సుమతీ కౌశల్‌ అమెరికాలో నివసిస్తున్న కూచిపూడి నృత్య కళాకారిణి. ఆమె కూచిపూడి నాట్యంతో పాటు వివిధ నాట్యాల్లోను ఆరితేరిన గొప్ప కళాకారిణిగా గుర్తింపు పొందారు.హైదరాబాద్ కు చెందిన సుమతి కౌశల్ ప్రస్తుతం అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో నివసిస్తున్నారు. ఆమె ఎందరో ప్రవాసాంద్ర యువతి, యువకులకు కూచిపూడి నృత్యంలో శిక్షణ ఇస్తున్నారు. అమెరికాలో ఉన్న పలు ఉన్నత విద్యా సంస్థలకు ఆమె విజిటింగ్ ప్రొఫెసర్ గా చేస్తున్నారు. భారతీయ నృత్యరీతులను అక్కడ భోదిస్తున్నారు.[1]

జీవిత విశేషాలు

మార్చు

ఆమె మహిళా సమాజ సేవకురాలు వడ్డాది సౌభాగ్య గౌరి, డా.కృష్ణారావు గార్ల రెండవ కుమార్తె.[2] సుమతి కౌశల్ హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం, మహిళా కళాశాలలో నుండి 1959లో బీఏ (ఎకనామిక్స్) లో పట్టభద్రురాలయ్యారు. 1962లో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి ఎంఏ (ఎకనామిక్స్) లో పీజీ పట్టా పొందారు. 1952లో సుమతీ కౌశల్ కూచిపూడి నృత్యాన్ని అభ్యసించడం మొదలు పెట్టారు. వేదాంతం లక్ష్మి నారాయణ శాస్త్రి, డా. నటరాజ రామకృష్ణ, శ్రీవేదాంతం జగన్నాధ శర్మ, చింతా కృష్ణమూర్తి, శ్రీ వేదాంతం సత్యనారాయణ శర్మ, శ్రీ సీ.ఆర్.ఆచార్యులు వద్ద ఆమె కూచిపూడి నృత్యాన్ని అభ్యసించారు.[3] తొలినాళ్ళలో సోదరి ఉమా రామారావుతో బాటు పలు సందర్భాలలో పలు ప్రదేశాల్లో గురువుల వ్యక్తిగత పర్యవేక్షణలో ప్రదర్శనలు చేసినది. ఆమె తొలి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఎదుట ప్రత్యేక ప్రదర్శనను ఆగస్టు 7,1957న యిచ్చారు. ఆమె సికింద్రాబదులో డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ ఎదుట ప్రదర్శననిచ్చారు. భారతీయ నృత్య రీతుల పై సుమతి కౌశల్ పలు పుస్తకాలను రచించారు.

సన్మానాలు,సత్కారాలు

మార్చు

హైదరాబాద్ తెలుగు విశ్వవిద్యాలయం (1993), ఆటా (1994) ఇంటర్నెషనల్ లయన్స్ క్లబ్ (1992, హైదరాబాద్ ఆర్ట్స్ అండ్ కల్చరల్ సొసైటీ (1987) ఏపి నృత్య అకాడమీ (1983) తానా (1981) కిన్నెర (1980), వంశీ ఆర్ట్స్ దియేటర్స్ (1979) తదితర సంస్థలు సుమతి కౌశల్ ను నాట్య రాణి నృత్య కళా శిరోమణి తదితర అవార్డులు రివార్డులతో సత్కరించారు.

  • 1994 సంవత్సరంలో జరిగిన ‘ఆటా’ వార్షికోత్సవంలో సుమతి కౌశల్ ప్రదర్శించిన ‘భామాకలాపం’ అందరిని ఆకట్టుకుంది.
  • 1997 సంవత్సరంలో ఢిల్లీ తెలుగు అకాడమి ఆమెను ఆజాద్ అవార్డుతో సత్కరించింది.
  • 1996లో రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ చేతుల మీదుగా రాజీవ్ గాంధీ సద్భావన అవార్డును ఆమె అందుకున్నారు.
  • 2001 లో నేతాజీ సుభాస్ చంద్రబోస్ 104 జయంతి సందర్భంగా సుమతి కౌశల్ ను పెద్ద ఎత్తున సత్కరించారు.
  • 2006 లో కూచిపూడి గ్రామంలో జరిగిన నృత్యోత్సవంలో సుమతి కౌశల్ ప్రముఖ పాత్ర వహించారు.
  • 2010లో అమెరికన్ తెలుగు సొసైటీ ఆద్వర్యంలో సుమతి కౌశల్ ను జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించారు.
  • 2010లో కేరళ ప్రభుత్వం ఆమెను ప్రత్యేక అవార్డుతో సత్కరించింది.
  • అక్కినేని నాగేశ్వరరావు 87వ జన్మదినోత్సవం సందర్భంగా సుమతి కౌశల్ కు ‘స్వర్ణ కమలం’ తొడిగి సత్కరించారు.
  • 2012 లో అక్కినేని నాగేశ్వరరావు 89వ జన్మదినోత్సవం సందర్భంగా డల్లాస్ లో జరిగిన కార్యక్రమంలో సుమతి కౌశల్ ను అవార్డుతో సత్కరించారు.
  • 2010, 2012సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆద్వర్యంలో ఆమెను సత్కరించారు.
  • 2014 లో సభలను కాలిఫోర్నియా తెలుగు సంఘం ఆద్వర్యంలో, వంశి ఇంటర్నేషనల్ సంస్థ ఘంటసాల అవార్డుతో ఆమెను సత్కరించాయి.

వ్యక్తిగత జీవితం

మార్చు

ఆమె కుమారుడు ఆదర్శ్ కౌశల్ అమెరికాలో స్థిరపడిన ఫోటోగ్రాఫర్. కోడలు ప్రముఖ సినీనటి భానుప్రియ.ఆమె సోదరి ఉమా రామారావు ప్రసిద్ధా నాట్యకళాకారిణి.

మూలాలు

మార్చు
  1. "An Interview with Bhanu Priya Kaushal". Archived from the original on 2017-03-23. Retrieved 2015-07-26.
  2. ‘మా’ భాగ్యమే సౌభాగ్యం
  3. "నాటి తరం మేటి నృత్య కెరటం–సుమతీ కౌశల్". Archived from the original on 2016-03-10. Retrieved 2015-07-26.

ఇతర లింకులు

మార్చు