అవనిశ్రీ వీరేశ్

అవనిశ్రీ వీరేశ్ జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన కవి. జిల్లాలోని మల్దకల్ మండలం, దాసరిపల్లి స్వగ్రామం. వర్తమాన కాలంలో విరివిగా రచనలు చేస్తున్న తెలంగాణ యువకవులలో ఒకరు. వచన కవిత్వం, పాటలు, సమకాలినాంశాలపై వివిధ పత్రికల్లో వ్యాసాలు[1][2]రాస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఏర్పడిన తొలి ఏడాదే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లా ఉత్తమకవిగా అప్పటి కలెక్టర్ రజత్ కుమార్ షైని చేతుల మీదుగా అవార్డు స్వీకరించారు. ఇప్పటి వరకు రెండు వచన కవితా సంకలనాలు వెలువరించారు.

రచనలు

మార్చు
  1. మట్టి కుదురు
  2. ఆపతి
  3. ధిక్కార ఖడ్గం
రచనల్లో కొన్ని...

ఇసుర్రాయి

ఇసుర్రాయి
ఇంటింటి మట్టి అరుగు ఈతసాపమీద
దోసెడు గింజల్ని పగలగొట్టి
కడుపులో ఆకలిని నలిపేసే బండరాయి.
పల్లెప్రజల గొంతులోకి కాసింత
గంజో సద్దసంకటో కమ్మగా జారిపోవాలంటే
ఇంట్లో అవ్వనో అమ్మనో
ఇసుర్రాయి కి శాసబోయాల్సిందే.
భూమి సూర్యూని చుట్టూ
ఎలా తిరుగుతుందో
పల్లె ప్రజలు
బహుశ ఇక్కడి నుండే అర్థం చేసుకున్నారేమో..!
ఆ ఇంటి ముచ్చట ఈ ఇంటి ముచ్చటనీ
పల్లెసద్దులన్ని
ఇసుర్రాయి చుట్టే పొట్టుపొట్టు అయితుండేవి.
ఒకప్పుడు
ఇసుర్రాయిమీద ఇసిరిన తిండిగింజల్ని తిని
రాయిలాగా గట్టితనపు పాయము
మనిషి మనిషిలో ఉర్కులాడుతుండేది.
ఈ రాయికింద నలిగిన
కూడుతిన్నవారికి
ఎడెద్దులు తినే మ్యాత మోపును కూడా
ఒక్కపెట్టున నెత్తికెత్తుకునే బలముండేది.
పెండ్లిలప్పుడు
ఐదుమంది కలిసి చేతులకు కంకణాలు కట్టుకొని
కొత్త జొన్నలు ఇసిరి గమ్రం జరిగితేనే
పచ్చటిపందిట్లో పెండ్లిటికి రూపునిచ్చేది.
పాతగోడ ఇడుపుకు ఇల్లంత సుగ్గిబోయిన
ఇసుర్రాయి అరుగుమీద
ఓ మూలకు ఇంటిని కాపుగాసే బువ్వకుండ.
ఇసుర్రాయి పై ఇసిరి వంటచేసే
ఇంటాడి మనిషి ఫుస్తీ తగ్గకుండా
వందయేండ్ల జీవితకాలం మాత్రం
కాయిదంమీద రాసియ్యవచ్చు.
ఇప్పుడు ఇసుర్రాయి మూలకుపడ్డ ఆస్తి
రేపటితరం మరిచిపోయి
చరిత్రలో శాసనాల జాబితాలోకినెట్టేయబడ్డది.
ఏనాటికైనా
ఇసుర్రాయిది వన్నెతగ్గని చారిత్రక జ్ఞాపకం.

మూడుతరాల పాఠం

పెద్దలు
ఇంట్లో ఖాళీగా ఉండే బదులుగా
రేపటి తరమైన మీ పిల్లలకు
మీ మూడు తరాల కథను
భాగాలు భాగాలుగా కత్తరించి
వాక్యాల వారధి కట్టండి.
పుస్తకాల్లో లేని సిలబస్ ను
టీచర్లు చెప్పలేని అనుభవాలను
ఏ ప్రయోగశాల నేర్పలేని పాఠాలను
ఏ సమాజం ఇవ్వలేని జ్ఞానాన్ని
మీ ఇండ్లలో మీరే
వంతులేసుకొని పాఠాలు పాఠాలుగా చెప్పండి.
ప్రతిరోజు సద్దసంకటితో గొడ్డుకారం కల్పుకొని తిని
పండగనాడొక్కటే పరిగకంకులను యేరుకొచ్చి
బండమీద రాల్పి తూర్పారబట్టి
రొట్లో దంచి కట్టెలపొయ్యిమీద కొత్తకుండలో
ఉడికేసుకొని ఉడుకుడుకు జేజబువ్వను
ఊదుకొని తిన్న సుద్దులను వివరించండి.
మీ తాతవ్వల సుద్దులను సింతొక్కు
తిన్నంత కమ్మగా
మీ అమ్మనాన్నల పడబాట్లను
కలెంబలి తాగి బత్కిన బత్కులను
మీ జీవిత సాధకబాధలను
ఈతకల్లు తాగినంత తీయ్యగా
పూసగుచ్చినంత సుతారంగా అల్లి చెప్పండి.
అద్దరూపాయి కూలీకి
పొద్దుముక్కులు మట్టిమోసి కలుక్కుమన్న
పాత రోజులను నెమరేయండి
యాభై రూపాయలకు
యాడాదిపాటు గాసంచేసిన గడ్డుకాలాన్ని
పిల్లల వాకిండ్లముందు సాన్కెజల్లండి.
తొలి కోడికూతకే
పడమటికి గొరుకొల్లు పొడవంగనే
ఎరువుబండ్లుగట్టి
మూనిమాపుదాకా
ముడ్లు ఇరిగేదాకా కష్టపడిన గాథలను చెప్పండి.
ఊరంతా పండగజేస్తుంటే
ఉగాదినాడు సెంబునీళ్ళుతాగి
ఉపాసం పండుకున్న ముచ్చటేదైన ఉంటే చెప్పండి.
ఊరంత ఉమ్మిచ్చి
ఉన్నపొలం సరీకుడు గుంజుకుంటే
నెత్తిన మూటగట్టుకొని
సుగ్గిబోతుంటే
ఉండమని అడిగిటోడు లేని జ్ణాపకాలను
కంట్లనీళ్ళురాల్పుకుంటా
మీ పిల్లలకు చెప్పండి.
బువ్వలేక గంజితాగి
పడుకున్న రాత్రులను గుర్తుచేయండి
రొట్టెదొరకని కాలంలో
ఈతపండ్లుతిని మోటగొట్టిన
మునపటి దినాలను ఎరుకచేయండి.
కుంచెడు గింజలకు ఆరుఎకరాల మాగాణం
దొరకు రాసిచ్చిన కాయిదాలను చూపించండి
రొట్టెదొరకక కానీదేశం వలసబోయి
మూడొందల కిలోమైటర్లు నడిచిన బాటల
సంగతులను యాదిజేయండి.
ఆ ఊరు ఈ ఊరు తిరిగి
మూడు ఊర్లలో పొయ్యిబెట్టి
ముప్పుతిప్పలు పడినా యతలను
కానీదానికి ఐనదానికి
కొట్లాటకొచ్చి కొంపలు నాశనంజేసిన
పగవాడి పంతాలను శాసబోయండి.
రోగమోస్తే సంకలున్న పిల్లల్ని సంపుకున్న
పొద్దులను గొత్తుచేయండి
పాసిన బువ్వకు పొద్దంత పనిజేసిన
కన్నీటి వలపోతలను తెల్పండి.
మీ పిల్లలకు
బలిసినోడికి బీదోడికి తేడాలు
కష్టపడేటోడు కూసోని తీనేటోడి భేదాలు
అంటరానోడు అంటేటోడి విలువలు
పెదాలపై నవ్వు లోపలంత విషజనాల కథలు
ఒక్కొక్కటి
ఓనమాల తీరుగా చెప్పండి.
మీ పిల్లలకు
ఏ కథలు చెప్పకండి
ఏ గ్రంథాలు చదవని చెప్పొద్దు
మీ కథలే
ఏ కథకు సాటిరాని గాథాలు.
మీ పిల్లలకు
ఏ కాశీ మజిలీ కథలొద్దు
ఏ బట్టి విక్రమార్క కథలొద్దు
ఇంకే పంచతంత్ర కథలొద్దు
మీ కథలే చెప్పండి
మీ కథలకు మించిన కథలు
ఈ ప్రపంచమంత వెతికినా దొరకవు.
(ఇదంతా నా జీవితకాలంలో
మా అమ్మనాన్న మా అన్న చెప్పినవే ఇక్కడ రాశాను.)

మూలాలు

మార్చు
  1. చెట్టు మీద అల్లుకున్న పాటలపందిరి[permanent dead link] ప్రజాపక్షం, దినపత్రిక, తేది: 06.07.2020.
  2. విద్య-అసమానతలు[permanent dead link] మనం, దినపత్రిక, తేది:17.06.2020