అగ్నిపరీక్ష (నవల)

మాదిరెడ్డి సులోచన దాదాపు నలభై ఏళ్ళ క్రితం, అచ్చమైన తెలంగాణా వాతావరణం, మానవ సంబంధాలూ కలిపి చక్కనైన కుటుంబకథా నవలలను వ్రాశారు. ఆమె నవలలలో ఎక్కువగా మధ్యతరగతి కుటుంబాలలలో వుండే సమస్యలు కనిపిస్తూవుంటాయి. మన చుట్టూ వుండే వాతావరణం ప్రతిబిబంబిస్తూ వుంటుంది. ఆ నవల చదువుతూ వుంటే ఇది ఎక్కడో మనమధ్యే జరిగిందే అనిపిస్తుంది. పాఠకులు ఊహాలోకలో విహరించరు. సులభమైన శైలిలో చివరి వరకూ ఆగకుండా చదివిస్తాయి. ఆవిడ వ్రాసిన నవలలో ఒకటి ఈ “అగ్నిపరీక్ష”. ఇది ఇద్దరు యువకులు ఒకేరకమైనటువంటి సమస్యలో ఇరుక్కునప్పుడు ఎలా స్పందించారు అన్నదాని గురించి వ్రాసారు.

కథావస్తువు

మార్చు

కోదండరామయ్య, చలపతి, రఘుపతి ముగ్గురు అన్నదమ్ములు. కోటీశ్వరులుగా పేరు పొందారు. కోదండరామయ్య అలనాటి కోదండరాముడే. అతనికి తమ్ములంటే అభిమానం. వ్యసనాలకులోనై మరణించిన రఘుపతిని తలుచుకొని ఏడుస్తూ వుంటాడు. ఉమ్మడికుటుంబం. అతని భార్య కాంతమ్మ భర్త లాంటిదే. మరిది పిల్లలు, నా పిల్లలు అని ఏనాడు భేదం చూపి ఎరగదు. రామయ్యకు, మోటార్ రిపేరింగు కంపెనీ ఉంది. అడితీ దుఖాణం ఉంది.ఇంకా ఎన్నో వ్యాపారాలు చేస్తాడు. అతని ఆదాయవ్యయ సంగతులు ఎవరికీ తెలియదు. రోజుకు పది మంది ఆశ్రితజనం ఆయింట వుంటారు. పిల్లలంతా పిల్ల జమీందారులా పెరుగుతున్నారు. ఇంటిలోని ఆడవారుకు జమా ఖర్చులు తెలియదు.

కావలసిన వస్తువులు, బట్టలు అన్నీ పద్దు వ్రాయించి తెచ్చుకోవటమే. అలాంటి పరిస్థితులలో కోదండరామయ్య చనిపోతాడు. చనిపోయేముందు తమ ఆర్థికపరిస్థితి గురించి కొడుకు విష్ణువర్ధన్ కు వివరించి, కుటుంబగౌరవం కాపాడమని మాట తీసుకుంటాడు. అస్తవ్యస్తంగా వున్న ఆర్థికపరిస్థితిని చక్కదిద్దటానికి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాడు విష్ణు. ఇంటిలోని దుబారా ఖర్చులు తగ్గిస్తాడు. పద్దువ్రాసి వస్తువులు తెప్పించే పద్ధతి మానిపిస్తాడు. ఇంటివారంతా కర్కోటకుడని తిడుతున్నా పట్టించుకోడు. ఈ కష్టసమయములో తోడు కావాలని మధ్యతరగతి అమ్మాయి సుజాతను వివాహమాడుతాడు. సుజాత అత్తవారి సూటిపోటిమాటలను పట్టించుకోక విష్ణుకు అండగా నిలుస్తుంది. ఎన్నో వొడిదడుకులను ఎదురుకొని అన్నీ సరిదిద్దుతాడు విష్ణు.

సుందరమ్మ భర్త ఒకప్పుడు తాసిల్దారుగా పనిచేసాడు. సికింద్రాబాద్ దగ్గర లాల్ బజార్ లో బంగళా కట్టించాడు. దగ్గరే పొలం కొన్నాడు. నలుగురు ఆడపిల్లలు ఒక్కడే కొడుకు. ముగ్గురు ఆడపిల్లల పెళ్ళి అయ్యింది. చివరి కూతురు సుజాత బి.యే చదివింది. అన్న ఇబ్బంది చూసి కట్నం ఇచ్చేవాడిని వివాహమాడటానికి ఇష్టపడదు. సుందరమ్మ కొడుకు రఘు ప్రాణాలు తీస్తూ, ఆడపిల్లలలకు అన్ని లాంచనాలను జరిపిస్తూవుంటుంది. ఖర్చుచేస్తూవుంటుంది. అడ్డుపడబోయిన కూతురు సుజాతను, కోడలు సరళను మాట్లాడనీయదు. తల్లికి ఎదురుచెప్పలేని బలహీనతతో రఘు అప్పులపాలవుతాడు. ఖర్చులు తట్టుకోలేక బంగళా, పొలం అన్నీ అమ్మేస్తాడు. ఐనా సుందరమ్మ ఖర్చులు తట్టుకోలేకపోతాడు. సుజాత, సరళ ఎంత హెచ్చరించినా ఆమెను అదుపులో వుంచలేకపోతాడు. మధ్యతరగతి భేషజాలకు బలైపోతాడు. పిచ్చివాడైపోతాడు. ఒక్క రఘు కాదు, రఘు లాంటి యువకులెందరో ఇంటివారి దుబారా,బయటవారి దుష్ప్రచారాలకు బ్రతుకులు బలిచేస్తున్నారు.

రఘు, విష్ణు ఇద్దరూ జీవిత బాటపై డక్కామొక్కీలు తిన్నవారే. ఒకరు బలహీనుడు. భయపడుతూ పిరికితనంతో,చెడు అని తెలిసినా, భయపడి పిరికివానిలా తన జీవితమేకాక, ఇతరుల జీవితం నరకప్రాయం చేసినవాడు. రెండో అతను మంచిని ఎంచి యెవరెన్ని మాటలన్నా, కర్కోటకుడని బిరుదునిచ్చినా ధైర్యంగా నిలబడి, శాసించి, శ్క్షించి, బ్రతుకు బాటలోని గతుకులను పూడ్చాడు.

సినిమా

మార్చు

ఈ నవల 1982లో కలవారి సంసారం అనే పేరుతో సినిమాగా తీయబడింది. దోనేపూడి బ్రహ్మయ్య నిర్మించి కె.ఎస్.రామిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృష్ణ, శ్రీదేవి, హరనాథ్, పండరీబాయి తదితరులు నటించారు.