ఉమా రామారావు
శ్రీమతి డాక్టర్ ఉమా రామారావు కూచిపూడి నర్తకి, నృత్య దర్శకురాలు, పరిశోధకులు, ఆచార్యులు, రచయిత్రి. 1985 లో హైదరాబాదులో తాను స్థాపించిన లాస్యప్రియ డ్యాన్స్ అకాడమీకి నిర్దేశకులు కూడా. భారతదేశానికి చెందిన సంగీత, నృత్య, రూపక అకాడమీ 2003 లో ఉమా రామారావుని సంగీత్-నాటక్ అకాడమీ అవార్డుతో సత్కరించింది.
కె. ఉమా రామారావు | |
---|---|
జననం | ఉమా మహేశ్వరి 4 జూలై 1938 విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ |
ప్రసిద్ధి | కూచిపూడి నర్తకి |
పుట్టు పూర్వోత్తరాలు
మార్చు4-జూలై-1938 న "ఉమా మహేశ్వరి" డా. శ్రీ వి.వి. కృష్ణారావు, శ్రీమతి సౌభాగ్యం లకు విశాఖపట్టణంలో జన్మించింది. సాహిత్యం, సంగీతం, నృత్యాల యెడల అమితాసక్తిగల వేదపండితుల ఇంట జన్మించటం, వారందించిన స్ఫూర్తి, ప్రేరణలతో 5వ ఏటి నుండే ఆచార్య పి.వి.నరసింహా రావు, పద్మశ్రీ డా. నటరాజ రామకృష్ణ, బ్రహ్మశ్రీ వేదాంతం లక్ష్మీ నారాయణ శాస్త్రి, గురు పక్కీరిస్వామి పిళ్ళై, గురు సి.ఆర్. ఆచార్యల వద్ద కూచిపూడి, భరతనాట్యం, ఇతర సాంప్రదాయిక నృత్యరీతులని అభ్యసించటం ప్రారంభించింది. ఈ నృత్యరీతుల సైద్ధాంతిక, ఆచరణీయ కారకాలని అవపోసన పట్టినది.
తొలినాళ్ళలో సోదరి సుమతీ కౌశల్‌తో బాటు పలు సందర్భాలలో పలు ప్రదేశాల్లో గురువుల వ్యక్తిగత పర్యవేక్షణలో ప్రదర్శనలు చేసింది. 1953-55 లలో అప్పటి మద్రాసు ప్రభుత్వం నిర్వహించిన శాస్త్రీయ సంగీత, నృత్య పరీక్షలలో ఉత్తీర్ణురాలైనది. అటు పిమ్మట డా. నటరాజ రామకృష్ణ గారి ఆశీస్సులతో భావి తరాలకు ఈ సంప్రదాయాన్ని అందించేందుకు ఆచార్యుల వృత్తిని చేపట్టారు.
అర్థశాస్త్రంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పోస్టు-గ్రాడ్యుయేట్ పట్టాని పుచ్చుకొన్నారు.
ప్రదర్శనలు
మార్చుపేరొందిన నాటి, నేటి రచయితల గీతాలకు పలు ఏకపాత్ర నృత్యాలను, నృత్య లక్షణాలను, నృత్య రూపకాలను, సాంప్రదాయికి యక్షగానాలను వినూత్న రీతిలో నృత్య దర్శకత్వం వహించటంతో ఉమా రామారావు ప్రసిద్ధికెక్కారు. శ్రీ త్యాగరాజ నౌకాచరిత్ర, ప్రహ్లాద భక్తి విజయం, షాహజీ రాజు శంకర, విష్ణు పల్లకీ సేవా ప్రబంధనాలు, విఘ్నేశ్వర కళ్యాణం, నారాయణ తీర్థుల సాధ్వి రుక్మిణి, మాతృభుతయ్యుల పారిజాతాపహరణం, కాకుటూరి పద్మావతి గారి మందాకిని, శివ కాత్యాయని వంటి సాంప్రదాయిక రూపకాలు, విశ్వదీపం, పంచనదీయం, సినారె వారి స్వరరాగనర్తనం, తెలుగు వెలుగులు, మేధ, కంప్యూటరు పై మేధావికాస్ వంటి నృత్య లక్షణాలు వారిలో నృత్య దర్శకత్వం లోని బహుముఖ పాటవాన్ని, పాండిత్యాన్ని బహిర్గతం చేసింది.
బోధనా వృత్తి
మార్చుఈ నేపథ్యంతో హైదరాబాదుకి చెందిన శ్రీ త్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో సీనియర్ లెక్చరర్ గా 1969 నుండి 1988 వరకు భరతనాట్యంలో విద్యార్థులకు సర్టిఫికేట్, డిప్లొమా, డిగ్రీ కోర్సులను బోధించింది. తర్వాత పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్ స్థాయిలో నృత్య విభాగానికి అధిపతిగా బాధ్యతలు చేపట్టారు.
నృత్యకళలో విద్యార్థుల పరిశోధన, ఇతర కార్యకలాపాలలో పర్యవేక్షణకై 'షాహజీ రాజు యక్షగాన ప్రబంధాలు' (షాహజీ 1684 నుండి 1712 వరకూ తంజావూరుని పరిపాలించిన ఒక మరాఠీ రాజు. ఈయన తెలుగు భాషలో ఇరవై యక్షగానాలని కూర్చారు.) అనే థీసిస్ ని తెలుగు విశ్వవిద్యాలయానికి సమర్పించి 1994 లో పీహెచ్ డీ పట్టాతో బాటు బంగారు పతకాన్ని కూడా అందుకొన్నారు.
తెలుగు విశ్వవిద్యాలయానికి నృత్య విభాగానికి అధిపతి అయిన డా. అలేఖ్య పుంజాల,[1] జ్యోతి లక్కరాజు, మాధురి కిషోర్, పద్మ చేబ్రోలు, పల్లవి కుమార్ లు వీరి ప్రియ శిష్యురాళ్ళే.
లాస్యప్రియ డ్యాన్స్ అకాడమీ
మార్చు1985 లో లాస్యప్రియా డ్యాన్స్ అకాడమీని హైదరాబాదులో స్థాపించారు. ఈ కళాశాల కూచిపూడి, భరతనాట్యం లలోని నృత్య సాంప్రదాయలని సైద్ధాంతిక, ఆచరణీయ అంశాలపై శిక్షణనిస్తూ విద్యార్థులని రాష్ట్ర ప్రభుత్వ, విశ్వవిద్యాలయ స్థాయిలో పరీక్షలకి సిద్ధం చేస్తుంది. లాస్యప్రియ ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీకి అనుబంధ సంస్థ.
అవార్డులు , సత్కారాలు
మార్చునాట్యం పట్ల తమకున్న అంకిత భావానికి, నిబద్ధతకి, నాట్యానికి తామందించిన సేవలకి వారికి ఎన్నో అవార్డులు, సత్కారాలు లభించాయి. వాటిలో కొన్ని:
- ఆం. ప్ర ప్రభుత్వం నుండి కళా నీరాజనం, ఉత్తమ అధ్యాపకులు
- ఉత్తర అమెరికా అన్నమాచార్య మునీశ్వర సంస్థ నుండి శ్రీ కళాపూర్ణ
- పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు నుండి ప్రతిభా పురస్కారం
- 26-అక్టోబరు-2004 లో సంగీత్-నాటక్ అకాడమీ అవార్డు
రచనలు
మార్చు- Kuchipudi Bharatam Of Kuchipudi Dance: South Indian Classical Dance Tradition. Sri Satguru Publications, 1992. ISBN 81-7030-291-9.
Rama Rao
మూలాలు
మార్చు- ↑ ఆంధ్రజ్యోతి, నవ్య - ఓపెన్ పేజి (1 January 2018). "అప్పుడు విద్యార్థిని.. ఇప్పుడు రిజిస్ట్రార్‌ని." వెంకటేశ్. Archived from the original on 14 May 2019. Retrieved 14 May 2019.