1824 బారక్‌పూర్ తిరుగుబాటు

1824 లో బ్రిటిషు వారిపై భారత సిపాయీలు చేసిన తిరుగుబాటు

1824 నవంబరులో బారక్‌పూర్‌లో బ్రిటిషు అధికారులకు వ్యతిరేకంగా భారతీయ సిపాయిలు చేసిన తిరుగుబాటు, బారక్‌పూర్ తిరుగుబాటు. బెంగాల్ గవర్నర్ జనరల్, విలియం అమ్హెర్స్ట్, 1వ ఎర్ల్ అమ్హెర్స్ట్ నాయకత్వంలో బ్రిటిషు ఈస్టిండియా కంపెనీ సైన్యం, మొదటి ఆంగ్లో-బర్మీస్ యుద్ధం (1824-1826) లో పోరాడుతున్నప్పుడు ఈ సంఘటన జరిగింది.

1824 బారక్‌పూర్ తిరుగుబాటు
the First Anglo-Burmese Warలో భాగము

19 వ శతాబ్దపు సుబేదారు, యూనిఫారంలో
(published in An Assemblage of Indian Army Soldiers & Uniforms from the original paintings by the late Chater Paul Chater)
తేదీ1824 నవంబరు 2
ప్రదేశంబారక్‌పూర్, బెంగాల్ ప్రెసిడెన్సీ
22°46′N 88°22′E / 22.76°N 88.37°E / 22.76; 88.37
ఫలితంబ్రిటిషువారి గెలుపు
  • తిరుగుబాటు అణచివేత
ప్రత్యర్థులు
 United Kingdom
  • British East India Company
  • భారత సిపాయీలు
    సేనాపతులు, నాయకులు
    Commander-in-Chief, India Sir Edward Paget
  • Maj-Gen Dalzell, Bengal Presidency
    • Lt-Col D'Aguilar, 26th BNI
    • Lt-Col Cartwright, 47th BNI
    • Major Roope, 62nd BNI
    బిందీ తివారీ  Executed
    పాల్గొన్న దళాలు
    * 1st (Royal) Regiment
    • British 47th Regiment
    • One squadron of horse artillery
    • Governor General's body guards
    • 62nd Regiment of BNI (Loyals)
    • 26th Regiment of BNI (Loyals)
    Indian sepoys of
  • 47 వ రెజిమెంటు
  • 62 వ రెజిమెంటు
  • 26 వ రెజిమెంటు
  • ప్రాణ నష్టం, నష్టాలు
    ఇద్దరు మరణించారు [1]12 మందిని ఉరితీసారు
    180 మంది సిపాయీలు మరణించారు.[2]
    Barrackpore is located in West Bengal
    Barrackpore
    Barrackpore
    Barrackpore (Barrackpur), West Bengal, India

    తిరుగుబాటుకు మూలాలు భారతీయ సాంస్కృతిక భావాల పట్ల బ్రిటిషు వారికి గౌరవం లేకపోవడం, నిర్లక్ష్యం, సరఫరాలు సరిగ్గా లేకపోవడం మొదలైన కారణాల వలన, బెంగాల్ స్థానిక పదాతిదళానికి చెందిన అనేక రెజిమెంట్‌ల సిపాయిలలో పెరుగుతున్న ఆగ్రహానికి కారణమైంది. వ్యక్తిగత రవాణా లేకపోవడం, సాంస్కృతికంగా ఉన్న అభ్యంతరాలను త్రోసిరాజని సముద్రం ద్వారా రవాణా చేయడం వంటివి సిపాయీల్లో వ్యతిరేకతను కలిగించాయి. 47 వ స్థానిక పదాతిదళానికి చెందిన సిపాయీలు కవాతులో కనిపించినప్పుడు, తమ సమస్యలను పరిష్కరించకపోతే తాము చిట్టగాంగ్ వైపు వెళ్లమని చెప్పారు. వివాదాన్ని పరిష్కరించడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అసమ్మతి 26 వ, 62 వ రెజిమెంట్లకు వ్యాపించింది. కంపెనీ భారతసైన్య సేనాధిపతి అయిన జనరల్ సర్ ఎడ్వర్డ్ పాగెట్, పరిహారం కోసం వారి అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకునే ముందు ఆయుధాలు వదలిపెట్టమని దళాలను ఆదేశించాడు. సిపాయిలు అందుకు నిరాకరించడంతో, 26 వ, 62 వ రెజిమెంట్లు, మరో రెండు బ్రిటిషు రెజిమెంట్లకు చెందిన నమ్మకమైన సైనికులు వారి శిబిరాన్ని చుట్టుముట్టారు. ఆఖరి అల్టిమేటం తరువాత, శిబిరంపై ఫిరంగిదళం, పదాతిదళాలతో దాడి జరిగింది. అనేక మంది పౌర ప్రేక్షకులతో పాటు దాదాపు 180 మంది సిపాయిలు మరణించారు.

    తదనంతర పరిణామాలలో, అనేకమంది తిరుగుబాటుదారులను ఉరితీశారు. ఇతరులకు దీర్ఘకాల శిక్షా దాస్యం విధించబడింది. 47 వ రెజిమెంటును రద్దు చేసారు. దాని భారతీయ అధికారులను తొలగించారు. దాని యూరోపియన్ అధికారులను ఇతర రెజిమెంట్లకు బదిలీ చేసారు. ఈ సంఘటనను భారతీయ, బ్రిటిషు మీడియాలో రాకుండా తొక్కిపెట్టారు. బ్రిటిషు ప్రజలకు పరిమిత సమాచారాన్ని మాత్రమే విడుదల చేసారు. అయినప్పటికీ, సిపాయిల మనోవేదనలను పరిష్కరించడంలో ఈస్టిండియా కంపెనీ ప్రభుత్వం అవలంబించిన దమననీతిపై పార్లమెంటు విమర్శించింది.[3]

    నేపథ్యం

    మార్చు

    నాంది

    మార్చు

    మొదటి ఆంగ్లో-బర్మా యుద్ధసమయంలో, 1824 అక్టోబరులో, బెంగాల్ స్థానిక పదాతిదళానికి చెందిన 26 వ, 47 వ, 62 వ రెజిమెంట్లను, 800 కిలోమీటర్ల దూరం కవాతు చేయాలని ఆదేశించారు. బర్మా భూభాగంలోకి ప్రవేశించడం కోసం, కలకత్తా సమీపంలోని మిలిటరీ కంటోన్మెంట్ అయిన బారక్‌పూర్ నుండి చిట్టగాంగ్ వరకు ఈ కవాతు చెయ్యాలి.[4] ఈ రెజిమెంట్లు అప్పటికే దాదాపు 1600 కిలోమీటర్లు కవాతు చేసుకుంటూ మధుర నుండి బారక్‌పూర్ వరకు వచ్చాయి. ఇపుడు అజ్ఞాత శత్రువు అయిన బర్మాకు వ్యతిరేకంగా మరొక సుదీర్ఘమైన కవాతు చేసేందుకు అవి ఇష్టపడలేదు. బర్మీయుల మార్మిక పరాక్రమాల గురించి భారతీయ సిపాయిలలో పుకార్లు వ్యాపించాయి. ఆ సంవత్సరం మేలో, రమూ వద్ద బ్రిటిషు వారిపై బర్మీయులు సాధించిన విజయం నేపథ్యంలో, వారిలో ధైర్యం అప్పటికే సన్నగిల్లింది. అంతేకాకుండా, ఈ మూడు రెజిమెంట్లలో ఎక్కువగా హిందువులు ఉన్నారు. కాలా పానీ కారణంగా సముద్ర ప్రయాణం పట్ల వారికి అభ్యంతరాలు ఉన్నాయి. [5]

    తక్షణ కారణాలు

    మార్చు

    భయం, అలసటలతో పాటు, బళ్ళు లాక్కువెళ్ళే పశువులు లేకపోవడమే సిపాయిలను ఎక్కువగా నిరుత్సాహపరిచింది. ఉన్నత కులాలకు చెందిన సైనికులు తమ స్వంత ఇత్తడి వంట పాత్రలను ఉపయోగించారు. ఆ పాత్రలను తమ పరుపులో చుట్టుకుని తీసుకెళ్ళేవారు. వాటి బరువు కారణంగా, వీపుకు తగిలించుకునే సంచీ, తుపాకులు, మందుగుండు సామగ్రితో పాటు ఈ పరుపు చుట్టలను కూడా మోయడం సైనికులకు కష్టంగా ఉండేది. ఆ సమయంలో, మూటలను మోయడానికి ఎద్దుల బండ్లను సాధారణంగా ఉపయోగించేవారు. చిట్టగాంగ్‌కు వెళ్లేందుకు, ఎద్దులు ఏవీ లేవు. దాదాపు అందుబాటులో ఉన్న పశువులన్నిటినీ రంగూన్‌కు సముద్రంలో ప్రయాణించడానికి అప్పటికే కొనుగోలు చేసేసారు. అందుబాటులో ఉన్న కొద్దిపాటి ఎద్దులు నాసిరకమైనవి. పైగా వాటి ధరలు సిపాయిలు భరించలేనంత ఉన్నాయి. ప్రభుత్వమే ఎద్దులను సమకూర్చాలని, లేదా వాటి కొనుగోలుకు సరిపోయేలా తమకు రెట్టింపు బత్తా (శత్రు భూభాగంలో ఉన్నప్పుడు చెల్లించే భత్యం) చెల్లించాలని వాళ్ళు కోరారు.[6][7] కంపెనీ వారి అభ్యర్థనలను పట్టించుకోకుండా, తమ వీపుసంచీలలో పట్టినన్ని తీసుకెళ్లాలని, మిగిలిన వాటిని వదిలివేయమనీ సలహా ఇచ్చారు.[8] ఈ పరిస్థితిని పరిష్కరించడానికి, కమాండింగ్ అధికారులు ప్రతి రెజిమెంట్‌కు 4,000 రూపాయలు అడ్వాన్సుగా ఇవ్వజూపారు.[9] ఆ డబ్బులు ఖర్చులకు సరిపోవు, బ్యాగేజీ ఛార్జీలు స్వంత జేబు నుండే పెట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి సిపాయిలు దాన్ని తిరస్కరించారు. ఎద్దులు కావాలని డిమాండ్లు ఆపకపోతే, సైనికులను సముద్ర మార్గంలో పంపుతామని ఒక ముస్లిం సుబేదార్ మేజర్ బెదిరించడంతో పరిస్థితి మరింత తీవ్రమైంది.[10] [6]

    తిరుగుబాటు సంఘటనలు

    మార్చు
     
    తిరుగుబాటును అణచివేసిన జనరల్ సర్ ఎడ్వర్డ్ పాగెట్ చిత్రం.

    ముందుగా 26 వ రెజిమెంట్‌ను కవాతు చేయాలని, ఆ తర్వాత 47 వ రెజిమెంట్‌ని, ఆ తర్వాత 62 వ రెజిమెంట్‌ను కవాతు చెయ్యాలని ఆదేశించారు. చివరి క్షణంలో ఈ వరసను మార్చి, 47 వ రెజిమెంట్‌ను 1824 నవంబరు 1 న కవాతు మొదలుపెట్టమని ఆదేశించారు. 47వ రెజిమెంట్ బయలుదేరిన వారంలోపు మిగతా రెండు రెజిమెంట్‌లు బయలుదేరాలని ఆదేశించారు.[11] నవంబరు 1 న జరిగిన పెరేడ్‌లో 47 వ పదాతిదళానికి చెందిన సైనికులు తమ వీపు స<చీలు లేకుండా వచ్చారు. వాటిని తీసుకురమ్మని ఆదేశించినపుడు ఆ ఆదేశాలను తిరస్కరించారు. తమకు ఎద్దులను ఇవ్వాలని లేదా రెట్టింపు బత్తా చెల్లించాలని వాళ్ళు డిమాండు చేశారు. తమ సమస్యలను పరిష్కరించకుండా కవాతు చేయడానికి నిరాకరించారు.[12] కమాండింగ్ ఆఫీసర్, జనరల్ డాల్జెల్, అసంతృప్తిని అణచివేయలేకపోయాడు. భారత కమాండర్-ఇన్-చీఫ్, జనరల్ సర్ ఎడ్వర్డ్ పాగెట్‌ను సంప్రదించడానికి అతను కలకత్తా వెళ్లాడు. మిగతా రెండు రెజిమెంట్లు కూడా దీనితో ప్రభావితమయ్యాయి. 26 వ BNI నుండి ఇరవై మంది సిపాయిలు, 62వ BNI నుండి 160 మంది, 47వ రెజిమెంటు లోని తిరుగుబాటు సిపాయిలతో చేరారు.[13][14]

    బిందీ తివారీ నాయకత్వంలో, పగటిపూట సిపాయిలు క్రమశిక్షణగ మెలిగారు. రాత్రంతా పరేడ్ గ్రౌండ్‌లోనే ఉన్నారు. ఈలోగా కలకత్తా పంపిన సందేశం మేరకు అక్కడి నుండి పెగెట్‌ బయలుదేరి వచ్చాడు.[15] సిపాయిలు తమ డిమాండ్లను ఒక దూత ద్వారా పేజెట్‌కు సమర్పించారు. తమ చర్య మతపరమైన గొడవల కారణంగా జరిగిందని, తమ డిమాండ్లను నెరవేర్చకుంటే తమను సేవ నుండి తొలగించమనీ వాళ్ళు అభ్యర్థించారు. సిపాయిలు ఆయుధాలు వదలివేసిన తర్వాతే న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరిస్తామని పేజెట్ బదులిచ్చాడు.[16] సిపాయిలు తమ డిమాండును వదులుకోవడానికి ఈ వాగ్దానం సరిపోలేదు. ఈ తిరస్కరణను పేజెట్, సాయుధ తిరుగుబాటు చర్యగా పరిగణించాడు.[17] అతను యూరోపియన్ దళాలకు చెందిన రెండు రెజిమెంట్లను - 47వ (లాంకషైర్) రెజిమెంట్ ఆఫ్ ఫుట్, 1వ (రాయల్) రెజిమెంట్ - అలాగే కలకత్తా నుండి గవర్నర్ జనరల్ అంగరక్షకుడి దళాలను పిలిపించాడు. సమీపంలోని డమ్ డమ్ నుండి గుర్రాలు లాగే ఫిరంగిని కూడా తెప్పించాడు.[18][19][15][20]

    నవంబరు 2 ఉదయానికి 26 వ, 62 వ రెజిమెంట్ల బలగాలు, నమ్మకస్తులైన సైనికులు తమతమ స్థానాల్లోకి చేరారు. వారు రహస్యంగా సిపాయిలున్న మైదానాన్ని చుట్టుముట్టారు. వారి సమస్యలపై ఎటువంటి చర్చలు జరగాలన్నా ముందు ఆయుధాలు వదలివేయాలని చెబుతూ తిరుగుబాటుదారులకు తుది సందేశం పంపారు. అయితే సిపాయిలు నిర్ణయించుకునేందుకు పది నిమిషాల సమయం మాత్రమే ఇచ్చారు.[21] రెబల్స్‌పై కాల్పులు జరపాలని పేజెట్ రెండు ఫిరంగులను ఆదేశించాడు, తర్వాత రహస్యంగా ఉంచిన గుర్రాలు లాగే ఫిరంగి వెనుక నుండి దాడి చేసాయి. ఈ ఆకస్మిక దాడికి ఆశ్చర్యపోయిన సిపాయిలు పారిపోవడానికి ప్రయత్నించారు కానీ మిగిలిన బ్రిటిషు రెజిమెంట్లు అన్ని వైపుల నుండి దాడి చేశారు. కొంతమంది సిపాయిలు తప్పించుకోవడానికి హుగ్లీ నదిలోకి దూకి మునిగిపోయారు, మరికొందరు ఆశ్రయం కోసం స్థానిక ఇళ్ళలోకి దూరారు. కాని విధేయులు వారిని వెంబడించి బయోనెట్‌లతో పొడిచి చంపారు. ఆపరేషన్ సమయంలో చుట్టుపక్కల ఉన్న మహిళలు, పిల్లలతో సహా చాలా మంది ప్రేక్షకులు మరణించారు.[22] అనంతరం భారత సిపాయిల వద్ద ఉన్న తుపాకులలో గుళ్ళు లేవని తేలింది. తిరుగుబాటుదారులు ఎటువంటి హింసను ఉద్దేశించలేదని స్టీవెన్సన్ నిర్ధారించాడు.[17]

    ప్రాణనష్టం

    మార్చు
     
    బారక్‌పూర్ కంటోన్మెంట్‌లో బిందీ తివారీ తిరుగుబాటుపై ఒక బోర్డు

    దాదాపు 1400 మంది తిరుగుబాటుదారులలో 180 మంది దాడి సమయంలో మరణించారు, అయితే మృతుల సంఖ్య వివాదాస్పదంగా ఉంది. [23] బెంగాల్ హుర్కారు అనే స్థానిక సెమీ-అధికారిక వార్తాపత్రిక, 1824 నవంబరులో ఒక నివేదికను ప్రచురించింది, "పరిపూర్ణ అంచనా" 100 మంది అని అది పేర్కొంది.[22] 1827లో, జోసెఫ్ హ్యూమ్ అనే ప్రతిపక్ష ఎంపీ, బ్రిటిషు పార్లమెంటులో "భారతదేశం నుండి అతనికి చేరిన వాస్తవాల" ప్రకారం మృతుల సంఖ్య 400 నుండి 600 దాకా ఉందని చెప్పాడు.[24] ప్రతిస్పందనగా, చార్లెస్ విలియమ్స్-విన్, ప్రభుత్వం తరపున మాట్లాడుతూ ఆ సంఖ్య 180 లోపేనని చెప్పాడు.[2]

    అనంతర పరిణామాలు

    మార్చు

    తిరుగుబాటుదారులకు శిక్ష

    మార్చు

    మిగిలిన తిరుగుబాటుదారులలో చాలా మంది పట్టుబడ్డారు. నవంబరు 2న, పదకొండు మంది సిపాయిలను రింగ్ లీడర్‌లుగా గుర్తించారు. వేగంగా విచారణ జరిపి వారికి ఉరిశిక్ష విధించారు. వీరిలో ఆరుగురు 47వ బిఎన్‌ఐకి చెందినవారు, నలుగురు 62వ బిఎన్‌ఐకి చెందినవారు, ఒకరు 26వ బిఎన్‌ఐకి చెందినవారు. వాళ్లన్ము ఆ రోజే ఆ పరేడ్ గ్రౌండ్‌లోనే ఉరితీసారు.[25][26][27] దాదాపు 52 మందికి పద్నాలుగు సంవత్సరాల కఠిన శ్రమతో కూడిన రోడ్లపనితో కారాగార శిక్ష విధించారు. అనేకమందికి తక్కువ నిబంధనలతో శిక్ష పడింది.[28] నవంబరు 4న, ఫోర్ట్ విలియం నుండి జారీ చేయబడిన ఒక సాధారణ ఉత్తర్వు ద్వారా, 47వ రెజిమెంటును రద్దు చేసి, దాని భారతీయ అధికారులను అవమానపరచి, తొలగించి, ప్రభుత్వ విశ్వాసానికి అనర్హులుగా ప్రకటించారు. వారికి తెలియకుండా తిరుగుబాటు జరగదని బ్రిటిషు వారు భావించారు.[29] బ్రిటిషు అధికారులందరినీ కొత్త 69 వ రెజిమెంట్‌కి బదిలీ చేసారు.[22] నవంబరు 9 న, బిందీని అరెస్టు చేశారు. మరుసటి రోజు బహిరంగంగా గొలుసులతో వేలాడదీసారు. బహిరంగ ప్రదర్శనలో అతని శరీరం నెలల తరబడి కుళ్ళిపోయింది. [30] [31] [32]

    ప్రెస్ సెన్సార్‌షిప్

    మార్చు
     
    గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఎర్ల్ అమ్హెర్స్ట్. బ్రిటిషు వార్తాపత్రిక నివేదికలో ఇతన్ని తీవ్రంగా విమర్శించారు.

    బారక్‌పూర్‌లో అశాంతి వార్తలు, ముఖ్యంగా శాంతియుత నిరసనను అణచివేయడానికి హింసను ఉపయోగించడం గురించి, కలకత్తా, లండన్, తదితర ప్రాంతాలలోని మీడియాలో వార్తలు రాకుండా అణచివేసారు. నవంబరు 4న అధికారిక కలకత్తా గెజిట్‌లో ప్రచురించబడిన ఒక చిన్న పేరా మినహా వలస ప్రభుత్వం మౌనాన్ని ఆశ్రయించింది. ఆ వార్తలో ఈ సంఘటన చిన్నవిషయంగా రాస్తూ, ప్రాణనష్టం గురించి అసలు ప్రస్తావించనేలేదు.[33][34] బ్రిటిషు డిప్యూటీ జడ్జి-అడ్వకేట్ సంపాదకత్వంలో స్థానిక సెమీ-అధికారిక వార్తాపత్రిక బెంగాల్ హుర్కారు కూడా 1824 నవంబరులో ఒక చిన్న నివేదికను ప్రచురించింది. నివేదిక సంఘటనను తగ్గించి చూపింది. తిరుగుబాటుకు కారణంతో సహా ప్రాథమిక వివరాలేమీ ఇవ్వలేదు. అటువంటి వివరాలను ప్రచురించడానికి తమకు అనుమతి లేదని పేర్కొంది.[35] ఈ సంఘటన గురించి పుకార్లు వ్యాపించినప్పటికీ, సాధారణ భారతీయులు, బ్రిటన్లకు ఈ రెండు నివేదికలు మినహా, పెద్దగా సమాచారమేమీ ఇవ్వలేదు.[36]

    తర్వాత పత్రికల్లో విమర్శలు వచ్చాయి

    మార్చు

    ఈ సంఘటన జరిగిన దాదాపు ఆరు నెలల తర్వాత లండన్‌లోని ఓరియంటల్ హెరాల్డ్ ఈ విషయంపై మొదటిసారిగా, కలకత్తాలోని బ్రిటిషు విలేకరి నివేదిక ఆధారంగా ఒక కథనాన్ని ప్రచురించింది. దీనిని "బారక్‌పూర్ ఊచకోత" అని వర్ణించింది.[37] ఓరియంటల్ హెరాల్డ్ బ్రిటిషు అధికారుల ప్రవర్తనను తీవ్రంగా విమర్శిస్తూ, ముఖ్యంగా శాంతియుత నిరసనను అణిచివేసేందుకు పేజెట్ హింసను ఆశ్రయించాడని, సిపాయిలకు వేతనాన్ని పెంచాలని, సామాన్ల రవాణాకు సౌకర్యాలు కలగజేయాలనీ డిమాండ్ చేసింది.[38] ఈ సంఘటనపై ప్రభుత్వం స్థిరమైన, వాస్తవమైన వివరణ ఇవ్వాలని కూడా కోరింది.[13] ముఖ్యంగా అమ్హెర్స్ట్‌ను తీవ్రంగా విమర్శిస్తూ ఈ నివేదిక, అతనిని "దుష్ట మేధావి"గా పేర్కొని, ఈ తిరుగుబాటుల్కు అతనే కారణమని నిందించింది:[33]

    స్థానిక సైనికుల విధేయతను పొందడానికి ఇలాంటి పని చెయ్యాల్సిన అవసరం వచ్చిందంటే, మన అధికారం ఎంత ఘోరంగా, ఎంత అల్పంగా ఉందో కదా! ఒకవేళ అంతటి అవసరం లేదనే పక్షంలో, బ్రిటనుకు ఈ మచ్చ తెచ్చినవారిని ఆ భగవంతుడు క్షమించుగాక.

    —బారక్‌పూర్ ఊచకోత – బర్మా యుద్ధం – బెంగాల్లో స్థానిక సైన్యపు వర్తమాన స్థితి, ది ఓరియెంటల్ హెరాల్డ్, సంచిక 5, 1825.[33]

    పరిణామాలు

    మార్చు

    తిరుగుబాటును అణచివేసిన తరువాత, చాలా మంది సిపాయిలు బ్రిటిషు సేవను విడిచిపెట్టారు. [32] ఈ ఘటనపై విచారణకు కోర్టు ఆఫ్ ఎంక్వైరీని ఏర్పాటు చేశారు.[27] దాని నివేదిక గురించి తెలిసినదల్లా ఒకటే - సిపాయిల డిమాండు న్యాయబద్ధమైనదని అది అంగీకరించింది. తిరుగుబాటు చేసిన సిపాయిలు మొదట కోరిన రాయితీలన్నిటినీ 'జనరల్ సర్వీస్' కోసం నియమించబడిన బెంగాల్ యూనిట్లకు ఇచ్చారు.[17] 1824 సంఘటన స్థానిక భారతీయ రెజిమెంట్లలో అపనమ్మక వాతావరణాన్ని సృష్టించింది. బ్రిటిషు అధికారులు, స్థానిక భారతీయ సిపాయిల మధ్య సంబంధాలు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నాయి.[32][17]

    అంచనాలకు విరుద్ధంగా పేజెట్ పైన గాని, సైన్యంలోని మరే ఇతర అధికారిపై గానీ క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదు.[34] పరిస్థితితో వ్యవహరించడంలో అసమర్థతకు గాను అమ్హెర్స్ట్‌ను వెనక్కి పిలిచే దాకా వచ్చింది గానీ, చివరికి తన పదవిని నిలుపుకున్నాడు.

    బ్రిటిషు పార్లమెంటులో చర్చ

    మార్చు

    1827 మార్చి 22 న, హౌస్ ఆఫ్ కామన్స్‌లో బారక్‌పూర్ తిరుగుబాటు గురించి చర్చ జరిగింది. ప్రతిపక్షానికి చెందిన ఒక అతివాద ఎంపీ అయిన హ్యూమ్, సైనిక ప్రవర్తనను విమర్శిస్తూ, తన సహచరులకు ఈ సంఘటనను వివరించాడు. బాధ్యులను గుర్తించడానికి తాజా దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి చేశాడు; అసలైన దోషులను కనుగొనే సంకల్పం అమ్హెర్స్ట్‌కు లేదని అతను గ్రహించాడు. [39] కోర్ట్ ఆఫ్ ఎంక్వయిరీ నివేదికను కూడా అటకెక్కిస్తున్నారని, పూర్తి నివేదికను పార్లమెంటులో సమర్పించాలని డిమాండ్ చేశాడు. వివాదానికి సంబంధించిన రెండు వైపులా విని సభ న్యాయమైన నిర్ణయానికి రావాలని విజ్ఞప్తి చేశాడు.[2] వైన్, డేవిస్ వంటి ప్రభుత్వ పక్షానికి చెందిన టోరీ ఎంపీలు ఈ ప్రతిపాదనపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, అమ్హెర్స్ట్, పేజెట్‌లకు మద్దతు పలికారు. చర్చ ముగిసాక జరిగిన వోటింగులో, తాజా విచారణ జరపాలని, విచారణ నివేదికను సభకు సమర్పించాలని వచ్చిన ప్రతిపాదన 44-176 తో వీగిపోయింది.[29]

    చారిత్రక ప్రాముఖ్యత

    మార్చు
     
    బారక్‌పూర్‌ లోనే, 1857 నాటి సిపాయీల తిరుగుబాటు మొదలుపెట్టిన సిపాయి మంగళ్ పాండే. 1984 నాటి తపాలా బిళ్ళ,

    ఈ సంఘటన జరిగిన ముప్పై మూడు సంవత్సరాల తరువాత 1857 మార్చి 29 న ఇదే బారక్‌పూర్ కంటోన్మెంటులో సిపాయి మంగళ్ పాండేతో మరో తిరుగుబాటు మొదలైంది. భారత సైన్యపు 24వ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, మేజర్ జనరల్ VK సింగ్ (2010–2012), 1824 బారక్‌పూర్ తిరుగుబాటు గురించి విస్తృతంగా రాశాడు. అతను ఇలా అన్నాడు:

    జరిగిన తిరుగుబాటు కాదు, దాన్ని క్రూరంగా అణచివేసిన విధానం అందరినీ నిర్ఘాంతపరచింది. అధికారులు, మరీ ముఖ్యంగా జనరల్ పాగెట్, అవగాహనతో, చాకచక్యంగా వ్యవహరించి ఉంటే రక్తపాతాన్ని నివారించగలిగి ఉండేవారు. తిరుగుబాటును త్వరగ అణచివేసినప్పటికీ – ఒక్కరోజు లోపే అది ముగిసిపోయింది – దీర్ఘకాలంలో దాని ప్రభావం చాలానే ఉంది. 1857 సిపాయీల తిరుగుబాటుకు బీజం ఇందులోనే ఉంది.

    —జనరల్ వి.కె.సింగ్, భారత స్వాతంత్ర్యోద్యమంలో సాయుధ దళాల పాత్ర

    1824 నాటి సంఘటనలు బ్రిటన్లు, భారతీయులను చాలా సంవత్సరాలు వెంటాడుతూనే ఉన్నాయి. 1857లో బ్రిటిషు అధికారులను చంపడానికి భారతీయ సిపాయిలకు ఇది హేతువును అందించిందని చాలామంది భావించారు.[40]

    స్మారకం

    మార్చు
     
    బారక్‌పూర్ కంటోన్మెంట్‌లోని బింది తివారీ ఆలయం

    బిందీ తివారీ మరణం తర్వాత భారతీయ సిపాయిలలో అతను అమరవీరుడు, కాల్పనిక వీరుడు అయ్యాడు. బిందీ మరణించిన ఆరు నెలల తర్వాత, ఈ సంఘటన జ్ఞాపకార్థం, భారతీయ సిపాయిలు, స్థానికులు అతనిని ఉరితీసిన ప్రదేశానికి సమీపంలో ఒక ఆలయాన్ని నిర్మించారు. బిందా బాబా దేవాలయం అనే ఆ గుడి ఇప్పటికీ ఉంది.[41]

    ఇవి కూడా చూడండి

    మార్చు

    మూలాలు

    మార్చు
    1. Pogson 1833, p. 25.
    2. 2.0 2.1 2.2 OHJGL 1827, p. 139.
    3. Singh 2009, p. 11.
    4. Pogson 1833, p. 5.
    5. Singh 2009, p. 13.
    6. 6.0 6.1 Singh 2009, p. 14.
    7. OHJGL 1825, p. 16.
    8. Pogson 1833, p. 8.
    9. Pogson 1833, p. 9.
    10. Menezes 1993, p. 107.
    11. Pogson 1833, p. 6.
    12. OHJGL 1825, p. 23.
    13. 13.0 13.1 OHJGL 1825, p. 24.
    14. EAR 1824, p. 216.
    15. 15.0 15.1 Ritchie 1846, p. 279.
    16. Pogson 1833, p. 18.
    17. 17.0 17.1 17.2 17.3 Stevenson 2015, p. 46.
    18. OHJGL 1825, p. 25.
    19. Pogson 1833, p. 22.
    20. Wilson 1848, p. 102.
    21. OHJGL 1825, p. 28.
    22. 22.0 22.1 22.2 OHJGL 1825, p. 29.
    23. Ritchie 1846, p. 280.
    24. AJMM 1827, p. 169.
    25. Pogson 1833, pp. 28, 30.
    26. Pogson 1833, p. 30.
    27. 27.0 27.1 OHJGL 1825, p. 30.
    28. OHJGL 1825, p. 33.
    29. 29.0 29.1 OHJGL 1827, p. 199.
    30. Mishra, Yash (10 December 2019). "Bindee Tewary: The 'Other' Mangal Pandey". Retrieved 3 May 2023.
    31. Pogson 1833, p. 31.
    32. 32.0 32.1 32.2 OHJGL 1825, p. 31.
    33. 33.0 33.1 33.2 OHJGL 1825, p. 14.
    34. 34.0 34.1 AJMM 1827, p. 168.
    35. OHJGL 1825, p. 15.
    36. OHJGL 1825, pp. 14–15.
    37. OHJGL 1825, p. 13.
    38. OHJGL 1825, p. 27.
    39. OHJGL 1827, p. 182.
    40. Singh 2009, p. 19.
    41. Mazumdar 2008, p. 23.