సినిమా అభిమానులు

సినిమా అభిమానులు సినిమాలను కానీ, సినిమాల్లో నటీనటులు, సాంకేతిక నిపుణులను కానీ అభిమానించేవారు. తెలుగు, తమిళ సినిమా రంగాల్లో హీరోలను అభిమానించడం అన్నది ఒక ప్రధానమైన ధోరణి.

పద్ధతులు, ధోరణులు

మార్చు

తెలుగు సినిమాల్లో స్టార్లుగా పిలుచుకునే హీరోల అభిమానులు తమ అభిమానాన్ని రకరకాల పద్ధతుల్లో ప్రదర్శిస్తూ ఉంటారు వాటిలో కొన్ని:

సినిమా విడుదలకు హంగామా

మార్చు

సినిమా విడుదలయ్యేరోజు ఉదయం ఆట కన్నా ముందే బెనిఫిట్ షో లేక ఫ్యాన్ షో అని థియేటర్లు ప్రదర్శించగా అభిమానులు సాధారణ టిక్కెట్ ధర కన్నా ఎన్నో రెట్లు (కొన్నిసార్లు రూ.150 టిక్కెట్ కోసం రూ.3000 వరకూ) ఖర్చుచేసి చూస్తూ ఉంటారు.[1] మొదటి రోజు మొదటి ఆట చూడకపోవడం అవమానంగా కూడా భావిస్తూంటారు.[2] విడుదలకు ముందు హీరోల బొమ్మలతో, తమ పేర్లు, అభిమాన సంఘం వివరాలతో థియేటర్ ముందు బ్యానర్లు కడుతూ ఉంటారు. మరికొందరు అభిమానులు తమ నగరం/పట్టణంలోని పలు చోట్ల కూడా బ్యానర్లు కడతారు.[3][4] విడుదల సమయంలో తమ అభిమాన హీరోల కటౌట్లకు పాలతో అభిషేకం చేయడం వంటివి కూడా చేస్తూ ఉంటారు.[5] సినిమా విజయవంతమైతే డప్పులతో, డ్యాన్సులతో వేడుక చేయడం, బ్యాండ్ మేళం ఏర్పాటుచేయడం, థియేటర్ ఆవరణలోనే టపాకాలు, ఇతర బాణసంచా కాల్చడం కూడా పరిపాటి.[6] ఉదాహరణకు బాహుబలి:ద బిగినింగ్ సినిమా విడుదలకు పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో ప్రభాస్ అభిమానులు 2 ఏనుగులు, 100 రాయల్ ఎన్ ఫీల్డ్ బైకులు, 50 గుర్రాలతో కూడిన భారీ ఊరేగింపు నిర్వహించారు.[7][8]

వేడుకలు, సేవా కార్యక్రమాలు

మార్చు

అభిమానులు ఏర్పాటుచేసుకున్న అభిమాన సంఘాలు తమ అభిమాన హీరో పుట్టిన రోజులు వేడుకగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా కొన్ని అభిమాన సంఘాలు తమ హీరో పేరున సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటాయి. అనాధాశ్రమాల్లో భోజనాలు ఏర్పాటుచేయడం, ఆసుపత్రుల్లో రోగులకు పళ్ళు పంచిపెట్టడం, నుంచి అవయవ దానాలు, రక్త దానాల వరకూ రకరకాల సేవా కార్యక్రమాలు ఇందులో ఉంటాయి.[9] తమ హీరోల సినిమాల ఆడియో ఫంక్షలు మొదలుకొని వంద రోజుల వేడుకల వరకూ ప్రతీ కార్యక్రమానికి అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చేవారు. ఉదాహరణకు కృష్ణ సింహాసనం సినిమా శతదినోత్సవానికి మద్రాసుకు 400 బస్సుల్లో, 30 వేల మంది తరలివచ్చారు.[10]

కుల నేపథ్యాలు

మార్చు

తెలుగు సినిమా హీరోల కులాలను బట్టి ఆయా కులాలకు చెందినవారు అభిమానులుగా మారడం అన్నది తెలుగు సినిమా రంగంలో దశాబ్దాలుగా ఉన్న ధోరణి. పాత్రికేయురాలు ప్రియాంక రిచి ప్రకారం "ఈ అభిమానులు స్టార్ యొక్క ఇమేజ్‌కు స్వయం ప్రకటిత పరిరక్షకులుగానూ, మరీ ముఖ్యంగా వారి కుల గౌరవానికి సంరక్షకులుగానూ పరిగణించుకుంటారు." 1970లు, 80ల్లోనే పలు కులాలు ఒక్కో సినిమా హీరోను తమ కులానికి ప్రతినిధిగా, కుల గౌరవానికి ప్రతీకగా భావించడం ఉన్నది. క్రమేపీ అది పెరుగుతూనే వచ్చింది. ఈ కుల అభిమానాలు కొన్నిసార్లు పలు కులాల - అభిమాన సంఘాల మధ్య వివాదాలుగానూ పరిణమించాయి.[11]

ఘర్షణలు, యాంటీ ఫ్యాన్స్

మార్చు

ఒకప్పుడు ఎదుటి హీరో పోస్టర్ల మీద ఒక హీరో అభిమానులు పేడ కొట్టేవారు. అక్కినేని నాగేశ్వరరావు దీన్ని ప్రస్తావిస్తూ - తానూ, రామారావు ఇలానే ఒకరి అభిమానులు, మరొకరి పోస్టర్ల మీద పేడ కొడితే ఆ పేడ ఎరువుగా ఎదిగామని చమత్కరించాడు. వేర్వేరు హీరోల అభిమానులు ఘర్షణలు పడడం, కొన్నిసార్లు ఆ ఘర్షణల్లో కొందరు మరణించడం వంటి సంఘటనలు కూడా జరిగాయి. ఈ వివాదాల్లో కుల, రాజకీయ విభేదాలు కూడా కారణం కావడం ఉంది.[11] వివాదాలకు కారణాలుగా ఒక హీరో ఫ్లెక్సీ తీసివేసి మరొక హీరో ఫ్లెక్సీ పెట్టడం, హీరోని వేరే హీరో అభిమానులు తిట్టడం వంటివి ఉన్నాయి.[12][13][14] సామాజిక మాధ్యమాల్లో తమ ప్రత్యర్థి హీరోలను దూషించడం, ట్రోల్ చేయడం వంటివి చేస్తూ ఉండడం, తమ హీరోపై ట్రోల్స్ చేసినవారిని తిరిగి ట్రోల్ చేయడం వంటివి జరుగుతుంటాయి.[11]

విమర్శలు

మార్చు

అభిమానుల ధోరణులు, పద్ధతుల పట్ల సమాజంలో చాలా విమర్శలు ఉన్నాయి. కటౌట్లు కట్టేప్పుడు అడ్డుతగిలిన విద్యుత్ వైర్లు షాక్ కొట్టి, టిక్కెట్ల కోసం పోటీపడేప్పుడు తొక్కిసలాటలో పడి ప్రాణాలు కోల్పోయిన అభిమానులు ఎందరో ఉన్నారు. ఈ సందర్భంలో హీరోలు స్పందించి బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందించారు.[9][15][16] కొందరు అభిమానులు, అభిమాన సంఘ నాయకులు తమ స్వంత డబ్బును సినిమాల వేడుకల కోసం, అలంకరణల కోసం వెచ్చించి ఆర్థికంగా నష్టపోయి ఇబ్బందుల్లో పడ్డారు.[17] మొదటి రోజే సినిమా చూడకపోతే అవమానకరమనీ, మొదటి షో చూడడం తమకు ప్రతిష్టాత్మకమని భావించే అభిమానుల వల్ల మొదటి రోజు టిక్కెట్ల ఖరీదు విపరీతంగా పెంచడం పరిపాటి అయిపోయింది.[2] హీరోల కటౌట్లకు క్షీరాభిషేకాలు చేయడం వల్ల పాల వంటి ఆహారపదార్థాలు వృధా అవుతున్నాయని దీనిపై చెన్నై హైకోర్టులో వ్యాజ్యం కూడా నడిచింది.[9]

మూలాలు

మార్చు
  1. Apr 28, P. PavanP Pavan / Updated:; 2017; Ist, 18:10. "Bahubali 2: Police imposes Section 144 in Prabhas's hometown". Mumbai Mirror (in ఇంగ్లీష్). Retrieved 2021-01-09. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
  2. 2.0 2.1 "సినిమాకెళ్తే జేబులు ఖాళీ..!? | వరంగల్ | www.NavaTelangana.com". NavaTelangana. Retrieved 2021-01-09.
  3. "మహర్షి సినిమా రిలీజ్ ఎఫెక్ట్: ఫ్లెక్సీ కడుతూ అభిమాని దుర్మరణం". Asianet News Network Pvt Ltd. Archived from the original on 2021-01-09. Retrieved 2021-01-09.
  4. "మహేష్ ఫాన్స్ హంగామా షురూ". Latest Telugu Breaking News - తొలివెలుగు - Tolivelugu (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-01-09. Archived from the original on 2021-01-11. Retrieved 2021-01-09.
  5. "ధైర్యం చేసి మరీ.. చెర్రీకి పాలాభిషేకం చేసిన యువతి". ఆంధ్రజ్యోతి. Archived from the original on 2021-01-11.
  6. Telugu, TV9 (2019-05-09). "చెన్నైలో పోటెత్తిన "మహర్షి" హంగామా - TV9 Telugu Maharshi release day hungama at Chennai". TV9 Telugu. Archived from the original on 2021-01-11. Retrieved 2021-01-09.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  7. "Prabhas fans rally for 'Baahubali' in Bhimavaram,erect huge cut outs". ap7am.com (in ఇంగ్లీష్). Archived from the original on 2021-01-11. Retrieved 2021-01-09.
  8. Srikanya (2015-07-05). "కనీ,వినీ రీతిలో 'బాహుబలి' ర్యాలి...పూర్తి డిటేల్స్". telugu.filmibeat.com. Retrieved 2021-01-09.{{cite web}}: CS1 maint: url-status (link)
  9. 9.0 9.1 9.2 "ఫ్యాన్సే నిజమైన హీరోలు!". andhrabhoomi.net. Retrieved 2021-01-09.{{cite web}}: CS1 maint: url-status (link)
  10. "మొట్టమొదటి 70ఎం.ఎం. చిత్రానికి 30 ఏళ్ళు!". Samayam Telugu. Archived from the original on 2018-12-08. Retrieved 2021-01-10.
  11. 11.0 11.1 11.2 "How caste is integral to the functioning of the Telugu film industry". The News Minute (in ఇంగ్లీష్). 2019-12-23. Retrieved 2021-01-09.
  12. Pratap (2017-09-05). "హీరోల ఫ్లెక్సీల వివాదం: మహేష్ బాబు వర్సెస్ పవన్ కల్యాణ్". telugu.oneindia.com. Retrieved 2021-01-10.{{cite web}}: CS1 maint: url-status (link)
  13. "పవన్‌, ప్రభాస్‌ అభిమానులకు పోలీసుల కౌన్సెలింగ్‌". www.andhrajyothy.com. 2017-04-26. Archived from the original on 2021-01-11. Retrieved 2021-01-10.
  14. "భీమవరంలో ఫ్లెక్సీ వివాదం | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi". www.andhrabhoomi.net. Retrieved 2021-01-10.
  15. Srinivas (2014-09-14). "ఆగడు కటౌట్: కాల్వలోకి దూకిన మహేష్ అభిమాని". తెలుగు వన్ ఇండియా. Retrieved 2021-01-09.{{cite web}}: CS1 maint: url-status (link)
  16. "మహర్షి సినిమా రిలీజ్ ఎఫెక్ట్: ఫ్లెక్సీ కడుతూ అభిమాని దుర్మరణం". Asianet News Network Pvt Ltd. Retrieved 2021-01-09.
  17. "చిరంజీవి కోసం అన్నీ అమ్ముకుని..సాయం కోసం రోడ్డెక్కిన అభిమాని". Asianet News Network Pvt Ltd. Retrieved 2021-01-09.