అన్నపూర్ణ భోజన పథకం

తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన భోజన పథకం

అన్నపూర్ణ భోజన పథకం, తెలంగాణ రాజధాని హైదరాబాదు నగర ప్రజలకు కేవలం 5 రూపాయలకే ఆహారాన్ని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పథకం. ఈ అన్నపూర్ణ పథకం ద్వారా 2014 నుంచి 2022 మే నెల వరకు రూ.185.89 కోట్లను ఖర్చుతో 9,67,53,612 భోజనాలను అందించబడ్డాయి.[1] ఈ పథకం కింద ప్రతిరోజూ 400 గ్రాముల అన్నం, 120 గ్రాముల సాంబారు, 100 గ్రాముల కూరగాయల కూర, 15 గ్రాముల పచ్చిమిర్చి కూరతోపాటు పచ్చడితో కూడిన నాణ్యమైన పోషక విలువలున్న భోజనాన్ని ఈ అన్నపూర్ణ పథకం కింద అందిస్తున్నారు.[2]

అన్నపూర్ణ భోజన పథకం
అన్నపూర్ణ క్యాంటీన్
ప్రాంతంహైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
దేశంభారతదేశం
ప్రధాన వ్యక్తులుహైదరాబాదు నగర ప్రజలు
స్థాపన2014, మార్చి 1
వెబ్ సైటుజీహెచ్‌ఎంసీ వెబ్సైటు
నిర్వాహకులుహైదరాబాదు మహానగరపాలక సంస్థ, హ‌రేకృష్ణ మూమెంట్ ఛారిట‌బుల్ ఫౌండేష‌న్

ప్రారంభం

మార్చు

హైదరాబాదు మహానగరపాలక సంస్థ ఆధ్వర్యంలో హ‌రేకృష్ణ మూమెంట్ ఛారిట‌బుల్ ఫౌండేష‌న్ సహకారంతో 2014 మార్చి 1న నాంప‌ల్లి రైల్వే స్టేష‌న్ వ‌ద్ద ఈ పథకం ప్రారంభించబడింది.[3] మొదట ప్రయోగాత్మకంగా 8 కేంద్రాల‌తో రోజుకు 2,500 మందికి భోజ‌నాన్ని అందించబడింది. ఆ తరువాత ద‌శ‌ల‌వారిగా న‌గ‌రంలోని పలు ప్రాంతాలలో దాదాపు 150 అన్నపూర్ణ క్యాంటీన్ల ద్వారా రోజుకు 45 వేల అన్న పూర్ణ భోజనాలను అందించేవారు. తెలంగాణ రాష్ట్ర ఐటి, పుర‌పాల‌క, పరిశ్రమల శాఖామంత్రి కల్వకుంట్ల తారకరామారావు 2017, మార్చి 16న దీనికి అన్న‌పూర్ణ భోజన ప‌థ‌కంగా పేరు పెట్టాడు.[4] 2022 జూలై నాటికి 373 కేంద్రాల ద్వారా రోజుకు దాదాపుగా 80వేల మందికి రెండు పూటలా ఉచిత భోజనాలు అందించబడుతోంది.

ఈ పథకంలో భాగంగా రూ. 5కే భోజనం అందించేందుకు హరేకృష్ణ మూవ్‌మెంట్‌ ఛారిటబుల్‌ ఫౌండేషన్‌తో హైదరాబాదు మహానగరపాలక సంస్థ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం లబ్ధిదారులు 5 రూపాయలు చెల్లించనుండగా, రూ. 19.25 జీహెచ్‌ఎంసీ చెల్లిస్తోంది.

ఇతర జిల్లాల్లో

మార్చు

ఈ పథకాన్ని స్పూర్తిగా తీసుకున్న వరంగల్‌, మహబూబ్‌నగర్‌, సిరిసిల్ల, కరీంనగర్‌, ఖమ్మం, సూర్యాపేట, సిద్ధిపేట జిల్లాల్లోని వివిధ మున్సిపాలిటీల్లో ఈ అన్నపూర్ణ భోజనాన్ని అందిస్తున్నారు.[5] రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన అన్నపూర్ణ క్యాంటిన్ ను 2019 ఫిబ్రవరి 8న కేటీఆర్ ప్రారంభించి, ప్రారంభోత్సవం అనంతరం స్థానిక ప్రజలతో మాట్లాడుతూ అధికారులతో కలిసి అదే క్యాంటిన్‌లో భోజనం చేశాడు.[6]

మోబైల్ క్యాంటిన్లు

మార్చు

2020 మార్చి 2న రాష్ట్రంలోని సీనియర్ సిటిజన్లు, దివ్యాంగలు కోసం మొబైల్ అన్నపూర్ణ క్యాంటీన్ పథకం ప్రారంభించబడింది. వండిన ఆహారాన్ని కేవలం రూ. 5 కే మొబైల్ అప్లికేషన్ సహాయంతో లబ్ధిదారులు భోజనాన్ని బుక్ చేసుకుంటే, ఆహారం వారి ఇంటివద్దకే డెలివరీ చేయబడుతుంది. ఈ పథకంలో భాగంగా ఐదు మొబైల్ క్యాంటీన్ వాహనాలను ఫ్లాగ్ ఆఫ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ఎంఎయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, జిహెచ్ఎంసి కమిషనర్ డిఎస్ లోకేష్ కుమార్, హరేకృష్ణ మూవ్‌మెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్ అధ్యక్షులు సత్యగౌర చంద్రదాసు పాల్గొన్నారు.[7]

లాక్‌డౌన్‌ సమయంలో

మార్చు

లాక్‌డౌన్‌కు ముందు, మొదటి లాక్‌డౌన్ సమయంలో మధ్యాహ్న భోజన సమయంలో, మొబైల్ అన్నపూర్ణ క్యాంటీన్‌తోసహా 373 కేంద్రాలలో, రాత్రి భోజన సమయంలో 259 కేంద్రాలలో పూర్తిగా ఉచితంగా ఆహారాన్ని అందించారు.[8]

సీటింగ్ క్యాంటిన్లు

మార్చు

2020-21లో మొత్తం 2 కోట్ల 29 లక్షల 46వేల 80 భోజనాలను అందించడం జరిగింది. జీహెచ్‌ఎంసీలోని ఒక్కో సర్కిల్‌లో 32 స్థలాలలో సీటింగ్ తో కూడిన క్యాంటీన్లు ఏర్పాటుచేయనున్నారు.[9] ఇందులో భాగంగా మొత్తం రూ. 8.70 లక్షల వ్యయంతో 40 అడుగుల పొడవు, 14 అడుగుల వెడల్పుతో క్యాంటీన్ల విస్తీర్ణాన్ని పెంచి డైనింగ్‌ టేబుళ్లను ఏర్పాటుచేసి, కనీసం 35 మంది కూర్చుని తినడంతోపాటు చేతులు కడుక్కునేందుకు వాష్‌ బేసిన్‌, ఫ్యాన్లు, స్టీల్‌ ప్లేట్‌లో భోజనం చేసే సదుపాయాలను సమకూర్చనున్నారు.[10]

మూలాలు

మార్చు
  1. "Annapurna Canteens: పేద ప్రజల ఆకలి తీరుస్తోన్న అన్నపూర్ణ భోజన పథకం". ETV Bharat News. 2022-07-26. Archived from the original on 2022-07-26. Retrieved 2022-07-26.
  2. "అన్నార్థుల ఆకలి తీరుస్తున్న రూ.5 భోజనం.. సిటీలో సిట్టింగ్‌ అన్నపూర్ణ క్యాంటీన్లు". Prabha News. 2022-07-24. Archived from the original on 2022-07-26. Retrieved 2022-07-26.
  3. "అన్నపూర్ణ.. అక్షయ పాత్ర". Sakshi. 2022-07-25. Archived from the original on 2022-07-26. Retrieved 2022-07-26.
  4. G, Rajesh (2020-03-03). "GHMC Launches Rs 5 Mobile Annapurna Meal Scheme In Hyderabad". Mango News. Archived from the original on 2022-07-26. Retrieved 2022-07-26.
  5. "అన్నార్తుల ఆకలి తీరుస్తున్న 'అన్నపూర్ణ' భోజన పథకం". www.andhrajyothy.com (in ఇంగ్లీష్). 2020-04-03. Archived from the original on 2022-07-26. Retrieved 2022-07-26.
  6. "PICS: రూ.5 భోజనంపై కేటీఆర్ ప్రశంసలు...సిరిసిల్లలో అన్నపూర్ణ క్యాంటిన్". News18 Telugu. 2019-02-08. Archived from the original on 2020-08-08. Retrieved 2022-07-26.
  7. Madhuri (2020-12-16). "Mobile Annapurna Canteen: Book Meal at Rs 5 & Get Door Delivery". PM Modi Yojana. Archived from the original on 2022-03-02. Retrieved 2022-07-26.
  8. Telugu, TV9 (2022-07-25). "Hyderabad: సరికొత్తగా జీహెచ్ఎంసీ అన్నపూర్ణ క్యాంటిన్.. రూ. 5ల భోజనంతోపాటు అందుబాటులోకి మరిన్ని సౌకర్యాలు." TV9 Telugu. Archived from the original on 2022-07-26. Retrieved 2022-07-26.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  9. telugu, NT News (2022-07-25). "ఆకలి తీర్చుతున్న అన్నపూర్ణ". Namasthe Telangana. Archived from the original on 2022-07-26. Retrieved 2022-07-26.
  10. R, Nagaraju (2020-02-11). "Vaartha Online Edition తెలంగాణ". Vaartha. Archived from the original on 2022-03-16. Retrieved 2022-07-26.