అంతర్జాలంలో తెలుగు
అంతర్జాలంలో తెలుగు చరిత్ర 1990 లలో మొదలైంది. ఐ.ఆర్.సి చానెళ్ళలో చర్చలతో తెలుగు మొదలైంది. అది యాహూ గ్రూపులలో కొనసాగింది. అప్పట్లో తెలుగు భాషను రోమను లిపిలో రాసేవాళ్ళు. యూనికోడ్ తెలుగు ఫాంట్ల రాకతో ఆ సమస్య తీరిపోయింది. అ తరువాత తెలుగు యాహూ గ్రూపులను గూగుల్ గ్రూపులను దాటి వెబ్‌సైట్లు, బ్లాగుల లోకి ప్రవేశించింది. ఆ తరువాత ఇతర సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి వాటి లోకి విస్తరించింది.
2000 కు ముందు ఉన్న కంప్యూటర్లలో చాలా వరకు తెలుగును సహజంగా చూపేందుకు సాంకేతికంగా సిద్ధంగా ఉండేవి కావు. తెలుగు కనబడాలంటే వాటి ఆపరేటింగ్ వ్యవస్థ సెట్టింగుల్లో కొన్ని సర్దుబాట్లు చేసుకోవలసి వచ్చేది. విండోస్ ఎక్స్.పి వచ్చాక అందులో తెలుగు యూనీకోడ్ ఫాంటు తోర్పాటు వలన అప్పటి నుండి కంప్యూటర్లు తెలుగును చూపించేందుకు సన్నద్ధమై వచ్చేవి.
కంప్యూటర్లో తెలుగులో రాయడం అనేది తరువాతి సమస్య. బహుశా తెలుగు ఎదుర్కొన్న అతిపెద్ద సవాలు ఇదే. తెలుగులో రాసేందుకు అవసరమైన పనిముట్లను అభివృద్ధి చేసి వెబ్ వ్యాప్తంగా అందుబాటు లోకి తేవడం మొదలయ్యాక ఈ సమస్యకు పరిష్కారం మొదలైంది. రైస్ ట్రాన్స్‌లిటరేషన్ సిస్టమ్ అనేది తెలుగును తేలిగ్గా రాయగలిగే తొలి వ్యవస్థ. రోమను లిపిలో తెలుగును రాస్తే తెలుగు లిపి లోకి లిప్యంతరీకరణ చెయ్యడం ఈ పద్ధతి ప్రత్యేకత. ఈ పద్ధతినే వాడి మరింత తేలిగ్గా తెలుగులో రాయగలిగే లేఖిని వంటి ఉపకరణాలు రావడంతో తెలుగులో రాసే వీలు మరింత పెరిగింది. ఆ విధంగా తెలుగు విస్తరణ వేగం పుంజుకుంది.
కంప్యూటరులో తెలుగును సాధ్యపరచిన సాధనాలు
మార్చురోమను లిపిలో తెలుగు
మార్చుతెలుగు ఫాంట్లు అందుబాటు లోకి రాక మునుపు, తెలుగు సైట్లు ఇంగ్లీషు లిపిలో ఉండేవి. ఈమెయిలింగు లిస్టులు రోమను లిపిలో తెలుగు భాషలో సాగేవి. వాటికి ఉదాహరణ "తెలుసా లిస్ట్". ప్రసిద్ధ తెలుగు కావ్యాలు, కావ్యఖండికలను వెబ్‌సైట్లలో ప్రచురించేవారు. వాటికి ఒక ఉదాహరణ: "సంకా రామకృష్ణ". తరువాతి కాలంలో వీటిని తెలుగు లోకి తేలిగ్గా మార్చే వీలు ఉన్నప్పటికీ వాటిని అలాగే రోమను లిపి లోనే కొనసాగించడంతో ఆ సైట్లకు చారిత్రిక విలువ చేకూరింది.
ఆ తరువాత యాహూ గ్రూప్స్ లో రచ్చబండ అనే ఒక సమూహం చాలా చురుగ్గా ఉండేది. తెలుగు సాహిత్యం గురించి, సాహితీకారుల గురించీ పరిణతితో కూడిన చర్చలు జరుగుతూ ఉండేవి. కొందరు సాహితీకారులు ఇందులో సభ్యులుగా ఉండేవారు. కొన్నాళ్ల తరువాత ఈ యాహూ గ్రూపుకు, గూగుల్ గ్రూప్స్ లో ఒక మిర్రరు సమూహాన్ని సృష్టించారు. 2011 తరువాత దానిలో చురుకుదనం తగ్గి చర్చలు ఆగిపోయాయి. యాహూ సంస్థ 2020 లో గ్రూప్స్‌ను శాశ్వతంగా మూసివేయడంతో రచ్చబండ మూతబడింది.
కంప్యూటర్లలో తెలుగును చూపించడం
మార్చు2000 కు ముందు ఉన్న కంప్యూటర్లలో చాలా వరకు తెలుగును సహజంగా చూపేందుకు సాంకేతికంగా సిద్ధంగా ఉండేవి కావు. తెలుగు కనబడాలంటే వాటి ఆపరేటింగ్ వ్యవస్థ సెట్టింగుల్లో కొన్ని సర్దుబాట్లు చేసుకోవలసి వచ్చేది. విండోస్ ఎక్స్.పి వచ్చాక ఆ సమస్య చాలా వరకు తీరిపోయింది. ఎక్స్.పి ఆపరేటింగ్ వ్యవస్థలో తెలుగును చూపించే ఏర్పాటు ముందే ఉండేది. ఎలాంటి సెట్టింగులూ చేసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. గౌతమి ఫాంటు ముందే ఇమిడ్చి ఉండేది.[1] అయితే, చాలామంది విండోస్ 95, 98 లే వాడుతూ ఉండేవారు కాబట్టి ఈ సమస్య 2007-08 వరకూ ఉంటూనే ఉండేది. ఈ సమస్య తీరిపోవడం అనేది తెలుగు వ్యాప్తిలో తొలి అడ్డంకి తొలగినట్లైంది. మ్యాక్, లినక్స్[2] లో కూడా తెలుగు ఖతులు అందుబాటులోకి వచ్చాయి [3].ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఆరవ కూర్పు నుంచి తెలుగు యూనీకోడ్ అందుబాటులోకి వచ్చింది[4]
కంప్యూటరులో తెలుగు రాయడం
మార్చుకంప్యూటరులో తెలుగులో రాయడం అనేది తెలుగు ఎదుర్కొన్న అతి పెద్ద సమస్యల్లో ఒకటి. తెలుగు రాసేందుకు అనుగుణమైన పరికరాలు, కీబోర్డు లేఔట్లూ రావడంతో ఈ సమస్య పరిష్కారం కావడం మొదలైంది. తెలుగు టైపింగు నేర్చుకునే అవసరం లేకుండానే రోమను లిపిలో రాస్తే తెలుగు లోకి మార్చేసే పరికరాలు రావడం ఈ పరిష్కారాన్ని వేగవంతం చేసింది. వీటిలో 2002 సంవత్సరంలో విడుదల అయిన తెలుగువర్డ్ విండోస్ ప్లాట్‌ఫారమ్ కోసం తెలుగు భాష మద్దత్తు ఉన్న ప్రత్యేక వర్ద్ ప్రాసెసర్ దీనిని తయారు చేసినది పెండ్యాల రాంబాబు, ఇది ఫొనెటిక్, ఆపిల్, టైప్‌రైటర్, ఇంగ్లీష్ మొదలైన బహుళ కీబోర్డ్ లేఅవుట్‌లకు కూడా మద్దతు ఇస్తుంది[5] .అలాంటి పరికరాల్లో ప్రముఖమైనది "పద్మ". ఈ పద్మ పరికరాన్ని తయారుచేసినది వెన్న నాగార్జున. ఈ పరికరాన్ని అప్పట్లో అందుబాటులో ఉన్న జియోసిటీస్.కాం సైటులో పెట్టి అందరికీ ఉచితంగా వాడుకునేందుకు అందుబాటులో ఉంచాడు. ఒక పెట్టెలో రాయదలచిన పాఠ్యాన్ని రోమను లిపిలో రాసి మార్చమని ఒక బొత్తాన్ని నొక్కితే, తెలుగు పాఠ్యం కనిపించేది. ప్రస్తుతం ఈ పద్మ పరికరం oocities.org అనే సైటులో అందుబాటులో ఉంది. తెలుగుకు కూడా ఒక వికీపీడియా ఉండాలని, వికీమీడియా గ్రూపు సైట్లలో భాగంగా తెలుగు వికీపీడియాను నాగార్జునే స్థాపించాడు.
ఆ తరువాత 2006 మార్చిలో లేఖిని ఉనికి లోకి వచ్చింది. వీవెన్ సృష్టించిన ఈ సైటు తెలుగులో రాయడానికి మరింత వీలు కల్పించింది. ఒక పెట్టెలో రోమను లిపిలో రాస్తూ ఉంటే కిందనే ఉన్న మరో పెట్టెలో అది తెలుగు లోకి మారుతూ కనిపిస్తుంది. అనే క సంవత్సరాలుగా ఈ సైటు కంప్యూటర్లో తెలుగు రాయడానికి ఉపయోగపడుతూ ఉంది.
ఈ-తెలుగు ప్రచారం
మార్చుఅంతర్జాలంలో తెలుగును వ్యాప్తి చేసేందుకు ఈ-తెలుగు సంస్థ మార్గదర్శక కృషి చేసింది. అంతర్జాలంలో తెలుగును వ్యాపింపజేసే లక్ష్యంతో కొందరు ఔత్సాహికులు 2007 మే లో ఈ-తెలుగు సంస్థను ఏర్పాటు చేసారు.2008 ఏప్రిల్‌లో అధికారికంగా నమోదు చేసారు. "మీ కంప్యూటరుకు తెలుగొచ్చా?" అనే ప్రసిద్ధి గాంచిన ప్రశ్నతో సంస్థ తన ప్రచారం మొదలుపెట్టింది. వివిధ ఆపరేటింగు వ్యవస్థలలో తెలుగు కనబడేలా చేసుకోవడం ఎలా, తెలుగులో రాయడం ఎలా అనేవి చెబుతూ తెలుగుకు ప్రచారం కల్పించింది. అది చురుగ్గా పనిచేసిన సుమారు మూడేళ్ళ కాలంలో, ఉచిత కరపత్రాలతో, చిరుపొత్తాలతో పుస్తక ప్రదర్శనల వంటి ప్రదేశాల్లో క్షేత్ర స్థాయి ప్రచారం నిర్వహించింది. వివిధ బ్లాగు కూడళ్ళకు, వెబ్‌సైట్లకు, వికీపీడియాకు, అంతర్జాల సంబంధ సాంకేతిక సహాయం అందించే సైట్లకూ అది ప్రచారం కల్పించింది. 2007 లో వివిధ బ్లాగుల్లోని ప్రసిద్ధి గాంచిన టపాలను ఏరి కూర్చి, ఒక ఇ పుస్తకంగా ప్రచురించింది.[6]
ఫాంట్ల రంగంలో
మార్చుమొదట్లో తెలుగు ఫాంట్లు యూనీకోడులో కాకుండా వేరే ఎన్‌కోడింగు పద్ధతుల్లో ఉండేవి. అను ఫాంట్స్ అనేవి అటువంటి ఫాంట్లే. ఇవి ఉచితంగా లభించవు, కొనుక్కోవాలి. వీటిని డెస్క్ టాప్ పబ్లిషింగులో విస్తృతంగా వాడేవారు. ఇప్పటికీ వాడుతున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి పత్రికల వారు ప్రత్యేకంగా తయారు చేసుకున్న ఫాంటులు వాడేవారు. ఆ పత్రికలు చదవాలంటే ఆ వెబ్‌సైట్లలో వాళ్ళ ఫాంట్లను పాఠకుల కంప్యూటర్ల లోకి దించుకోవాల్సి వచ్చేది. యూనికోడ్ ఫాంట్ల రాకతో ఆ సమస్య తీరిపోయింది. అయితే ఆ తరువాత కూడా అనేక సంవత్సరాల పాటు పత్రికలు తమ స్వంత ఫాంట్లనే వాడడం చేత, ఆ సైట్లలో తెలుగు చూడాలంటే వారి ఫాంట్లను దించుకోక తప్పేది కాదు. [7]
తెలుగు ఫాంట్లు అప్పటికి ఇంకా అందుబాటు లోకి రాలేదు. మొదటి తెలుగు ఫాంటు పోతనను తిరుమల కృష్ణ దేశికాచారి సృష్టించాడు. అయితే ఇది ISO-8859-1 ఎన్‌కోడింగు ప్రమాణాలకు అనుగుణంగా లేనందున వెబ్‌పేజీల్లో వాడే వీలు లేకపోయింది. జువ్వాడి రమణ దాన్ని సవరించి తిక్కన 1.0 అనే పేరుతో విడుదల చేసాడు. కానీ అందులో కొన్ని తీవ్రమైన లోపాలు ఉండటాన, దాన్ని చోడవరపు ప్రసాదు,[8] జువ్వాడి రమణలు సవరించి తిక్కన 1.1 గా విడుదల చేసారు.[9]
మొదట్లో తెలుగు వెబ్‌సైట్లలో తెలుగు చూడాలంటే, ఆ సైటు నుండి ఫాంట్లను దించుకోవాల్సి వచ్చేది. ప్రతి సైటు అలా లింకు ఒకటి ఇచ్చేవారు. ఫాంటు దింపుకునే అవసరం లేకుండానే తెలుగు చూడగలిగే తొట్టతొలి ఫాంటు తిక్కన 1.1 యే. ఆ తరువాత దానికి మరిన్ని మార్పులు చేసి 1998 మార్చిలో తిక్కన 1.2 ను విడుదల చేసారు. భారత ప్రభుత్వ సంస్థ సిడాక్ కూడా కొన్ని ఫాంట్లను, టైపింగు తదితర ఉపకరణాలను తయారు చేసినది [10]
ప్రస్తుతం అనేక యూనికోడు తెలుగు ఫాంట్లు స్వేచ్ఛగా దింపుకోవడానికి వివిధ సైట్లలో అందుబాటులో ఉన్నాయి.
స్థానికీకరణ
మార్చుప్రజాదరణ పొందిన వివిధ వెబ్‌సైట్ల యూజర్ ఇంటర్‌ఫేసును తెలుగు లోకి అనువదించే స్థానికీకరణ పనులు అంతర్జాలంలో తెలుగు వ్యాప్తికి దోహదం చేసిన మరొక అంశం. వర్డ్‌ప్రెస్, జూమ్లా, ద్రూపల్ వంటి కంటెంటు మేనేజిమెంట్ వెబ్‌సైట్లను, మొజిల్లా వారి అప్లికేషన్లు, గూగుల్‌కు సంబంధించిన వివిధ సైట్లు, వికీపీడియా, వికీసోర్స్ వంటి మీడియావికీ సాఫ్టువేరు వాడే సైట్లు, అనేక ఇతర సైట్ల స్థానికీకరణ ప్రాజెక్టులలో కొందరు విరివిగా పాల్గొనేవారు. ట్రాన్స్‌లేట్‌వికీ వంటి సైట్లలో స్థానికీకరణ ప్రాజెక్టులు నడిచేవి. స్థానికీకరణకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను వివిధ బ్లాగుల్లోను, వికీబుక్స్ లోనూ ప్రచురించేవారు.[11] [12]
తెలుగులో వెబ్‌సైట్లు
మార్చు2000 దశాబ్దపు తొలి సంవత్సరాల్లో అంతర్జాలంలో తెలుగు వెబ్‌సైట్లలో పత్రికలు, గ్రూపులు, బ్లాగులు, మెయిలింగ్ లిస్టులు, ఇతర సామాజిక మాధ్యమాలు వగైరాలు ఉండేవి. 2004 కు ముందు తెలుగులో వెబ్‌సైట్లు ఉన్నప్పటికీ స్వల్ప సంఖ్య లోనే ఉండేవి. 2003 డిసెంబరులో తెలుగు వికీపీడియా మొదలైంది. 2005 నుండి వికీపీడియా అభివృద్ధి మొదలైంది.
పత్రికలు
మార్చుతెలుగు వార్తా పత్రికల్లో మొదటగా అంతర్జాలంలో ప్రవేశించినది ఈనాడు. తొలుత ఈ సైటులో వార్తలను కారెక్టర్ల రూపంలో కాకుండా, బొమ్మల రూపంలో ప్రచురించేవారు. ఆ తరువాత తమ స్వంత ఫాంట్లతో ప్రచురించడం మొదలుపెట్టారు. అయితే వాడుకరులకు తెలుగు కనబడేది కాదు చిక్కిరి బిక్కిరి కారెక్టర్లు కనబడేవి. ఆ సైటు నుండి ఫాంట్లను వాడుకరి కంప్యూటరు లోకి దించుకుంటే, అప్పుదు తెలుగు అక్షరాలు కనబడేవి. ఈ పద్ధతినే అంధ్రజ్యోతి వంటి ఇతర వెబ్‌సైట్లు కూడా అనుసరించాయి. యూనికోడ్ వచ్చాక ఈ సమస్య తీరిపోయింది. యూనికోడు రూపంలో ఏ భాషలో ప్రచురించిన పేజీ అయినా ఫాంట్లేవీ దించుకునే అవసరం లేకుండానే ఏ కంప్యూటరులోనైనా కనబడేది.
గూగుల్ గ్రూపులు - తెలుగు ప్రచారం కోసం
మార్చుతెలుగు గురించిన సాంకేతిక సహాయం అందించేందుకు, తెలుగు బ్లాగులను, వికీపీడీయానూ జాలంలో వ్యాప్తి చేసేందుకు గూగుల్ గ్రూపులను వివిరివిగా వాడుకున్నారు. తెలుగు వికీ, తెలుగు బ్లాగు వంటి పలు గ్రూపులను స్థాపించారు. ఈ గ్రూపు లన్నిటి లోకీ "తెలుగు బ్లాగు" అనే గ్రూపు ఈ విషయంలో అన్నిటి కంటే ముందుంది. తెలుగు చదవడం, రాయడంలో ఉన్న సందేహాలను తీర్చడంతో పాటు బ్లాగులకు సంబంధించిన సందేహాలను ఈ గ్రూపులో తీర్చేవారు.
సామాజిక మాధ్యమాలు - ఆర్కుట్‌తో తెలుగు మొదలు
మార్చుగూగుల్ వారి అర్కుట్, సామాజిక నెట్‌వర్కింగు సైట్లలో మొదటిది. ఇది 2004 లో మొదలైంది. 2007 నాటికి ఆర్కుట్ ఇంటర్‌ఫేసును తెలుగులోకి అనువదించింది.
బ్లాగులు
మార్చుఅంతర్జాలంలో తెలుగు విస్తరణలో ప్రముఖమైన పాత్ర వహించినది బ్లాగులు. 2004 లోనే బ్లాగులు మొదలైనప్పటికీ, 2005 లో విస్తరించడం మొదలైంది. ఎవరికి వారే ఏ సహాయమూ అవసరం లేకుండా, సులువుగా స్థాపించుకోగలగడం బ్లాగుల విశిష్టత. ఉన్న సులువు, దానికి తోడు బ్లాగుల్లో కొత్త పోస్టులు రాగానే చూపించే బ్లాగుల అగ్రిగేటర్లు రావడం బ్లాగుల వ్యాప్తికి మరింతగా దోహదం చేసింది. మొదటిగా వచ్చిన అగ్రిగేటర్లలో కూడలి, జల్లెడ, తేనెగూడు వంటివి ఉన్నాయి. ఆ తరువాత మరిన్ని వచ్చాయి.
బ్లాగరుల సమావేశాలు
మార్చుహైదరాబాదులో ఉండే కొందరు బ్లాగర్లు నెలకొకసారి కలిసి అంతర్జాల విశేషాల గురించి ముచ్చటించుకూంటూ ఉండేవారు. ఈ సమావేశాలు కొత్త ఆలోచనలకు వేదికలయ్యేవి. కొత్త అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టేవి. హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక సమావేశంలో ఈతెలుగు సంస్థకు బీజం పడింది. పుస్తక ప్రదర్శనలో ఒక స్టాలు పెట్టాలనే ఆలోచన రావడం, ప్రదర్శన నిర్వాహకులతో మాట్లాడి , ఉచితంగా స్టాలు పొందే ఏర్పాటు చెయ్యడం - వీటికి బీజం పడింది కూడా హైదరాబాదు లోని కృష్ణకాంత్ పార్కులో జరిగిన బ్లాగరుల సమావేశంలోనే. తెలుగు బ్లాగుల కోసం ఒక అగ్రిగేటరు పెట్టాలనే ఆలోచన వచ్చింది కూడా ఈ సమావేశాల్లోనే. [13][14][15]
మూలాలు
మార్చు- ↑ https://docs.microsoft.com/en-us/typography/font-list/gautami
- ↑ https://pagure.io/lohit
- ↑ https://salrc.uchicago.edu/resources/fonts/available/telugu/
- ↑ https://ildc.in/Telugu/htm/EnableIndianLanguages2000XP.htm
- ↑ http://www.cybervillagesolutions.com/telugu.htm
- ↑ "తెలుగు బ్లాగుల సంకలనం" (PDF). ఈతెలుగు.
{{cite web}}
: CS1 maint: url-status (link)[permanent dead link] - ↑ "I am unable to copy text from www.eenadu.net site into notepad. why may I know the reason. can you please help me out". answers.microsoft.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-01-28.
- ↑ https://www.gnu.org/software/freefont/sources/resources.html
- ↑ "తిక్కన ఫాంట్స్". www.ghantasala.info. Archived from the original on 2022-01-02. Retrieved 2022-01-27.
- ↑ https://www.cdac.in/index.aspx?id=ev_corp_gist_ism_launch
- ↑ "తెలుగు స్థానికీకరణ మార్గదర్శిని - Wikibooks". te.wikibooks.org. Retrieved 2022-01-30.
- ↑ "తెలుగులో 7-జిప్ | e-తెలుగు". web.archive.org. 2008-04-09. Archived from the original on 2008-04-09. Retrieved 2022-01-30.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "డిసెంబర్ నెల e-తెలుగు సమావేశ వివరాలు | e-తెలుగు". web.archive.org. 2007-12-15. Archived from the original on 2007-12-15. Retrieved 2022-01-30.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "e-తెలుగు హైదరాబాదు సమావేశం ఆగష్టు 2007 | e-తెలుగు". web.archive.org. 2007-12-10. Archived from the original on 2007-12-10. Retrieved 2022-01-30.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "హైతెబ్లాస వర్షాకాల సమావేశాలు శుభారంభం | e-తెలుగు". web.archive.org. 2008-08-21. Archived from the original on 2008-08-21. Retrieved 2022-01-30.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)