తారిమ్ మమ్మీలు

వాయువ్య చైనా లోని తారిమ్ నదీ బేసిన్ లో లభ్యం అయిన క్రీ.పూ. ఒకటి, రెండు సహాస్రాబ్దిల నాటి కాకసాయిడ్ జాతికి చెందిన ప్రజల యొక్క మమ్మీలను తారిమ్ మమ్మీలు గా వ్యవహరిస్తారు. ఈ మమ్మీలు క్రీ.పూ 2000 నుండి క్రీ.శ. 100 మధ్య కాలాలకు చెందినవి. ప్రాథమికంగా తొలి కంచుయుగపు నాగరికతా కాలానికి చెందినవి. వీటిని పశ్చిమ యురేషియా మూల ప్రాంతాలనుంచి చైనా లోని తారిం బేసిన్ ప్రాంతానికి వలస వచ్చిన ఆదిమ ఇండో-యూరోపియన్ తెగ ప్రజలకు చెందినవిగా భావించారు. తక్లమకాన్ ఎడారి ప్రాంతంలో ఈ మమ్మీలు వెలికితీయబడటంతో వీటిని తక్లమకాన్ మమ్మీలుగా పిలుస్తారు. వీరు మాట్లాడే భాష ప్రాచీన ఇండో-యూరోపియన్ భాషా కుటుంబానికి చెందిన తొకేరియన్ భాష అయివుండవచ్చని భావించినందున వీటిని తొకేరియన్ మమ్మీలుగా కూడా పిలిచారు

షియౌహ్ సమాధులు లేదా క్రీక్ సమాధులు బయల్పడిన ప్రాంతం
Map of the Lop Nor region by Folke Bergman 1935.jpg
చైనా లోని లోప్ నర్ సరస్సు ప్రాంతంలో క్రీక్ సమాధులు బయల్పడిన ప్రదేశం Ördek’s Necropolis గా గుర్తించబడింది.
స్థలం China
ప్రాంతంషిన్జాంగ్ (Xinjiang)
అక్షాంశ రేఖాంశాలు40°20′11″N 88°40′21″E / 40.3364°N 88.6725°E / 40.3364; 88.6725
తారిం మమ్మీ
Stein with his expedition team including R.B Lal Singh Mehta in the en:Tarim Basin, circa 1910.

ఈ మమ్మీల ప్రాచీనతకన్నా ప్రధానంగా కొట్టొచ్చినట్లు కనిపించే యూరోపియన్ ముఖకవళికలు, లక్షణాలుతో కూడిన భౌతిక రూపాలు, వీటి పాశ్చాత్య వస్తు సంస్కృతి (Western material Culture) పురావస్తు శాస్త్రవేత్తల, పురా మానవ శాస్రవేత్తల (anthropologists) దృష్టిని విశేషంగా ఆకర్షించాయి. దీనికి కారణం చైనీయులు మంగోలాయిడ్ కు చెందిన జాతి ప్రజలు కాగా అదే చైనా దేశంలో లభ్యమైన తారిమ్ మమ్మీలు మాత్రం కాకసాయిడ్ జాతికి చెందిన ప్రజలవి కావడం. అంతే కాక ఆయా సమాధులలో ఈ మమ్మీలతో పాటు లభ్యం అయిన వస్తు సంస్కృతి, పశ్చిమ యురేషియా ప్రాంతానికి చెందిన వస్తు సంస్కృతికి చెందినది కావడం.

వేలాది సంవత్సరాల క్రితమే పశ్చిమ యురేసియా ప్రాంతం నుంచి చైనాకు వలస వెళ్ళిన ప్రజల మమ్మీలు ఇవి. తమ దేశంలోనే వేలాది సంవత్సరాల క్రితం జీవించిన వీరి ఉనికిని గురించి ప్రాచీన చైనా చరిత్రకారులుకు కూడా తెలియరాలేదు. నేటి పురావస్తు శాస్రవేత్తలు ఈ మమ్మీలనుచైనా, యూరప్ ల కూడలి ప్రాంతాల వద్ద క్రీ. పూ. 2000 - క్రీ. పూ. 1000 ల మధ్య కాలంలో విలసిల్లిన ఒక ప్రాచీన నాగరికతకు చెందిన ప్రజలకు చెందినవిగా భావిస్తున్నారు.

తారిమ్ మమ్మీలు - లభ్యమైన ప్రదేశాలుసవరించు

తారిం మమ్మీలు చైనా లోని షిన్జాంగ్–ఉయ్ఘర్ (Xinjiang-Uyghur) అటానమస్ ప్రాంతమలో గల తారిం నదీ పరీవాహక ప్రాంతంలో వున్న తక్లమకాన్ ఎడారిలో లభ్యం అయ్యాయి. ముఖ్యంగా తారిమ్ బేసిన్ దక్షిణ భాగంలోనూ, తూర్పు భాగంలోనూ ఈ మమ్మీలు అధికంగా లభ్యం అయ్యాయి.

దక్షిణ తారిమ్ బేసిన్ ప్రాంతంలో మమ్మీలు దొరికిన ప్రాంతాలు: ఖోటాన్ (Khotan), నియా (Niya), చెర్చాన్ (Cherchan), సాంపులా (Shanpula/ Sampul), యింగ్ పాన్ (Yingpan) తూర్పు తారిమ్ బేసిన్ ప్రాంతంలో మమ్మీలు దొరికిన ప్రాంతాలు: లోప్ నర్ సరస్సు (Lop Nur) ప్రాంతం, షియౌహ్ (Xiaohe), కావ్రిజల్ (Qäwrighul), తుర్ఫాన్ సమీపంలోని సుబేషీ (Subeshi) ప్రాంతం, వూపు (Wupu), క్రోరాన్ (Kroran), కుముల్ (Qumul) ప్రాంతాలు

చరిత్ర - పురావస్తు అన్వేషణలుసవరించు

చరిత్రసవరించు

క్రీ.పూ. 126 లో హాన్ రాజ వంశానికి చెందిన దూత, అన్వేషకుడు Zhang Qian తొలిసారిగా మధ్య ఆసియా గురించిన సాధికార సమాచారం చైనాకు తెలియచేసాడు. వాయువ్య చైనాలోని షిన్జాంగ్ (Xinjiang) ప్రాంతంలోని ఎడారి రాజ్యాలలో కనిపించిన గ్రీకు ప్రభావాన్ని గురించి పేర్కొన్నాడు. ఆ తరువాత క్రీ .శ. 1 వ శతాబ్ధానికి చెందిన రోమన్ రచయిత ప్లీనీ (Pliny the elder) హిమాలయాలకు ఆవతల వైపు వున్న భూభాగంలో సాధారణ మానవ ఎత్తును మించిన ఎత్తుతో, నీలి రంగు కళ్ళు, లేత రంగు జుత్తు గల జాతి ప్రజలు నివసిస్తున్నారని తెలియచేసాడు. వీరు కీచు గొంతుకతో మట్లాడే ప్రజలుగా పేర్కొన్నాడు. ఇది తారిమ్ బేసిన్ లో నివసిస్తున్న ప్రాచీన యురేషియన్ ప్రజలను ఉద్దేశించి కావచ్చు. సిల్క్ రోడ్ వాణిజ్య కాలంలో కూడా ఈ ఎడారి అంచులలో ఒయాసిస్ నగరాలు గొప్ప వాణిజ్య కేంద్రాలుగా వికసించినప్పటికీ ఎడారి మధ్య ప్రాంతాలలో నాగరికతా జీవనం వున్నట్లు బయటి ప్రపంచానికి తెలియరాలేదు.

పురావస్తు అన్వేషణలుసవరించు

 
క్రీక్ సమాధుల ప్రాంతం
 
క్రీక్ సమాధుల సముదాయం
 
క్రీక్ సమాధుల ప్రాంతం
 
place

19 వ శతాబ్దం చివరివరకూ దుర్భేధ్యమైన తక్లమకాన్ ఎడారి అంతర్భాగాలలో మానవులు నివసించిన జాడే లేదని ప్రపంచం భావించింది. అయితే 19 వ శతాబ్దం చివరిలో యూరోపియన్ అన్వేషకులు, పురావస్తు శాస్రవేత్తలు ఈ ఎడారిని పురావస్తువుల కోసం అన్వేషిస్తున్నప్పుడు ఎడారి ఇసుకదిబ్బలలో కూరుకుపోయిన పురాతన మమ్మీలను కనుగొన్నారు. వీటిలో అతి ప్రాచీనమైన మమ్మీ క్రీ. పూ. 1800 సంవత్సరాల నాటిది కాగా ఇటీవలి మమ్మీ క్రీ.పూ. 200 నాటిది. అంటే తోకేరియన్ నాగరికతకు ముందు కాలం నాటిది.

ఈ ఎడారిలో అంతరించిపోయిన ప్రాచీన నాగరికతా అవశేషాలను అన్వేషించి వెలుగులోనికి తెచ్చిన పురావస్తు శాస్త్రవేత్తలు, అన్వేషకులలో అతి ముఖ్యులు.

  • బ్రిటీష్ -హంగేరియన్ కు చెందిన ఆర్కియాలజిస్ట్ స్టెయిన్ (Sir Marc Aurel Stein) (1862-1943)
  • జర్మనీకు చెందిన స్వాన్ హెడిన్ (Sven Anders Hedin) (1865-1952)
  • స్వీడన్ కు చెందిన వాన్ లీ కాక్ (Albert Von Le Coq) (1860-1930)
  • ఫ్రాన్స్ కు చెందిన పెళ్ళికాట్ (Paul Eugene Pellicot) (1878-1945)

తరువాతి కాలంలో రష్యాకు చెందిన నికోలాయ్ జెవలాస్కి (Nikolai Przhevalsky), అమెరికాకు చెందిన ఎల్స్ వర్త్ హంటింగ్టన్ (Ellsworth Huntington), జపాన్కు చెందిన జూకొ తషిబానా (Zuicho Tachibana) లు ఇంకా జర్మనీ దేశాలకు చెందిన పురావస్తు పరిశోధకులు ఈ ఎడారిలో పురావస్తు అన్వేషణలు జరిపారు.

1896 లో స్వాన్ హెడిన్ ఎడారి మధ్యలో ప్రాచీన ఒయాసిస్ నగరమైన దాండన్ ఓలిక్ (Dandan Olik) ను కనుగొన్నాడు. 1900 లో హెడిన్ చేసిన అన్వేషణలో ఇసుకదిబ్బలలో కూరుకుపోయిన ప్రాచీన లౌలాన్ (Loulan) నగర శిథిల ఆనవాళ్ళు లభించాయి.

వీరి పురావస్తు అన్వేషణల కృషి ఫలితంగా ఈ ఎడారి మద్యన ఇసుక దిబ్బలలో పూడుకుపోయిన దాండన్ ఓలిక్ (Dandan Olik), లౌలాన్ (Loulan), నియా (Niya), ఎండరె (Endere), రవాక్ (Rawak), కార్డంగ్ (Kardong), మిరాన్ (Miran) వంటి ప్రాచీన నగరాల శిథిల ఆనవాళ్ళు కనుగొనబడ్డాయి. ఈ శిథిలాలలో లభ్యమైన క్రీ. శ. 1000 కాలంనాటి పురావస్తు సంపద ఈ ఎడారి ప్రాంతంలో ప్రాచీన కాలంలో విలసిల్లిన నాగరికత పై గల పర్షియన్, గ్రీకు, భారతీయ, బౌద్ధ ప్రభావాన్ని సూచిస్తుంది.

Lop nur ఉప్పు నీటి సరస్సుకు దగ్గరలో లౌలాన్ ప్రాచీన నగరం ఉంది. 1910 లో ఈ లౌలాన్ నగరానికి 175 కి. మీ. దూరంలో గల షియౌహ్ మూడి ( Xiaohe Mudi) వద్ద ఒక చిన్న వాగు (Creek) సమీపంలో ఓర్డెక్ (Ordek) అనే ఒక స్థానిక వేటగాడు ఇసుకదిబ్బల క్రింద పూడ్చబడ్డ 4000 సంవత్సరాల నాటి సమాధులను కనుగొన్నాడు. షియౌహ్ అనగా చిన్న నది లెదా వాగు అని అర్ధం. ఈ సమాధుల సముదాయంలో సుమారు 100 కు పైగా చెక్క స్తంభాలు ఒక ఇసుక దిబ్బపై నిలబెట్టినట్లు ఉన్నాయి. చిన్న నదీ స్మశానం (Small river cemetery) లేదా క్రీక్ సమాధులు (Creek Tombs) లేదా షియౌహ్ సమాధుల ప్రాంగణం (Xiaohe Tomb Complex) గా పిలవబడిన ఈ స్మశానంలో ఆనాడు పదుల సంఖ్యలో అతి భద్రంగా పదిలపరచ్బడిన పురాతన మమ్మీలు లభించాయి.

తదనంతరం స్వీడిష్ ఆర్కియాలజిస్ట్ బెర్గ్మాన్ (Folke Bergman) 1934 లో ఈ క్రీక్ సమాధుల స్థలాన్ని తిరిగి కనుగొన్నాడు. 1934 నాటికే తక్లమకాన్ ఎడారి ఇసుక దిబ్బలనుండి 200 కు పైగా మమ్మీలను వెలికితీయడం జరిగింది. తరువాత విస్మతికి లోనైన ఈ క్రీక్ సమాధుల సముదాయాన్ని తిరిగి 66 సంవత్సరాల అనంతరం GPS నావిగేషన్ ద్వారా చైనా అన్వేషకులు కనుగొనడంతో 2003 నుండి 2005 వరకూ ఇక్కడి విభిన్న పొరలలో వున్న అనేక మమ్మీలను బయటకు వెలికితీసారు. నేటికి తారిమ్ బేసిన్ లో ఎడారి ఇసుకలో పాతిపెట్టబడిన 500 కు పైగా మమ్మీలు భద్రంగా పదిలపరచబడిన స్థితిలో లభించాయి.

ఎద్దు తోలులో చుట్టబడిన ఈ మమ్మీలను కప్పివేస్తూ పడవ ఆకారపు శవ పేటికలు తలక్రిందులుగా మూతల మాదిరి వీటిపై బోర్లించబడి ఉన్నాయి. మమ్మీల అడుగు భాగం మాత్రం ఎడారి ఇసుకను తాకుతున్నాయి. బోర్లించిన పడవ ఆకారపు శవ పేటికలలో ఉంచబడిన ఈ శవాలు ఎడారి ఇసుక దిబ్బలలో ఉపరితలం నుంచి అతి తక్కువ లోతులలో (1 మీటర్ కంటే తక్కువ లోతులలోనే) పాతిపెట్టబడి వుండటం విశేషం. వారి సమాధికి గుర్తుగా పాతిపెట్టబడిన చోటునే సుమారు 10-13 అడుగుల పొడుగాటి చెక్క కర్రలను ఇసుక దిబ్బలలో స్తంభాలుగా నిలబెట్టారు.

తారిమ్ మమ్మీలు పదిలంగా ఉండటానికి కారణాలుసవరించు

తారిమ్ మమ్మీలు ఈజిప్షియన్ మమ్మీల వలె లేపనాలతో పూయబడి కృత్తిమంగా భద్రపరచబడినవి కావు. ఇసుకలో పాతిపెట్టబడ్డ శవాలు ఎడారి వేడిమికి ఎండిపోయి ప్రకృతి సిద్ధంగా మమ్మీలుగా మారిపోయిన తరగతికి చెందినవి.

  1. తక్లమకాన్ శీతల ఎడారి శుష్క వాతావరణం
  2. ఎడారి ఇసుకనేల యొక్క లవణీయత (Salinity) : శీతాకాలంలో ఈ ఎడారి ఇసుకనేలల లవణీయత 10 గ్రా./లీ. కలిగి వుండి ఉపరితలం కన్నా 5 రెట్లు ఎక్కువగా వుంటుంది.
  3. శీతాకాలంలో ఉష్టోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోవడం. ఈ అతి శీతల ఉష్ణోగ్రతలు దేహం కుళ్ళిపోవడానికి తోడ్పడే బాక్టీరియాను నశింపచేస్తుంది.

పై కారణాల వల్ల తక్లమకాన్ శీతల ఎడారి, తారిమ్ బేసిన్ లో పూడ్చబెట్టిన శవాలను, వాటిని కప్పి ఉంచిన వస్త్రాలను సైతం వేలాది సంవత్సరాలు చెక్కు చెదరకుండా భద్రంగా ఉంచగలిగింది.

ఈజిప్షియన్ మమ్మీలకు తారిమ్ మమ్మీలకు తేడాలుసవరించు

ప్రాచీనతతో పోలిస్తే తారిమ్ మమ్మీల కన్నా ఈజిప్షియన్ మమ్మీలు చాలా పురాతనమైనవి. అయినప్పటికీ కొన్ని అంశాలలో తారిమ్ మమ్మీలు ప్రత్యేకతను కలిగివున్నాయి.

  • ఈజిప్షియన్ మమ్మీలు పూర్తి స్థాయిలో ఏర్పడిన (well established) ఒక నాగరికతా సమాజానికి చెందినవి. కాగా తారిమ్ మమ్మీలు ఆసియా ఖండంలో ఇప్పటికీ అంతుపట్టని ఒక ప్రాచీన నాగరికతా సమాజానికి చెందినవిగా భావిస్తున్నారు.
  • ఈజిప్షియన్ మమ్మీలు ఉన్నత స్థాయి ప్రభు వర్గాలకు, ప్రముఖ వ్యక్తులకు చెందినవిగా కనిపిస్తాయి. వాటి వలన ఆ నాటి ఉన్నత స్థాయి, ప్రభు వర్గాలకు చెందిన విశేషాలు, వస్తు సంస్కృతీ మనకు తెలుస్తాయి. దీనికి విరుద్ధంగా తారిమ్ మమ్మీలు సాధారణ ప్రజలకు చెందినవి. అందువలన ఇవి సాధారణ ప్రజల విశేషాలు, వస్తు సంస్కృతులను తెలియచేస్తాయి.
  • ఈజిప్షియన్ మమ్మీలు కృత్తిమంగా పదిలపరచబడిన మమ్మీలు. తారిమ్ మమ్మీలు ఎడారి వేడిమికి ఎండిపోయి, ప్రకృతి సహజ సిద్ధంగా ఎడారి వాతావరణంలో భద్రంగా పదిలపరచబడిన మమ్మీలు. కృత్తిమ లేపనాలు, రసాయనాలుతో పూయబడి కట్టుదిట్టమైన వాతావరణంలో భద్రపరిచిన ఈజిప్షియన్ మమ్మీలతో పోలిస్తే వాటికన్నా ఏ విధమైన లేపనాలకు పూయబడకుండా, ప్రకృతి సహజసిద్ధంగా ఏర్పడిన తారిమ్ మమ్మీలే అత్యుత్తమంగా పదిలపరచబడిన మమ్మీలని (Perfectly preserved mummies) పురావస్తు నిపుణులు పేర్కొన్నారు.

తారిమ్ మమ్మీలకు చెందిన ప్రజల మూల నివాస స్థానంసవరించు

తారిమ్ మమ్మీ ప్రజలు పశ్చిమ యురేషియా మూల ప్రాంతాలనుంచి వలస వచ్చిన ఆదిమ ఇండో-యూరోపియన్ తెగలకు చెందినవారు. వీరు మూల స్థానం నుండి మధ్య ఆసియాకు, తారిమ్ బేసిన్ ప్రాంతానికి ఎలా వలసకు వచ్చారు అనే విషయాన్ని వివరిస్తూ అనేక మంది అనేక ప్రతిపాదనలు చేసారు.

కుర్గాన్ ప్రతిపాదనసవరించు

 
pontic steppe లేదా యూరేషియన్ గ్రేట్ స్టెప్పీ ప్రాంతం
 
కుర్గాన్ ప్రతిపాదన ప్రకారం క్రీ.పూ. 4000 నుండి క్రీ.పూ. 1000 మధ్య కాలంలో యూరేషియన్ స్టెప్పీ ప్రాంతం (మజెంతా రంగు వున్న ప్రాంతం) నుండి ఆదిమ ఇండో-యూరోపియన్ ప్రజల వలసలు వివిధ దిశలలో జరిగిన తీరు
 
అఫానసేవో సంస్కృతి, ఆండ్రనోవో సంస్కృతులచే ప్రభావితమైన ప్రాంతాలు

ఆదిమ ఇండో-యూరోపియన్ ప్రజల మూల నివాస స్థానాన్ని గుర్తించడానికి, వారి తదనంతర వలసల తీరును వివరించే అనేకానేక ప్రతిపాదనలలో నేడు ఎక్కువగా అంగీకారయోగ్యమైనది కుర్గాన్ ప్రతిపాదన. ఈ ప్రతిపాదన ప్రకారం సుమారుగా క్రీ.పూ. 4000 నుండి క్రీ.పూ. 1000 మధ్య కాలంలో నల్ల సముద్రం-కాస్పియన్ సముద్రం మధ్యన గల pontic steppe లేదా యూరేషియన్ గ్రేట్ స్టెప్పీ ప్రాంతాల నుండి సంచార జాతి పశుకాపరులైన (Nomadic pastoralists) ఆదిమ ఇండో-యూరోపియన్ ప్రజలు అనేక శాఖలుగా, అనేక దిశలలో వలస వెళ్ళారు.

మధ్య ఆసియా ప్రాంతానికి సంబంధించినంత వరకూ వీరి వలసలు రెండు అలల మాదిరి జరిగి, తత్ఫలితంగా వలసలు జరిగిన ప్రాంతాలలో ప్రధానంగా రెండు సంస్కృతులు ఏర్పడ్డాయి. అవి 1. అఫానసేవో సంస్కృతి ( Afanasevo culture) 2. ఆండ్రనోవో సంస్కృతి (Andronovo culture)

ఆ విధంగా స్టెప్పీ ప్రాంతాలనుండి బయలుదేరిన ఒక వలస శాఖ అయిన ఇండో-యూరోపియన్ ప్రజలు ఆసియా ఖండం వైపుగా ప్రయాణం సాగిస్తూ దక్షిణ సైబీరియా లోని మినుసినస్క్ (Minusinsk basin) కు, ఆల్తాయ్ పర్వత ప్రాంతాలకు వలస వచ్చి అఫానసేవో సంస్కృతిని (క్రీ.పూ. 3500 నుండి క్రీ. పూ. 2500 కాలంలో) ఏర్పరిచారు. తామ్ర లేదా కంచు యుగపు పురావస్తు నాగరికతకు చెందిన వీరు తోకేరియన్ భాష మాట్లాడేవారని భావించారు. వీరి తరువాత వీరి స్థానాన్ని భర్తీ చేస్తూ మరో అల మాదిరి వచ్చిన ఇండో-యూరోపియన్ ప్రజలు రెండు ప్రాంతాలలో రెండు సంస్కృతులు ఏర్పరిచారు.

సింతాష్టా సంస్కృతి (Sintashta culture) : తూర్పు యూరప్, మధ్య ఆసియా ప్రాంతాలలోకి వలస వచ్చిన శాఖ (క్రీ.పూ. 2100 నుండి క్రీ.పూ. 1800 కాలంలో) సింతాష్టా సంస్కృతిని ఏర్పరిచారు. వీరు కంచు యుగపు పురావస్తు నాగరికతకు చెందినవారు. అయితే వీరికంటే కాస్త నిదానంగా తరువాతి కాలంలో వచ్చిన వలస వచ్చిన ప్రజలు సింతాష్టా సంస్కృతి కంటే చాలా విస్తృతిగా ఆండ్రనోవో సంస్కృతిని ఏర్పరిచారు.

ఆండ్రనోవో సంస్కృతి (Andronovo culture) : పశ్చిమ సైబీరియాకు, కజకస్తాన్ ప్రాంతాలకు వలస వెళ్ళిన ఇండో-యూరోపియన్ శాఖ ప్రజలచే ఆండ్రనోవో సంస్కృతి (క్రీ.పూ. 1800 నుండి క్రీ. పూ. 900 కాలంలో) విలసిల్లింది. వీరు కూడా కంచు యుగపు పురావస్తు నాగరికతకు చెందినవారు. ఈ ఆండ్రనోవో సంస్కృతిని కొన్ని స్థానిక సంస్కృతుల సమ్మేళనంగా భావిస్తారు. ఆండ్రనోవో సంస్కృతికి చెందిన ఒకానొక స్థానిక సంస్కృతి ఇండో-ఇరానియన్ శాఖ సంస్కృతి. ఈ ఇండో-ఇరానియన్ శాఖ ప్రజలు మరింత దక్షిణానికి వలస వెళ్లి ఇరానియన్ ప్రజలుగా మారారు. మరొక శాఖ ఇండో-ఆర్యన్ శాఖ ప్రజలు భారత దేశానికి వలసలు వచ్చి ఇండో-ఆర్యులుగా మారారు.

తారిమ్ మమ్మీలకు చెందిన ప్రజలు జన్యుపరంగా అఫానసేవో సంస్కృతి ప్రజల కన్నా, ఆండ్రనోవో సంస్కృతి ప్రజలకు సన్నిహితంగా ఉన్నారు.

ఎలిజబెత్ వేలాండ్ బార్బర్ ప్రతిపాదనసవరించు

పురావస్తు పరిశోధకురాలు, చరిత్ర పూర్వయుగపు వస్త్ర నిపుణులు అయిన ఎలిజబెత్ వేలాండ్ బార్బర్ (Elizabeth Wayland Barber) ప్రకారం మధ్య ఆసియా దక్షిణాసియా, యూరప్ ప్రాంతాలలో విలసిల్లిన చారిత్రిక పూర్వయుగపు నాగరికతా సమాజాలు ఆయా ప్రాంతాలలో స్వతంత్రంగా అంకురించినవి కావు. చారిత్రిక పూర్వయుగంలో వేలాది సంవత్సరాల క్రితం పశ్చిమ యురేసియా లేదా పశ్చిమ మధ్య ఆసియా స్టెప్పీ ప్రాంతాలనుండి సంచార జాతి ప్రజలు (ఇండో-యూరోపియన్ ప్రజలు) అనేక శాఖలుగా అనేక దిశలలో వలస వెళ్ళారు. ఇలా క్రీ.పూ. 4000 నుండి వివిధ దిశలలో, వివిధ ప్రాంతాలలో భౌగోళిక సరిహద్దులను అధిగమిస్తూ వేలాది మైళ్ళు ప్రయాణం చేస్తూ వలస వెళ్ళిన వీరు, యూరప్, ఆసియాలలో చారిత్రిక పూర్వ యుగంలో విలసిల్లిన నాగరికతా సమాజాలకు (prehistoric civilizations of Europe and Asia) పూర్వికులుగా నిలిచారు.

ఆ విధంగా బయలుదేరిన ఒక వలస శాఖ అయిన ఇండో-యూరోపియన్ ప్రజలు పశ్చిమ యురేసియా లేదా పశ్చిమ ఆసియా స్టెప్పీ ప్రాంతాలనుండి బయలు దేరి క్రీ.పూ. 1, 2 సహస్రాబ్దాలలో తారిం బేసిన్ ప్రాంతానికి చేరుకొన్నారు. ఒయాసిస్ ప్రాంతాలలో స్థిరపడిన వీరు ఎడారి అంతటా చెల్లా చెదురుగా ఆవాసాలు ఏర్పాటు చేసుకొన్నారు. తుదకు వారు తారిం బేసిన్ నుండి బయటకు నెట్టివేయబడి ప్రసుత ఆఫ్ఘనిస్తాన్, తరువాత ఉత్తర భారత్ లలో ప్రవేశించారు. క్రమేణా బౌద్ధులుగా మారిన వీరు క్రీ.పూ. 3 వ శతాబ్దానికి (గ్రీకు చక్రవర్తి అలెగ్జాండర్ దండయాత్ర అనంతరం) గ్రీకు కళల చేత ప్రభావితమైనారు. తుదకు సిల్క్ రోడ్ ద్వారా తిరుగు ప్రయాణం సాగించి షిన్జాంగ్–ఉయ్ఘర్ (Xinjiang-Uyghur) ప్రాంతానికి చేరుకోవడం, ఆవిధంగా తమతో పాటు తారిమ్ బేసిన్ ప్రాంతాలకి బౌద్ధంను, గాంధార కళారీతిని (గ్రీకో-రోమన్ కళను) పరిచయం చేసివుండవచ్చు.

భాషసవరించు

ఈ తారిమ్ మమ్మీ ప్రజలు మాట్లాడే భాష గురించి తెలియదు. పెన్సిల్వేనియా యూనివర్సిటీ ప్రొఫెసర్, తారిం బేసిన్ ప్రాంతానికి సంబంధించిన చారిత్రిక పూర్వ నిపుణుడు అయిన విక్టర్ మెయిర్ (Victor H. Mair) ప్రకారం వీరి భాష తోకేరియన్ (Tokharian) భాష కావచ్చు. ఇది ప్రాచీన ఇండో-యూరోపియన్ భాషా కుటుంబానికి చెందిన ఒక ఉపశాఖ. క్రీ. శ. 500 నుంచి 900 వరకూ మధ్య గల కాలంలో తారిం బేసిన్ ప్రాంతంలోని ప్రజల వ్యవహారిక భాషగా వున్న తోకేరియన్ భాష ప్రస్తుతానికి అంతరించిపోయింది. తోకేరియన్ భాషలోని రాతప్రతులు (Manuscripts) తారిం బేసిన్ లో లభించాయి. అయితే తూర్పు ప్రాంతంలో మనుగడ సాధించినప్పటికి తోకేరియన్ భాషకు, ఇండో-ఇరానియన్ కు చెందిన 'Satum' భాషా కుటుంబంతో కన్నా యూరప్ కు చెందిన ‘Centum’ భాషా కుటుంబంతోనేకి సన్నిహిత సంబంధం కలిగివుంది. అసలు తారిం బేసిన్ లో తోకేరియన్ ప్రజల ఉనికికి సంబంధించి లభ్యమైన ప్రాథమిక ఆధారాల కన్నా రెండు వేల సంవత్సరాలకు పూర్వమే తారిం మమ్మీ ప్రజలు నివసించారు. అయితే విక్టర్ మెయిర్ ప్రకారం తారిం మమ్మీలకు చెందిన ప్రజల సంస్కృతిలో అవిచ్ఛన్నత స్పష్టంగా కనిపిస్తుంది. ఆ ప్రజల ఆచారాలు వారి తదనంతరం క్రీ.శ.లో కొన్ని శతాబ్దాల వరకూ కూడా అవిచ్ఛన్నంగా కొనసాగుతూ వచ్చాయి.

మమ్మీలపై జన్యు పరిశోధనలుసవరించు

ఈ పురాతన మమ్మీలు కాకసాయిడ్ జాతికి చెందిన ప్రజలుగా గుర్తించారు. తారిమ్ మమ్మీల పై విదేశీయులు చేసిన DNA జన్యు పరిశోధనల తొలి ఫలితాలు ప్రాథమికంగా వీరు యూరప్ నుండి వలస వచ్చిన వారిగానే తేల్చాయి. మమ్మీల పుర్రెలపై చేసిన చైనీయ అధ్యయనాలు కూడా ఈ ప్రాంతంలో తొలి నివాసీయులు ఆసియా ప్రజలు కాదనే తేల్చాయి.

అయితే 2007 లో జరిపిన ఆధునిక జన్యు విశ్లేషణలు ఈ తారిమ్ మమ్మీ ప్రజలు పశ్చిమ యురేషియాతో పాటు తూర్పు ఆసియా, దక్షిణ ఆసియా మూలాలను కూడా కలిగి వున్నారని తేల్చాయి. అంటే తారిమ్ మమ్మీలకు చెందిన ప్రజలు పశ్చిమ, తూర్పు ప్రాంతాల ఉప మిశ్రమానికి చెందినవారిగా నిర్ధారించాయి. ముఖ్యంగా తండ్రి వైపు చూస్తే ప్రత్యేకంగా పశ్చిమ యురేషియా ప్రాంతం నుండి వచ్చిన వంశీయులకు చెందినవారిగా, తల్లి వైపు నుంచి చూస్తే పశ్చిమ యురేషియా, తూర్పు యురేషియా ప్రాంతం నుండి వచ్చిన మిశ్రమ వంశీయులకు చెందినవారిగా వెల్లడించాయి.

చాంగ్ షున్ లోని జిలాన్ యూనివర్సిటీకు చెందిన హుయ్ జో (Hui Zhou) ఆధ్వర్యంలో ఒక నిపుణుల బృందం ఈ తారిమ్ మమ్మీలపై విస్తృతంగా ఆధునిక జన్యు పరిశోధనలు చేపట్టింది. ప్రాచీన Y క్రోమోజోము వారసత్వం ప్రకారం చూస్తే తూర్పు యూరప్, మధ్య ఆసియా, సైబీరియా ప్రాంతాల ప్రజలలో ముఖ్యంగా కనిపిస్తుంది. ఇది చైనీయ ప్రజలలో అరుదుగా కనిపిస్తున్నది. స్త్రీలకు అను వంశికంగా సంక్రమించే మైటోఖండ్రియా DNA ప్రకారం చూస్తే సైబీరియా, యూరప్ ప్రాంతాల ప్రజలలో పొసుగుతుంది. మమ్మీల ప్రాచీన Y క్రోమోజోము, మైటోఖండ్రియా DNA జన్యు అనువంశికత పై చేసిన పరిశోధనలు ఫలితంగా హుయ్ జో బృందం పశ్చిమ యురేషియా ప్రజలు తారిం బేసిన్ కు వలసలు రావడానికి ముందే (క్రీ. పూ. 4000 సంవత్సరాలకు పూర్వమే) సైబీరియన్ ప్రజలతో అంతర్గత వివాహాలు జరిగి వుండవచ్చని నిర్ధారణకు వచ్చింది.

తారిమ్ మమ్మీలకు చెందిన ప్రజల సంస్కృతిసవరించు

ఈ మమ్మీలు కకేసియన్ జాతికి చెందిన ఆదిమ ఇండో-యూరోపియన్ ప్రజలకు చెందినవి. సుమారుగా 4000 సంవత్సరాల క్రితం తారిం బేసిన్ ప్రాంతంలో నివసించిన ఈ ప్రాచీన ఇండో-యూరోపియన్ ప్రజలు తొలి కంచుయుగపు కాలానికి చెందినవారుగా పేర్కొనవచ్చు. ఇండో యూరోపియన్ కు చెందిన వీరు కాకసాయిడ్ జాతి లక్షణాలైన రాగిరంగు లేదా గోధుమ రంగు జుత్తు, పొడుగాటి ముక్కు, స్పష్టంగా కనిపించే యూరోపియన్ ముఖకవళికలతో ఉన్నారు.

వీరు చారిత్రిక పూర్వయుగంలో పశ్చిమ యురేషియా మూల ప్రాంతాలనుంచి లేదా పశ్చిమ మధ్య ఆసియా స్టెప్పీ ప్రాంతాలనుండి వలస వచ్చిన ప్రాచీన ఇండో-యూరోపియన్ తెగ ప్రజలకు చెందినవారు. ఈ తెగ ప్రజలలో ఒక శాఖ 4000 సంవత్సరాల క్రితం సంచార పశుపాలకులుగా పశ్చిమ యురేషియా ప్రాంతం నుండి తారి బేసిన్ ప్రాంతానికి వలస వెళ్ళారు. అయితే తారిం బేసిన్ ప్రాంతంలో వీరు సంచార జీవితాన్ని వదిలిపెట్టి స్థిరజీవనాధారం కొనసాగించారని తెలుస్తుంది. ఒయాసిస్ లను ఆధారం చేసుకొని వీరు ఒకవైపు బార్లి, జొన్నలు, గోధుమలు సాగు చేస్తూ మరోవైపు గొర్రెల పెంపకం (Sheep farming), మేకల పెంపకం చేసేవారు. జున్ను తయారీ విధానం వీరికి తెలుసు. కుక్క, గుర్రం వీరికి తెలిసినట్లు సాక్ష్యాలు ఉన్నాయి. ఔషద మొక్కల సేకరించడం కూడా వారికి తెలుసు. Qäwrighul శ్మశానంలో మమ్మీలతో పాటు దొరికిన సామాగ్రిని పరిశీలిస్తే వారికి ఎఫెడ్రా (Ephedra) వంటి ఔషద మొక్కలను సేకరించడం తెలుసుననన్న విషయం అర్ధమవుతుంది. ప్రజలలో పచ్చబొట్టు (tattoos) వినియోగం వ్యాప్తిలో ఉంది. చేతులమీద, ముఖం మీద చిత్రమైన డిజైన్లలో వీరు చిత్రించుకొన్న పచ్చబొట్లు ఇప్పటికి చెక్కు చెదరకుండా ఈ మమ్మీల దేహంపై స్పష్టంగా కనిపిస్తున్నాయి. స్త్రీల శిరోజాలంకరణ పోనీ టైల్ లతోను, డిజైన్లు చిత్రించిన జడల అల్లికలతోను వుండేది. మూడు పాయలతో జడను అల్లడం ఆనాటికే కనిపిస్తుంది. జుత్తు రంగు వేలాది సంవత్సరాలైనప్పటికి చెక్కు చెదరకుండా వుండడం విశేషం.

వస్తు సంస్కృతిసవరించు

 
లోప్ నర్ ప్రాంతంలో లభించిన క్రీ.పూ.2000 - క్రీ.పూ.1000 నాటి యూరోపాయిడ్ తొడుగు

మమ్మీలతో పాటు శవపేటికలలో సాదారణ ప్రజలకు సంబంధించిన అనేక రకాలైన సామాగ్రి అందంగా నేయబడ్డ ధాన్యం బుట్టలు, తొడుగులు (Masks), వన మూలికలు, కంచు సామాగ్రి, నగలు, ఉన్ని వస్త్రాలు, దువ్వెనలు, విసనకర్రలు, ధాన్యాలు, బెబీ సీసా (Baby Bottle) మొదలైనవి దొరికాయి.

వీరి పడవ ఆకారపు సమాధుల ఆచారం వైకింగు (Vikings) ప్రజలలో సాధారణంగా కనిపిస్తుంది. వీరి శవపేటికల మీదుగా 13 అడిగుల పైబడి చెక్క స్తంభాలు (wooden poles) ఇసుక దిబ్బలలో నిలబెట్టబడి ఉన్నాయి. సమాధి చిహ్నాలుగా కనిపిస్తున్న ఈ పొడుగాటి చెక్క స్థంబాలను లింగ చిహ్నాలుగా ఆర్కియాలజిస్టులు నిర్ధారణకు వచ్చారు. స్త్రీ మమ్మీలు తాళ్ళపోగులతోతో నేసిన లోదుస్తులు (String undergarments) తో, పురుషులు నడుమును కవర్ చేస్తున్న ఉన్ని వస్త్రాలుతో (loin cloths) పాతిపెట్టబడి వుండడం కనిపిస్తున్నది. ఈ విధమైనలో దుస్తులతో, లింగ చిహ్నాలతో సమాధి చేయడం అనేది ఉత్తర యూరప్ కు చెందిన కంచు యుగపు ప్రజలలో కూడా కనిపిస్తుంది.

తారిమ్ మమ్మీలకు చెందిన ఇండో-యూరోపియన్ ప్రజలు ప్రధానంగా ట్యునిక్స్, పాంట్స్, బూట్లు, సాక్స్, టోపీలు ధరించేవారు. తలచుట్టూ ఉన్ని క్యాప్ ను, కాళ్ళకు తోలు బూట్లను ధరించడం సాధారణంగా కనిపిస్తుంది. వీరి టోపీలకు తాళ్ళు, ఈకలు కలిగివుండడం సాధారణ అంశం. వీరి ధరించిన పెద్ద ఉన్ని క్యాప్ లు తాడులతో చుట్టబడి, అంచులలో ఈకలతో వుండి టైలోరియన్ టోపీ (tylorean cap) లను స్ఫురణకు తెస్తాయి.

సాధారణంగా తారిమ్ మమ్మీల ప్రజలు ముదురు రంగులుతో వున్న ఉన్ని వస్త్రాలను ధరించేవారు. వీరి ధరించిన వస్త్రపు పోగుల అల్లికలో కనిపిస్తున్న నేత పరిజ్ఞానం చాలా విశిష్టమైనది. క్రీ. పూ. 2 వ సహస్రాబ్దిలో మనుగడ సాగించిన వీరి వస్త్రాల నేత అల్లికను పరిశీలిస్తే ఆ విధమైన నేత పరిజ్ఞానం అదే కాలంలో ఆస్ట్రియా లోని ఉప్పు గనుల ప్రాంతాలలోని హాల్ స్టాట్ సంస్కృతి (Hallstatt culture) కి చెందిన ప్రజలకు, స్కాటిష్ తదితర ప్రజలకు తెలిసిన నేత పరిజ్ఞానంతో అనేక రీతులలో సారూప్యతను కలిగివుంది అని నిపుణులు తెలియచేసారు. ప్రాచీన వస్త్ర నిపుణుల ప్రకారం వీరి వస్త్రాల అల్లిక డిజైన్ లో విశిష్టంగా కనిపించే ‘Diagnol Twill‘ నేత పరిజ్ఞానం వీరు మగ్గాన్ని వుపయోగించి ఉంటారని సూచిస్తుంది. క్రీ. పూ. 2 వ సహస్రాబ్దిలోనే యురేషియా ప్రజలకు తెలిసిన ఈ రకమైన వస్త్ర అల్లిక నమూనా టెక్నిక్ తారిమ్ బేసిన్ లాంటి సదూర మధ్య ఆసియా ప్రాంతంలో కూడా కనిపించడం విశేషం. అయితే ఒకే ఇండో-యూరోపియన్ కుటుంబానికి చెందిన ప్రజలైనప్పటికి అటు యూరప్ లోని స్కాటిష్ ప్రజలకు, ఇటు తారిం బేసిన్ ప్రజలకు ఈ అల్లిక నైపుణ్య పరిజ్ఞానం విడివిడిగానే సంక్రమించి ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ చైనా ప్రజలకు కూడా తెలియని విశిష్టమైన నేత అల్లిక టెక్నిక్ క్రీ. పూ. 2000 ప్రాంతంలోనే తారిమ్ మమ్మీలకు చెందిన ప్రజలకు తెలియడం అనేది సామాన్య విషయం కాదు. అది ఆ కాలంలో మధ్య ఆసియాలో పురోగమించిన గొప్ప సాంకేతికాభివృద్ధికి చిహ్నంగా చెప్పవచ్చును.

వీరి సమాధులలో కంచు సామాగ్రి కూడా లభ్యమైంది. షిన్ జియాంగ్ (Xinjiang) ప్రాంతంలో కంచు యుగం క్రీ. పూ 2000 నుంచి క్రీ.పూ. 400 వరకు నెలకొంది. నిజానికి క్ర్రీ. పూ. 2వ సహస్రాబ్దంలో చైనా ప్రజలకు కూడా తెలియని కంచు వాడకం ఈ తారిమ్ ప్రజలకు తెలియడం మరో విశేషం. దీనిని బట్టి చైనా ప్రజలకు కంచు లోహ పరిజ్ఞానం మధ్య ఆసియా నుండి వలస వెళ్ళిన ఇండో-యూరోపియన్ ప్రజల నుంచే సంక్రమించి వుండడానికి అవకాశం ఉంది. ఆనాటి చైనీయులకు కూడా తెలియని చక్రం (wheel), కంచు వంటి లోహాలు, ఉన్నతమైన నేత పరిజ్ఞానంతో అల్లబడిన ఉన్ని వస్త్రాలు మొదలైనవి ఈ తారిం మమ్మీ సమాధుల వద్ద లభ్యం కావడాన్ని గమనిస్తే తారిం మమ్మీలకు చెందిన ప్రజలు పశ్చిమ యూరేసియా ప్రాంతం నుంచి వలస వచ్చిన వారని స్పష్టంగా సూచించడమే కాకుండా, వారు తమ సమకాలీన ప్రాచీన చైనా జాతి ప్రజలకంటే ఉన్నత స్థాయి సాంకేతికతకు అభివృద్ధి చెందారని తెలుస్తుంది.

రాజకీయ-సాంస్కృతిక వివాదంసవరించు

తారిమ్ మమ్మీలు బయటపడిన ప్రాంతం వాయువ్య చైనాలోని షిన్జాంగ్–ఉయ్ఘర్ (Xinjiang-Uyghur) అటానమస్ ప్రాంతానికి చెందినది. చైనా దేశంలో అంతర్భాగంగా వున్న ఈ ప్రాంతం కజకస్తాన్, కిర్గిస్తాన్, పాకిస్తాన్ దేశాలతో సరిహద్దును కలిగివుంది. ఈ ఉయ్ఘర్ ప్రాంతంలో నేడు కోటి మందికి పైగా టర్కిష్ భాష మాట్లాడే ముస్లింలు (ఉయ్ఘర్లు) నివసిస్తున్నారు. వీరి ముఖకవళికలు తూర్పు ఆసియన్ ప్రజల కన్నా విభిన్నంగా వుంటూ యూరోపియన్ ప్రజలకు కాస్త దగ్గరగా కనిపిస్తాయి. అయితే గత 60 సంవత్సరాల క్రితం చైనా నుంచి వచ్చిన హాన్ ప్రజలు ఈ ప్రాంతంలో సెటిలర్స్ గా స్థిరపడ్డారు. అంటే షిన్జాంగ్–ఉయ్ఘర్ అటానమస్ ప్రాంతంలో మెజారిటీ ప్రజలుగా వున్న ముస్లింలు, సంస్కృతి రీత్యా బీజింగ్ కన్నా ఇస్తాంబుల్ కే చేరువగా ఉన్నారు. అందువలన ప్రస్తుతం ఈ ఉయ్ఘర్లు కి, హాన్ సెటిలర్స్ కి మధ్య సంస్కృతి పరమైన వివాదాలు తలెత్తుతూ అవి జాతిపరమైన ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి.

చైనా దేశానికి సంబంధించినంతవరకూ ఈ ఉయ్ఘర్ ప్ర్రాంతం యొక్క ప్రాచీన చరిత్ర క్రీ.పూ. 2 వ శతాబ్దం నుండి మొదలవుతుంది. క్రీ.పూ. 2 వ శతాబ్దంలో హాన్ రాజ వంశం కాలంలో షిన్జాంగ్ (Xinjiang) పై సైనిక దండయాత్ర జరగడం, అప్పటినుంచి జనావాసరహితమైన షిన్జాంగ్ ప్రాంతం చైనా దేశంలో కలిసిపోయింది. అప్పటినుండి అనగా హాన్ రాజవంశం కాలం నుంచి చైనాకు షిన్జాంగ్–ఉయ్ఘర్ మీద చారిత్రిక హక్కు ఏర్పడింది. అంటే క్రీ.పూ. 2 వ శతాబ్దానికి ముందు వరకూ షిన్జాంగ్ ప్రాంతాన్ని కేవలం ఒక జనావాసరహిత ప్రాంతంగా చైనా చరిత్ర పేర్కొంటూ వచ్చింది. కాగా ఆ ప్రాంతంలో దొరికిన తారిమ్ మమ్మీలు వేలాది సంవత్సరాల చరిత్రను వెలికితీసాయి. అసలు హాన్ రాజ వంశం కాలానికి వేలాది సంవత్సరాలకు ముందుగానే ఉయ్ఘర్ ప్రాంతంలో ప్రజల ఉనికి ఉందని, అందులోను వారు సాంకేతికత అభివృద్ధిలో చైనా నదీ లోయ నాగరికతలను మించిపోయారని వెల్లడైంది. ముఖ్యంగా పశ్చిమం నుండి వచ్చిన, యూరోపేయన్ ముఖకవళికలతో కూడిన చైనేతర ప్రజల ఉనికి వుందని తేలడం చైనా ప్రభుత్వానికి సాంస్కృతిక పరంగా ఇబ్బందికరమైన పరిస్థితి కలిగించింది.

ఉయ్ఘర్ ప్రాంతంలో తారిమ్ మమ్మీలు వెలికితీత, వాటి జాతీయత చైనా దేశంలో రాజకీయంగా సాంస్కృతికంగా తీవ్ర చర్చలకు వివాదానికి దారితీసింది. కారణం ఈ ఉయ్ఘర్ ప్ర్రాంతం యొక్క తొలి మూల నివాసీయులు కాకసాయిడ్లు లేదా యూరోపియన్లు అని తెలియడమే. అంటే వీరికి ఆసియా మూలాలు లేకపోవడం మీడియాలోనూ, సాంస్కృతికంగా తీవ్ర చర్చలను రేకెత్తించింది. దీనికి తోడు తారిం మమ్మీల సమాధులలో లభ్యం అయిన వస్తు సంస్కృతీ పాశ్చాత్య యూరోపియన్ సంస్కృతిగా నిర్ధారించబడింది. ఇది నేటి చైనా దేశం పేర్కొనే ప్రాచీన చైనీయుల సంస్కృతికి పూర్తీ భిన్నంగా ఉంది. పైగా ఆ నాటి ప్రాచీన చైనా నదీ లోయ నాగరికతా ప్రజలకు కూడా తెలియని చక్రం (wheel), కంచు వంటి లోహాలు, ఉన్నితో అల్లిన వస్త్రాలు (woolen fabrics) ఈ తారిమ్ ప్రజలకు తెలిసాయి. దానితో ఉయ్ఘర్ వేర్పాటు జాతీయ ఉద్యమకారులకు ఈ ప్రాంతానికి మొట్ట మొదట వచ్చిన వారు పశ్చిమ యురేషియా నుంచి, మధ్య ఆసియా స్టెప్పీల నుండి వచ్చిన వారేనని, చైనా నదీ లోయల నుండి వచ్చిన వారు కాదని అవగతమైంది. దీనితో మొదటి నుంచి ఈ ప్రాంతం మీద చారిత్రికంగా తమకు గల హక్కు కోసం పోరాడే ఉయ్ఘర్ వేర్పాటు వాద జాతీయ ఉద్యమకారులకు ఈ తారిమ్ మమ్మీలు జాతీయ గౌరవచిహ్నాలుగా మారాయి. లౌలాన్ బ్యూటీ (Beauty of Loulan) వంటి మమ్మీలు ప్రముఖ వ్యక్తులుగా మారాయి. ఒకవిధంగా బయల్పడిన తారిం మమ్మీలు ఉయ్ఘర్ వేర్పాటు జాతీయ ఉద్యమకారులకు రాజకీయకంగా, సాంస్కృతిక ఊతం ఇచ్చాయి. చైనా ప్రభుత్వానికి చిక్కులు తెచ్చిపెట్టాయి.

చైనా ప్రభుత్వం కూడా తారిమ్ మమ్మీల వెలికితీత వల్ల, తమ ఎడారి భూభాగంలో చైనీయ జాతి ప్రజలు క్లెయిమ్ చేసుకొంటున్న సాంస్కృతిక వారసత్వపు హక్కుకు భంగం వాటిల్లుతుందని గమనించింది. ఫలితంగా విదేశీ ఆర్కియాలజిస్తులకు ఈ తారిమ్ మమ్మీలపై మరింత పరిశోధనలకు అవకాశం ఇస్తే, దాని మూలంగా ఈ ప్రాంతంలో చైనా ప్రాచీన సాంస్కృతిక వారసత్వం ఇంకా ఎంతమేరకు పశ్చిమ యూరప్ కు కోల్పోవవలసి వస్తున్నదనే ఆందోళన చైనాలో నెలకొంది. దానితో చైనా ప్రభుత్వం ఈ మమ్మీలమీద జన్యు పరీక్షలు జరపడానికి విదేశీ శాస్రవేత్తలను అనుమతించే విషయంలో చాలా కాలం అనాసక్తిని చూపడమే కాక విదేశీయులకు ఇచ్చిన పరిశోధనా అనుమతులను సైతం పక్కకు పెట్టింది. సొంతంగా చైనీయ శాస్రవేత్తలచే జన్యు పరిశోధనలు చేయించింది.

అయితే ఉయ్ఘర్లు క్రీ.శ. 9, 10 శతాబ్దాలకు ముందు ఈ ప్రాంతంలో కనిపించే అవకాశం లేదని చరిత్రకారులు ఉదహరిస్తారు. టర్కీ భాష మాట్లాడే ఉయ్ఘర్లు క్రీ.శ. 842 లో ఓర్కన్ ఉయ్ఘర్ రాజ్య పతనానంతరం మంగోలియా నుండి తారిం బేసిన్ కు వచ్చి అప్పటివరకూ తారిం బేసిన్ ప్రాంతంలో వ్యాప్తిలో నున్న తోకేరియన్ భాషకు, వారి సంస్కృతికి ముగింపు పలికారు. అంటే ఈ తారిమ్ బేసిన్ గల షిన్జాంగ్–ఉయ్ఘర్ ప్రాంతమలో క్రీ. శ. 9 వ శతాబ్దం వరకూ అడుగు పెట్టని ఉయ్ఘర్లు మాత్రం ఈ ప్రాంతంపై తమకు ఎప్పటినుంచో హక్కు వుందని పేర్కొంటూ దానికి సాక్ష్యంగా బయల్పడిన తారిమ్ మమ్మీలను ఉదహరిస్తున్నారు. దానితో షాంగై (చైనా) లోని ఫూడాన్ యునివర్సిటికి చెందిన ప్రముఖ చైనీయ జన్యు పరిశోధకులు లీజిన్ (Li Jin) తారిమ్ బేసిన్ లో బయల్పడిన లౌలాన్ బ్యూటీ వంటి కొన్ని మమ్మీల మీద మరింత క్షుణంగా DNA జన్యు పరిశోధనలు జరిపి చివరకు 2007 లో ఈ తారిమ్ మమ్మీల యొక్క మూలాలు పశ్చిమ యురేషియాతో పాటు తూర్పు ఆసియా, దక్షిణ ఆసియా మూలాలను కూడా కలిగి వున్నాయని తేల్చారు.

ప్రముఖ తారిమ్ మమ్మీలుసవరించు

నేటికి తారిం బేసిన్ లో భద్రంగా పదిలపరచబడిన స్థితిలో గల మమ్మీలు 500 కు పైగా వెలికితీయబడ్డాయి. వీటిలో కొన్ని ప్రసిద్ధమైనవి. 1955 లో లోప్ నర్ ఉప్పు నీటి సరస్సు సమీపంలో ఇంగ్ పాన్ వద్ద 2000 సంవత్సరాల పూర్వం నాటి ఇంగ్ పాన్ మానవుని మమ్మీ లభ్యమైంది. 1978 సంవత్సరంలో చెర్చన్ వద్ద 3000 సంవత్సరాల పూర్వం నాటి చెర్చన్ మానవుని మమ్మీ దొరికింది. 1980 లో ప్రాచీన లౌలాన్ (Loulan) శిథిల నగర సమీపంలో 3800 సంవత్సరాల పూర్వం నాటి భద్రపరచబడిన శ్రీ మమ్మీ (లౌలాన్ బ్యూటీ) దొరికింది. 2003 లో షియౌహ్ (Xiaohe) వద్ద గల సమాధులలో 3600 సంవత్సరాల పూర్వం నాటి భద్రపరచబడిన శ్రీ మమ్మీ (షియౌహ్ బ్యూటీ) లభించింది. అదే 2003 వ సంవత్సరం లోనే యాంగై సమీపంలో 2800 సంవత్సరాల పూర్వం నాటి మమ్మీ (యాంగై షామాన్) దొరికింది.

లౌలాన్ బ్యూటీ (Beauty of Loulan)సవరించు

తక్లామకాన్ ఎడారి తూర్పు భాగంలో గల ప్రాచీన ఎడారి నగరం లౌలన్ శిథిలాల సమీపంలో అనగా లోప్ నర్ ఉప్పు నీటి సరస్సుకి ఉత్తరంలో గల Tiebanhe నదీ స్మశానంలో 1980 లో ఈ మమ్మీని వెలికితీసారు. 3800 సంవత్సరాల నాటి (క్రీ. పూ. 1800) పురాతనమైన ఈ మమ్మీ, తారిం బేసిన్ లో లభించిన మమ్మీలలో అత్యంత పురాతనమైన వాటిలో ఒకటి. ప్రముఖమైనది. ఈమె యూదు మతానికి చెందిన ప్రవక్త ‘అబ్రహం’ జీవించిన కాలంలో వుండేది. చనిపోయేనాటికి ఈమె వయస్సు 40-45 మధ్య సంవత్సరాలుగా ఉండవచ్చని భావించారు. ఎత్తు 152 సెం. మీ., బరువు 10.1 కేజీలు. ఆకర్షణీయమైన ముఖ లక్షణాలను బట్టి ఈమెను లౌలాన్ బ్యూటీ (Beauty of Loulan) లేదా క్రోరాన్ బ్యూటీ (Beauty of Kroran) గా వ్యవహరించారు. ఈమె చనిపోయి 3800 సంవత్సరాల కాలం గడిచినప్పటికీ ఇంకా చెక్కు చెదరకుండా అత్యంత పదిలపరచబడిన స్థితిలో లభించింది. ఉన్ని దుస్తులు ధరించిన ఈమె ఛాతీపై ధాన్యాన్ని తూర్పారబెట్టే చేట, గోధుమ గింజలు ఉన్నాయి. ఆమె తల వెనుక ఒక అందమైన అల్లిక బుట్ట (Basket) ఉంది. ఆ బుట్ట గోధుమలు (wheat) తో నిండి ఉంది. కాకేసియన్ జాతి లక్షణాలైన ఎర్రని రాగిరంగు జుత్తు, పొడుగాటి ముక్కు, స్పష్టంగా కనిపించే ఇండో-యూరోపియన్ ముఖకవళికలతో వున్న ఈమె చైనీయురాలు కాదని స్పష్టంగా తేలింది. అయితే ఆమె జీవిత ప్రస్థానం చైనా భూభాగంలో ఎలా ముగిసింది అన్న విషయంపై అనేక ప్రశ్నలు రేకెత్తాయి. ఈమె నిజ జీవితంలో ఎలా కనిపించి ఉండేదో ఆ విధంగా ఫోటోని పునర్నిర్మించారు.

కమేణా చైనా లోని ఉయ్ఘర్ ప్రాంతంలో చైనీయ ముఖలక్షణాలు ఏమాత్రం లేని అనేక వందల మమ్మీలు ఒకదాని తరువాత మరొకటిగా దొరికాయి. దానితో ఈ ఉయ్ఘర్ ప్ర్రాంతం యొక్క తొలి మూల నివాసీయులు చైనీయులు కాదని ప్రపంచానికి వెల్లడైంది. అసలు సిసలు తొలి మూల నివాసీయులు కాకసాయిడ్లు లేదా యూరోపియన్లు అని తెలిసింది. ఇది సాంస్కృతికంగా తీవ్ర చర్చలను రేకెత్తించింది. దానితో చైనా నుండి సాంస్కృతికంగా దూరమవుతున్న నేటి ఉయ్ఘర్ వేర్పాటు జాతీయ ఉద్యమకారులకు ఈ లౌలాన్ బ్యూటీ (Loulan Beauty) ఒక ప్రముఖ సాంస్కృతిక చిహ్నంగా మారింది. ప్రస్తుతం ఈ మమ్మీ షిన్జాంగ్ రాజధాని ఉరుంచి లోని షిన్జాంగ్ ప్రాంతీయ మ్యూజియం (Xinjiang Regional Museum) లో ఉంచబడింది.

షియౌహ్ బ్యూటీ (Beauty of Xiaohe)సవరించు

 
తారిమ్ బేసిన్ లో లభ్యం అయిన 3800 సంవత్సరాల నాటి యువతి మమ్మీ" The beauty of Xiaohu "

తారిమ్ బేసిన్ కు తూర్పున గల లోప్ నర్ ఉప్పు నీటి సరస్సుకు సమీపంలో ప్రాచీన లౌలాన్ (Loulan) శిథిల నగరం ఉంది. ఈ లౌలాన్ నగరానికి 175 కి. మీ. దూరంలో గల ఒక చిన్న నదీ సమీపాన షియౌహ్ సమాధుల ప్రాంగణం (Xiaohe Tomb Complex) ఉంది. 2003 సంవత్సరంలో ఇక్కడ బోర్లించిన చెక్క పడవ ఆకారంలోగల ఒక శవపేటిక నుండి 3600 సంవత్సరాల నాటి పురాతన స్త్రీ మమ్మీని వెలికితీశారు. చనిపోయేనాటికి ఈమెకు 30 సంవత్సరాల వయస్సు ఉండవచ్చు. క్రీ. పూ. 1500-1800 సంవత్సరాల ప్రాంతంలో జీవించిన ఈ యువతి ఆకర్షణీయమైన ముఖ లక్షణాలను బట్టి షియౌహ్ బ్యూటీ (Beauty of Xiaohe) గా వ్యవహరించారు.

ఈమె చర్మం, జుట్టు, చివరకు కనురెప్ప వెంట్రుకలు సైతం చెక్కు చెదరకుండా అత్యంత భద్రంగా పదిలపరచబడ్డాయి. ఈమె ఉన్ని వస్త్రాలను, తలచుట్టూ ఉన్ని టోపీని, తోలు బూట్లను సైతం ధరించి ఉంది. సాధారణ స్త్రీ లకన్నా భిన్నంగా ఈమె ధరించిన ఉన్ని టోపీ బట్టి, ఈకలను బట్టి ఈమె స్థాయి కాస్త ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉండవచ్చు. నాయకురాలు గాని, పూజారిణి గాని అయి వుండవచ్చునని భావించారు. తాళ్ళపోగులతోతో నేసిన లోదుస్తులు (String undergarments) తో, ఈమె పాతిపెట్టబడి వుండడం కనిపిస్తున్నది

ఈ శవపేటికలో ఈమెతో పాటు వన మూలికలు వున్న చిన్న చిన్న సంచులు కూడా దొరికాయి. షియౌహ్ బ్యూటీగా వ్యవహరిచిన ఈ మమ్మీ మెడ వద్ద, రొమ్ముల వద్ద పూయబడిన పసుపురంగు జున్ను (Cheese) ముద్ద జాడలు పదిలంగా దొరికాయి. ఈ పసుపురంగు సేంద్రియ పదార్ధాన్ని పరీక్షిస్తే అది క్రీ.పూ. 1615 నాటి జున్నుగా నిర్ధారించబడింది. ప్రాచీన నాగరికతా సమాజాలలో జున్ను తయారీ గురించిన అవగాహన క్రీ.పూ. 6000 నాటికే వుందని తెలిసినప్పటికీ, ఇప్పటివరకూ మనకు ప్రత్యక్షంగా లభ్యం అయిన అత్యంత ప్రాచీన జున్ను అవశేషాలు ఇవే.

ఇంగ్ పాన్ మానవుడు (Yingpan Man లేదా Yingpin Man)సవరించు

1955 సంవత్సరంలో Lopnur సరస్సు సమీపంలో ఇంగ్ పాన్ (Yingpan) శ్మశాన ప్రాంతంలో ‘M15’ సమాధిలో వెలికితీయబడిన ఈ మమ్మీని “ఇంగ్ పాన్ మానవుడు”గా వ్యవహరించారు. 2000 సంవత్సరాల నాటి పురాతనమైన ఈ మమ్మీతో పాటు సమాధిలో ఆశ్చర్యం గొలిపే అనేక కళాఖండాలు లభించాయి.

లభించిన తారిం మమ్మీలన్నింటి లోను పొడుగైన వ్యక్తి ఇంగ్ పాన్ మానవుడే. ఇతను సుమారు 2 మీటర్ల (6 అడుగుల 6 అంగుళాలు) పొడవుతో ఉన్నాడు. చనిపోయే నాటికి ఇతనికి 55 సంవత్సరాల వయస్సు ఉండవచ్చు. కాకసాయిడ్ జాతికి చెందిన ఇంగ్ పాన్ మానవుడు యూరోపియన్ వ్యక్తివలె కనిపిస్తాడు. ఇతనిని తొకేరియన్ ప్రజలకు చెందినవానిగా భావిస్తున్నారు. ఇతని గోధుమరంగు జుట్టు పైభాగం ముడి వేయబడి వుంది. అతని మెడకి ఒక తలగడ దిండు సిల్క్ పట్టీలతో తగిలించబడివుంది. ఇంగ్ పాన్ మానవుడు బాగా సంపన్న తరగతి లేదా ఉన్నత తరగతికి చెందినవాడు అయి ఉండవచ్చు.

పురావస్తు శాస్రవేత్తలను అమితంగా ఆకర్షించిన అంశాలు ఇతను ధరించిన “తొడుగు” (death mask), వస్త్ర డిజైన్లు.

ఇంగ్ పాన్ మానవుడు జనపనారతో చేసిన తెల్లని తొడుగు (death mask) ధరించాడు. ఈ తొడుగు నుదురు భాగంపై బంగారుపూత రేకు తాపడం చేసి ఉంది. ఇలా జుట్టు, గడ్డం వున్న ముఖాన్ని కనిపించకుండా మాస్క్ ధరించడం అనేది ప్రాచీన గ్రీకుకు చెందిన మైసీనియన్ (Mycenian) లేదా త్రేసియన్ (Thracian) సాంప్రదాయంగా కనిపిస్తుంది.

ముఖ్యంగా ఇతని వస్త్ర ధారణ, ఆభరణాలు చాలా అద్భుతంగా, అసాధారణంగా ఉన్నాయి. ఇతను ముదురు ఎరుపు, మెరూన్ రంగు గల వస్త్రాలను ధరించాడు. తివాసీ నేత వలె కనిపిస్తున్న ఈ వస్త్రాలకి బంగారు రంగు ఎంబ్రాయిడరీ ఉంది. ఇతని ధరించిన పైభాగపు వస్త్రం మెడ భాగంలో కాలరును కలిగివుండి, మోకాలి పొడుగునా ఉంది. ఈ వస్త్రాలపై పశ్చిమ యూరోపియన్ డిజైన్లు కనిపించడమే కాకుండా ముదురు ఎరుపు రంగు నేపథ్యంలో నగ్న దేవతా మూర్తులు, చెట్లు, ఇతర లేడి బొమ్మలు చిత్రించబడి ఉన్నాయి. అతని బొజ్జ పైన వేరొక దుస్తుల అదనపు సెట్ ఉంది. క్రీ.పూ. 1 వ శతాబ్దంలో జీవించిన ఇతని వస్త్రధారణ గ్రీకో-రోమన్ నాగరికతా లక్షణాలను పోలి వుండడం కనిపిస్తుంది.

చెర్చన్ మానవుడు (Cherchen Man)సవరించు

1985 లో కీమో పట్టణం సమీపంలో జఘున్లుక్ (Zaghunluq) స్మశానంలో చెర్చన్ మానవుని మమ్మీని వెలికితీశారు. ఈ చెర్చన్ యువకునితో పాటు మరో ముగ్గురు స్త్రీలు, ఒక శిశువు మమ్మీ కూడా అదే సమాధిలో లభించాయి. వీరిని చెర్చన్ మానవుని కుటుంబంగా భావిస్తున్నారు. 

ఈ చెర్చన్ మానవుని మమ్మీ క్రీ. పూ. 1000 నాటిది. 5 అడుగుల 5 అంగుళాల ఎత్తుగా వున్న ఈ చెర్చన్ మానవుడు కకేసియన్ జాతి లక్షణాలతో యూరోపియన్ వ్యక్తిలా కనిపిస్తాడు. DNA జన్యు పరీక్షలు కూడా చెర్చన్ మానవుడు, అతనితో పాటు వున్న మిగిలిన మమ్మీలు యూరోపియన్ సంతతికి చెందినవే అని ధ్రువీకరించాయి.

మెరుస్తున్న ఉన్నితో తయారుచేసిన బోర్డాక్స్ రంగు (Bordeaux colour) వస్త్రాలు, ప్యాంటు, సాక్స్ లు, బూట్లు ధరించాడు. ఈ మమ్మీతో పాటు వున్న కళాఖండాలు దుప్పట్లు (blankets), ఉన్ని బట్టలు, గోధుమలు, బేబీ సీసా సైతం సంపూర్ణంగా సంరక్షించబడి ఉన్నాయి. వీటిలో పరిశోధకులను ఎక్కువగా ఆకర్షించిన రెండు అంశాలు ఇతని వస్త్రాల నేతపని అల్లికలో కనిపిస్తున్న ప్లాడ్ నమూనా (plaid pattern). శిశువుకు పాలు పట్టేదిగా భావిస్తున్న బేబీ సీసా (Baby Bottle). ప్రస్తుతం ఈ చెచెన్ మానవుని కుటుంబానికి చెందిన మమ్మీలను షిన్జాంగ్ రాజధాని ఉరుంచి లోని షిన్జాంగ్ ప్రాంతీయ మ్యూజియం (Xinjiang Regional Museum) లో ప్రదర్శనకు ఉంచారు.

యాంగై షామాన్ (Yanghai Shaman)సవరించు

2003 లో వాయువ్య చైనా లోని తుర్ఫాన్ సమీపంలో యాంగై (Yanghai) వద్ద గల సమాధుల ప్రాంగణంలో క్రీ.పూ. 800 నాటి ఒక మమ్మీ దొరికింది. సుమారుగా 2800 సంవత్సరాల నాటి పురాతనమైన ఈ మమ్మీని షామాన్ (మతాచార క్రతువులలో ఆత్మలతో మాట్లాడుతూ పూనకంతో వూగే వ్యక్తి) గా భావించడం చేత ఈ మమ్మీని “యాంగై షామాన్”గా వ్యవహరించారు. ఇతను స్థానికంగా గషీ సంస్కృతి (Gushi Culture) కి చెందినవాడు. ఇతనికి కుడి వైపున ఒక తోలు బుట్ట, దానిలో 789 గ్రాముల గంజాయి (గంజాయి మొక్క గింజలను చూర్ణం చేసిన మిశ్రమం - 840 పొడి) చూర్ణం అత్యంత భద్రపరచబడిన స్థితిలో లభించింది. ఇతని కాళ్ళ వద్ద ఆ చూర్ణం చేయడానికి అవసరమైన చెక్కతో చేయబడ్డ కల్వం కూడా దొరికింది. ఈ పొడి ఇప్పటికి ముదురు ఆకుపచ్చ రంగులో వున్నప్పటికీ దాని ప్రత్యేకమైన వాసనను కోల్పోయింది. అంతర్జాతీయ నిపుణుల బృందం ఈ పొడిలో Tetrahydrocannabinol (THC) అనే రసాయన సమ్మేళనం వుందని, ఇది మానసిక క్రియాశీల కారకం (psychoactive agent) గా పనిచేస్తుందని నిర్ధారించారు. గంజాయిని ఔషద క్రియాశీల కారకంగా మానవులు ఉపయోగించినట్లు మనకు లభ్యం అయిన అతి పురాతన ఆధారం ఇది. ఈ ప్రజలు గంజాయి సాగును మానసిక ప్రయోజనాల కొరకే చేపట్టారని, నార (fibre) లేదా ఆహారం కొరకు మాత్రం కాదని పరిశోధనలు తెలియచేశాయి. వీటితో పాటు అతని వద్ద అసాధారణంగా సంగీత వాయిద్య పరికరాలు, గంటలు, చేతి కర్రలు దొరికాయి. దానితో ఇతనిని ఆనాటి మతాచారాలలో మానసిక ప్రయోజనాలు కోసం పూనకంతో వూగే వ్యక్తిగా, గంజాయి మాదక ద్రవ్యాన్ని సేవించేవానిగా భావించారు. ముఖ్యంగా సముద్రానికి వేలాది కిలోమీటర్ల దూరంలో మధ్య ఆసియా ఖండాంతరభాగంలో వున్న ఇతను సముద్రపు గవ్వలతో చేసిన అలంకరించబడిన టోపీని ధరించి వుండటం చాలా గొప్ప విషయంగా భావించారు.

చరిత్రలో తారిమ్ మమ్మీల అధ్యయనానికి గల ప్రాధాన్యంసవరించు

సుమారు 4000 సంవత్సరాల పురాతన కాలం నాటి ఒక ప్రాచీన నాగరికతా అవశేషాలుగా గుర్తించబడిన ఈ తారిమ్ మమ్మీల అధ్యయనం ప్రాచీన మానవ చరిత్రలో విస్మృతికి లోనైన ఒక ప్రాచీన నాగరికతా పార్శ్వాలను వెలికితీసే ప్రయత్నం చేస్తుంది. మధ్య ఆసియాలో ముఖ్యంగా తారిం బేసిన్ ప్రాంతంలో మరుగున పడిన ఒక ప్రాచీన ఎడారి నాగరికతకు చెందిన సంస్కృతి విశేషాలను వెలికితీసే ప్రయత్నానికి తారిం మమ్మీల అధ్యయనం విశేషంగా తోడ్పడుతుంది. ఫలితంగా ప్రాచీన ఆసియా ఖండపు నాగరికతలలో అంతుపట్టని రహస్యంగా మిగిలిపోయిన అవశేషాంశాలను పూరించే ప్రయత్నం చేస్తుంది. పశ్చిమ యూరేషియాకు చెందిన ఆదిమ ఇండో-యూరోపియన్ ప్రజలు ఆసియా ఖండంలోనికి సాగించిన వలసల తీరు తెన్నులను, వారిచే తీసుకొనిరాబడిన సంస్కృతీ విశేషాలను, తెలుసుకోవడానికి తారిమ్ మమ్మీల అధ్యయనం తోడ్పడుతుంది.

స్థూలంగా చెప్పాలంటే ఈ తారిమ్ మమ్మీలు చరిత్ర పూర్వ యుగంలో (Pre historic time) వివిధ ఖండాలలో విభిన్న జాతుల సమూహాలు (Ethnic groups) విస్తరించిన (Spread) విధాన్ని తెలుసుకోవడానికి ఉపకరిస్తున్నాయి. అంతే కాక ఈ మమ్మీలు చరిత్ర పూర్వ యుగంలో యూరప్ఆసియా ప్రాచీన నాగరికతా సమాజాల మధ్య తప్పిపోయిన ఒక లింక్ (missing link) ను అర్ధం చేసుకోవడానికి తోడ్పడతాయి.

వీటిని కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

బయటి లింకులుసవరించు