ఆంగ్లో-మరాఠా యుద్ధాలు

ఆంగ్లో-మరాఠా యుద్ధాలు అన్నవి భారత ఉపఖండంలో మరాఠా సామ్రాజ్యంబ్రిటీష్ ఈస్టిండియా కంపెనీల నడుమ జరిగిన మూడు యుద్ధాలు. 1775-82లో మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం, 1803-05లో రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం, 1816-19లో మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం లేక పిండారీ యుద్ధం జరిగాయి.

మొదటి ఆంగ్లో-మరాఠా యుద్ధం మార్చు

 
మొదటి ఆంగ్లో-మరాఠా యుద్ధంలో బ్రిటీషర్ల లొంగుబాటును చిత్రీకరించిన కుడ్యచిత్రం. పుణె సమీపంలోని వడగావ్ వద్ద నిర్మించిన విజయసూచకమైన విజయ్ స్తంభ్ లో ఈ కుడ్యచిత్రం భాగం

1775లో సూరత్ ఒప్పందంతో ప్రారంభమైన ఈ యుద్ధం, 1782లో సాల్బాయ్ ఒప్పందంతో ముగిసింది. నానా ఫడ్నవీస్, 12 మంది రాజప్రతినిధులకు, రఘునాధ్ రావుల మధ్య పీష్వా పదవి వారసత్వానికి సంబంధించిన వివాదంలో రఘునాధ్ రావు పక్షం వహించి బొంబాయి బ్రిటీష్ ప్రభుత్వం కలగజేసుకుని అతనితో సూరత్ ఒప్పందం కుదుర్చుకుంది. కలకత్తా బ్రిటీష్ కౌన్సిల్ దీన్ని రద్దుచేస్తూ నానా ఫడ్నవీస్ తో పురంధర్ ఒప్పందం కుదుర్చుకుంది. పురంధర్ ఒప్పందాన్ని బొంబాయి ప్రభుత్వం బేఖాతరు చేస్తూ రఘునాధ్ రావుకు రక్షణ కల్పించింది, దాంతో నానా ఫడ్నవీస్ కూడా పురంధర్ ఒప్పందంలోని అంశాలకు వ్యతిరేకంగా పశ్చిమ తీరంలో ఫ్రెంచివారికి ఒక నౌకాశ్రయాన్ని ఇచ్చింది.
ఫ్రెంచివారితో పుణె ఒప్పందం చేసుకున్నాకా 1776లో బ్రిటీష్ ప్రభుత్వం పీష్వా రాజప్రతినిధులను ఓడించి, రఘునాధ్ రావును ప్రభుత్వంపై నిలపాలని నిర్ణయించుకుంది. బొంబాయి ప్రభుత్వం పంపిన సైన్యం 1779 జనవరి 4న పుణె సైన్యపు దాడి ఎదుర్కొంది. వెనుతిరిగిన బొంబాయి సైన్యం జనవరి 16న వడగావ్ దగ్గర ఓడిపోయి, వడగావ్ ఒప్పందం చేసుకుంది. ఉత్తర భారతదేశం నుంచి యుద్ధసహాయానికి బయలుదేరిన కల్నల్ థామస్ గొడార్డ్ సైన్యం రాక చాలా ఆలస్యమైంది. గవర్నర్-జనరల్ వారన్ హేస్టింగ్స్ వడగావ్ ఒప్పందాన్ని అంగీకరించనని, అసలు ఒప్పందం మీద సంతకం చేయగలిగిన అధికారం బొంబాయి ప్రభుత్వానికి లేదన్నదాన్ని కారణంగా బ్రిటీష్ వారి ఆసక్తులను నిలిపేందుకు యుద్ధాన్ని కొనసాగించమని ఆదేశించాడు.
గ్వాలియర్ పాలకుడు మహాదాజీ షిండే సైన్యంతో గొడార్డ్ నేతృత్వంలోని బ్రిటీష్ సైన్యానికి పలు ఘర్షణలు జరిగాయి. 1781 జూలై 1న మహదాజీ షిండే తుది దాడి చేసి బ్రిటీష్ సైన్యాన్ని కోలుకోలేని దెబ్బతీశాడు. దాంతో 1782 మే 17న బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీకి, మరాఠా సామ్రాజ్యానికి మధ్య సల్బాయ్ ఒప్పందం కుదిరింది.[1]

రెండవ ఆంగ్లో-మరాఠా యుద్ధం మార్చు

 
అసాయ్ యుద్ధంలో ఆర్థర్ వెల్లస్లీ

1799లో నాలుగవ ఆంగ్లో-మైసూరు యుద్ధంలో మైసూరు సామ్రాజ్యం పతనమయ్యాకా, బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ తప్పించి భారతదేశం వ్యాప్తంగా ప్రబలంగా ఉన్న మరొక అధికార కేంద్రం మరాఠా కూటమి మాత్రమే. 1800లో మరాఠా కూటమిలోని అధికార కేంద్రం బలహీనుడైన పీష్వా రెండవ బాజీరావు, బరోడాలోని గైక్వాడ్ వంశ పాలకుడు, గ్వాలియర్ లోని సింధియా పాలకుడు, ఇండోర్ లోని హోల్కర్ వంశ పాలకుడు, నాగపూర్కు చెందిన భోంస్లే వంశ పాలకుడి నడుమ ఉండేది. అంతర్గత కలహాల్లో పీష్వా, సింధియాల సంయుక్త సైన్యాన్ని యశ్వంత్ రావు హోల్కర్ ఓడించడంతో పీష్వా రెండవ బాజీరావు తప్పించుకుని కంపెనీ వారి రక్షణ పొందాడు. వారి నుంచి సైన్య సహకారాన్ని పొందేందుకు సైనిక, దౌత్యపరమైన అన్ని అధికారాల్లోనూ తన సార్వభౌమత్వాన్ని బ్రిటీష్ వారి పరం చేస్తూ, పీష్వా వద్ద బ్రిటీష్ సైన్యాన్ని ఉంచడానికి అంగీకరిస్తూ, ఆ సైన్య ఖర్చుల నిమిత్తం 26 లక్షల రూపాయల రెవెన్యూ అందించే భూభాగం బ్రిటీష్ పరం చేస్తూ, ఆపైన సూరత్, వడోదర ప్రాంతాలు తనవని చేస్తున్న వాదన వదులుకుంటూ 1802లో బేసిన్ ఒప్పందం చేసుకున్నాడు.[2]
బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ వారితో అత్యంత ప్రమాదకరమైన, అవమానకరమైన బేసిన్ ఒప్పందాన్ని తమ నామమాత్ర అధిపతి, పీష్వా రెండవ బాజీరావు చేసుకోవడం మరాఠా నాయకుల్లో ప్రత్యేకించి సింధియాలు, భోంస్లేల్లో భయాందోళనలు రేకెత్తించింది. వారు ఈ ఒప్పందంలోని షరతులను, అంశాలను తిరస్కరించారు. దాంతో రెండవ ఆంగ్లో-మరాఠా యుద్ధం ప్రారంభమైంది బ్రిటీష్ సైనికాధికారులు గెరార్డ్ లేక్, ఆర్థర్ వెల్లస్లీ వేర్వేరు యుద్ధాల్లో సింధియా, భోంస్లేలు ఓటమి చెందారు.
ఈ యుద్ధ ఫలితంగా, సింధియాలు కంపెనీకి రోహ్ టక్, గుర్ గావ్, గంగా-జమునా దోఅబ్, ఢిల్లీ-ఆగ్రా ప్రాంతం, బుందేల్ ఖండ్ లో కొంత భాగం, గుజరాత్ జిల్లాల్లో కొన్ని, అహ్మద్ నగర్ కోట స్వాధీనపరిచారు, రెండవ రఘోజీ భోంస్లే కంపెనీకి ఒడిశా ప్రాంతంలో కటక్ ప్రావిన్సును స్వాధీనం చేశాడు. బ్రిటీష్ వారు దాడికి సన్నాహం చేసుకోవడంతో, యశ్వంత్ రావ్ హోల్కర్ టోంక్, రాంపురీ, బుంద్ ప్రాంతాలను ఒప్పందంలో భాగంగా అప్పగించాడు.

మూడవ ఆంగ్లో-మరాఠా యుద్ధం మార్చు

మూడవ ఆంగ్లో-మరాఠా యుద్ధం (1817-1818) బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీకి, మరాఠా సామ్రాజ్యానికి మధ్య జరిగిన యుద్ధాల్లో చివరి, నిర్ణయాత్మక యుద్ధం. ఈ యుద్ధంతో కంపెనీ భారతదేశంలోని ప్రధాన భాగంపై నియంత్రణ సాధించింది. భారతదేశంలో బ్రిటీష్ వారు సమీకరించిన అత్యంత భారీ సంఖ్యాక సైన్యం మరాఠా భూభాగంపై దండయాత్ర సాగించడంతో ఈ యుద్ధం ప్రారంభమైంది. గవర్నర్ జనరల్ హేస్టింగ్స్ (బెంగాల్ తొలి గవర్నర్-జనరల్ వారన్ హేస్టింగ్స్ కాదు, అతనితో ఏ సంబంధం లేదు), జనరల్ థామస్ హిస్లాప్ సైన్యాన్ని నడిపించారు. మధ్య భారతానికి చెందిన ముస్లిం కిరాయి సైనికులు, మరాఠా సైన్యాల దండు అయిన పిండారీలకు వ్యతిరేకంగా దాడితో యుద్ధ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.

ఈస్టిండియా కంపెనీకి వ్యతిరేకంగా పీష్వా రెండవ బాజీరావు సైన్యానికి, నాగపూర్ పాలకుడు రెండవ ముధోజీ భోంస్లే, ఇండోర్ పాలకుడు మల్హర్ రావు హోల్కర్ తోడయ్యారు. నాలుగవ ప్రధాన మరాఠా నాయకుడు దౌలత్ రావు సింధియా తటస్థంగా ఉండిపోయేలా ఈస్టిండియా కంపెనీ దౌత్యం, ఒత్తిడి పనిచేశాయి, రాజస్థాన్ పై తన నియంత్రణ కోల్పోయినా సింధియా బ్రిటీష్ సైన్యానికి భయపడి తటస్థంగా ఉండిపోయాడు.

బ్రిటీష్ వారు చాలా వేగంగా విజయాలు అందుకున్నారు. ఫలితంగా మరాఠా సామ్రాజ్యం ముక్కలై, మరాఠాలు స్వాతంత్ర్యం కోల్పోయారు. ఖడ్కి, కోరెగావ్ యుద్ధాల్లో పీష్వా ఓడిపోయాడు. పీష్వా బందీ కాకుండా అడ్డుకునేందుకు పీష్వా సైన్యాలు అనేక చిన్నా చితకా పోరాటాలు చేశారు.[3]

అయితే పీష్వాని కంపెనీ బందీని చేసి, కాన్పూరుకు సమీపంలోని బిథూర్ అన్న చిన్న సంస్థానంలో ఉంచారు. అతని భూభాగంలో చాలావరకూ స్వాధీనం చేసుకుని, బొంబాయి ప్రెసిడెన్సీలో కలిపింది. తన భూభాగాన్ని రాచరిక రాష్ట్రంగా చేసి సతారా మహారాజు పరిపాలించేందుకు పున:ప్రతిష్ఠించారు. డల్హౌసీ తీసుకువచ్చిన రాజ్యసంక్రమణ సిద్ధాంతం ద్వారా 1848లో ఈ భూభాగం బొంబాయి ప్రెసిడెన్సీలో భాగమైపోయింది. సితాబుల్దీ యుద్ధంలో భోంస్లే, మహిద్ పూర్ యుద్ధంలో హోల్కర్ ఓడిపోయారు. నాగ్ పూర్ చుట్టుపక్కల భోంస్లే పాలనలో ఉన్న ఉత్తర భాగం, బుందేల్ ఖండ్ లో పీష్వా భూభాగాలతో సహా సౌగోర్, నెరబుద్దా భూభాగాలు అన్న పేరిట బ్రిటీష్ ఇండియాలో కలిసిపోయాయి. భోంస్లే, హోల్కర్ ల ఓటమి, మరాఠా రాజ్యాలైన నాగ్ పూర్, ఇండోర్ ల స్వాతంత్ర్యాన్ని హరించడానికి కారణమయింది. వీటితో పాటు సింధియా నుంచి గ్వాలియర్, పీష్వా నుంచి ఝాన్సీ కూడా తమ నియంత్రణలోకి తెచ్చుకుని బ్రిటీష్ సార్వభౌమాధికారం క్రింద రాజరిక రాష్ట్రాలుగా పరిమిత పరిపాలన ఏర్పాటుచేశారు. ఖడ్కి, సితాబుల్ది, మహిద్ పూర్, కోరెగావ్, సతారా ప్రాంతాల్లో అత్యంత వేగంగా సాధించిన విజయాల వల్ల భారతీయ యుద్ధ నిర్వహణలో బ్రిటీష్ వారు సాధించిన దక్షత తెలియజేస్తున్నాయి.[4]

మూలాలు మార్చు

  1. Naravane, M.S. (2014). Battles of the Honorourable East India Company. A.P.H. Publishing Corporation. p. 63. ISBN 9788131300343.
  2. Naravane, M.S. (2014). Battles of the Honorourable East India Company. A.P.H. Publishing Corporation. p. 66. ISBN 9788131300343.
  3. Naravane, M.S. (2014). Battles of the Honorourable East India Company. A.P.H. Publishing Corporation. pp. 79–86. ISBN 9788131300343.
  4. Black 2006, p. 78.