వడ్డాది సౌభాగ్య గౌరి

వడ్డాది సౌభాగ్య గౌరి మహిళా సమాజ సేవకురాలు. విజయవాడలో నాస్తిక కేంద్ర వ్యవస్థాపకులు గోరా గారి సోదరి.[1]

జీవిత విశేషాలు

మార్చు

ఆమె 1915 మార్చి 18కాకినాడలో గోపరాజు రాజ్యలక్ష్మి, వెంకట సుబ్బారావు దంపతులకు నాల్గవ కుమార్తెగా జన్మించింది. ఏడవ తరగతి వరకే చదువుకున్నారు. ఆమె తండ్రిగారు రచించిన కీర్తనలు, అధ్యాత్మ రామాయణ కీర్తనలు పాడటం నేర్చుకొని, తొమ్మిదేళ్ళ వయస్సునుండి స్కూలు నాటకాలలో ముఖ్య భూమికలల్లో నటించారు. పదకొండేళ్ళకి విశాఖపట్నం వాస్తవ్యులు డా.కృష్ణారావుగారితో వివాహమయింది. 1949లో బొల్లారంలో భర్త మెడికల్‌ ప్రాక్టిస్‌ మొదలుపెట్టడంతో అప్పటినుండి హైదరాబాదులోనే స్థిరపడ్డారు. ఆమెకు ఐదుగురు కుమార్తెలు, ఒక కుమారుడు. నలుగురు అమ్మాయిలను భారతీయ నృత్యాలలో, ముఖ్యంగా కూచిపూడి నృత్యంలో పేరు సంపాదించుకోడానికి ఆవిడ శ్రమ, ప్రోత్సాహం చాలా అందించారు.

సామాజిక సేవలు

మార్చు

ఆమె బొల్లారంలో ఉన్నప్పుడు మహిళా సమాజం ఒకటి మొదలుపెట్టి భర్త గారి ప్రోత్సాహంతో ఎన్నో కార్యకలాపాలని ప్రవేశపెట్టింది. కుట్టుపనులు, చేతిపనులే కాక, స్వెట్టర్లు అల్లి అమ్మడం, ఎవరికి వచ్చిన పనులు వారు చేసి ఒక ఉపాధి కల్పించుకోడానికి పనులు కల్పించేది. మహిళలకి సమాజం పనులలో పాల్గొనడానికి వీలుగా ఉండి సమాజం యొక్క సభ్యత్వం పెరిగింది. ఇదంతా చూసి గోరా గారు వెంటనే అంబర్‌ చర్కాలు తెప్పించి, వాటి మీద దూది ఏకడం, దారం, వడకటం, వాటిని అమ్మడానికి ఏర్పాటు చేయడంతో చాలా కొద్దికాలంలోనే సమాజం అభివృద్ధి చెందుతూ వచ్చింది.

వ్యక్తిగత జీవితం

మార్చు

భర్త మరణించిన తర్వాత ఒక మహిళగా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నా ఒక ఆత్మస్థైర్యంతో, ఆత్మవిశ్వాసంతో సమష్టి కుటుంబంలోని నిబంధనలు పాటిస్తూ, పేరు ప్రతిష్ఠలు నిలబెట్టడానికి తాపత్రయపడుతూ మరో జీవిత అధ్యాయం మొదలు పెట్టడం అయింది. పిల్లలందరిని పోస్టుగ్రాడ్యుయేషన్‌ వరకు చదివించిందింది.కూచిపూడి నృత్యంలో నలుగురు కూతుర్లు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోడానికి తోడ్పడింది. ఆమె కుమార్తెలు ఉమా రామారావు, సుమతీ కౌశల్‌లు కూచిపూడి నేర్చుకొన్న మొదటి ఆడపిల్లలో ఒకరుగా చెప్పొచ్చు. పెద్ద కూతురు డాఉమా రామారావు, నృత్య అధ్యాపకురాలిగా 1960లలో ప్రభుత్వ సంగీత కళాశాలలో ఉద్యోగం చేసి, తర్వాత పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో నృత్యశాఖాధిపతిగా ఉంటూ మరాఠా మహారాజు సహాజి రాసిన ప్రబంధాలపై పరిశోధనచేసి డాక్టరేటు పుచ్చుకోడం జరిగింది. రెండో కూతురు, సుమతీ కౌశల్‌ (ప్రస్తుతం అమెరికాలో ఉంటూ నృత్యం నేర్పుతున్నారు) కూచిపూడి, భరతనాట్యం, ఒడిస్సి నృత్యాలలో ప్రావీణ్యత పొంది దేశ, విదేశాలలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొన్న ప్రఖ్యాత నర్తకి. 1957లో డిల్లీలో జరిగిన "ఇంటర్‌ యూనివర్సిటీ యూత్‌ ఫెస్టివల్‌”లో కూచిపూడిలో మొదటి బహుమతి తెచ్చుకొన్న ప్రథమ నర్తకి.

ఆమె తొంభై రెండేళ్ళ వయస్సులో 2007 జనవరి 14న ఆఖరి శ్వాస విడిచారు.

మూలాలు

మార్చు

ఇతర లింకులు

మార్చు