అభ్యుదయ రచయితల సంఘం

(అరసం నుండి దారిమార్పు చెందింది)

అభ్యుదయ రచయితల సంఘం (టూకీగా అరసం) సామాజిక అభ్యుదయాన్ని కోరే రచయితల సంఘం. జాతీయ స్థాయిలో 1936వ సంవత్సరంలో అఖిల భారత అరసం ఏర్పడింది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1943వ సంవత్సరంలో తెనాలి పట్టణంలో ఏర్పడింది. ఆనాటి ప్రథమ సమావేశానికి ప్రముఖ రచయిత తాపీ ధర్మారావు గారు అధ్యక్షత వహించారు.ఈ సంఘపు స్వర్ణోత్సవాలు కూడా తెనాలిలోనే 1994 ఫిబ్రవరి 12, 13 తేదీలలో నిర్వహించారు.[1]

చరిత్ర

మార్చు

దీనికి 1935లో ఇంగ్లాండ్‌లో పునాదులు పడ్డాయని చరిత్ర చెబుతున్నది. 1936లో లక్నోలో జరిగిన ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ తొలి సభలు తోడ్పడ్డాయి.[2] రవీంద్రనాథ్ టాగోర్, ప్రేమ్‌చంద్ వంటివారి మద్దత్తు, మంటో, చుగ్తాయ్, ముల్క్‌ రాజ్ ఆనంద్ వంటివారి భాగస్వామ్యంతో జరగడం వల్ల ఈ సభలు దేశం నలుమూలలా రచయితలను ఆకర్షించాయి.

పిదప 1943 సంవత్సరం విజయనగరంలో కూడా చాగంటి సోమయాజులు, శెట్టి ఈశ్వరరావు వంటి రచయితలు ఇటువంటి వేదిక ఆవిర్భావం కొరకు ఆలోచిస్తున్న సమయంలో తెనాలి నుంచి చదలవాడ పిచ్చయ్య కూడా వీరితో కలిశారు. అప్పటికే తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధులైన అనిశెట్టి సుబ్బారావు, బెల్లంకొండ రామదాసు, ఏల్చూరి సుబ్రహ్మణ్యం, రెంటాల గోపాలకృష్ణ, కుందుర్తి, మగ్దూం, సోమసుందర్, వట్టికోట, కొడవటిగంటి, దాశరథి, చంద్రమౌళి చిదంబరరావు తదితర రచయితలకు ఇటువంటి సంఘం ఒకటి ఏర్పడాలని కోరిక ఉండినది. దాని కొరకు చదలవాడ పిచ్చయ్య పూనిక మీద అందరూ వచ్చి పాల్గొనేందుకు వీలుగా తెనాలిలో 1943 ఫిబ్రవరి 13, 14 తేదీలలో తొలి ఆంధ్ర అభ్యుదయ రచయితల సంఘం సభలు జరిగాయి. వీటికి తాపీ ధర్మారావు అధ్యక్షత వహించారు. ఆ తర్వాత రెండో మహాసభ విజయవాడలో, మూడవది రాజమండ్రిల, గుంటూరు జిల్లా పెదపూడిలో నాలుగో మహాసభ జరిగాయి. అనంతరం దేశంలో ఏర్పడ్డ పరిణామాల వల్ల ఆ తరువాతి ఎనిమిదేళ్ల దాకా అంటే 1955 దాకా అరసం తన అయిదో మహాసభలు నిర్వహించుకోలేకపోయింది. 1955లో ఈ సభలు ఉప్పల లక్ష్మణరావు, శ్రీశ్రీ ఆధ్వర్యంలో జరిగాయి.

ఇక ఆరో మహా సభలకు పట్టిన కాలం అక్షరాలా పందొమ్మిదేళ్లు. ఇవి ఒంగోలులో 1974లో జరిగాయి. ఈ పందొమ్మిదేళ్ల కాలంలో కొత్త కవితాస్వరాలు వచ్చి అలుముకున్న స్తబ్దతను ప్రశ్నించాయి. దిగంబర, పైగంబర వంటి కవితా ఉద్యమాలు తమ వంతు ప్రభావాన్ని ప్రసరించాయి. హైదరాబాద్‌లో 1970 జూలై 4న విరసం ఆవిర్భవించింది. ఆ తర్వాత అరసంలో రెండు వర్గాలు ఏర్పడి పోటాపోటీ సభలు నిర్వహించాయి. క్రమంగా అసలు అరసం స్తబ్దుగా అయిపోవడంతో కొత్త అరసం బలం పుంజుకుంది. తుదకు అరసం ఏ రాజకీయ పక్షానికీ అనుబంధ సంస్థ కాదని తేల్చి చెప్పిన చాసో కూడా ఆరుద్ర సూచనతో ఎమర్జెన్సీకి మద్దతు ఇచ్చిన సిపిఐవారి వేదికైన కొత్త అరసంలో చేరి తను మరణించే వరకు అంటే పదకొండో మహాసభ వరకూ సేవలందిస్తూనే వచ్చారు. వారి కాలంలోనూ ఆ తరువాత కూడా డా.పరుచూరి రాజారాం, డా.ఎస్.వి.సత్యనారాయణ, డా.చందు సుబ్బారావు, పెనుగొండ లక్ష్మీ నారాయణ ప్రభృతులు బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు.

మూలాలు

మార్చు
  1. నేతి, పరమేశ్వరశర్మ (2006). నూరేళ్ల తెనాలి రంగస్థలి. తెనాలి: సప్తసింధు. pp. 482–483.
  2. "డెబ్బయి ఏళ్లుగా మోగుతున్న జనఢంకా అరసం". సాక్షి వార్తలు. సాక్షి. Retrieved 20 February 2016.