హంపీ నుంచి హరప్పా దాక

సాహిత్య అకాడెమీ అవార్డు పొందిన తెలుగు రచన

హంపీ నుంచి హరప్పా దాక బహుభాషావేత్త, రచయిత, అనువాదకుడు, పండితుడు తిరుమల రామచంద్ర ఆత్మకథ. ఆత్మకథా సాహిత్యంలోనే కాక తెలుగు సాహిత్యంలోనే విశిష్టమైన రచనగా పేరొందింది.

హంపీ నుంచి హరప్పా దాక
హంపీ నుంచి హరప్పా దాక ముఖచిత్రం
కృతికర్త: తిరుమల రామచంద్ర
దేశం: భారత దేశం
భాష: తెలుగు
ప్రక్రియ: ఆత్మకథ
ప్రచురణ: అజో విభొ కందాళం ఫౌండేషన్
విడుదల: 1997

రచన విశేషాలు

మార్చు

హంపీ నుంచి హరప్పా దాక మహాపండితులు, మనస్వి తిరుమల రామచంద్ర జీవితంలో 25 శాతం కాలానికి అక్షర రూపం. రామచంద్ర పుట్టి పెరిగిన హంపీ ప్రాంతం నుంచి నవయువకునిగా ఆయన షుమారు 30 వయస్సులో హరప్పా శిథిలాల ప్రాంతాన్ని దర్శించడం వరకూ ఈ ఆత్మకథ సాగుతుంది[1]. సంస్కృతి పట్ల అపరిమితమైన ప్రేమ, సంస్కృతి సమగ్ర స్వరూపాన్ని దర్శించేందుకు ఆయన చేసిన అన్వేషణ, భిన్న అనుభవాల్లో పొందిన జీవిత సారం వంటివి ఈ ఆత్మకథలో రామచంద్ర అందించారు. హంపీ శిథిలాల్లోని తమ ఊళ్లో చిన్నప్పటి ఆటపాటల ప్రదేశాల్లో చారిత్రికాంశాలు, తన ఊళ్లో బసివిగా జన్మించినా పెళ్ళికాకున్నా సహచరుణ్ని భర్తగా భావించే సాధ్వీమణి, నత్తిని తాను పోగొట్టుకునేందుకు వాసుదాసు చిట్కా వాడి చేసిన కృషి, పాండిత్య సభల్లోని వాతావరణం, తమ గురువుల సౌహార్దత, నాటి అద్భుతమైన బలశాలులు, స్వాతంత్ర్యోద్యమంలో భాగస్వామ్యం, కుట్రకేసులో ఇరుక్కోవడం, తాళపత్ర గ్రంథాల మధ్య ఉద్యోగం, మిలట్రీలో చేరడం, సైన్యంలో ఓ మంచిపని చేసి ఉద్యోగాన్ని కోల్పోవాల్సి రావడం, పచ్చని పంజాబు మొక్కజొన్న తోటల్లో తిరిగిన అనుభవం, చివరికి సింధునదిలో స్నానమాడి ప్రాచీన భారత చరిత్రకు సాక్ష్యాలైన హరప్పా శిథిలాలను దర్శించడం వరకూ సాగుతుంది ఈ గ్రంథం.

సంస్కృత, ప్రాకృతాలతో కలిపి పలు భాషల్లో లోతైన పాండిత్యం ఉన్న తిరుమల రామచంద్ర ప్రతి అధ్యాయాన్నీ సంస్కృత శ్లోకంతోనో, ప్రాకృత పద్యంతోనో ప్రారంభించి ముగిస్తూ శ్లోకమో, పద్యమో రాసి ముగిస్తారు ప్రారంభంలోని శ్లోకానికి ప్రారంభించిన ఎత్తుగడకీ, ముగింపులోని కవితార్థానికీ ముగింపుకూ చక్కటి సంబంధం అన్వయించడం విశేషం. ఎన్నో ఏళ్లు పాత్రికేయ వృత్తిలో పనిచేసిన తిరుమల రామచంద్రకు తెలుగు వాక్యనిర్మాణంపై ఉన్న పట్టు, భావసులభంగా పదాలు ప్రయోగించడంలోని ఒడుపు ఈ గ్రంథంలో కనిపిస్తుంది. సరళమైన భాషలో గంభీరమైన విషయాలను ఆసక్తిగా వివరించే శైలిలో "హంపీ నుంచి హరప్పా దాక" రాశారు.

అధ్యాయాల సూచీ

మార్చు

తన ఆత్మకథను తిరుమలరామచంద్ర వరుసగా ఏకబిగిన కాకుండా ఘట్టాలు ఘట్టాలుగా విభజించి వ్రాశాడు. ఈ పుస్తకంలో 61 అధ్యాయాలున్నాయి. వాటి జాబితా ఇలా ఉంది.

  1. గుండ్రాయి చెప్పిన గాథ
  2. రాగంపల్లె శ్రోతియం
  3. ఈశ్వరయ్యనవరు
  4. పాడు పట్టణమైన విజయనగరం
  5. బసివి నాగమ్మ
  6. దారికి అడ్డంగా పడుకున్నపులి
  7. పాపం పన్నారాజు!
  8. నీటి ఎద్దడి
  9. పాములతో సహవాసం
  10. రైట్ ఆనరబుల్ కోలాచలం వెంకటరావు గారు
  11. తెనాలిరామన మంటప
  12. గొడుగుపాలుడు
  13. అంజనంలో కనిపించిన పట్టణద ఎల్లమ్మ
  14. బళ్ళారిలో గాంధీజీ
  15. భయం భయంతో సంస్కృతాభ్యాసం
  16. ఆనేగొంది చదువు
  17. అనాచారం, దొంగతనం
  18. పండుగలతో తలమునకలు
  19. చిరుతపులుల చిత్రహింసలతో శాడిస్టుల వినోదం
  20. నిద్రలో నడక
  21. మహాతపస్విని కొండమ్మవ్వ
  22. తుంగభద్రలో మొసలి వేట
  23. భవతీ భిక్షాందేహి!
  24. రూపనగుడి నారాయణరావు
  25. కృతఝ్నతామూర్తి
  26. నత్తి-వావికొలను సుబ్బారావు గారి హితవు
  27. కళాశాలలో దినచర్య
  28. శిష్యవత్సలులు మా గురువులు
  29. హాథీరాంజీ నమిలిన ఆల్యాకు
  30. ప్రిన్సిపాల్ సుబ్బారావుగారు
  31. మానవల్లివారి కృపాకటాక్షం
  32. మొద్దబ్బాయిలు మహామేధావులైన కథ
  33. నేను చూచిన అద్భుతాలు
  34. అమ్మమాట
  35. చిత్తూరు జిల్లాలో కాంగ్రెస్ ప్రచారం
  36. సహధ్యాయులూ - సత్పురుషులూ
  37. శాసనోల్లంఘనం - అరెస్టు
  38. విచారణ - శిక్ష
  39. తిరుచిరాపల్లి కారాగారంలో
  40. డిటెన్యూలు చేసిన బ్రెయిన్ వాష్
  41. నెల్లూరు వేదసంస్కృత కళాశాలలో
  42. కొందరు నెల్లూరు పెద్దలు
  43. చెట్టుకింద కరకబళం
  44. ఆనాటి మా మద్రాసు కుట్రకేసు
  45. కుట్రకేసు విచారణ - నాకు బహిష్కరణ
  46. దయామయుడు డాక్టర్ దాసూరావ్
  47. కూటికోసం కోటివిద్యలు
  48. ప్రభాకరుల ప్రభావం
  49. మద్రాసులో సజ్జనసాంగత్యం
  50. నాగేశ్వర సందర్శనం
  51. తంజావూరు సరస్వతీమహల్
  52. మద్రాసులో సుభాష్ చంద్రబోస్
  53. లావణ్యం వొలికే లాహోర్
  54. కొందరు రచయితలు
  55. మాయబంగారాలు - మాయతాయెత్తులు
  56. డా రఘువీర మాటవినక మిలటరీలో చేరిక
  57. చర్చిల్ సందర్శనం
  58. కోర్ట్ మార్షల్
  59. మొహంజదడో - హరప్పా
  60. గంగాతీరంలో
  61. డెయిలీ టెలిగ్రాఫ్‌లో

ఉదాహరణలు

మార్చు
  • లాహోర్‌లో ఉంటూ పశ్చిమాన ముల్తాన్ వరకూ తూర్పున ధరంశాలా వరకూ తిరిగాను. ‘ పన్నెండు కోసులకు భాష మారుతుంది ‘ అన్న పంజాబీ భాషణానికి అనుగుణంగా మారుతున్న పంజాబీ మధుర వాక్కులు ఆస్వాదిస్తూ వారిండ్ల ఆవకూర, యలవపిండి, రొట్టెలు తింటూ, తామరతూళ్ళ ఊరగాయలు నంజుకుంటూ, మన మధ్యాక్కర వంటి వారి హీర్‌చందస్సులోని పాటలు వింటూ, నిలువెత్తు ఆవచేలల్లో, మొక్కజొన్న చేలలో, రహస్యంగా పెంచే నల్లమందు తోటలలో, భంగ్ (భంగా) తోటలలో తిరిగాను. ప్రాప్రా (భ్రాతా భ్రాతా) అంటూ చుట్టూ చేరి నా జరీ ఖద్దరు పంచెలు, జరీ ఉత్తరీయాలు చుట్టుకొని ఆనందించే అమాయకులైన పల్లెపడుచుల ఆనందాన్ని చూచి మురిసిపోతూ, రబ్బా! (భగవంతుడా!) నీవున్నావు. నీవు భారత గ్రామ ప్రజల ఆనందంలో ఉన్నావు – అనుకొని కళ్ళు మూసుకొని మా అమ్మను తలచుకొని, ఆమె మాటలు మననం చేస్తూ సంతోషించాను

ప్రఖ్యాతి

మార్చు

తిరుమల రామచంద్ర మరణానంతరం ప్రచురితమైన ఈ పుస్తకం తెలుగు సాహిత్యంలో అత్యుత్తమమైన గ్రంథాల్లో ఒకటిగా, తెలుగు వారి ఆత్మకథల్లో అగ్రగణ్యమైనదిగా పేరొందింది. ఈ పుస్తకాన్ని చదివి తీరాల్సిన తెలుగు పుస్తకాల జాబితాలు ఎన్నిటిలోనో చేర్చారు. పలుమార్లు సాహిత్య పత్రికల్లో, జాలపత్రికల్లో ఈ గ్రంథాన్ని పరిచయం చేస్తూ వ్యాసాలు ప్రచురితమయ్యాయి.[ఆధారం చూపాలి]

పురస్కారాలు

మార్చు

ఈ రచనకు 2002లో కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం లభించింది.

ప్రశంసలు

మార్చు

"హంపీ నుంచి హరప్పా దాక" వంటి మేలి గ్రంథంతో తులతూగ గలిగినవి ఏ నాగరిక సాంస్కృతిక భాషాసాహిత్యాలలోనైనా ఒకశతాబ్దంలో పదిహేను, ఇరవై గ్రంథాలు వెలువడితే అది చాలా గొప్ప సంగతి "- అక్కిరాజు ఉమాకాంతరావు పుస్తకం పరిచయంలో అన్నారు[2].

మూలాలు

మార్చు
  1. వెలమల, సిమ్మన్న (2017-10-12). "మరపురాని మహాపండితుడు". ఆంధ్రజ్యోతి. Archived from the original on 2020-08-05. Retrieved 2020-08-05.
  2. తిరుమల, రామచంద్ర (2010-08-01). "మనవి మాటలు". హంపీ నుంచి హరప్పాదాకా (4 ed.). అజో-విభో-కందాళం ప్రచురణలు. p. XV.