అభంగాలు అంటే మహారాష్ట్రలోని పండరీపురంలో వెలసిన విఠోబా దేవుని కీర్తిస్తూ రాసిన దివ్య కవిత్వం. అభంగం అంటే అంతం లేనిది అని అర్థం.[1] భజనలు అంతరాత్మలోకి ప్రయాణానికి నిర్దేశించినవైతే అభంగాలు ముఖ్యంగా భయట సమాజంతో అనుభవాలను క్రోడీకరించి రాసినవి.[2] పండరీపురానికి వెళ్ళే భక్తులు ఈ అభంగాలను గానం చేస్తూ వెళుతుంటారు. భజనలు చేసేవారే కాక వీటిని దక్షిణ, ఉత్తర భారత సంగీత సంప్రదాయాల ప్రకారం స్వరపరచి శాస్త్రీయ సంగీత కళాకారులు కూడా గానం చేస్తుంటారు. మహారాష్ట్రలో భక్తి సంప్రదాయాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన జ్ఞానేశ్వరుడు, నామదేవుడు, తుకారాం మొదలైన వారు అభంగాలను రచించారు.

చరిత్ర మార్చు

భక్తి సాంప్రదాయం, నామసంకీర్తనం మొదటిసారిగా జ్ఞానేశ్వరుడు సుమారు సా.శ. 1200 కాలంలో వెలుగులోనికి తీసుకువచ్చాడు. అప్పటి దాకా ప్రజల్లో భగవంతుని చేరాలంటే కచ్చితంగా సంస్కృతం తెలిసి ఉండాలనే అభిప్రాయం ఉండేది. జ్ఞానేశ్వరుడు, నామదేవుడు తమ రచనలు, భక్తి ద్వారా కులం, జాతితో సంబంధం లేకుండా పాండురంగడిని చేరే మార్గాన్ని ఉపదేశించి కొత్త సంప్రదాయానికి బాటలు వేశారు. కేవలం భక్తి ద్వారా దేవుణ్ణి చేరుకోగలమనే భక్తి సాంప్రదాయా నికి ఇదే మూలమైంది. ఇది సామాన్యులు కూడా అనుసరించగల సులువైన పద్ధతి. ముఖ్యంగా పిల్లలు, మహిళలు ఈ సాంప్రదాయం వైపు సులభంగా ఆకర్షింపబడ్డారు.

తుకారాం పాండురంగడి భక్తుడు. మహారాష్ట్రలోని దేహో గ్రామ నివాసి. 1608 - 1649 మధ్య కాలంలో జీవించిన తుకారం, పాండురంగడిని సేవించడమే తన జీవితానికి పరమార్థంగా భావించాడు. పాండురంగడి ఆదేశం మేరకు అనేక అభంగాలు రచించి వాటిని ఆ స్వామికే అంకితమిచ్చాడు.

సాధన మార్చు

మరాఠీ భజనలు ముందుగా ప్రార్థనాగీతంతో ప్రారంభమవుతాయి. తరువాత విఠోబాయొక్క భౌతిక రూప లావణ్యాలను వర్ణించే రూపంచ అభంగాలు, చివరగా ఆధ్యాత్మిక, నీతిప్రభోదకమైన మార్మిక విషయాలు తెలియజేసే అభంగాలను గానం చేస్తారు. పండిట్ భీమ్‌సేన్ జోషి, సురేష్ వాడ్కర్, రంజని, గాయత్రి, అరుణా సాయిరాం, జితేంద్ర అభిషేక్ మొదలగు ప్రముఖులు అభంగాలను గానం చేశారు.

మూలాలు మార్చు

  1. Gowri Ramnarayan: Eclectic range at The Hindu, 8 November 2010
  2. Christian Lee Novetzke (13 August 2013). Religion and Public Memory: A Cultural History of Saint Namdev in India. Columbia University Press. pp. 275, 279. ISBN 978-0-231-51256-5.
"https://te.wikipedia.org/w/index.php?title=అభంగాలు&oldid=3499784" నుండి వెలికితీశారు