లౌలాన్ బ్యూటీ

(Beauty of Kroran నుండి దారిమార్పు చెందింది)

తారిమ్ మమ్మీలలో అత్యంత ప్రసిద్ధమైన వాటిలో లౌలాన్ బ్యూటీ ఒకటి. సుమారు 3800 సంవత్సరాల క్రితం కాంస్య యుగంలో నివసించిన ఒక కాకేసియన్ మహిళ యొక్క మృతదేహం ఇది. దీనిని 1980 లో చైనా లోని తక్లమకాన్ ఎడారిలో గల లోప్ నర్ ఉప్పు నీటి సరస్సు సమీపంలో కనుగొన్నారు. క్రీ.పూ. 1800 కాలానికి చెందిన ఈ మమ్మీ, తారిం బేసిన్‌లో లభించిన మమ్మీలలో అత్యంత పురాతనమైన వాటిలో ఒకటి, ప్రముఖమైనది కూడా. ఈమె చనిపోయి 3800 సంవత్సరాల కాలం గడిచినప్పటికీ ముఖలక్షణాలు చెక్కు చెదరగుండా బాగా భద్రపరచబడిన స్థితిలో లభించింది. ఆకర్షణీయమైన ముఖ లక్షణాలను బట్టి ఈమెను లౌలాన్ బ్యూటీ (బ్యూటీ అఫ్ లౌలాన్) లేదా క్రోరాన్ బ్యూటీ (బ్యూటీ అఫ్ క్రోరన్) గా వ్యవహరించారు. ఉరుంచి (చైనా) లోని షిన్జాంగ్ ప్రాంతీయ మ్యూజియంలో ఈ మమ్మీ ఉంచబడింది. చైనాలో బయల్పడిన ఈ కాకేసియన్ మమ్మీ ముఖంలో యూరోపియన్ లక్షణాలు స్పష్టంగా ఉండటంతో ఈమె చైనీయురాలు కాదని తేలిపోయింది. దానితో ఈమె జీవిత ప్రస్థానం చైనా భూభాగంలో ఎలా ముగిసింది అన్న విషయం తీవ్ర చర్చలకు దారితీసింది.

లౌలన్ బ్యూటీ క్లోజప్ చిత్రం

ముఖ్యాంశాలు

మార్చు
  • లౌలాన్ బ్యూటీ కాంస్య యుగంలో జీవించిన మహిళ. షిన్జాంగ్ ప్రాంతంలో కాంస్య యుగం క్రీ.పూ 2000 నుంచి క్రీ.పూ. 400 వరకు విలసిల్లింది.
  • ఈమె మమ్మీ చైనాలోని షిన్జాంగ్ ప్రాంతంలో తారీమ్ బేసిన్ లో, తక్లమకాన్ ఎడారి తూర్పున లౌలాన్ ప్రాచీన ఎడారి నగర శిథిలాల సమీపంలో బయటపడింది.
  • క్రీ.పూ.1800 కాలానికి చెందిన ఈ మమ్మీ, 3800 సంవత్సరాల క్రితం నాటిది. చనిపోయేనాటికి ఆమె వయస్సు 40-45 సంవత్సరాల మధ్య ఉండవచ్చు.
  • ఇది సహజసిద్ధమైన మమ్మీ. మరణాంతరం ఈమెను తక్లమకాన్ ఎడారి ఇసుక క్రింద శవపేటికలో పాతిపెట్టడం వలన ఎడారి వేడిమికి ఎండిపోయి ప్రకృతి సిద్ధంగా మమ్మీగా మారిపోయింది. ఎడారి వేడిమికి చర్మం ఎండి, నల్లగా మారినప్పటికీ శరీరం, జుట్టు, దుస్తులు మాత్రం చెక్కుచెదరలేదు.
  • లౌలాన్ బ్యూటీ కాకసాయిడ్ జాతికి చెందిన ఒక మహిళ. ఆమె ముఖంలో కనిపించే యూరోపియన్ లక్షణాలు ఆమె చైనీయురాలు కాదని స్పష్టంగా చెపుతాయి.
  • ఆధునిక డిఎన్ఏ పరిశోధనల ప్రకారం ఈమె తండ్రి వైపు పూర్వీకులు యూరోపియన్ మూలానికి చెందినవారని, తల్లి వైపు పూర్వికులు మాత్రం మిశ్రమ-ఆసియా వారసత్వం కనీసంగా కలిగి ఉన్నట్లు తెలిసింది.
  • ఆర్కియాలజిస్టుల ప్రకారం ఈ లౌలాన్ బ్యూటీ, చైనా-ఐరోపా‌ కూడలి ప్రాంతాల వద్ద క్రీ.పూ. రెండవ సహస్రాబ్దిలో విలసిల్లిన ఒక ప్రాచీన నాగరికతకు చెందిన మహిళగా భావించబడింది.
  • చైనీయుల మంగోలాయిడ్ జాతికి భిన్నంగా వున్న ఈ పురాతన కాకసాయిడ్ జాతి మమ్మీ చైనా భూభాగంలో బయటపడటం ఎన్నో ప్రశ్నలను లేవనెత్తింది. ఈమె జాతీయత, చైనా దేశంలో రాజకీయ-సాంస్కృతిక వివాదానికి దారితీసింది. ఉయ్ఘర్ వేర్పాటు జాతీయ ఉద్యమకారులకు సంస్కృతీ పరంగా లౌలాన్ బ్యూటీ ఒక జాతీయ గౌరవ చిహ్నంగా మారింది. ఇది చైనా ప్రభుత్వానికి సాంస్కృతికంగా చిక్కులు తెచ్చిపెట్టింది.

జీవితం, మరణం

మార్చు

క్రీస్తు పూర్వం 1800 లో చనిపోయేనాటికి, లౌలాన్ బ్యూటీ 45 సంవత్సరాల వయస్సు వరకు జీవించింది. ఈమె యూదు మతానికి చెందిన ప్రవక్త ‘అబ్రహం’ జీవించిన కాలంలో వుండేది. పొడి దుమ్ము, మసి మొదలైనవి ఎక్కువగా పేరుకుపోవడం వల్ల ఊపిరితిత్తులు చెడిపోయి ఆమె మరణించింది.[1] [2] చలిని తట్టుకోవడానికి ఆమెకు తొడిగిన ఉడుపులు, ఇతరత్రా చేసిన ఏర్పాట్లను బట్టి పరిశీలిస్తే, లౌలాన్ బ్యూటీ శీతాకాలంలో మరణించి ఉండవచ్చని పురావస్తు పరిశోధకురాలు, చరిత్ర పూర్వయుగపు వస్త్ర నిపుణులు అయిన ఎలిజబెత్ వేలాండ్ బార్బరు పేర్కొన్నారు. ఆమె ధరించిన దుస్తుల ముతక స్వరూపాన్ని బట్టి, ఆమె జుట్టులోని పేలును బట్టి చూస్తే, ఆమె కష్టతరమైన జీవితం గడిపినట్లు తెలుస్తుంది.[1]

మమ్మీ వెలికితీత

మార్చు

వాయవ్య చైనాలోని తక్లామకాన్ ఎడారి తూర్పు భాగంలో గల ఒక ప్రాచీన ఎడారి నగరం లౌలన్. ఈ నగర శిథిలాల సమీపంలో లోప్ నర్ ఉప్పు నీటి సరస్సు ఉంది. ఈ సరస్సుకి ఉత్తరంలో గల తీబాన్హే (Tiebanhe) నదీ శ్మశానంలో ఈ మమ్మీ కాకతాళీయంగా బయల్పడింది. సిల్క్ రోడ్ గురించి ఒక డాక్యుమెంటరీని చిత్రీకరిస్తున్న సందర్భంలో చైనీస్ ఆర్కియాలజిస్ట్ ము సన్-ఇంగ్ (穆舜英), షిన్జాంగ్ అకాడమీ ఆఫ్ సోషల్ సైన్సెస్ కు చెందిన ఆర్కియాలజీ ఇన్స్టిట్యూట్ సభ్యులతో కలసి ఈ మమ్మీని 1980 లో వెలికితీశారు. ప్రస్తుతం ఈ మమ్మీని చైనా లోని షిన్జాంగ్ రాజధాని ఉరుంచిలో షిన్జాంగ్ అటానమస్ ప్రాంతీయ మ్యూజియంలో రెండవ అంతస్తులో గల మమ్మీ హాలులో ప్రదర్శనార్దం ఉంచారు.[3]

మమ్మీ సంరక్షణ

మార్చు

లౌలాన్ బ్యూటీ, కృత్తిమ పద్ధతులలో లేపనాలతో భద్రపరచబడిన మమ్మీ కాదు. కేవలం తక్లమకన్ వేడి ఎడారి ఇసుక క్రింద బహిరంగ శవపేటికలో పాతిపెట్టబడటంతో సహజసిద్ధంగా అతి చక్కగా సంరక్షించబడింది.[2] ఎడారి వేడిమికి ఆమె శరీరం ఎండిపోయి ప్రకృతి సిద్ధంగా మమ్మీగా మారిపోవడానికి ప్రధానంగా శీతల ఎడారి శుష్క వాతావరణం, శీతాకాలంలో ఎడారి ఇసుకనేల యొక్క అధిక లవణీయతలు దోహదం చేశాయి. వేలాది సంవత్సరాలుగా ఎడారి వేడికి ఆమె చర్మం ఎండిపోయి, నల్లబారిపోయినప్పటికీ శరీరం మాత్రం స్పష్టంగా చెక్కు చెదరకుండా ఉంది. శరీరంతో పాటు, జుట్టు, ధరించిన వస్త్రాలు సైతం వేలాది సంవత్సరాలుగా సంరక్షించబడి భద్రంగా ఉన్నాయి. చివరకు ఆమె కనురెప్పల వెంట్రుకలు సైతం చెక్కు చెదరలేదు.

మమ్మీ స్వరూపం

మార్చు
 
లౌలన్ బ్యూటీ పూర్తి చిత్రం

ఈమె ఎత్తు 152 సెం. మీ. బరువు 10.1 కేజీలు. రాగి జుత్తు, కంటి కింద వున్న పెద్ద ఎముకలు, పొడుగాటి ముక్కుతో కూడిన ఈమె ముఖకవళికలు ఇండో-యూరోపియన్ల మాదిరిగా ఉన్నాయని తెలుస్తుంది. ఆకర్షణీయమైన ముఖ లక్షణాలను బట్టి ఈమెను లౌలాన్ బ్యూటీ లేదా క్రోరాన్ బ్యూటీగా వ్యవహరించారు.[4] ఈమె నిజ జీవితంలో ఎలా కనిపించి ఉండేదో ఆ విధంగా ఫోటోని కూడా పునర్నిర్మించారు.

జుట్టు

మార్చు

బ్యూటీ ఆఫ్ లౌలన్ యొక్క జుట్టు రాగి వన్నెతో కూడిందిగా వర్ణించబడింది.ఆమె జుట్టుకు పేలు పట్టినట్లు తెలుస్తుంది.[5]

దుస్తులు

మార్చు

బ్యూటీ ఆఫ్ లౌలన్ ఉన్ని (wool), ఫర్ (fur) లతో చేసిన దుస్తులను ధరించింది. తలను, మెడను కప్పుతూ ఈకతో కూడిన ఒక ఫెల్ట్ టోపీ మాదిరి ఉడుపును ధరించింది. తోలుతో చేసిన బూట్లను కాళ్ళ చీలమండలం వరకూ ధరించింది. ఈ బూట్ల పైభాగం ఫర్‌తో కప్పబడివుంది. చిరిగిపోయి జీర్ణావస్థలో వున్న బూట్లు, దుస్తులు అనేకసార్లు సరి చేయబడినట్లుగా కనిపిస్తున్నాయి.[5] ఆమె ధరించిన తోలు స్కర్ట్ లోపలిభాగం వెచ్చదనంకోసం ఫర్‌తో కవర్ చేయబడింది. ఆమె ఉన్ని టోపీ కూడా ధరించింది. ఎలిజబెత్ బార్బరు ప్రకారం, చలి బారినుంచి తప్పించుకోవడానికి చేసిన ఈ ఏర్పాట్లు, ఆమె శీతాకాలంలో మరణించిందని సూచిస్తున్నాయి.

ఉపకరణాలు

మార్చు

ఉన్ని దుస్తులు ధరించిన ఈమె ఛాతీపై ధాన్యాన్ని తూర్పారబెట్టే చేట, గోధుమలు ఉన్నాయి. ఆమె తల వెనుక ఒక అందమైన అల్లిక బుట్ట (Basket) ఉంది. ఆ బుట్ట లోపల గోధుమ ధాన్యాలను సైతం కనుగొన్నారు. లౌలన్ బ్యూటీ వద్ద నాలుగు పళ్ళతో కూడిన ఒక దువ్వెన లభ్యమైంది. ఈ దువ్వెన, జుట్టును దువ్వడానికే కాక నేత పని చేసేటప్పుడు, ఆ నేతలోని పేక పోగులను వత్తుగా బంధించడానికి "ద్వంద్వ ప్రయోజన సాధనం"గా ఉండేదని అని బార్బరు సూచించారు.

లౌలాన్ బ్యూటీ యొక్క జాతి మూలం

మార్చు

లౌలాన్ బ్యూటీ యూరోపియన్ ముఖలక్షణాలను కలిగివుంది. కాకసాయిడ్ జాతికి చెందింది. లౌలాన్ బ్యూటీ మమ్మీ ప్రాచీనతకన్నా విస్పష్టంగా కొట్టొచ్చినట్లు కనిపించే ఆమె యూరోపియన్ ముఖలక్షణాలుతో కూడిన భౌతిక రూపం, పాశ్చాత్య వస్తు సంస్కృతులు ప్రపంచవ్యాప్తంగా ఆర్కియాలజిస్టులు, ఆంత్రోపాలజిస్టుల దృష్టిని విశేషంగా ఆకర్షించింది. దీనికి ప్రధాన కారణాలు 1. చైనీయులు మంగోలాయిడ్ జాతికి చెందిన ప్రజలైతే చైనా దేశంలో లభ్యమైన ఈ మమ్మీ మాత్రం కాకసాయిడ్ జాతికి చెందినది కావడం. 2. ఈ మమ్మీతో పాటు ఇదే ప్రాంతంలోని బయల్పడిన ఇతర మమ్మీ సమాధులలో లభ్యం అయిన వస్తు సంస్కృతి, పశ్చిమ యురేషియా ప్రాంతానికి చెందిన వస్తు సంస్కృతికి చెందినది కావడం.

1993 లో పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ విక్టర్ మెయిర్, జన్యు శాస్త్రవేత్త పాలో ఫ్రాంకాలాచిలు ఈ బ్యూటీ ఆఫ్ లౌలాన్ యొక్క జన్యు నమూనాలను సంపాదించి ప్రాథమికంగా ఆమె యూరోపియన్ అని తెలియచేసారు.[2] ఆమె జాతి మూలాలు సెల్టిక్, సైబీరియన్ లేదా స్కాండినేవియన్ సంతతికి చెందినవారని వారి పరీక్షల్లో తేలింది.[6]

అయితే 2007 లో చేపట్టిన ఆధునిక డిఎన్ఏ పరిశోధనలు లౌలాన్ బ్యూటీ యొక్క జాతి వారసత్వ మూలాలను మరింత నిశితంగా పరిశీలించాయి. దాని ప్రకారం ఆమె తండ్రి వైపు పూర్వీకులు యూరోపియన్ మూలానికి చెందినవారని, [5] తల్లి వైపు పూర్వికులు మాత్రం మిశ్రమ-ఆసియా వారసత్వం కనీసంగా కలిగి ఉన్నట్లు తెలిసింది.[7] ఈ పరిశోధనలు అంతిమంగా ఆమె పూర్వికులు, పశ్చిమ, తూర్పు ప్రాంతాల ఉప మిశ్రమ జాతికి చెందినవారిగా నిర్ధారించాయి. ఈమె బహుశా తొకేరియన్ల పూర్వీకురాలు కావచ్చు. ఈమెను ఖననం చేసిన పద్ధతి కూడా పురాతన ఇండో-యూరోపియన్లకు (అఫానస్యేవ్ సంస్కృతి లేదా తొకేరియన్) చెందింది.

లౌలాన్ బ్యూటీ యొక్క సాంస్కృతిక మూలాలు

మార్చు
  1. 1.0 1.1 Edward, Wong 2008.
  2. 2.0 2.1 2.2 Robert, Cipriani. "Chinese Mummies". chinesemummies.weebly.com. Retrieved 18 October 2020.
  3. Gilles Sabrie (November 18, 2008). "The Dead Tell a Tale China Doesn't Care to Listen To". The New York Times.
  4. "The Beauty of Loulan and the Tattooed Mummies of the Tarim Basin". January 16, 2014.
  5. 5.0 5.1 5.2 Barbara Demick (November 21, 2010). "A beauty that was government's beast". The Washington Post.
  6. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; History 101| 2020 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  7. her's a few maternal line was Eastern Asian mixed-blood.

చారిత్రిక పూర్వయుగంలో అంటే సుమారు 4000 సంవత్సరాల క్రితం ఇండో-యూరోపియన్ తెగలలో కొన్ని సమూహాలు, పశ్చిమ యురేషియా మూల ప్రాంతాలనుంచి లేదా పశ్చిమ మధ్య ఆసియా స్టెప్పీ ప్రాంతాలనుండి బయలు దేరి చైనాలోని తారిమ్ బేసిన్ ప్రాంతానికి వలస వెళ్ళారు. అయితే వీరు తారిమ్ బేసిన్ ప్రాంతంలో తమ సంచార జీవితాన్ని వదిలిపెట్టి, స్థిరజీవనాధారం కొనసాగించారని తెలుస్తుంది. ఒయాసిస్‌లను ఆధారం చేసుకొని వీరు ఒకవైపు బార్లి, జొన్నలు, గోధుమలు సాగు చేస్తూ మరోవైపు గొర్రెల పెంపకం, మేకల పెంపకం చేపట్టారు. కాలక్రమంలో తారిమ్ బేసిన్‌లో విస్మృతికి లోనైన ఒక ప్రాచీన నాగరికతకు వీరు కారకులయ్యారు. నిజానికి లౌలాన్ బ్యూటీ, ఆ విధంగా వేలాది సంవత్సరాల క్రితమే పశ్చిమ యురేసియా ప్రాంతం నుంచి చైనాకు వలస వెళ్ళిన తెగ ప్రజలకు చెందిన ఒకానొక మహిళ. అయితే విశేషమేమిటంటే ఆదినుంచి చారిత్రక స్పృహ కలిగివున్న ప్రాచీన చైనా చరిత్రకారులుకు సైతం, తమ దేశంలోనే వేలాది సంవత్సరాల క్రితం జీవించిన వీరి ఉనికిని గురించి లేశమాత్రంగా నైనా తెలియదు. నేటి పురావస్తు శాస్రవేత్తలు ఈ లౌలాన్ బ్యూటీ, చైనా-ఐరోపా‌ కూడలి ప్రాంతాల వద్ద క్రీ.పూ. రెండవ సహస్రాబ్దిలో (క్రీ.పూ.2000-క్రీ.పూ.1001) మధ్య కాలంలో విలసిల్లిన ఒకానొక ప్రాచీన నాగరికతకు చెందిన మహిళగా భావిస్తున్నారు.

సాంస్కృతిక వివాదం

మార్చు

చైనాలోని మెజారిటీ హాన్ జాతీయులకు, ఉయ్ఘర్స్ ముస్లిం ప్రజల మధ్య గల రాజకీయ-సాంస్కృతిక వివాదంలో లౌలాన్ బ్యూటీ మమ్మీ కూడా ఒక అంశంగా మారింది. తారిమ్ మమ్మీలు బయటపడిన ప్రాంతం వాయవ్య చైనాలోని షిన్జాంగ్–ఉయ్ఘర్ అటానమస్ ప్రాంతానికి చెందినది. ఈ ప్రాంతంలో నివసించే ఉయ్ఘర్లు టర్కిష్ మాట్లాడే ముస్లిం ప్రజలు.[1] సంస్కృతి రీత్యా వీరు బీజింగ్ కన్నా ఇస్తాంబుల్ కి చేరువగా ఉండటమే కాక వీరి ముఖలక్షణాలు కూడా యూరోపియన్ల మాదిరిగానే ఉంటాయి.

చైనా దేశానికి సంబంధించినంతవరకూ షిన్జాంగ్–ఉయ్ఘర్ ప్రాంతం మీద చారిత్రిక హక్కు, హాన్ రాజవంశం కాలం (క్రీ.పూ. 2 వ శతాబ్దం) నుంచి మాత్రమే ఏర్పడింది. అంటే క్రీ.పూ. రెండవ శతాబ్దానికి ముందు వరకూ షిన్జాంగ్ ప్రాంతాన్ని కేవలం ఒక జనావాసరహిత ప్రాంతంగా చైనా చరిత్ర పేర్కొంటూ వచ్చింది. కాగా ఆ ప్రాంతంలో దొరికిన లౌలాన్ బ్యూటీతో పాటు ఇతర వందలాది తారిమ్ మమ్మీలు ఈ ప్రాంతానికి సంబంధించి మరుగునపడిన వేలాది సంవత్సరాల చరిత్రను ఒక్కసారిగా వెలికితీసాయి. దానితో చైనా పేర్కొనే తొలి రాజ వంశం (హాన్) కాలానికి వేలాది సంవత్సరాలకు మునుపే షిన్జాంగ్ ప్రాంతంలో యూరోపియన్ ముఖలక్షణాలతో కూడిన ప్రజల ఉనికి ఉందని, అందులోను సాంకేతికాభివృద్ధిలో వారు చైనా నదీ లోయ నాగరికతలను మించిపోయారని ప్రపంచానికి మొదటిసారిగా వెల్లడైంది. ముఖ్యంగా పశ్చిమం నుండి వచ్చిన, యూరోపియన్ ముఖలక్షణాలతో కూడిన చీనియేతర ప్రజల ఉనికి షిన్జాంగ్ ప్రాంతంలో వుందని తేలడం చైనా ప్రభుత్వాన్ని సాంస్కృతికంగా ఇబ్బందిలోకి నెట్టింది.

దీనిని ఆధారంగా చేసుకొని, ఆసియన్లగా కంటే యూరోపియన్ల మాదిరిగా ఎక్కువగా కనిపించే ఉయ్ఘర్లు, చైనా ప్రభుత్వం నమ్ముతున్నదాని కంటే చాలా ముందుగానే తమ పూర్వీకులే ఈ ప్రావిన్స్‌కు వచ్చారని, ఈ ప్రాంతం మీద తొలి చారిత్రిక వారసత్వం తమదేనని ప్రకటించుకొన్నారు.[1] దీనికోసం లౌలన్ బ్యూటీ మమ్మీ బయల్పడిన వెంటనే, ఉయ్ఘర్లు వెంటనే ఆమెను తమ పూర్వీకురాలిగా పేర్కొన్నారు.[1] చైనీయుల కన్నా మొదటగా తమ ప్రజలు ఈ ప్రాంతంలో వచ్చారని, దానికి తిరుగులేని సాక్ష్యంగా లౌలన్ బ్యూటీతో పాటు మిగిలిన తారీమ్ మమ్మీలు సాక్ష్యమని విశ్వసించారు. లౌలన్ బ్యూటీని తమ ప్రజలతో అనుసంధానించడంకోసం, ఉయ్ఘర్ వేర్పాటు జాతీయ ఉద్యమకారులు సాంస్కృతికంగా లౌలాన్ బ్యూటీని ఒక జాతీయ గౌరవ చిహ్నంగా గుర్తించారు. ఇది చైనా ప్రభుత్వానికి మరిన్ని చిక్కులు తెచ్చిపెట్టింది. అయితే వాస్తవానికి లౌలన్ బ్యూటీ కాకేసియన్ అయినప్పటికీ, ఉయ్ఘర్ల పూర్వీకురాలు ఎంతమాత్రం కాదని, ఆమె జన్మ మూలాలు సెల్టిక్, సైబీరియన్ లేదా స్కాండినేవియన్ ప్రాంతాలకు చెందిన పూర్వికులవని పరీక్షల్లో తేలింది.[1] పైగా చారిత్రక సాక్ష్యాల ప్రకారంగా చూసినా షిన్జాంగ్–ఉయ్ఘర్ ప్రాంతమలో సా.శ. తొమ్మిదవ శతాబ్దం వరకూ ఉయ్ఘర్లు అడుగు పెట్టడమంటూ జరగలేదు. దానితో ఉయ్ఘర్ ప్రజల సాంస్కృతిక వారసత్వానికి, వారు ఆశించినంతగా లౌలాన్ బ్యూటీ ఉపయోగపడదని తేలిపోయింది.

ప్రాముఖ్యత

మార్చు

లౌలాన్ బ్యూటీ మమ్మీ యొక్క ఆవిష్కరణ, పురాతన చైనాపై ఆధునిక ప్రపంచ దృక్పథాన్ని రూపుదిద్దింది.[2] చారిత్రిక పూర్వయుగంలో చైనాలో కాకేసియన్లు కూడా వర్ధిల్లారని చెప్పడానికి బలమైన ఆధారానిచ్చింది.[2] భవిష్యత్తులో సాకారమయ్యే అంశాలను చరిత్రకారులు ఊహించడానికి కొన్ని వందల సంవత్సరాలకు ముందే తూర్పు, పశ్చిమ ప్రాంతాల ప్రజల మధ్య సాధ్యపడిన అన్వేషణలలో భాగంగా రాకపోకలను సూచించడానికి లౌలాన్ బ్యూటీ మమ్మీ తొలి సాక్ష్యంగా ఉంది. మధ్య ఆసియాలో ముఖ్యంగా తారిమ్ బేసిన్ ప్రాంతంలో విస్మృతికి లోనైన ఒకానొక ప్రాచీన ఎడారి నాగరికతకు చెందిన సంస్కృతి విశేషాలను వెలికితీసే ప్రయత్నానికి ఈ లౌలాన్ బ్యూటీ మమ్మీ అధ్యయనం ప్రధానంగా దోహదం చేసింది.

ఇవి కూడా చూడండి

మార్చు

చిత్రమాలిక

మార్చు

రిఫరెన్సులు

మార్చు

Edward, Wong (November 18, 2008). "The Dead Tell a Tale China Doesn't Care to Listen To". The New York Times. Retrieved 17 October 2020.

బయటి లింకులు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 "Who was the Sleeping Beauty of Loulan?". history101.com. Novelty Magazines Inc. Archived from the original on 18 అక్టోబరు 2020. Retrieved 18 October 2020.
  2. 2.0 2.1 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Chinese Mummies|Robert Cipriani అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు