సీమ్ బౌలింగు
సీమ్ బౌలింగు, క్రికెట్‌లో ఒక బౌలింగ్ పద్ధతి. ఈ పద్ధతిలో బౌలింగు చేసినపుడు ఉద్దేశపూర్వకంగా బంతిపై ఉండే సీమ్ నేలను తాకేలా వేస్తారు. ఆ విధంగా నేలను తాకి బంతి పైకి లేచేటపుడు అది ఎటైనా వంపు తిరిగే అవకాశం ఉంటుంది. అలా వంపు తిరగడం వలన బ్యాట్స్‌మన్‌కు ఆ బంతిని ఆడడంలో ఇబ్బంది కలుగుతుంది. సీమ్ బౌలింగు చేసే బౌలర్లను సీమ్ బౌలర్లు లేదా సీమర్లు అంటారు.
సీమ్ బౌలింగ్ అనేది ఫాస్ట్ బౌలింగులో ఒక రూపం. అయితే మీడియం-పేస్ బౌలింగులో కూడా సీమ్ ఒక కారకంగా ఉంటుంది. సాధారణ ఫాస్ట్ బౌలర్ల కంటే నెమ్మదిగా బౌలింగ్ చేస్తూ, ఆఫ్ కట్టర్, లెగ్ కట్టర్‌లను ఉద్దేశపూర్వకంగా ఉపయోగించే స్పెషలిస్ట్ సీమర్‌లు ఉన్నప్పటికీ, బౌలర్లు చాలా మంది సీమ్‌ను కొంత ప్రభావానికి ఉపయోగించుకుంటారు కాబట్టి "సీమర్", "ఫాస్ట్ బౌలర్" అనే పదాలు ఎక్కువగా పర్యాయపదాలుగా ఉంటూంటాయి. గతంలోను, ఇటీవలి గంతంలోనూ కూడా ఇలా భావించడం చాలా తక్కువగా ఉండేది. టామ్ కార్ట్‌రైట్, డెరెక్ షాకిల్‌టన్ వంటి బౌలర్లు తక్కువ వేగంతో సీమర్‌లను బౌలింగ్ చేశారు. నియంత్రణలో, వైవిధ్యంలో వారి నైపుణ్యం కారణంగా చాలా విజయవంతమయ్యారు.
క్రికెట్ బంతి పరిపూర్ణమైన గోళం కాదు. బంతి పైన ఉండే సీమ్ బంతిలో ఉండే రెండు భాగాలను కలిపే వృత్తాకారపు కుట్టు. ఈ కుట్టు గమనించదగ్గ ఎత్తుగా ఉంటుంది. బంతి సీమ్ పిచ్‌కి తాకే విధంగా బౌల్ చేస్తే, సీమ్ ఎత్తు కారణంగా బంతి దాని మార్గంలో పక్కకు మళ్ళుతుంది. ఇది ఏ దిశలోనైనా కదలవచ్చు లేదా నేరుగా వెళ్లవచ్చు. బ్యాట్స్‌మెన్ తన షాట్‌ను ఎంచుకోవడానికి నేలను తాకిన తరువాత బంతి ఎలా కదులుతుందో చూడాల్సి ఉంటుంది.
ఈ ప్రభావాన్ని సాధించడానికి సీమ్ బౌలరు బంతిని క్షితిజ సమాంతర అక్షం చుట్టూ తిప్పుతూ సీమ్‌ని నిటారుగా ఉంచి బంతిని వేస్తాడు. [1] ఇది బ్యాటర్ వైపు ప్రయాణిస్తున్నప్పుడు సీమ్ నిట్టనిలువుగా ఉంటుంది. తద్వారా బంతి పిచ్‌పై పడినపుడు, సీమ్ నేలను తాకే అవకాశం ఉంటుంది. సీమ్‌ను నేలపై తాకించే పని నిలకడగా చెయ్యడం అనుకున్నంత సులభం కాదు. బంతిని డెలివరీ చేసే సమయంలో చూపుడు వేలు, మధ్య వేలు మధ్య సీమ్ నిటారుగా ఉంచాలి. మరీ ముఖ్యంగా, బంతిని డెలివరీ చేసినప్పుడు ఖచ్చితంగా నేరుగా డెడ్‌గా ఉండాలి. ఆస్ట్రేలియా బౌలరు గ్లెన్ మెక్‌గ్రాత్ సీమ్, మణికట్టు స్థానం దీనికి ఒక ఖచ్చితమైన ఉదాహరణ.
బంతి మార్గం నుండి మళ్ళే దిశ, డిగ్రీలు -సీమ్ అమరిక, పిచ్ ఉపరితలంపై ఉండే అసమానతలపై ఆధారపడి ఉంటాయి. అంటే సీమ్ నేలను తాకిన తరువాత బంతికి కలిగే విచలనం అస్తవ్యస్తంగా, అనూహ్యంగా ఉంటుందని అర్థం.
సీమ్ వల్ల కలిగే విచలనం, బంతిని ఆడటంలో బ్యాటర్‌కు పెద్ద సమస్యలను కలిగించేంత ఎక్కువగా ఉండదు. అయితే, అప్పుడప్పుడు, బంతి బ్యాట్ అంచుకు తగిలేంత దూరంగా వెళ్లి, సమీపంలోని ఫీల్డర్‌లకు క్యాచ్‌ని అందజేస్తుంది. దీనితో పోలిస్తే, స్వింగ్ బౌలింగులో విచలనం ఎక్కువ ఉంటుంది గానీ దాన్ని నియంత్రించడం కష్టం.
ఆస్ట్రేలియా ఫాస్ట్-మీడియం బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్ తన సీమింగ్ సామర్థ్యాన్ని గొప్పగా ఉపయోగించాడు. జట్టు ఇన్నింగ్స్ ప్రారంభంలో, బంతి కొత్తది అయినప్పుడు బంతి అత్యుత్తమంగా ఉంటుంది. పగుళ్లు ఉన్న పిచ్ కూడా సీమ్ బౌలర్‌కు సహాయపడవచ్చు. సీమ్ బౌలర్లు 'యార్కర్'ను ఉపయోగించవచ్చు, కానీ యార్కరులో బంతి బ్యాటర్ పాదాలకు చాలా దగ్గరగా నేలను తాకుతుంది కాబట్టి, ఆ తరువాత దాని మార్గం నుండి మళ్ళే అవకాశం ఉండదు.
సీమ్ బౌలింగ్ టెక్నిక్‌కి మరో మంచి ఉదాహరణ ఫాస్ట్ బౌలర్లు కోర్ట్నీ వాల్ష్, వసీం అక్రమ్. కింది వివరణల యొక్క క్లోజ్-అప్ కెమెరా పనిని ఉదాహరణకు ఇక్కడ చూడవచ్చు:. ఇద్దరూ ఫార్వర్డ్ రిస్ట్ ఫ్లిక్‌ని ఉపయోగించి, బంతిని వదిలిపెట్టేటపుడు దానికి బ్యాక్-స్పిన్ ఇస్తారు. అయితే, బంతిపై వారి వేలును పెట్టిన స్థానం బంతి స్థితికి (గైరోస్కోప్ లాగా) కారణమౌతుంది. సీమ్ విశాలంగా నిటారుగా ఉంటుంది కానీ, గాల్లో వెళ్తున్న బంతిని కిందనుండి చూస్తే దాని సీమ్, గడియారంలో ఉండే 5 - 7 గంటల మధ్య డోలనం చేస్తూ ఉంటుంది. దీంతో, సీమ్ వలన బంతికి కలిగాల్సిన స్వింగు రాదు. (డొలనం కారణంగా బంతి సీమ్, అవుట్‌స్వింగ్, ఇన్‌స్వింగ్ సీమ్ స్థానాల మధ్య నిరంతరం మారుతూ ఉంటుంది కాబట్టి). అందువలన, బంతి నేరుగా పిచ్‌పైకి వెళుతుంది. అయితే, బంతి నేలను తాకేటపుడు సీమ్ 5 గంటల స్థానంలో ఉంటే ఎడమ వైపుకు (కుడి చేతి బ్యాటర్ నుడ్ంఇ దూరంగా) వెళ్తుంది. సీమ్ 7 గంటల స్థానంలో ఉంటే కుడి వైపుకు (కుడిచేతి బ్యాటరు పైకి) వెళ్తుంది. బంతి సరిగ్గా సీమ్ 6 గంటల స్థానంలో ఉండగా నేలను తాకడం బాగా అరుదుగా జరుగుతుంది. ఇది సీమ్ బౌలింగులో ఉండే అనూహ్య స్వభావానికి అనుగుణంగా ఉంటుంది. సీం బౌలింగు, ప్రధానంగా బౌలరు కుశలతపై ఆధారపడి ఉంటుంది గానీ, పిచ్ ఉపరితలంలో ఉండే అసమానతలపై పెద్దగా ఆధారపడుతున్నట్లు అనిపించదు.
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Swing and seam – the basic grip". BBC. 2005-09-06. Retrieved 2015-07-16.