ఆర్కాటు సోదరులు

ఆర్కాటు సోదరులు పేరిట ప్రపంచప్రఖ్యాతి గాంచిన వారు ఆర్కాటు రామస్వామి మొదలియారు, ఆర్కాటు లక్ష్మణస్వామి మొదలియారు. ఏకరూప కవలలైన వీరిద్దరూ వేర్వేరు రంగాలలో తమ మేధాశక్తితో సుప్రతిష్ఠులయ్యారు. రామస్వామి మొదలియారు న్యాయవేత్తగా, రాజనీతిజ్ఞునిగా, పారిశ్రామికవేత్తగా ప్రఖ్యాతి చెందారు. లక్ష్మణస్వామి మొదలియారు స్త్రీప్రసూతి వైద్యం, విద్య మొదలైన రంగాల్లో పేరు సంపాదించుకున్నారు. వీరిద్దరినీ కలిపి ఇంటిపేరు మీదుగా ఆర్కాటు సోదరులని వ్యవహరిస్తారు.

ఆర్కాటు రామస్వామి మొదలియారు మార్చు

ప్రధాన వ్యాసం: ఆర్కాటు రామస్వామి మొదలియారు
ఆర్కాటు రామస్వామి మొదలియారు జస్టిస్ పార్టీలో ప్రధాన రాజకీయవేత్త, భారతదేశానికి స్వాతంత్రం రాకముందు-వచ్చాకా వేర్వేరు పరిపాలనశాఖల్లో పదవులు చేపట్టిన రాజనీతివేత్త, న్యాయవాది, రాజకీయనాయకుడు. బ్రాహ్మణ వ్యతిరేకోద్యమంలో జస్టిస్ పార్టీలో ఆయన కీలకమైన పాత్ర పోషించారు. 1920 నుంచి 1926 వరకూ మద్రాసు శాసనమండలి సభ్యునిగా, 1931 నుంచి 1934 వరకూ మద్రాసు శాసనసభ సభ్యునిగా పనిచేశారు. 1934లో ఆయన ముఖ్య రాజకీయ ప్రత్యర్థియైన ఎస్.సత్యమూర్తిపై ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 1939 నుంచి 1941 వరకూ బ్రిటీష్ ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యునిగా పనిచేశారు. 1942 నుంచి 1945 వరకూ బ్రిటీష్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ నేతృత్వం వహించిన బ్రిటీష్ యుద్ధ కేబినెట్‌లో స్థానం పొందారు. యునైటెడ్ నేషన్స్ ఆర్థిక సాంఘిక కౌన్సిల్‌కు మొదటి అధ్యక్షునిగా, శాన్‌ఫ్రాన్సిస్కో కాన్ఫరెన్సులో భారత ప్రతినిధిగా వ్యవహరించారు. 1946 నుంచి 1949 వరకూ మైసూరు రాజ్యానికి దివానుగా బాధ్యతలు నెరవేర్చారు.[1]

ఆర్కాటు లక్ష్మణస్వామి మొదలియారు మార్చు

 
మద్రాసు విశ్వవిద్యాలయపు సెనెట్ హౌస్‌లో ఆర్కాటు లక్ష్మణస్వామి మొదలియారు విగ్రహం

ప్రధాన వ్యాసం: ఆర్కాటు లక్ష్మణస్వామి మొదలియారు
ఆర్కాటు లక్ష్మణస్వామి మొదలియారు (Arcot Lakshmanaswami Mudaliar) (1887 - 1974) ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రసూతి వైద్య నిపుణులు, విద్యావేత్త. లక్ష్మణ స్వామి మొదలియారు మద్రాసు విశ్వవిద్యాలయం లో అవిచ్చిన్నంగా 27 సంవత్సరాలు ఉప కులపతి గా పనిచేశారు. వైద్యవిద్య పూర్తిచేసుకున్న వెంటనే లక్ష్మణస్వామికి 1909లో ప్రభుత్వ వైద్యశాఖలో ఉద్యోగం లభించింది. మొదటి సంవత్సరం మదురై, పశని పట్టణాల్లో పనిచేసి ఆపైన మద్రాసుకు బదిలీ అయ్యారు. మద్రాసులో మొదట ఆయనను డొనోవన్ అనే ప్రఖ్యాత వైద్యునికి సమాయకునిగా నియమించారు. ఆపైన 1912లో ఎగ్మూరులోని ప్రభుత్వ స్త్రీ, శిశు ఆసుపత్రికి బదిలీ చేశారు. ఆనాటి నుంచీ ఆయన స్త్రీ, ప్రసూతి, శిశు వైద్యరంగంలో విశేష నైపుణ్యాన్ని కనబరిచి అదే స్పెషలైజేషన్ లో ఏళ్ళతరబడి పనిచేయడమే కాక సుప్రఖ్యాతులయ్యారు. 1914లో ఆయన బి.యే. పూర్తచేసుకుని పట్టభద్రుడు కావడంతో ఆయనను రాయపురంలోని ప్రసూతి ఆసుపత్రికి ఉద్యోగోన్నతిపై బదిలీ చేశారు. అక్కడ కూడా ఆయన మంచి వైద్యునిగా పేరుగడించి తన బాధ్యతలు నిర్వర్తించారు. 1920లో ఆయనను మద్రాసు ప్రభుత్వ మహిళల శిశువుల ఆసుపత్రికి బదిలీచేశారు. ఆపైన అక్కడే 25 సంవత్సరాలకు పైగా పనిచేసి తనకూ, ఆసుపత్రికీ కూడా దేశాంతర ఖ్యాతిని తెచ్చిపెట్టారు. ఆయన వద్ద నైపుణ్యం నేర్చేందుకు, వైద్యవిద్యలో లోతుపాతులు తెలుసుకునేందుకు ఆసుపత్రికే బర్మా, మలేషియా, చైనా మొదలైన ఆసియా దేశాల నుంచి స్నాతకోత్తర వైద్యవిద్యార్థులు వచ్చి వెళ్ళేవారు. 1934 లో మద్రాసు మెడికల్ కళాశాలలో ప్రసూతి వైద్య విభాగంలో ప్రొఫెసర్ పదవిని పొందారు. అనతికాలంలోనే ఆ కాలేజీకి ప్రిన్సిపాల్ గా పదవిని అధిష్టించిన తొలి భారతీయులుగా ఘనత పొందారు. అనంతరం మద్రాసు విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా పనిచేశారు. 1948లో లక్ష్మణస్వామి మొదలియారు మొట్టమొదటి ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీకి భారత ప్రాతినిధ్య బృందానికి ఉపనాయకునిగా వ్యవహరించారు. 1949-50 సంవత్సరానికి గాను ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యనిర్వాహక బోర్డుకు ఛైర్మన్‌గా, 1955లో 8వ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీకి ఉపాధ్యక్షునిగా, నాల్గవ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీకి అధ్యక్షునిగా పనిచేశారు.[1]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 రాధాకృష్ణమూర్తి, చల్లా (1988). ఆర్కాటు సోదరులు (ప్రథమ ముద్రణ ed.). హైదరాబాద్: తెలుగు విశ్వవిద్యాలయం.