ఆడారి తులసీరావు

ఆడారి తులసీరావు (1939 ఫిబ్రవరి 1 - 2023 జనవరి 4) శ్రీ విజయ విశాఖ పాల ఉత్పత్తిదారుల సహకార సంస్థకు (విశాఖ డెయిరీ) చైర్మన్. గ్రామ పంచాయితీ సర్పంచి నుండి విశాఖ డెయిరీ ఛైర్మను వరకూ వివిధ రాజకీయ పదవులను చేపట్టాడు.

జననంఫిబ్రవరి 01,1939
మరణంజనవరి 04,2023
వృత్తివిశాఖ డైరీ చైర్మన్,గ్రామ సర్పంచ్, రైతు
బిరుదుఆంధ్ర కురియన్
రాజకీయ పార్టీకృషికర్ లోక్ పార్టీ,తెలుగు దేశం పార్టీ,
జీవిత భాగస్వామిజయ లక్ష్మి
పిల్లలుఆనంద్ కుమార్,రమా కుమారి
తల్లిదండ్రులువెంకటరామయ్య, సీతయ్యమ్మ
వెబ్‌సైటుhttp://www.visakhadairy.com/

కుటుంబ నేపథ్యం

మార్చు

1939 ఫిబ్రవరి 1న విశాఖపట్నం జిల్లా (నేటి అనకాపల్లి జిల్లా) ఎలమంచిలిలో వెంకటరామయ్య, సీతయ్యమ్మ దంపతులకు జన్మించారు. పదో తరగతి వరకూ చదివారు. తులసీ రావు కుమారుడు ఆడారి ఆనంద్ కుమార్ ప్రస్తుతం విశాఖ డెయిరీ వైస్ చైర్మెన్ గా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కుమార్తె రమాకుమారి ఎలమంచిలి పురపాలక సంఘ చైర్మెన్.

ప్రజాసేవలో

మార్చు

తులసీరావు బాల్యంలోనే వ్యవసాయంతో మమేకమయ్యారు. పశుపోషణంటే మక్కువ పెంచుకున్నారు. దేశానికి అన్నం పెట్టే రైతు బతుకే గొప్పదని మనసా వాచా నమ్మారు. అందుకే ఆయనను రాజకీయల్లోకి రమ్మనమని ప్రజలే స్వాగతించారు. కృషికార్ లోక్ పార్టీ, స్వతంత్ర పార్టీ, జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీల్లో కీలకమైన పాత్ర పోషించారు. 1962లో కోపరెటివ్ అర్బన్ బ్యాంక్ డైరక్టర్గా ఎన్నికయ్యారు. మరో రెండేళ్లకు జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో నెగ్గి ఎలమంచిలి గ్రామపంచాయితీ బోర్డు అధ్యక్షుడయ్యారు. ఇరవైయ్యేళ్లపాటు సర్పంచ్ పదవిలో కొనసాగారు. 1985 కాలంలో అప్పటి తెలుగుదేశం నాయకుల ప్రోద్బలంతో జిల్లాశాఖ అధ్యక్షుడిగా ఆ కార్యక్రమాల్లో బిజీగా ఉండేవారాయన, అప్పుడే విశాఖడెయిరీకి ఎన్నికలొచ్చాయి. మారిన పరిస్థితుల దృష్ట్యా వెంకటరమణ స్థానంలో డెయిరీ అధ్యక్షుడిగా పాలనాపగ్గాలు చేపట్టవలసివచ్చింది. డెయిరీ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన నాటి నుంచి నేటి వరకూ ఆయన చైర్మన్ గా ఎప్పుడూ పనిచేయలేదు. ఒక కార్మికునిగా పాటుపడ్డారు. ఒక పాలరైతుగానే ఆలోచించారు. అందుకే విశాఖ డెయిరీ నేడింతగా ప్రగతి సాధించింది. పాల దిగుబడి పెరగడం నుంచి, డెయిరీ పాల ఉత్పత్తుల శ్రేణిని విస్తృతం చేసే వరకూ ఆయన పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. రైతు కష్టం మరో రైతుకే తెలుసు. అందుకే రైతుబిడ్డ తులసీరావు వారికోసం ఆసుపత్రి కట్టించారు. విశాఖడెయిరీకి పాలు ఉత్పత్తి చేసే ప్రతీ రైతుకు ఉచిత వైద్య సౌకర్యాన్ని అందించారు. రైతుతో పాటు

వారి కుటుంబ సభ్యులకు ఈ పథకాన్ని వర్తింపు చేసారు.

అవార్డులు

మార్చు

విశాఖ డెయిరి విజయ ప్రస్థానంలో తులసీరావు కృషికి ఎన్నో అవార్డులు వచ్చాయి. డెయిరీ ఎన్నో జాతీయ స్థాయి అవార్డులను సాధించింది. 2003లో ఎనర్జీ అండ్ ఫ్యూయల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా విశాఖ డెయిరీకి జాతీయ అవార్డును ప్రకటించింది. అదే ఏడాది వాల్తేరు రోటరీ క్లబ్ 'కార్పొరేట్ సిటిజన్ అవార్డు' ను అందజేసింది. ఇండియన్ డెయిరీ అసోసియేషన్ 2005లో బెంగుళూరులో నిర్వహించిన 34వ జాతీయ సదస్సులో విశాఖ డెయిరీకి ప్రశంసా పత్రాన్ని అందజేసింది. 2007లో ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు విశాఖ డెయిరీ ట్రీట్మెంట్ ప్లాంటును కాలుష్య రహితంగా నిర్వహిస్తున్నందుకు కాంప్లిమెంటు అవార్డును అందచేసింది. పాలు, పాలఉత్పత్తులను ఉత్పత్తి చేస్తున్న ఉత్తమ డెయిరీగా భారత ప్రభుత్వం నుంచి 2009 సెప్టెంబరు 24న 'నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ అవార్డు'ను అందుకుంది. ఇండియన్ డెయిరీ అసోసియేషన్ 2010లో బెంగుళూరులో నిర్వహించిన 38వ జాతీయ సదస్సులో విశాఖ డెయిరీకి ప్రశంసా పత్రాన్ని అందజేసింది. డెయిరీ రంగంలో విశేష పురోగతి సాధిస్తున్న సంస్థగా విశాఖ డెయిరీకి 'ఇండియన్ ఎచీవర్స్ అవార్డు 'ను భారత ప్రభుత్వం, ఇండియన్ ఎకనామిక్ డవలప్మెంట్ అండ్ రీసెర్చ్ అసోసియేషన్ సంయుక్తంగా అందజేసాయి. విశాఖ డెయిరీకి ఎన్ని అవార్డులు వచ్చినా ఏనాడూ వాటిని అందుకొనేందుకు ఛైర్మన్ ఆడారి తులసీరావు వెళ్ళలేదు. అవార్డుల కన్నా రైతు ప్రశంసలే తనకు మిన్నని ఆయన వినమ్రంగా చెప్పేవారు.

తులసీరావు అనారోగ్య కారణాలతో హైదరాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2023 జనవరి 4న మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డితో పాటు ప్రముఖ నాయకులు తులసీరావు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

మూలాలు

మార్చు
  1. విశాఖ డెయిరి అధికారిక వెబ్ సైట్
  2. విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు కన్నుమూత