సోమర్ సెట్ మామ్

బ్రిటిష్ రచయిత

విలియం సోమెర్‌సెట్ మామ్‌, (/mɔːm/ MAWM; 25 జనవరి 1874 – 16 డిసెంబరు1965), డబ్ల్యూ. సోమెర్‌సెట్ మామ్‌ గా సుప్రసిద్ధుడు. అతడు బ్రిటిష్ నాటక రచయిత, నవలా రచయిత, లఘు కథా రచయిత. 1930లలో అనేక ప్రసిద్ధ రచనలు చేసాడు.[1]

విలియం సోమర్సెట్ మామ్
1934లో కార్ల్ వాన్ వెక్టెన్ తీసిన మామ్‌ ఛాయాచిత్రం
పుట్టిన తేదీ, స్థలంవిలియం సోమర్సెట్ మామ్
(1874-01-25)1874 జనవరి 25
యునైటెడ్ కింగ్డమ్‌ రాయబారకార్యాలయం, పారిస్, ఫ్రాన్స్
మరణం1965 డిసెంబరు 16(1965-12-16) (వయసు 91)
నీస్, ఆల్ప్స్ మారీటైంస్, ఫ్రాన్స్
వృత్తినాటకకర్త, నవలారచయిత, కథానిక రచయిత
పూర్వవిద్యార్థిసెయింట్ థామస్ ఆసుపత్రి వైద్యకళాశాల (ప్రస్తుత లండన్ కింగ్స్ కళాశాలలో భాగం), ఎం.బి.బి.ఎస్., 1897
గుర్తింపునిచ్చిన రచనలుOf Human Bondage
The Moon and Sixpence
Cakes and Ale
The Razor's Edge
జీవిత భాగస్వామి
సైరీ వెల్కమ్
(m. 1917; div. 1929)
సంతానంమేరీ ఎలిజబెత్ మామ్
(1915–1998)
ఆలన్ సియర్లె (దత్తపుత్రుడు, 1962)

బాల్యం-జీవితం మార్చు

విలియం సోమర్ సెట్ మామ్, 1874 జనవరి 25న తేదీన పారిస్ లో జన్మించాడు. ఆయన తాత ముత్తాతలకిమల్లై ఆయన తండ్రి కూడా న్యాయవృత్తినే స్వీకరించి, బ్రిటిష్ రాయబార కార్యాలయంలో సలహాదారునిగా పనిచేసేవాడు. ఆయన ఎన్నెన్నో దూరప్రాంతాలు తిరిగేవాడు. దిష్టి తగలకుండా, అరిష్టాన్ని వారించే ఒక గుర్తుని- ఒంపుతిరిగి ఏసుసిలువను స్ఫురింపజేసే గుర్తును మొరాకో నుండి తెచ్చాడు. ఈగుర్తునే తన పుస్తకాలపైన ఇంటిముందూ వాడుతూ వచ్చాడు సోమర్ సెట్. మామ్ తల్లి సౌందర్యవతి, తండ్రి కురూపి. వారిని ఇరుగు పొరుగు వారు "బ్యూటీ అండ్ ద బీస్ట్" అని చలోక్తిగా వ్యవహరించేవారట. మామ్ తల్లి ఆరుగురు మగ పిల్లల్ని కని, 38వ యేట చనిపోయింది. అప్పుడాయన వయస్సు 8 యేళ్ళు. రెండేళ్ళ తరువాత ఆయన తండ్రి చనిపోయాడు. ఇంగ్లాండులో మతగురువుగా ఉంటున్న మామయ్య-హెన్రీమామ్ దగ్గర చదువుకుంటూ ఆరేళ్ళు గడిపాడు. సరైన ఆదరణ, పోషణ లేక ఆయనబాల్యం కష్టాలతో కూడివుంది. ఆయనకి నత్తి వుండేది, పెద్దయ్యాక, చికిత్సవల్ల అది తగ్గిందట. తోటి బాలురు దాని అదనుగా వెక్కిరించి హేళనచేస్తూ ఉండడం వల్ల స్నేహంలో మాధుర్యం నేనెరుగను అని చెప్పుకొనేవాడు.

13వయేట కాంటర్ బరీ పాఠశాలలో చేరాడు కాని, క్షయవ్యాధి చిహ్నాలు కనిపించడంతో, చదువును ఆపి చికిత్సకై ఫ్రాన్స్ లో తొమ్మిద్నెలలు గడిపాడు. 17వయేట హిడెల్ బర్గ్ లో ఒక జర్మన్ కుటుంబంతో ఉండి, చదువుకున్నాడు. విశ్వవిద్యాలయంలో చేరక పోయినా క్యూనోఫిషర్ తత్త్వాన్ని గూర్చిన ఉపన్యాసాలు శ్రద్ధతో వినేవాడు. మతం పట్ల గురితప్పడం అప్పుడే ప్రారంభం అయినది. మామయ్య కఠినుడు, పీనాసి, సోమరి. మతగురువులో ఉండవలసిన ఔదార్యం ప్రేమ ఆధ్యాత్మికచింతన ఆయనలో లేకపోవడం మూలాన, మతగురువులంతా ఇంతేననుకునేవాడు. నత్తిపోగొట్టమని ప్రతి రాత్రి దేవుడ్ని ప్రార్థించేవాడు మామ్. దైవం ఇవ్వలేదు. అందుకే దైవం మీద నమ్మకం లేదనుకొనేవాడు.

1892లో లండన్ లో సెయింట్ థామస్ హాస్పిటల్ నిర్వహించే వైద్యవిద్యాలయంలో విద్యార్థిగా చేరాడు మామ్. ఆంగ్ల, ఫ్రెంచ్, ఇటాలియన్ సాహిత్యాలు చరిత్ర, విజ్ఞానశాస్త్రం చదువుతూ, ఏకాంకికలు వ్రాస్తూ గడిపేవాడు ఆరోజుల్లో. ఆనాటకాలను, రంగస్థల నిర్వాహకులు స్వీకరించలేదు. రెండు, మూడు నవలలు వ్రాసి పేరుతెచ్చుకుంటే తప్ప, నాటకాలు చలామణి కావని భావించి, రెండు నవలికలు వ్రాశాడు. ఫిషర్ అంవిన్ అనే ప్రచురణ సంస్థ వీటిని స్వీకరించలేదు. వెంటనే నవలలు ప్రారంభించాడు. హాస్పిటల్ ప్రసూతిశాఖ గుమాస్తాగా, మురికివాడలు సందర్శించి 63 పురుళ్ళు పోసిన అనుభవం గడించాడు. బీదల జీవితాన్ని జాగ్రత్తగా పరిశీలించే అవకాశమూ అప్పుడే కలిగింది. కాయకష్టంపై బ్రతికే బీదల్ని గురించి ఆర్ధర్ మారిసన్ అనేఆయన వ్రాసిన్ నవల- చైల్ద్ ఆఫ్ ది జాగో జనాన్ని ఆకర్షించింది. కల్పన చేయకుండా తను విన్నదీ, చూసినదీ డాక్టర్ రోగిని పరిశేలించేవిధంగా వ్రాసి పూర్తి చేసిన మొదటి నవల లిజ్ ఆఫ్ లాంబెత్ . 1897 అక్టోబరులో ఈనవల వెలువడింది. లీజా అనే బీద కన్య పాపకార్యాలు చేసి చనిపోతుంది. పశ్చాత్తాపం పడదు. పాపానికి ఫలితం మృత్యువు అన్న ధ్వని ఈనవలలో లేదు. నీతిపాఠాలు ఉండవు. పాత్రల అంతరంగ భావల చిత్రీకరణ లేదు. భావగర్భితమైన ఉద్రేక ప్రకర్షఉండదు. ఈనవల పాఠకుల్ని ఆకర్షించింది. సమీక్షలుకూడా ప్రోత్సాహకరంగా వచ్చాయట. సంప్రదాయ సాహితీవేత్త ఎడ్మండ్ గాస్ కూడా ఈనవలను మెచ్చుకున్నాడట. పదేళ్ళు జరిగి చాల రచనలు చేసి పేరుతెచ్చుకున్న గాస్ మామ్ ను బాగాప్రోత్సహించి ఇంకా మంచిరచనలు చేయమన్నారు. ఆరోజుల్లోనే తాను గమనించిన వింతలనూ, విన్న చమత్కారభావాలను నోటుబుక్కులో వ్రాసుకోవడం మొదలెట్టాడు. ఆయన 78వయేటికి ఇవి 15నోటుపుస్తకాలయ్యాయి. వీటిని సంక్షిప్త పరిచి రచయిత నోట్ బుక్ గా వెలువరించాక ఆయన కొత్తరచనలేవీ చేయలేదు.

రచనలు- ఇతరవిశేషాలు మార్చు

వైద్య విద్యాలయంలో 5యేళ్ళు చదివి 1897లో వైద్య పట్టాపుచ్చుకొని డాక్టర్ మామ్ అయ్యాడు. కాని వైద్యవృత్తిని విడిచేసి, సాహిత్యరంగంలో విజయం సాధించడానికి నిర్ణయించుకొని నవలారచన కొనసాగించాడు.

స్పెయిన్ దేశంలో ఏడాది గడిపి, రోమ్ లో ఉండగా, ఎమాస్ ఆఫ్ ఆనర్ అన్న మొదతటి రంగస్థల నాటకం పూర్తి చేశాడు . ఇంగ్లాండు వచ్చాడు. ఆయన నవలలు ప్రజామోదం పొదకపోయినా విమర్సకులు పర్వాలేదు బాగున్నాయి అనడం, ధనికవర్గాలవారు ఆదరణ చూపడం పార్టీలకు అహ్వానించడం జరిగేది. మిసెస్ క్రాడక్ అనే నవల 1902లో వెలువడింది. ఇందులో డబ్బుండి పెద్దకుటుంబానికి చెందిన క్రాడిక్ అనే ఆమె తక్కువ అంతస్తువాడైన ఒక పంటకాపుని ప్రేమించి శక్తులన్నీ ఉడిగి ప్రేమ చావడంలో విషాదంవున్నా, మానసిక స్వేచ్ఛని పొందాను కదానన్న ఆహ్లాదంతో ఆమె సంతృప్తి చెందుతుంది. మొగుడు, గుర్రం మీదనుంచిపడి చనిపోతాడు.

1903 లో రంగస్థల సమాజం వారు మామ్ వ్రాసిన ఏ మాన్ ఆఫ్ ఆనర్ అనే నాటకాన్ని స్వీకరించి ప్రదర్సిస్తారు. తన సంపర్కం వల్ల పనిమనిషి గర్భం ధరిస్తుంది. కాబట్టి ఆమెను వివాహమాడతాడు. గౌరవనీయుడు. ఇదీ ఈనాటకంలో ఇతివృత్తం. తర్వాత రెండేళ్ళు పారిస్లో మామ్ లో గడిపాడు. పారిస్ లో చాలామంది చిత్రకారులతో రచయితలతో పరిచయం ఏర్పడింది. 1905లో స్వదేశానికి తిరిగివచ్చి డబ్బులేకపోవడం మూలాన హాస్యపూరక సుఖాంత నాటకాలు సాగించాడు. నిర్వాహకులు, నటులు సూచించిన ప్రకారం మార్పులు చేసేవాడు. 1907లో లేడి ఫ్రెడెరిక్ నాటకాన్ని రచించాడు. దానితో ఆర్థికంగా చాలా నిలదొక్కుకున్నాడు.

మామ్ కిదేశాటనంటే ఇష్టం. వచ్చిపడ్డ ధనంతో తనకిష్టమైన పనులు చెయ్యకలిగాడు. 1908లో గ్రీస్ దేశం పర్యటించాడు. 1911లో మేఫేర్ లో సొంత ఇల్లు కట్టుకొన్నాడు. 1898-1933 మధ్య ముప్పై నాటకాలు వ్రాసినా 18 మాత్రమే గ్రంథాలుగా వెలువడ్డాయి.

ది సర్కిల్ అనేది ఆయన ఉత్తమ నాట్తకంగా ఎన్నిక చేస్తారు విమర్శకులు,. మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైన ఏడాదికి ఆఫ్ హ్యూమన్ బాండేజ్ అనే పెద్ద నవల మొదలపెట్టి రెండేళ్లలో ముగించాడు. 1915లో ఇది ప్రచురితమైనది. యుద్ధ కాలంలో దీనిని ఎవరూ పట్టించుకోకపోయినా కాలం గడిచినకొద్దీ పాఠకులను మరింతగా ఆకర్షిస్తూ ఈనాటికీ ఆంగ్ల సాహిత్యంలో మహోన్నతమైన నవలగా దాని ఖ్యాతి స్థిరపడిపోయింది. నన్ను బాధించే కొన్ని సంఘటనలు కుంగదీసే అంతరంగం వీటినుండి విముక్తుణ్ణి అవ్వడానికి వ్రాశానీ నవల. వ్రాశాక బాధ కలిగింది. ఆంతరంగిక కల్లోలం అధోలోకం నుండి బైట పడ్డాను. మానసిక జాడ్యానికి మందులా పనిచేసింది అని చెప్పుకున్నాడు మామ్.

మామ్ చిన్నతనంలో ఒకామెను ప్రేమించాడట. ఆమె మెప్పును పొందాలంటే డబ్బు గడించాలి. అందుచేత డబ్బు గడించే కృషిచేశాడు. కొంతకాలం గడిచి, పేరూ ప్రతిష్ఠ డబ్బు సంపాదించాక ఆమెపై ఇష్టం పోయిందట. మామ్ కి ఫ్రెంచి నవలాకారుడు మార్సెల్ ప్రౌస్ట్ అంటే బాగా ఇష్టం.

1915లో విడాకులుపొందిన మామ్ సిరివెల్కం అనే ఆమెను మరలా పెండ్లాడాడు. వీరికి ఒక కుమార్తె కలిగింది. మొదటి నవల ప్రధానపాత్ర లిజ-ఎలిజబత్ సంక్షిప్తనామం-ఎలిజబెత్ అని ఆమెనామకరణం చేశారు. 12సంవత్సరాలు మామ్ సిరివెల్కంతో కలిసిఉండి విడాకులుపొంది విడిపోయారు. భార్యకు కొన్ని వేల పౌనులు ఇచ్చాక వివాహం రద్దైంది. గృహాలంకార వృత్తి కొనసాగిస్తూ భార్య 1955లో చనిపోయింది. కుమార్తె తల్లితో ఉంటూ వచ్చింది. విన్సెంట్ అనేఅతన్ని వివాహమాడింది. అమెకిద్దరు సంతానం. అమెరికాలో నివాసం ఏర్పరచుకొంది.

మొదటి యుద్ధం కొనసాగేరోజుల్లో మామ్ రెడ్ క్రాస్ సంస్థలో పనిచేస్తూ, ఫ్రాన్స్ బెల్జియం దేశాలలో గడిపాడు. ఈసమయంలో వ్రాసిన మన పెద్దలు (Our Betters) అనేనాటకం న్యూయార్క్ లో ప్రదర్సించారు. అక్కడ సంచలనం కలిగింది. పనిపాటూలేకుండా ఆస్తుల్ని అనుభవించి వూసుపోక ప్రేమకలాపం జరుపుతూ, వ్యభచరిస్తూ నైతిక పతనం చెందే స్త్రీ పురుషులు ఇందులో పాత్రలు. బాధ్యతారహితులైన వారిజీవితాలు నైతిక అరాజకత్వంలో అంతమొందుతాయన్న గుణపాఠం ఇమిడిఉంది. కాని ఆపాఠం చెప్పివెయ్యడు నాటక కర్త.

క్షయవ్యాధికి గురై రెండుమూడు సం.లు చికిత్స నిమిత్తమై నర్సింగ్ హోంలో గడిపి బాగైనాక 1920లో మామ్ చైనాదేశ యాత్ర చేశాడు. 1921లో మలే స్టేట్స్, ఇండో చైనా తర్వాత, జావాదీవులు, ఆస్ట్రేలియా దేశాలు, 1923 లో దక్షిణ అమెరికాలు, 1924లో బోర్నియా, 1935లో ఇండియ దేశాలు పర్యటించాడు. ఆయా దేశాల నుండి కథలకి, నవలలకీ అనువైన వస్తువు సేకరించాడు. తాను చూసిన వాటిని వర్ణిస్తూ కొన్ని యాత్రా గ్రంథాలు వ్రాశాడు మామ్.

ఇండియా పర్యటన గూర్చి ప్రత్యేక మయిన గ్రంథం వ్రాయలేదు గాని రమణ మహర్షిని గూర్చిన ఒక వ్యాసం వ్రాసాడు మామ్.

ఏకైక సత్యం లోకి ప్రవేశించారు మహర్షి. ఆయన చనిపోగానే, ఒక తోకచుక్క ఆకాశంలో మెల్లగా కదుల్తూ, పవిత్రమైన అరుణాచలం కొండ శిఖరానికి చేరుకొని దాని వెనక అంతర్ధానమైంది.ఈవింత దృశ్యాన్ని ఎందరో చూసి, ఒక మహావ్యక్తి నిర్యాణానికి చిహ్నమన్నారు.

అన్న వాక్యంతో ముగుస్తుంది ఈవ్యాసం. ఇందులో అంతర్ధానమైందిట అని వాక్యం చివర 'ట' ని తగల్చక పోవడం గమనించతగ్గది.

ఇండియా పర్యటన జ్ఞాపకాలని మామ్ తన "రచయిత నోట్ బుక్" అనే గ్రంథంలో పొందుపరిచారు. హైదరాబాద్ లో అనేక రోగుల వ్యాధులను కుదుర్చిన యోగి వుదంతం, సర్ అక్బర్ హైదరీగారింట్లో యోగితో జరిపిన గోష్ఠీ, తేలుమంత్రం, టికెట్ లేకుండా రైలెక్కనీయకపోయినప్పుడు, రైల్ని నిలిపివేసిన యోగి ఉదంతం, భూమిలో వారం కప్పడం, సజీవుడైన యోగి ఉదంతం, కాశీపట్నం, తాజ్ మహల్ వర్ణనలు, మధురలో ఆలయాలు- ఇవన్నీ చదవతగ్గవి. హిందూతత్త్వాన్ని అనేకులు ఒకే విధంగా విశదీకరించడం విని, విని ఇల్లా వ్రాస్తాడు: హిందూ తత్త్వజ్ఞానులతో వున్నచిక్కే ఇది. పదే పదే, అనే విషయాలు చెప్తారు. సత్యం ఒకటే కావున పదే పదే చెప్పడం సబబే ఐనా వినేవారికి ఇబ్బందిగానే వుంటుంది. ఉపనిషత్తులలో నుండి అవే ఉపమానాలు కాక మరివేటినన్నా చెప్తే బాగుండుననిపిస్తుంది. త్రాడు, సర్పము- ఈఉపమానం రాగానే గుండె జారుతుంది.

యాత్రలు మిగించుకొని 1928లో మామ్ ఫ్రెంచ్ రివియెరా ప్రాంతంలో నీస్ లో మాంటకార్లో నగరాల నడుమ కాప్ ఫిరాట్ అనేచోట ఇల్లు కట్టుకొని స్థిరపడ్డాడు. దాని పేరు విల్లా మార్కెస్. నౌకర్లు, కార్లు, స్విమ్మింగ్పూల్, చిత్రపటాలు, విలాసవంతమైన జీవితం గడపాడానికి అనువైన పరికరాలని సమకూర్చుకొని, విండర్స్ దంపతులు, ఆగాఖాన్, చర్చిల్, మొదలైన ప్రముఖ వ్యక్తులకు ఆతిధ్యమిస్తూ గడిపాడు. కొత్తభవనంలో స్థిరపడ్డాక ఆయన వ్రాసిన నవల కేక్స్ ఎండ్ ఏల్ .

రెండో ప్రపంచ యుద్ధం ముగిసాక మామ్ స్వగృహమైన మారెస్క్ చేరుకొన్నాడు. 75వ పుట్టినరోజు పండుగ, సాంఫ్రాంసిస్కోలో జరుపుకున్నాడు. సినిమా చిత్రాలుగా తీసిన కొన్ని కథానికల కథకుడిగా సినిమాలో దర్శనమిచ్చాడు. 1952లో ఏధెంస్ వెళ్ళొచ్చాడు. 80 వఏట లండన్ వళ్ళాడు. ఆయన్ని గురుంచి పత్రికలు ఎక్కువగా వ్రాశాయి. ఎలిజబత్ రాణి జన్మదినోత్సవ సందర్భంలో నైట్ బిరుదు స్వీకరించాడు. ఆయనతో గౌరవ సూచకమైన కంపానియన్ ఆఫ్ ఆనర్ బిరుదు చర్చిల్ మొదలైన 65 మంది ప్రముఖులకే లభించింది. లీజియన్ ఆఫ్ ఆనర్ అనే బిరుదుతో ఫ్రాన్స్ దేశం గౌరవించింది. ఉత్తమకథకి బహుమానం ఇచ్చే ఒక అవార్డుకై ధనమిచ్చాడు.ఎందరో ఆయన జీవితచరిత్ర వ్రాయదల్చి అనుమతి కోరారు. వివరాలడిగారు. ఆయనకది ఇష్టం లేదు. తనని గురుంచి ఎవ్వరూ వ్రాయకూడదని తను ఇదివరలో స్నేహితులకు వ్రాసిన ఉత్తరాలను తగులబెట్టమని కోరాడు. వార్ధక్యంలో ఒకటి రెండు వెర్రిపనులు చేస్తారంటారు. ఇది అట్లాంటిదిగా తోస్తుంది. బ్రిడ్జ్ ఆడుకుంటూ ప్రముఖులకు పార్టీలిస్తు ప్రపంచంలో జరిగే వింతల్ని తిలకిస్తూ లోలోన నవ్వుకుంటూ 91వఏట కన్నుమూశాడు.

మామ్ స్నేహితుల్లో ఒకడైన కరల్ ఫీఫర్ అంచనాప్రకారం, మామ్ 150 కథలు వ్రాసినా, 1951లో వెలువడిన మూడుకథల సంపుటాలలోనూ ఉన్నకథల సంఖ్య 91.

మూలాలు మార్చు

  1. "W. Somerset Maugham", The Literature Network
  • 1966 భారతి పత్రిక-వ్యాస రచన బుచ్చిబాబు