హెచ్.నరసింహయ్య
హెచ్.నరసింహయ్య సుప్రసిద్ధ విద్యావేత్త, హేతువాది. హెచ్. (హనుమంతప్ప) నరసింహయ్య (కన్నడ: ಹೆಚ್ ನರಸಿಂಹಯ್ಯ) హోసూరు నరసింహయ్యగా, డా.హెచ్.ఎన్‌గా ప్రజానీకానికి సుపరిచితుడు. ఈయన కర్ణాటక రాష్ట్రం, గౌరిబిదనూరు సమీపంలోని హోసూరులో జూన్ 6, 1921న హనుమంతప్ప, వెంకటమ్మ దంపతులకు ఒక బీద కుటుంబంలో జన్మించాడు. ఇతని తండ్రి హనుమంతప్ప వీధిబడిలో చదువు చెప్పే ఉపాధ్యాయుడు. తల్లి వెంకటమ్మ కూలి పని చేసుకుని బ్రతుకు సాగించిన వ్యక్తి[1].

విద్య, ఉద్యోగం సవరించు
హెచ్.ఎన్. కుగ్రామంలో పుట్టి ఎన్నో అవరోధాలను ఎదుర్కొంటూ కూడా చదువులో ప్రతిభను కనపరిచాడు. ఇతనిప్రాథమిక విద్య గౌరీబిదనూరు సమీపంలోని హోసూరు ప్రభుత్వ పాఠశాలలో నడిచింది. 8వ తరగతి వరకు మాత్రమే ఉన్న ఆ పాఠశాలలో అంత వరకు చదివి ఆ తరువాత ఒక సంవత్సరం ఖాళీగా ఉన్నాడు. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం.ఎన్.నారాయణరావు బెంగళూరులోని బసవనగుడి నేషనల్ హైస్కూలుకు బదిలీ కావడంతో ఇతడిని అక్కడికి ఆహ్వానించాడు. నరసింహయ్యకు బెంగళూరు వెళ్లడానికి డబ్బులు లేక పోవడంతో రెండురోజులు కాలినడకన ప్రయాణించి బెంగళూరు చేరుకున్నాడు. అక్కడ నేషనల్ హైస్కూలులో 1935లో చేరాడు. 1936లో ఆ హైస్కూలుకు గాంధీజీ సందర్శించినప్పుడు ఇతడి ఉపాధ్యాయుడు ఇతడిని గాంధీ ప్రసంగానికి కన్నడ అనువాదకుడిగా ఎంపిక చేశాడు. గాంధీజీ ప్రభావంతో ఆనాటి నుండి మరణించేదాక హెచ్.నరసింహయ్య ఖద్దరును ధరించసాగాడు. ఆ తర్వాత ఇతడు బెంగళూరు సెంట్రల్ కాలేజీలో బి.ఎస్.సి. చదవడానికి చేరాడు. ఇతడు చివరి సంవత్సరం చదువుతున్నప్పుడు 1942లోగాంధీ ఇచ్చిన పిలుపు మేరకు చదువు అర్థాంతరంగా మానేసి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నాడు. ఫలితంగా ఎర్వాడ జైలులోను, మైసూరు జైలులోను, బెంగళూరు సెంట్రల్ జైలులోను 9 నెలలు జైలుశిక్షను అనుభవించాడు. తరువాత బి.ఎస్.సి. భౌతికశాస్త్రంలో ఆనర్సు పూర్తి చేసి భౌతికశాస్త్రంలో ఎం.ఎస్.సి. ప్రథమ శ్రేణిలో 1946లో ఉత్తీర్ణుడయ్యాడు. అదే సంవత్సరం నేషనల్ కాలేజి, బెంగళూరులో అధ్యాపకుడిగా ఉద్యోగం చేయసాగాడు. పది సంవత్సరాలు అధ్యాపకుడిగా పనిచేసి 1957లో అమెరికాలోని ఓహియో స్టేట్ యూనివర్శిటిలో ఉన్నత విద్యకోసం చేరాడు. 1960లో న్యూక్లియర్ ఫిజిక్స్‌లో పి.హెచ్.డి సంపాదించాడు. 1961 నుండి 1972 వరకు బెంగళూరులోని బసవనగుడి నేషనల్ కాలేజికి ప్రిన్సిపాల్‌గా పనిచేశాడు. అమెరికాలోని సదరన్ ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయానికి విజిటింగ్ ప్రొఫెసర్‌గా కూడా సేవలను అందించాడు. 1972లో బెంగళూరు విశ్వవిద్యాలయానికి నాలుగవ ఉపకులపతిగా నియమించబడ్డాడు. 1975లో పునర్నియామకంతో 1977వరకు ఉపకులపతిగా కొనసాగాడు. ఇతడు ఉపకులపతిగా ఉన్న సమయంలో బెంగళూరు విశ్వవిద్యాలయంలో మనస్తత్వశాస్త్రం, సామాజిక శాస్త్రం, నాట్యం, నాటకం, సంగీతాలను పాఠ్యాంశాలుగా ప్రవేశపెట్టాడు. తరువాత ఇతడు కర్ణాటక శాసనమండలిలో సభ్యుడిగా కూడా పనిచేశాడు. మరణించేనాటికి ఇతడు కర్ణాటక నేషనల్ ఎడ్యుకేషనల్ సోసైటీకి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఈసొసైటీ తరఫున కర్ణాటక రాష్ట్రంలో నాలుగు కళాశాలలు, ఐదు ఉన్నత పాఠశాలలు, రెండు ప్రాథమిక పాఠశాలలు పనిచేస్తున్నాయి.
కార్యసిద్ధి సవరించు
హెచ్.ఎన్. 1962లో బెంగళూరు సైన్స్ ఫోరాన్ని స్థాపించాడు. ఈ సంస్థ ప్రతి వారం సైన్స్ అంశాలపై ప్రసంగాలను ఏర్పాటు చేసి ప్రజలకు శాస్త్రీయ దృక్పథాన్ని కలిగించింది. ఈ సంస్థ ఇప్పటివరకు ప్రముఖ శాస్త్రజ్ఞులచే 2000 ప్రసంగాలను ఇప్పించింది. 500 పాపులర్ సైన్స్ ఫిల్ములను ప్రదర్శించింది. ఇతడు బెంగళూరు లలితకళా పరిషత్, బి.వి.జగదీష్ సైన్స్ సెంటర్‌ల ఆవిర్భావానికి కూడా కృషి చేశాడు. ఇతడు బెంగళూరు విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్‌గా ఉన్నప్పుడు ఏప్రిల్ 1976లో "మూఢ నమ్మకాలను, మహిమలను హేతుబద్ధంగా పరిశోధించే సంస్థ"ను స్థాపించాడు. నియంత్రితమైన (ప్రయోగానుకూలమైన) పరిస్థితులలో తన మహిమలను చూపమని ఈ కమిటీ సత్య సాయి బాబాకు మర్యాదపూర్వకంగా లేఖ వ్రాసింది. ఆ పై మరో రెండు లేఖలు వ్రాసినా బాబా స్పందించలేదు. వారి విధానం అనుచితంగా ఉన్నదని,"ఇంద్రియాలకు లోబడేది విజ్ఞాన శాస్త్రం. అతీంద్రియమైనది ఆధ్యాత్మికం. ఆధ్యాత్మిక సాధన ద్వారానే దానిని తెలుసుకోవచ్చును. విశ్వంలో అద్భుతాలలో కొద్ది విషయాలను మాత్రమే విజ్ఞానశాస్త్ర్రం వెలిబుచ్చగలిగింది" - అని బాబా అన్నాడు. తమ అభ్యర్ధనకుసత్య సాయి బాబా మిన్నకుండడాన్నిబట్టి బాబా మహిమలు బూటకమని తేలుతున్నదని నరసింహయ్య అన్నాడు. మొత్తానికి వార్తా పత్రిలలో ఈ విషయమై చాలా కాలం వాద ప్రతివాదాలు నడచాయి. ఇతడు స్థాపించిన కమిటీ 1977లో రద్దయ్యింది. ప్రొఫెసర్ పౌల్ కుర్ట్జ్ ఏర్పరచిన కమిటీ ఫర్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్స్ ఆన్ ది క్లెయిమ్స్ ఆఫ్ ది పారానార్మల్ (CSICOP) లో భారతదేశం నుండి ఇతడొక్కడే ప్రాతినిధ్యం వహించాడు. ఇతడు జన్మతః హిందువే అయినా మూఢమైన ఆచారాలను పాటించలేదు. ఇతని తండ్రి మరణించినప్పుడు శ్రాద్ధకర్మలలో భాగంగా శిరోముండనం చేయించుకోవడానికి తిరస్కరించాడు. గ్రహణం పట్టినప్పుడు ఆహారం తీసుకుంటే ఏమీకాదని నిరూపించడానికి గ్రహణం సమయంలో భోజనం చేసి చూపించాడు. 1983లో భారత హేతువాద సంఘానికి అధ్యక్షుడిగా ఎంపికయ్యాడు. 1995లో భారత ప్రభుత్వం ఇతడిని కన్నడ డెవెలప్‌మెంట్ అథారిటీకి ఛైర్మన్‌గా నియమించింది.
ఇతడు సైన్సు, విద్యావిషయక వ్యాసాలను అనేకం వ్రాశాడు. తెరద మన (తెఱచిన మనసు) అనే పేరుతో వ్యాస సంకలనాన్ని, హోరాటద హాది (పోరాటపథం) అనే పేరుతో స్వీయచరిత్రను ప్రకటించాడు. ఇతడు స్వాతంత్ర్య పోరాట సమయంలో ఇంక్విలాబ్ పేరుతో ఒక లిఖితపత్రికను రహస్యంగా నడిపాడు. పోలీసులకు చేతికి చిక్కకుండా ఈ పత్రికను 22 సంచికలు వెలువరించగలిగాడు.
హోసూరులో ఇతని పేరుమీద హెచ్.నరసింహయ్య మెమోరియల్ హైస్కూలు నెలకొల్పబడింది.
నిరాడంబరత సవరించు
నిరుపేద కుటుంబంనుండి వచ్చిన హెచ్.ఎన్. ఉన్నత శిఖరాలను అధిరోహించినప్పటికీ జీవితాంతం నిరాడంబరంగా ఉన్నాడు. బెంగుళూరు బసవనగుడిలో ఉన్న నేషనల్ కాలేజి బాలుర హాస్టల్‌లోని ఒక గదిలో 1945 నుండి 57 సంవత్సరాలకు పైగా (ఉపకులపతిగా ఉన్న కాలం మినహా) మంచం, బల్ల, కుర్చీ వంటి పరికరాలు ఏమీ లేకుండా ఒక చాప, పాత స్టూలు, చేతికందే దూరంలో ఒక టెలీఫోనులతో జీవించాడు. ఇతని కార్యాలయంలో ఆధునికమైన ఆర్భాటాలేవీ ఉండేవి కావు. ఇతడు కూర్చునే కుర్చీ వెనుక గోడకు ఐన్‌స్టీన్ ఫోటో దాని పక్కనే పెద్ద ? గుర్తు ఉండేది. ఆ ప్రశ్న సంకేతం తను నమ్మిన 'ప్రశ్నించనిదే దేనినీ విశ్వశించవద్దు' అనే సిద్ధాంతానికి ప్రతీకగా ఉండేది.
పురస్కారాలు సవరించు
ఇతడి సేవలకు గుర్తింపుగా ఎన్నో పురస్కారాలు ఇతడిని వరించాయి. వాటిలో ముఖ్యమైన కొన్ని:
- 1984లో భారత ప్రభుత్వంచే పద్మభూషణ్ పురస్కారం.
- భారతస్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నందుకు తామ్రపత్రంతో సన్మానం.
- సైన్స్‌ను జనబాహుళ్యంలోనికి తెచ్చినందుకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య అవార్డు.
- ఇతడి గ్రంథాలు హోరాటద హాది, తెరద మన లకు సాహిత్య అకాడెమీ పురస్కారాలు.
- కర్ణాటక ప్రభుత్వంచే రాజ్యోత్సవ ప్రశస్తి, బసవ పురస్కారం.
- హంపి లోని కర్ణాటక విశ్వవిద్యాలయం నుండి "నాదోజ" అవార్డు.
- గుల్బర్గా విశ్వవిద్యాలయం నుండి గౌరవ డి.లిట్ పట్టా.
- సైన్సులో కృషి చేసినందుకు జవహర్‌లాల్ నెహ్రూ జాతీయ పురస్కారం.
మరణం సవరించు
ఇతడు జనవరి 31, 2005న తన 85వ యేట బెంగుళూరులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అతని కోరిక మేరకు అతని స్వగ్రామం హోసూరులో అదే రోజు సాయంత్రం అంత్యక్రియలు జరిపారు. తన మరణం సంభవిస్తే ఆ రోజు శెలవు ప్రకటించకూడదని అతడు గట్టిగా నొక్కి చెప్పినా అతని మరణవార్త విని అతడిని ఎంతగానో అభిమానించే నేషనల్ కాలేజీ విద్యార్థులు, ఉపాధ్యాయులు తరగతులు వదలి వచ్చి అతడిని అంతిమ దర్శనం చేసుకున్నారు[2].
మూలాలు సవరించు
- ↑ మూఢాచారాలపై ఎక్కుపెట్టిన అస్త్రం - డా. హెచ్.నరసింహయ్య - కన్నడ కస్తూరి - పుటలు: 134-138- జానమద్ది హనుమచ్ఛాస్త్రి
- ↑ An unconventional citizen - PARVATHI MENON