ్యమైన కారణం ఘగ్గర్ హక్రా నదీ వ్యవస్థ అదృశ్యం కావడం. భూమి అంతర్భాగ నిర్మాణంలో జరిగిన కొన్ని మార్పుల మూలంగా ఈ వ్యవస్థ గంగా నదీ లోయ పరీవాహక ప్రాంతానికి కదిలించబడి ఉండవచ్చు. కానీ ఇది ఎప్పుడు జరిగింది అన్నదానికి ఆధారాలు లేవు. ఎందుకంటే ఘగ్గర్-హక్రా నది పరీవాహక ప్రాంతంలో జనావాసాలకు సంబంధించిన తేదీలు అందుబాటులో లేవు. ఇది కేవలం ఊహాగానమే ఐనా అన్ని నాగరికతలు వివిధ కారణాలవల్ల అంతరించిపోయాయన్నది వాస్తవం. [ఆధారం చూపాలి] హరప్పా నాగరికత అంతరించిపోవడానికి వాతావరణ మార్పులు కారణమా లేక నదీ వ్యవస్థలో మార్పులు కారణమా అని తెలుసుకోవడానికీ, ఈ ప్రాంతంలో 8000 సంవత్సరాల నుంచి నదీ వ్యవస్థ ఎలా మారుతూ వస్తుందో తెలుసుకోవడానికి అబెర్దీన్ విశ్వవిద్యాలయానికి చెందిన పీటర్ క్లిఫ్ట్ నేతృత్వంలో ఒక కొత్త పరిశోధన జరుగుతున్నది. 2004 లో విడుదలైన ఒక పరిశోధనా పత్రం ప్రకారం ఘగ్గర్ హక్రాకు చెందిన ఐసోటోపులు హిమానీ నదాలనుంచి వచ్చినవి కావనీ, వర్షం వల్ల ఏర్పడ్డవేనని పేర్కొన్నది.[64]
వారసత్వం
మార్చుసింధు నాగరికత అంతరించిపోయిన తర్వాత దీనిచే ప్రభావితమైన అనేక ప్రాంతీయ నాగరికతలు పుట్టుకొచ్చాయి. హరప్పా శిథిలాలలో సమాధులు కూడా కనుగొనడం జరిగింది.అలాగే రాజస్థాన్లో కనిపించే కుండలపై చిత్రించే కళకు సంబంధించిన ఆధారాలు కూడా ఇక్కడ లభ్యమయ్యాయి.
ప్రాచీన సింధు లోయ నాగరికతకు చెందిన పెద్దనగరాల్లో ఒకటైన మొహెంజో దారోలో పర్యాటక, సాంస్కృతి రంగాన్ని ప్రొత్సహించ డానికి పాకిస్థాన్ ప్రభుత్వం పది కోట్ల రూపాయలను మంజూరు చేసింది. సా. పూ. 2600 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ నగరం పాకిస్థాన్ లోని సింధ్ రాష్ట్రంలో ఉంది. సింధు నాగరికత ఈ ప్రాంతంలో సుమారు 1260000 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో విస్తరించి ఉంది. 1922 వ సంవత్సరంలో జరిపిన త్రవ్వకాల్లో మొహెంజో దారో బయట పడింది. 1980 లో దీన్ని ప్రపంచ వారసత్వ ప్రాంతంగా యునెస్కో ప్రకటించింది.
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ www.timesofindia.indiatimes.com
- ↑ "'Earliest writing' found". BBC. BBC News. 1999-05-04.
- ↑ Ching, Francis D. K.; Jarzombek, Mark; Vikramaditya, Prakash (2006). A Global History of Architecture. Hoboken, N.J.: J. Wiley & Sons. pp. 28–32. ISBN 0471268925.
- ↑ (McIntosh 2001, p.24)
- ↑ Ratnagar, Shereen (2006). Trading Encounters: From the Euphrates to the Indus in the Bronze Age. Oxford University Press, India. ISBN 019568088X.
- ↑ Mode, H. (1944). Indische Frühkulturen und ihre Beziehungen zum Westen. Basel.
{{cite book}}
: CS1 maint: location missing publisher (link) - ↑ "Indus civilization". Encyclopædia Britannica. 2007. Retrieved 2007-02-16.
- ↑ 8.0 8.1 Parpola, Asko (1994). Deciphering the Indus Script. Cambridge University Press. ISBN 0521430798.
- ↑ Witzel, Michael (1999). "Substrate Languages in Old Indo-Aryan (Ṛgvedic, Middle and Late Vedic)" (PDF). Electronic Journal of Vedic Studies. 5 (1). Archived from the original (PDF) on 2012-02-06. Retrieved 2008-09-24.
- ↑ Masson, Charles (1842). "Chapter 2: Haripah". Narrative of Various Journeys in Balochistan, Afghanistan and the Panjab; including a residence in those countries from 1826 to 1838. London: Richard Bentley. p. 472. Archived from the original on 2007-09-30. Retrieved 2008-09-24.
A long march preceded our arrival at Haripah, through jangal of the closest description.... When I joined the camp I found it in front of the village and ruinous brick castle. Behind us was a large circular mound, or eminence, and to the west was an irregular rocky height, crowned with the remains of buildings, in fragments of walls, with niches, after the eastern manner.... Tradition affirms the existence here of a city, so considerable that it extended to Chicha Watni, thirteen cosses distant, and that it was destroyed by a particular visitation of Providence, brought down by the lust and crimes of the sovereign.
Note that the coss, a measure of distance used from Vedic to Mughal times, is approximately . - ↑ 11.0 11.1 Davreau, Robert (1976). "Indus Valley". In Reader's Digest (ed.). World's Last Mysteries.
- ↑ Cunningham, A., 1875. Archaeological Survey of India, Report for the Year 1872-73, 5: 105-8 and pl. 32-3. Calcutta: Archaeological Survey of India.
- ↑ Kenoyer, Jonathan Mark (1991). "The Indus Valley tradition of Pakistan and Western India". Journal of World Prehistory. 5: 1–64. doi:10.1007/BF00978474.
- ↑ (Shaffer 1992, I:441-464, II:425-446.)
- ↑ 15.0 15.1 Chandler, Graham (1999). "Traders of the Plain". Saudi Aramco World: 34–42. Archived from the original on 2007-02-18. Retrieved 2008-09-24.
- ↑ 16.0 16.1 Singh, Upinder (2008). A History of Ancient and Early medieval India: from the Stone Age to the 12th century. New Delhi: Pearson Education. p. 137. ISBN 978-81-317-1120-0.
- ↑ Dales, George F. (1962). "Harappan Outposts on the Makran Coast". Antiquity. 36 (142): 86–92. doi:10.1017/S0003598X00029689.
- ↑ Rao, Shikaripura Ranganatha (1973). Lothal and the Indus civilization. London: Asia Publishing House. ISBN 978-0-210-22278-2.
- ↑ Kenoyer 1998, p. 96
- ↑ Dani, Ahmad Hassan (1970–1971). "Excavations in the Gomal Valley". Ancient Pakistan (5): 1–177.
- ↑ Joshi, J.P.; Bala, M. (1982). "Manda: A Harappan site in Jammu and Kashmir". In Possehl, Gregory L. (ed.). Harappan Civilization: A recent perspective. New Delhi: Oxford University Press. pp. 185–195.
- ↑ A. Ghosh (ed.). "Excavations at Alamgirpur". Indian Archaeology, A Review (1958–1959). Delhi: Archaeol. Surv. India. pp. 51–52.
- ↑ Ray, Himanshu Prabha (2003). The Archaeology of Seafaring in Ancient South Asia. Cambridge University Press. p. 95. ISBN 978-0-521-01109-9.
- ↑ Dales, George F. (1979). "The Balakot Project: Summary of four years excavations in Pakistan". In Maurizio Taddei (ed.). South Asian Archaeology 1977. Naples: Seminario di Studi Asiatici Series Minor 6. Instituto Universitario Orientate. pp. 241–274.
- ↑ Bisht, R.S. (1989). "A new model of the Harappan town planning as revealed at Dholavira in Kutch: A surface study of its plan and architecture". In Chatterjee Bhaskar (ed.). History and Archaeology. New Delhi: Ramanand Vidya Bhawan. pp. 379–408. ISBN 978-81-85205-46-5.
- ↑ 26.0 26.1 Possehl, Gregory L. (1990). "Revolution in the Urban Revolution: The Emergence of Indus Urbanization". Annual Reviews of Anthropology. 19 (19): 261–282 (Map on page 263). doi:10.1146/annurev.an.19.100190.001401.[permanent dead link]
- ↑ Mughal, M. R. 1982. "Recent archaeological research in the Cholistan desert". In Possehl, Gregory L (ed.). Harappan Civilization. Delhi: Oxford & IBH & A.I.1.S. pp. 85–95.
{{cite book}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Shaffer, Jim G.; Lichtenstein, Diane A. (1989). "Ethnicity and Change in the Indus Valley Cultural Tradition". Old Problems and New Perspectives in the Archaeology of South Asia. Wisconsin Archaeological Reports 2. pp. 117–126.
- ↑ (Gupta 1995, p. 183)
- ↑ e.g. Misra, Virendra Nath (1992). Indus Civilization, a special Number of the Eastern Anthropologist. pp. 1–19.
- ↑ Ratnagar, Shereen (2006). Understanding Harappa: Civilization in the Greater Indus Valley. New Delhi: Tulika Books. ISBN 8189487027.
- ↑ [ఆంధ్రజ్యోతి1.10.2009 ]
- ↑ Indus writing: Sanskrit or Dravidian?
- ↑ "Hinduism and The Indus Valley Civilization". Archived from the original on 2009-04-05. Retrieved 2008-09-24.
- ↑ 35.0 35.1 Ancient Indus Valley Script: Dani Interview Text Only
- ↑ Indus Writing Analysis by Asko Parpola
- ↑ Durrani, F. A. (1984). "Some Early Harappan sites in Gomal and Bannu Valleys". In Lal, B. B. and Gupta, S. P. (ed.). Frontiers of Indus Civilisation. Delhi: Books & Books. pp. 505–510.
{{cite book}}
: CS1 maint: multiple names: editors list (link) - ↑ Thapar, B. K. (1975). "Kalibangan: A Harappan Metropolis Beyond the Indus Valley". Expedition. 17 (2): 19–32.
- ↑ It has been noted that the courtyard pattern and techniques of flooring of Harappan houses has similarities to the way house-building is still done in some villages of the region. (Lal 2002, pp. 93–95)
- ↑ Sergent, Bernard (1997). Genèse de l'Inde (in French). p. 113. ISBN 2228891169.
{{cite book}}
: CS1 maint: unrecognized language (link) - ↑ Bisht, R. S. (1982). "Excavations at Banawali: 1974-77". In Possehl, Gregory L (ed.). Harappan Civilization: A Contemporary Perspective. New Delhi: Oxford and IBH Publishing Co. pp. 113–124.
- ↑ Coppa, A.; et al. (2006-04-06). "Early Neolithic tradition of dentistry: Flint tips were surprisingly effective for drilling tooth enamel in a prehistoric population" (PDF). Nature. 440.
{{cite journal}}
: CS1 maint: date and year (link) - ↑ Kenoyer, Jonathan Mark (1997). "Trade and Technology of the Indus Valley: New Insights from Harappa, Pakistan". World Archaeology. 29 (2: "High-Definition Archaeology: Threads Through the Past"): 262–280.
- ↑ 44.0 44.1 (Lal 2002, p. 82)
- ↑ (Lal 2002, p. 89)
- ↑ (Parpola 2005, pp. 2–3)
- ↑ Neyland RS (1992). "The seagoing vessels on Dilmun seals". In Keith DH, Carrell TL (eds.). Underwater archaeology proceedings of the Society for Historical Archaeology Conference at Kingston, Jamaica 1992. Tucson, AZ: Society for Historical Archaeology. pp. 68–74.
- ↑ Jarrige, J.-F. (1986). "Excavations at Mehrgarh-Nausharo". Pakistan Archaeology. 10 (22): 63–131.
- ↑ Wells, B. An Introduction to Indus Writing. Early Sites Research Society (West) Monograph Series, 2, Independence MO 1999
- ↑ Farmer, Steve; Sproat, Richard; Witzel, Michael. "The Collapse of the Indus-Script Thesis: The Myth of a Literate Harappan Civilization".
- ↑ These and other issues are addressed in (Parpola 2005)
- ↑ [Corpus of Indus Seals and Inscriptions (1987, 1991)]
- ↑ sakshi news on IVC Indus people religion
- ↑ Photos: http://www.harappa.com/figurines/index.html
- ↑ Clark, Sharri R. (2007). "The social lives of figurines: recontextualizing the third millennium BC terracotta figurines from Harappa, Pakistan.". Harvard PhD.
- ↑ "Rigveda". The Hindu Universe. HinduNet Inc. Archived from the original on 2010-07-13. Retrieved 2007-06-25.
- ↑ "Hindu History". The BBC names a bath and phallic symbols of the Harappan civilization as features of the "Prehistoric religion (3000-1000BCE)".
- ↑ (Basham 1967)
- ↑ Frederick J. Simoons (1998). Plants of life, plants of death. p. 363.
- ↑ Ranbir Vohra (2000). The Making of India: A Historical Survey. M.E. Sharpe. p. 15.
- ↑ Grigoriĭ Maksimovich Bongard-Levin (1985). Ancient Indian Civilization. Arnold-Heinemann. p. 45.
- ↑ Steven Rosen, Graham M. Schweig (2006). Essential Hinduism. Greenwood Publishing Group. p. 45.
- ↑ 63.0 63.1 Shaffer, Jim (1993). "Reurbanization: The eastern Punjab and beyond". In Spodek, Howard; Srinivasan, Doris M. (ed.). Urban Form and Meaning in South Asia: The Shaping of Cities from Prehistoric to Precolonial Times.
{{cite book}}
: CS1 maint: multiple names: editors list (link) - ↑ Tripathi, Jayant K.; Tripathi, K; Bock, Barbara; Rajamani, V.; Eisenhauer, A (2004-10-25). "Is River Ghaggar, Saraswati? Geochemical Constraints" (PDF). Current Science. 87 (8).
మూలాలు
మార్చు- Allchin, Bridget (1997). Origins of a Civilization: The Prehistory and Early Archaeology of South Asia. New York: Viking.
- Allchin, Raymond (1995). The Archaeology of Early Historic South Asia: The Emergence of Cities and States. New York: Cambridge University Press.
- Aronovsky, Ilona; Gopinath, Sujata (2005). The Indus Valley. Chicago: Heinemann.
- Basham, A. L. (1967). The Wonder That Was India. London: Sidgwick & Jackson. pp. 11–14.
- Chakrabarti, D. K. (2004). Indus Civilization Sites in India: New Discoveries. Mumbai: Marg Publications. ISBN 81-85026-63-7.
- Dani, Ahmad Hassan (1984). Short History of Pakistan (Book 1). University of Karachi.
- Dani, Ahmad Hassan (1996). Mohen, JP (ed.). History of Humanity, Volume III, From the Third Millennium to the Seventh Century BC. New York/Paris: Routledge/UNESCO. ISBN 0415093066.
- Gupta, S. P. (1996). The Indus-Saraswati Civilization: Origins, Problems and Issues. ISBN 81-85268-46-0.
- Gupta, S. P. (1995). The lost Sarasvati and the Indus Civilisation. Jodhpur: Kusumanjali Prakashan.
- Kathiroli (2004). "Recent Marine Archaeological Finds in Khambhat, Gujarat". Journal of Indian Ocean Archaeology (1): 141–149.
- Kenoyer, Jonathan Mark (1998). Ancient cities of the Indus Valley Civilisation. Oxford University Press. ISBN 0-19-577940-1.
- Kenoyer, Jonathan Mark (1991). "The Indus Valley tradition of Pakistan and Western India". Journal of World Prehistory. 5: 1–64. doi:10.1007/BF00978474.
- Kenoyer, Jonathan Mark; Heuston, Kimberly (2005). The Ancient South Asian World. Oxford/New York: Oxford University Press. ISBN 0195174224.
- Kirkpatrick, Naida (2002). The Indus Valley. Chicago: Heinemann.
- Lahiri, Nayanjot (2000). The Decline and Fall of the Indus Civilisation. ISBN 81-7530-034-5.
- Lal, B. B. (1998). India 1947-1997: New Light on the Indus Civilization. ISBN 81-7305-129-1.
- Lal, B. B. (1997). The Earliest Civilisation of South Asia (Rise, Maturity and Decline).
- Lal, B. B. (2002). The Sarasvati flows on.
- McIntosh, Jane (2001). A Peaceful Realm: The Rise And Fall of the Indus Civilization. Boulder: Westview Press. ISBN 0813335329.
- Mughal, Mohammad Rafique (1997). Ancient Cholistan, Archaeology and Architecture. Ferozesons. ISBN 9690013505.
- Parpola, Asko (2005-05-19). "Study of the Indus Script" (PDF). Archived from the original (PDF) on 2006-03-06. Retrieved 2008-09-24. (50th ICES Tokyo Session)
- Possehl, Gregory (2002). The Indus Civilisation. Walnut Creek: Alta Mira Press.
- Rao, Shikaripura Ranganatha (1991). Dawn and Devolution of the Indus Civilisation. ISBN 81-85179-74-3.
- Shaffer, Jim G. (1995). "Cultural tradition and Palaeoethnicity in South Asian Archaeology". In George Erdosy (ed.). Indo-Aryans of Ancient South Asia. ISBN 3-11-014447-6.
- Shaffer, Jim G. (1999). "Migration, Philology and South Asian Archaeology". Aryan and Non-Aryan in South Asia. ISBN 1-888789-04-2.
- Shaffer JG (1992). "The Indus Valley, Baluchistan and Helmand Traditions: Neolithic Through Bronze Age". In Ehrich RW, Bronkhorst, Deshpande (eds.). Chronologies in Old World Archaeology (Second ed.). Chicago: University of Chicago Press.
- Witzel, Michael (2000). "The Languages of Harappa" (PDF). Electronic Journal of Vedic Studies.
బయటి లింకులు
మార్చు- Indus Valley Civilization at www. indohistory. com Archived 2019-07-09 at the Wayback Machine
- Harappa and Indus Valley Civilization at harappa. com
- An invitation to the Indus Civilization (Tokyo Metropolitan Museum)
- The Harappan Civilization Archived 2019-12-13 at the Wayback Machine
- Cache of Seal Impressions Discovered in Western India