అథర్వణాచార్యుడు మహా భారతాన్ని తెలుగులో వ్రాసిన కవి. ఇతను వ్రాసిన మహా భారతంఇప్పుడు లభించడంలేదు, కానీ ఇతని తరువాతి కవులు ఈ గ్రంథంలోని పద్యాలను ఉదహరించడం వల్ల మనకు ఇతని రచన గురించి తెలుస్తుంది.

కాలంసవరించు

క్రీ.శ.1445 కాలంలో జీవించి, లక్షణదీపిక అనే ఛందోగ్రంథాన్ని రచించిన గౌరన అథర్వణచ్ఛందాన్ని తెలిపినాడు. కనుక అథర్వణాచార్యుడు పదమూడవ శతాబ్దం వాడు అయి ఉంటాడు.

ఎంత భారతం తెనిగించి ఉండవచ్చు?సవరించు

కురుపతి రవిసుతుని సువర్ణరత్నభూషణతతుల నురక బహుమతిచే
సి రభసము మీఱ సేనల కు రాజు గావించె సమరకుశలుం డగుటన్

అను పధ్యము వల్ల కనీసం కర్ణ పర్వము వరకూ తెనిగించి ఉంటాదు అని చెప్పవచ్చు.

ఆతరిని చెలికి నిచ్చిన
రోతొడవులు తొడిగెనాసరోజదళాక్షీ
కౌతుకమున జెప్పుమని విన
బ్రీతి జనించెడిని తనదు హృదయంబునకున్

అను పధ్యము వల్ల ఆదిపర్వం నుండి మొదలుపెట్టినాడని చెప్పవచ్చు.

నయమార రాఘవుడు నావయెక్కి వడి దాతి జాహ్నవీశైవలినిన్
జయజయ యని వినువీధుల వియచ్చరులు సన్నుతింప వేడుకతోడన్.

అను పద్యము వల్ల అరణ్యపర్వాన్ని అందులోని ఉపాఖ్యాలనూ అనువదించినట్టు తెలుస్తుంది.

సుమారుగా మొత్తం భారతం తెనిగించి ఉండవచ్చు అని చెప్పవచ్చు.

రచనలోని కొన్ని పద్యాలుసవరించు

దుర్యోధనుని వర్ణణ:
నతనానావనినాథయూధమకుటన్యస్తాబ్జ రాగోజ్వల
ద్ద్యుతివిభ్రాజితపాదపీఠు లలనాదోశ్చామరోద్ధూతమా
రుతలోలాళివినీలకుంతలు బ్రభారుగ్ధాము గేయూరశో
భితబాహాపరిఘున్ సువర్ణ ధరణీభృద్ధైర్యు దుర్యోధనున్
రాజసూయం చేస్తున్న ధర్మరాజు వర్ణణ:
ప్రణతాశేషవసుంధరాధిప శిరస్స్రగ్గంధలుబ్ధభ్రమ
త్క్వణదభ్రభ్రమకృద్ద్విరేఫగణఝంకారప్రదాబద్ధసం
ప్రణవత్యుత్ప్రథిత ప్రవర్ధితసమస్తక్షత్రసూయాధ్వర
క్షణసింహాసనభాసితున్ దృఢధనుశ్శ్లాఘాజనున్ ధర్మజున్
కూచిమంచి తిమ్మకవి సర్వలక్షణసారసంగ్రహంలోని ఉదాహరణ:
పది దినము లయిదుప్రొద్దులు
పదపడి రెణ్ణాళ్ళు నొక్కపగలున్ రేయున్
గదనంబుజేసి మడిసిరి
నదిసుత గురు కర్ణ శల్య నాగ పురీశుల్
అప్పకవి ఉదాహరించిన విరాటపర్వంలోని పద్యం:
ఢాంఢమిత భేరికా ధ్వానముం ఢులీ ని
నాదమును నిన్ను ముట్ట ననారతంబు
పెక్కుగంధర్వపతులు నల్దిక్కులందు
గాచు సౌగంధికంబు దేగలరె యొరులు?

శైలిసవరించు

అథర్వుని శైలి చాలా కఠినమనీ, సమాసజటిలమఇన ఇతని కవిత కవిత్రయంవారి భారతం ముందు నిలబడలేక పొయిందనీ, తత్కారణముననే ఇతని భారతం కవిత్రయం వారి భారతం అంత ప్రచారం లభించలేదనీ పండితులు భావిస్తున్నారు.

ఆరుద్ర ముక్తాయింపుసవరించు

" మొత్తం మీద ఈ ఉదాహరణలన్నీ చూస్తూ ఉంటే ఒక చక్కని భారతరచన మనకు దక్కలేదే అన్న చింత ప్రతిసాహిత్యప్రియునికీ కలుగుతుంది. ఇతని ఛందస్సులోనివని లాక్షణికులు ఉదాహరించిన పదాలను గమనిస్తే ఇతని గ్రంథం సమగ్రమైన దేమో అనిపిస్తుంది. ఒక్క ఆనందరంగరాట్ఛందంలోనే ఇతనివి 26 పద్యాలు పేర్కొన్నాడు.

అధర్వణుని భారతమో, లేక కనీసం ఛందస్సో ముందు ముందు లభించాలని ఆశిద్దాం. ఇప్పటికి దొరికిన ఆక్షరాలనుబట్టి ఇతణ్ణిగురించి ఇంతకన్నా ఎక్కువ మనకు తెలియదు.

"

మూలాలుసవరించు

  1. ఆరుద్ర - సమగ్ర ఆంధ్రసాహిత్యం