పద్యాలను వ్రాయడానికి ఉపయోగించే విధానాన్ని ఛందస్సు అంటారు. ఛందస్సును మొట్టమొదట సంస్కృతములో రచించిన వేదాలలో ఉపయోగించారు. వేదముల యొక్క అంగములనబడు ఆరు వేదాంగములలో ఛందస్సు ఒకటి. వేదత్రయాన్ని ఛందస్సు అని కూడా అంటారు. ఋగ్వేదము, సామవేదము సంపూర్ణముగా పద్య (శ్లోక) రూపములో నున్నవి. యజుర్వేదములో గద్యము కూడా ఉంది. సామవేదమంతయూ ఛందస్సేనని పండితుల అభిప్రాయము. బ్రహ్మవిష్ణుశివులలాగా ప్రతి మంత్రానికీ ఋషి, ఛందస్సు, దేవత త్రిమూర్తులని భావిస్తారు. కావ్య నిర్మాణానికి వాడబడునది ఛందస్సు.

బ్రహ్మ మహేశ్వర విష్ణులు
పద్య విశేషాలు
వృత్తాలు
ఉత్పలమాల, చంపకమాల
మత్తేభం, శార్దూలం
తరళం, తరలము
తరలి, మాలిని
మత్తకోకిల
స్రగ్ధర, మహాస్రగ్ధర
ఇంద్రవజ్రము, ఉపేంద్రవజ్రము
లయగ్రాహి, లయవిభాతి
జాతులు
కందం, ద్విపద
తరువోజ
అక్కరలు
ఉప జాతులు
తేటగీతి
ఆటవెలది
సీసము

వేద ఛందస్సుసవరించు

వేదాలలో ముఖ్యంగా అనుష్టుప్ (8 అక్షరములు), బృహతి (9), పంక్తి (10), త్రిష్టుప్ (11), జగతి (12) అనబడు ఛందములను ఉపయోగించారు. మిక్కిలి ప్రఖ్యాతి గడించిన ఛందస్సు త్రిపద గాయత్రీ ఛందస్సు. అది తత్సవితుర్వరేణియం భర్గోదేవస్య ధీమహీ ధియో యోనః ప్రచోదయాత్. కొందరు మొదటి పాదములో వరేణ్యం అంటారు. అప్పుడు గాయత్రి ఛందస్సుకు 23 అక్షరాలే. ఇది గాయత్రిలో ఒక ప్రత్యేకత.

ఛందస్సు వేదాంగమైనప్పటికీ, వేద ఛందస్సును వివరించే గ్రంథాలేవీ ప్రస్తుతము లభ్యము కావట్లేదు. ఛందో శాస్త్రముపై ప్రస్తుతం లభ్యమవుతున్న అత్యంత పురాతనమైన గ్రంథము ప్రాచీన భారతీయ గణిత శాస్త్రజ్ఞుడైన పింగళుడు రచించిన ఛందస్ శాస్త్ర. ఇది వేద సంస్కృతము, పురాణ సంస్కృతముల సంధికాలమునకు చెందినది. హిందూ పౌరాణికంలో ఈశ్వరుడు పార్వతికి ఛందస్సును బోధిస్తుండగా దానిని విని పింగళాచార్యుడు ఛందస్సు శాస్త్రమును వ్రాసినాడని అంటారు. పింగళుడు ఇప్పటి కర్ణాటక దేశ వాసుడని ప్రతీతి.

ఆ తరువాత మధ్యయుగపు తొలినాళ్లలోని ఛందస్ శాస్త్రపై ఆధారితమైన అగ్ని పురాణము, భారతీయ నాట్య శాస్త్రంలోని 15వ అధ్యాయము, బృహత్‌సంహిత యొక్క 104 అధ్యాయములు ఛందస్సుపై లభ్యమవుతున్న వనరులు. 14వ శతాబ్దములో కేదారభట్టు రాసిన వ్రిత్తరత్నాకర ఛందస్సుపై ప్రసిద్ధి చెందిన గ్రంథమైనప్పటికీ వేద ఛందస్సును చర్చించదు.

తెలుగు ఛందస్సుసవరించు

పాదాది నియమములు గలిగిన పద్య లక్షణములను తెలుపునది ఛందస్సు అనబడును. తెలుగు ఛందస్సు, సంస్కృత ఛందస్సు పై ఆధారపడి అభివృద్ధి చెందినది. సంస్కృత ఛందస్సులోని వృత్తాలతో బాటు జాతులు, ఉపజాతులు తెలుగులోని ప్రత్యేకతలు. ఆధునిక పాఠకులు, లేఖకులు, నవ కవులు, విప్లవ కవులు ఛందస్సు పురాతనమైనదని, ప్రగతి నిరోధకమని భావించినా కొన్ని చలన చిత్ర పాటలలో, శ్రీ శ్రీ గేయాలలో మాత్రా ఛందస్సును చూడవచ్చు.

గురువులు, లఘువులుసవరించు

ఛందస్సు ద్విసంఖ్యామానంపై ఆధారపడి ఉంది. ఛందస్సులో రెండే అక్షరాలు. గురువు, లఘువు. గురువుని U తోటి, లఘువుని l తోటి సూచిస్తారు

గురువు, లఘువు, విభజించడముసవరించు

ఈ గురు, లఘు నిర్ణయం ఒక అక్షరాన్ని పలికే సమయంపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు "అమల, అమ్మ, ఆవల, అండ" ఇందులో మొదటి పదము "అమల": అ మ ల మూడు అక్షరాలు ఒక్కొక్కటి ఒక లిప్త కాలము మాత్రమే తీసుకుంటున్నాయి. రెండవ పదము "అమ్మ" ఇందులో మొదటి అక్షరము అమ్ రెండు లిప్తల కాలము, ఆ తరువాతి ఒక లిప్త అక్షరము కాలము తీసుకుంటున్నది. అలాగే మూడవ పదము "ఆవల" ఆ = రెండు లిప్తలు, వ, లలు ఒక లిప్త కాలములు తీసుకుంటున్నాయి. ఇలా ఒక లిప్త కాలము తీసుకొను వాటిని లఘువు అని, రెండు లిప్తల కాలము తీసుకొను వాటిని గురువు అని అంటారు.

కొన్ని నియమాలుసవరించు

  1. దీర్ఘాలున్న అక్షరాలన్నీ గురువులు. ఉదాహరణకు ఆట = U I
  2. "ఐ" "ఔ" అచ్చులతో కూడుకున్న అక్షరాలు గురువులు. (ఉదా: ఔనులో "ఔ" గురువు, "సైనికుడు"లో "సై" గురువు)
  3. ఒక సున్నా, విసర్గలు ఉన్న అక్షరాలు అన్నీ గురువులే (ఉదా: సందడిలో సం గురువు, అంత:పురములో త: అనునది గురువు )
  4. సంయుక్తాక్షరం (లేదా ద్విత్వాక్షరం) ముందున్న అక్షరం గురువవుతుంది. (ఉదా: అమ్మలో అ గురువు, భర్తలో భ గురువు). ఇది సాధారణంగా ఒకే పదంలోని అక్షరాలకే వర్తిస్తుంది. ఒక వాక్యంలో రెండు పదాలున్నప్పుడు, రెండవ పదం మొదటి అక్షరం సంయుక్తమైనా మొదటి పదం చివరి అక్షరం గురువు అవ్వదు. (ఉదా: అది ఒక స్తంభము అన్న వాక్యంలో "క" గురువు కాదు) అయితే రెండు పదాలూ ఒకే సమాసంలో ఉంటే ఈ నియమం వర్తిస్తుంది. (ఉదా: అది ఒక రత్నస్తంభము అన్నప్పుడు "త్న" గురువు అవుతుంది)
  5. ఋ అచ్చుతో ఉన్న అక్షరాలు, వాటి ముందరి అక్షరాలు (కృ, మొదలగున్నవి ) లఘువులు మాత్రమే.
  6. ర వత్తు ఉన్నప్పటికి దాని ముందు అక్షరములు కొన్ని సందర్భములలో లఘువులే! అద్రుచులోని అ లఘువు, సక్రమలో స గురువు. అభ్యాసము ద్వారా వీటిని తెలుసుకొనవచ్చు.
  7. పొల్లుతో కూడిన అక్షరాలు గురువులు. (ఉదా: "పూసెన్ గలువలు"లో "సెన్" గురువు)

గణాలు-రకాలు .సవరించు

అక్షరాల గుంపును గణము అని అంటారు. ఇవి నాలుగు రకాలు

ఏకాక్షర గణాలుసవరించు

ఒకే అక్షరం గణంగా ఏర్పడుతుంది. అది గురువు లేదా లఘువు కావచ్చు.

U, U, U

ఉదా: శ్రీ, శై, లం

రెండక్షరాల గణాలుసవరించు

రెండు అక్షరాలు కలిసి గణంగా ఏర్పడును. ఇవి నాలుగు రకాలు .౧. లలము ౨. లగము ( వ గణం ) ౩. గలము ( హ గణం ) ౪.గగము.

  1. లల II ఉదా: రమ, క్రమ, సమ, ధన, అన్నీ కూడా లల గణములు
  2. లగ లేదా వ IU ఉదా: రమా
  3. గల లేదా హ UI ఉదా: అన్న, అమ్మ, కృష్ణ
  4. గగ UU ఉదా: రంరం, సంతాన్

మూడక్షరాల గణాలుసవరించు

ఇవి మూడక్షరాల కలయికలతో ఏర్పడేవి (బైనరీ ౦, ౧, తీసుకున్న ౦౦౦, ౦౦౧, ౦౧౦, ౦౧౧, ౧౦౦, ౧౦౧, ౧౧౦, ౧౧౧) కింది వాక్యాన్ని మననం చేసుకుంటూ వీటిని సులువుగా గుర్తుంచుకోవచ్చు. య మా తా రా జ భా న స ల గం గణం కావాలంటే పై వాక్యంలో తో మొదలుపెట్టి వరుసగా మూడక్షరాల గురు లఘువులను గుర్తిస్తే యగణం అవుతుంది. యతో మొదలుపెట్టి మూడక్షరాలు: య మా తా - లఘువు,, గురువు, గురువు IUU అలాగే రాతో మొదలుపెట్టి మూడక్షరాలు (రా జ భా - UIU) రగణం అవుతుంది. ఈ విధంగా అన్ని గణాలను గుర్తుంచుకోవచ్చు

అన్ని గణాలు:

  1. ఆది గురువు గణము UII
  2. మధ్య గురువు గణము IUI
  3. అంత్య గురువు గణము IIU
  4. సర్వ లఘువులు గణము III
  5. ఆది లఘువు గణము IUU
  6. మధ్య లఘువు గణము UIU
  7. అంత్య లఘువు గణము UUI
  8. సర్వ గురువులు గణము UUU

ఇవి మూడక్షరముల గణములు

ఉపగణాలుసవరించు

ఉప గణములు అనగా పైవాటి సమ్మేళనంలో ఏర్పడేవి. ఇవి మూడు రకములు

  1. సూర్య గణములు. ఇవి రెండు.
    1. న = న = III
    2. హ = గల = UI
  2. ఇంద్ర గణములు. ఇవి ఆరు.
    1. నగ = IIIU
    2. సల = IIUI
    3. నల = IIII
    4. భ = UII
    5. ర = UIU
    6. త = UUI
  3. చంద్ర గణములు. ఇవి పద్నాలుగు.
    1. భల = UIII
    2. భగరు = UIIU
    3. తల = UUII
    4. తగ = UUIU
    5. మలఘ = UUUI
    6. నలల = IIIII
    7. నగగ = IIIUU
    8. నవ = IIIIU
    9. సహ = IIUUI
    10. సవ = IIUIU
    11. సగగ = IIUUU
    12. నహ = IIIUI
    13. రగురు = UIUU
    14. నల = IIII

పద్య లక్షణాలుసవరించు

వృత్తాలుసవరించు

గణాలతో శోభిల్లుతూ, యతి ప్రాస లక్షణాలను కలిగి ఉన్నటువంటివి వృత్తాలు. ఇందు చాలా రకాలు ఉన్నాయి.

  1. చంపకమాల
  2. ఉత్పలమాల
  3. శార్దూల విక్రీడితము
  4. మత్తేభ విక్రీడితము
  5. తరళం
  6. తరలము
  7. తరలి
  8. మాలిని
  9. మత్తకోకిల
  10. ఇంద్రవజ్రము
  11. ఉపేంద్రవజ్రము
  12. కవిరాజవిరాజితము
  13. తోటకము
  14. పంచచామరము
  15. భుజంగప్రయాతము
  16. మంగళమహశ్రీ
  17. మానిని
  18. మహాస్రగ్ధర
  19. లయగ్రాహి
  20. లయవిభాతి
  21. వనమయూరము
  22. స్రగ్ధర

జాతులుసవరించు

జాతులు మాత్రాగణములతో, ఉపగణములతో శోభిల్లును. జాతులకు కూడా యతి, ప్రాస నియమములు ఉన్నాయి.

  1. కందం
  2. ద్విపద
  3. తరువోజ
  4. అక్కరలు (మహాక్కర, మధ్యాక్కర, మధురాక్కర, అంతరాక్కర అల్పాక్కర)
  5. ఉత్సాహము

ఉప జాతులుసవరించు

  1. తేటగీతి
  2. ఆటవెలది
  3. సీసము (పద్యం)

పలు విధములైన ఛందములుసవరించు

  • యధా-ఆర్యా చందము- ప్రథమ తృతీయ పాదములందు ద్వాదశ మాత్రలును ద్వితీయపాదమందు 18 మాత్రలు చతుర్దశపాదమందు 15 మాత్రలను కలిగి యుండు చందమును యద్ధా ఆర్యా చందము అంటారు. ఇందు పూర్వార్ధ సదృశమై ఉత్తరార్ధమునుండి ఉన్నచో అది గీతి ఉత్తరార్ధ సదృశమై పూర్వార్ధముండినచో అది ఉపగీతి అనబడును. ఆర్యాది ఛంధములో 4 మాత్రలు గల 5 గణములుండును. సర్వగురు, అంత్యగురు,మధ్యగురు, ఆదిగురు, చతుర్లఘువులు ఈ భేదములకు వరుసగా కర్ణ, కరతల, పయోధర, వసుచరణ,విష్ఠములని నామములు.
  • పరిగణితాక్షర సిద్ధమగు చందములను వర్ణిక లందురు.
  • శిఖరిణి అను ఛంధములో ప్రతిపాదమునందు సమానములైన హ్రస్వదీర్ఘములైన 17 యక్షరములు ఉండును.
  • పుష్పితాగ్ర ఛంధము- దీని ప్రథమ తృతీయ చరణములు సమాన లక్షణములతో 12 అక్షరములు- రెండు నగణములు 1 రగణము 1 యగణముతో ఉండును. ద్వితీయ చతుర్ధ చరణములలో ఒకే లక్షణముతో కూడిన 13 అక్షరములు- 1నగణము 2 జగణములు 1 రగణము 1 గురువు ఉండును.
  • చండవృష్టి ఛంధము- 20 అక్షరములు గల దండమునకు చండవృష్టి ప్రపాతమని పేరు. ఇందు రెండు నగణములు 7 రగణములు ఉన్నాయి.పదాంతమున విరామము.
  • పేరుక్త ఛంధము - ప్రతిపాదమునందును ఒక్కొక్క అక్షరము ఉండును.దీనికి రెండు భేదములు కలవు మొదటిది గురువు అగునది- దీనికి శ్రీ అని పేరు- ఉదా: విష్ణుం వందే, రెండవది లఘువు అక్షరముతో అగునది- ఉదా: హరి హర.
  • రత్యుక్త ఛంధము - ప్రతిచరణమునందును 2 అక్షరములు గలవు. ప్రసారముచే దీనికి 4 భేదములు. ప్రధం భేదము స్త్రీ; రెండు గురువులుగల నాల్గుపాదముల ఛంధము స్త్రీ.
  • మధ్య ఛంధము- మూడు అక్షరములు గల ఛంధము. దీనికి 8 భేదములు ఉన్నాయి. మూడు అక్షరములు గురువుగా నున్న మొదటి భేదము పేరు వారి.
  • ప్రతిష్ఠ ఛంధము- 4 అక్షరములు గల ఛంధము.ప్రస్తారమున దీనికి 16 భేదములు ఉన్నాయి.ప్రథమభేదము పేరు కన్య. ఉదా: భాస్వత్క న్యా సైకా ధన్యా. యస్యాః కూలే కృష్ణో ఖేలత్||
  • సుప్రతిష్ఠ ఛంధము- ప్రస్తారమున దీనికి 32 భేదములు ఉన్నాయి. దీని 9 వ భేదముపేరు పంక్తి 1 భగణము 2 గురువులు.
  • గాయత్రి ఛంధము- దీనికి ప్రస్తారమున 64 భేదములు ఉన్నాయి. దీని మొదటి భేదము పేరు విద్యుల్లేఖ- 2 మగణములు 13 వ భేదము పేరు తనుమధ్య-తగనము, యగణము 16 భేదము పేరు శశివదన -నగనము, యగణము 19వ భేదము వసుమతి తగణము, సగణము.
  • అనుష్టుపు ఛంధము - ప్రస్తారమున దీనికి 256 భేదములు ఉన్నాయి. దీనిన విద్యున్మాల మాణవకాక్రీడ, చిత్ర పద, హంసరుత, ప్రమాణిక, సమానిక, శ్లోక, భేద ప్రబేధములు ఉన్నాయి. శ్లోక ఛంధమున ప్రతి చరణము నందును 6వ అక్షరము గురువై 5వ అక్షరము లఘువు. ప్రధం, తృతీయ చరణములందును 7 అక్షరము దీర్షముగాను ద్వితీయ,చతుర్ధ చరణములందును హ్రస్వముగాను ఉండును.
  • బృహతి ఛంధము- ప్రస్తారమున దీనికి 512 భేదములు ఉన్నాయి. 251వ భేదము హలముఖి- ర, న, సగణములు. 64 వ భేదము భుజ్మగ శిశుభృతము- 2నగణములు 1మగణము.
  • పంక్తి ఛంధము- ప్రస్తారమున దీనికి 1024 భేదములు ఉన్నాయి. దీనిలో శుద్ధవిరాట్, పణవ, రుక్మవతి, మయూర సారిణి, మత్తా, మనోరమా, హంసీ, ఉపసిత్థా, చంపకమాలా అనేక అవాంతర భేదములు ఉన్నాయి.
  • త్రిస్టుపు ఛంధము - ప్రస్తారమున దీనికి 2048 భేదములు ఉన్నాయి.దీనికే అనేకావాంతర భేదములు కలవు - ఇంద్రవ్రజ- 2 తగణములు 1 జగణము 2 గురువులు, ఉపేంద్రవ్రజ-1 జగణము 1 తగణము 1 జగణము 2 గురువులు, ఉపజాతి- ఇంద్రవ్రజ ఉపేంద్రవ్రజ కలయిక, దోధక- 3 భగణములు 2 గురువులు, శాలిని రథోద్దత- మ,త గణములు 2 గురువులు, స్వాగత -ర,న,భ గణములు 2 గురువులు- మొదలగు నామములతో ప్రసిద్ధమైనవి.
  • జగతి ఛంధము -ప్రస్తారమున దీనికి 4096 భేదములు ఉన్నాయి. అందులో వంశస్థము- జ,త,జ,ర గణములు పాదాంతరమున యతి, ఇంద్రవంశము-త,త,జ,రగణములు పాదాంతమున యతి, ద్రుత విలంబిత,తోటక, భుజంగ ప్రయూత, స్రగ్విణి, మొదలైనవి ప్రసిద్ధములు.
  • అతి జగతి ఛంధము - ప్రస్తారమున దీనికి 8192 భేదములు ఉన్నాయి. ఇందులో ప్రహర్షిణి-మ,న,జ,రగణములు 1 గురువు 2-10 యక్షరములపై యతి- ప్రసిద్ధమైనది.
  • శక్వరి ఛంధము - ప్రస్తారమున దీనికి 16384 భేదములు ఉన్నాయి. ఇందులో ఒకటి వసంతలతిక- త,భ గణములు 2 జగణములు 2 గురువులు. పాదాంతరమున విరామము. దీనినే కొందరు సింహోన్నత, ఉద్ధరిణి అని కూడా అంటారు.
  • అతిశక్వరి ఛంధము- ప్రస్తారమున దీనికి 32768 భేదములు ఉన్నాయి. చంద్రావర్త- 4 న, 1 సగణము 7-8 అక్షరములపై విరామము, మాలిని-2 న, 1 మ, 2 భగణములు 7-8 అక్షరములపై యతి, చంద్రావర్తకం - 7-8 అక్షరములపై విరామము 6-9 అక్షరములపై విరామము.
  • అష్టి ఛంధము- ప్రస్తారమున దీనికి 65536 భేదములు ఉన్నాయి. ఇందులో వృషభజగ విలసితము- భ,ర 3 న, 1 గురువు 7-9 అక్షరములపై యతి.
  • అత్యష్టి ఛంధము- ప్రస్తారమున దీనికి 131072 భేదములు ఉన్నాయి. ఇందు హరిణి, పృధ్వి, వంశపత్రపతితము, మందాక్రాంత, శిఖరిణి వృతములు ఉన్నాయి.
  • ధృతి ఛంధము- ప్రస్తారమున దీనికి 262144 భేదములు ఉన్నాయి.అందు భేదము కుసుమితాలతావేల్లితము- మ,త,న, 3 య గణములు 5-6-7 అక్షరములపై యతి.
  • విధృతి ఛంధము-ప్రస్తారమున దీనికి 524288 భేదములు ఉన్నాయి.ఇందలి భేదమే శార్దూల విక్రీడితము- మ,స,జ,స,త,త,గ ములు.12-7 వ అక్షరములపై యతి.
  • కృతి ఛంధము-ప్రస్తారమున దీనికి 1048576 భేదములు ఉన్నాయి.ప్రతి చరణము నందును 20, 20 అక్షరములు ఉన్నాయి.
  • ప్రకృతి ఛంధము-ప్రస్తారమున దీనికి 2097152 భేదములు ఉన్నాయి. ఇందులో ఒకటి స్రగ్ధర-మ,ర,భ,న,య,య,య,గణములు ఏడేసి అక్షరములపై యతి.
  • ఆకృతి ఛంధము-ప్రస్తారమున దీనికి 4194304 భేదములు ఉన్నాయి. ఇందులో ఒకటి భద్రకము- భ,ర,న,ర,న, గములు 10-12 అక్షరములపై యతి.
  • వికృతి ఛంధము-ప్రస్తారమున దీనికి 8388608 భేదములు ఉన్నాయి. ఇందులో అశ్వలలిత- న,జ,భ,జ,భ ల గములు, మత్తాక్రీడ- మ,మ,త,న,న,న,ల గములు.8-15 అక్షరములపై విరామము.
  • సంకృతి ఛంధము-ప్రస్తారమున దీనికి 16777216 భేదములు ఉన్నాయి. ఇందులో ఒకటి తన్వి -భ,త,న,స,భ,భ,న,య గణములు.5-7-12అక్షరములపై విరామము.
  • అతికృతి ఛంధము-ప్రస్తారమున దీనికి 33553432 భేదములు ఉన్నాయి. ఇందులో ఒకటి క్రౌంచపదము- భ,మ,స,భ,న,న,న,న గములు.5-8-7 అక్షరములపై విరామము.
  • ఉదాయము ఛంధము-ప్రస్తారమున దీనికి 67108864 భేదములు ఉన్నాయి. ఇందులో ఒకటి భుజంగ విజృంభితము - 2 మ, 1త, 3 నగణములు, 1ర, 1 స, 1ల, 1 గు 8-11-7 అక్షరములపై విరామము.

ఇవీ చూడండిసవరించు

  1. తెలుగు సాహిత్యము
  2. అలంకారములు

మూలములుసవరించు

  • 1957- భారతి మాస పత్రిక వ్యాసము-ఛందశ్శాస్త్రము- శ్రీ తటవర్తి సూర్యనారాయణమూర్తి.

బయటి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=ఛందస్సు&oldid=3783669" నుండి వెలికితీశారు