ఆకులో ఆకునై పూవులో పూవునై (పాట)

తెలుగు పాట

ఆకులో ఆకునై పూవులో పూవునై 1982లో విడుదలైన మేఘసందేశం చిత్రంలోని సుప్రసిద్ధమైన పాట. ఈ పాట పాడినందుకు పి.సుశీలకు రాష్ట్రస్థాయిలో ఉత్తమ గాయనిగా నంది బహుమతి వచ్చింది. ఈ పాటకు సాహిత్యం అందించింది దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఈ పాట దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన కృష్ణ పక్షము లోనిది. సంగీతం అందించింది రమేష్ నాయుడు.

"ఆకులో ఆకునై పూవులో పూవునై"
ఆకులో ఆకునై పూవులో పూవునై పాటలోని దృశ్యం.
రచయితదేవులపల్లి కృష్ణశాస్త్రి
సంగీతంరమేష్ నాయుడు
సాహిత్యందేవులపల్లి కృష్ణశాస్త్రి
ప్రచురణ1982
రచింపబడిన ప్రాంతంఆంధ్ర ప్రదేశ్
భాషతెలుగు
రూపంభావగీతం
గాయకుడు/గాయనిపి.సుశీల
రికార్డు చేసినవారు (స్టుడియో)శ్రీ మురళీకృష్ణ ఆర్ట్ క్రియెషన్స్
చిత్రంలో ప్రదర్శించినవారుజయసుధ

పాట-వివరణ

మార్చు

పల్లవి :

ఆకులో ఆకునై పూవులో పూవునై

కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై

ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా

వివరణ : కవి అడవి సౌందర్యానికి ముగ్ధుడై అక్కడి ఆకులు, పువ్వులు, కొమ్మలు, రెమ్మలతో తానూ ఒకడిగా కలసిపోయి అక్కడే ఉండిపోవాలని కోరుకుంటున్నాడు.

చరణం 1 :

గలగలనీ వీచు చిరుగాలిలో కెరటమై

జలజలనీ పారు సెలపాటలో తేటనై

పగడాల చిగురాకు తెరచాటు తేటినై

పరువంపు విరి చేడే చిన్నరి సిగ్గునై

ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా

వివరణ : తన మనసులోని భావాల్ని మరింత లోతుగా తరుస్తూ చిరుగాలిలో కెరటం లాగా, సెలయేరులో తేటగా, పూలమొగ్గలోని సిగ్గుగా వాటన్నితో కలసిపోవాలని కోరుకుంటాడు.

చరణం 2 :

తరులెక్కి ఎలనీలి గిరినెక్కి మెలమెల్ల

చదలెక్కి జలదంపు నీలంపు నిగ్గునై

ఆకలా దాహమా చింతలా వంతలా

ఈ కరణి వెర్రినై ఏకతమా తిరుగాడ

ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా

వివరణ : అక్కడ అడవిలోని చెట్లు, ఆ చెట్ల పైనుంచి నీలి కొండలు ఎక్కుతూ మెలమెల్లగా ఆకాశాన్ని చేరుకొని నీలి మబ్బులోకి చేరి దాని నీలిరంగులో కలిసి ప్రకాశిస్తూ ఆకలి - దాహం చీకులు, చింతలూ లేకుండా ఏకాంతంగా విహరిస్తూ వెర్రివాడిలా తిరుగుతూ ఆ అడవిలోనే కలిసిపోయి ఉండిపోనా అంటూ కవి ప్రకృతిలో తానూ మమేకమయిపోవాలని కోరుకుంటున్నాడు.

విశేషాలు

మార్చు

ఈ పాటను పి.సుశీల నటి జయసుధ కొరకు పాడారు. దర్శకుడు దాసరి నారాయణరావు ఈ పాటను జయసుధ, అక్కినేని నాగేశ్వరరావు మీద చిత్రీకరించారు. ఈ పాట దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసిన అనేక కవితలలో ఒకటి, ఆయన మరణాంతరం ఆయన రాసిన కొన్ని కవితలను ఈ చిత్రంలో పాటలుగా ఉపయోగించారు, వాటిలో ఈ పాట కూడా ఒకటి. రమేష్ నాయుడు సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఆయనకి ఈ చిత్రం వలన జాతీయస్థాయిలో ఉత్తమ సంగీతదర్శకునిగా బహుమతి లభించింది.

ఈ పాటను కృష్ణశాస్త్రి గారు ఒకసారి విజయవాడ (ఒకప్పటి బెజవాడ) నుండి బళ్ళారికి రైలులో వెళ్లునప్పుడు గిద్దలూరు-నంద్యాల మధ్యనున్న నల్లమల ఆడవి గుండ వెళ్లునప్పుడు, అచ్చటి ఆడవి అందం చూసినప్పుడు ఆయన గుండెలోతుల నుండి అశువుగా గంగా ప్రవహంలా పుట్టిన అందమయిన గేయం అది. కలకాలం సాహిత్య ప్రియుల గుండెలో నిలిచే పాట.

అవార్డులు

మార్చు

మూలాలు

మార్చు
  • ఆకులో ఆకునై, గోరింట - చిత్రాలు, పాటలు, వెండితెర పాటలు, కృష్ణశాస్త్రి సాహిత్యం, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 2008, పేజీ: 161.

లింకులు

మార్చు