2015 దీమాపూర్ సామూహిక హత్య

నాగాలాండ్ లోని దీమాపూర్లో 5 మార్చి 2015 న ఒక పెద్ద గుంపు సయ్యద్ ఫరీన్ ఖాన్ అనే ఒక యువకుడిపై తెగబడి సామూహిక హత్యకు పాల్పడినది.[1] సుమారు 7000-8000 మంది గుంపుగా దీమాపూర్ కేంద్ర కారాగారం యొక్క గేట్లను బద్దలగొట్టి, జైలులోకి చొరబడి మానభంగం చేశాడన్న ఆరోపణలు ఎదుర్కొంటూ జైలులో ఉన్న అతనిని రోడ్డుకు ఈడ్చి తక్షణ న్యాయము కోరుతూ, నగ్నంగా ఏడు కిలోమీటర్ల దూరం వరకూ ఊరేగించి రాళ్ళతో కొట్టి హతమార్చి, బహిరంగ ప్రదర్శన చేస్తూ శవాన్ని ఈడ్చుకెళ్ళి ఒక గోపురానికి వ్రేలాడదీసిన వైనం.[2]

భారతదేశంలో స్త్రీల పై పెరిగిపోతోన్న అత్యాచారాలు, 2012 ఢిల్లీ సామూహిక అత్యాచార ఉదంతం ఆధారంగా చిత్రీకరించబడ్డ లఘు చిత్రం ఇండియాస్ డాటర్ పై భారత ప్రభుత్వం నిషేధం విధించటం, నాగాలాండ్ లోకి బంగ్లాదేశీయులు అక్రమంగా చొరబడటం వంటి వాటి నేపథ్యంలో ఈ ఉదంతం జరిగింది.

యువకుడి వివరాలు

మార్చు

35 ఏళ్ళు గల సయ్యద్ ఫర్దీన్ ఖాన్ బంగ్లాదేశ్ నుండి వలస వచ్చాడన్న అభిప్రాయం తొలుత నెలకొని ఉన్నా, తర్వాత ఇతను అస్సాం నుండి వచ్చాడని ప్రసార మాధ్యమాలు తెలిపాయి.[3] ఇక్కడ సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారం నిర్వహిస్తూ ఉండేవాడు. ఖాన్ ఒక నాగా యువతిని పలుమార్లు మానభంగం చేశాడనే ఆరోపణలపై 23 ఫిబ్రవరి 2015 న పోలీసులు అతనిని అదుపులోకి తీసుకొన్నారు.[2]

యువతి వివరాలు

మార్చు

నాగా యువతికి అత్యాచారం చేసిన తర్వాత, దానిని గురించి బయట ఎవరికీ చెప్పకుండా ఉండటానికి రూ.5,000 ఇచ్చాడని యువతి తెలిపినది. అయితే పోలీసులకు ఫిర్యాదు చేసే సమయంలో ఆ డబ్బును ఆమె పోలీసు వారికే అందించానని తెలిపినది.[4]

రాళ్ళు రువ్వుకొంటూ వచ్చిన రాక్షస గుంపును పోలీసులు అదుపుచేయలేకపోయారు. నాగాలు కాని వారి దుకాణాలను ధ్వంసం చేయటం ప్రారంభించటంతో పరిస్థితులు అదుపు తప్పాయి. పోలీసులు ఖాన్ ను ఆ గుంపు నుండి రక్షించే లోపే, వారిచే అతను హతమార్చబడ్డాడు. గుంపును చెల్లాచెదురు చేయటానికి పోలీసులు తప్పనిసరి పరిస్థితులలో గాలిలోకి కాల్పులు జరిపారు. భాష్పవాయువు ప్రయోగించారు. అయితే తీవ్రంగా గాయపడ్డ ఖాన్, అప్పటికే మరణించాడు. ఈ గుంపు కనీసం 10 వాహనాలను దగ్ధం చేసినది. తొక్కిసలాటలో గుంపులోని దాదాపు 20 మంది గాయాలపాలయ్యారు.

అనంతర పరిణామాలు

మార్చు

Amnesty International India హత్యకు పాల్పడిన ప్రతి ఒక్కరిపై తక్షణమే న్యాయవిచారణ జరపాలని కోరినది. దీమాపూర్ జిల్లా కలెక్టరు, సూపరింటెండెంటు ఆఫ్ పోలీస్ ఈ కేసు విషయమై సస్పెండు చేయబడ్డారు.[3]

సాక్ష్యాధారాలు

మార్చు

జరుపబడిన వైద్యపరీక్షలు ఎటువంటి నిర్ధారణకు రాలేకపోవటంతో అత్యాచారం జరిగినదని తెలుపటానికి ప్రాథమిక సాక్ష్యాధారాలు దొరకనట్లేనని తెలిపారు.[3] రక్షణాదళంలో పని చేసిన ఖాన్ సోదరుడు ఖాన్ ను పోలీసులు అత్యాచార కేసులో అన్యాయంగా ఇరికించారని, నాగాల్యాండ్ గిరిజనులు కాని వారిని తరమికొట్టే ప్రయత్నంలో ఈ ఎత్తు వేశారని తెలిపాడు.[4]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. మానభంగం ఆరోపణలు ఎదుర్కొంటూ జైలులో ఉన్న ముద్దాయిని రోడ్డుకీడ్చి, నగ్నంగా ఊరేగించి, రాళ్ళతో కొట్టి చంపేసిన గుంపు (టైమ్స్ ఆఫ్ ఇండియా - 6 మార్చి 2015)
  2. 2.0 2.1 "శవాన్ని ఈడ్చుకెళ్ళి క్లాక్ టవర్ కి వ్రేలాడదీసిన గుంపు (అల్ జజీరా - 05 మార్చి 2015)". Retrieved 21 December 2015.
  3. 3.0 3.1 3.2 "అత్యాచారం జరిగిందని తెలుపటానికి సాక్ష్యాధారాలు లేనట్లేనని తెలిపిన పోలీసులు (ఐబీఎన్ లైవ్ - 07 మార్చి 2015)". Archived from the original on 22 జనవరి 2016. Retrieved 20 December 2015.
  4. 4.0 4.1 "ఖాన్ ను అన్యాయంగా అత్యాచార కేసులో ఇరికించారని తెలిపిన అతని సోదరుడు (ఏబిసి.నెట్ 09-మార్చి-2015)". Retrieved 20 December 2015.