ఆర్టోస్ ఒక ప్రాంతీయ శీతల పానీయం, ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలో మొట్టమొదటి త్రాగునీటి శీతల పానీయం.

ఆర్టోస్

చరిత్రసవరించు

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురానికి చెందిన అడ్డూరి రామచంద్ర రాజు, జగన్నాథ రాజు అన్నదమ్ములు. 1911 లో రామచంద్ర రాజు రోడ్ కాంట్రాక్టర్ ఉద్యోగం చేసేవారు . రోడ్డు పనుల నిమిత్తం కాకినాడ లోని కలెక్టర్ కార్యాలయానికి వెళ్లినప్పుడు అక్కడ పాడై ఉన్న సోడా మెషీన్ కనిపించింది. ఈ మెషీన్ అక్కడ పనిచేసిన బ్రిటిష్ అధికారి దాన్ని వదిలేసి వెళ్లినట్టు సిబ్బంది చెప్పారు. దానిలో నీళ్లు పోసి ఏదో తయారు చేసుకుని తాగేవారు అని అక్కడ సిబ్బంది చెప్పడంతో రామచంద్ర రాజు ఆ మెషీన్ కోరి, దానికి కొంత ధర చెల్లించి తన ఇంటికి తెచ్చుకున్నారు.1919లో ఏ.ఆర్.రాజు అనే పేరుతో డ్రింక్స్ అమ్మారు. ఆ తర్వాత 1955లో ఆర్టోస్ గా పేరు మార్చారు. అప్పట్లో దీనినే ‘రాజు గారి కలర్ కాయ్’ అని ప్రజలు పిలుచుకునే వారు.కానీ అప్పటికి భారతీయులకు సోడా కొత్త కావడంతో అంతగా ఆదరణ రాలేదు. సోడా సీసా చేసే శబ్దం, అందులో నుంచి వచ్చే పొగ ప్రజలకు ఆశ్చర్యం కలిగించింది[1][2]

ఆర్టోస్ పేరుసవరించు

సంస్థ ప్రారంభమైనప్పుడు 'ఎ రామచంద్రరాజు అండ్ బ్రదర్స్' పేరుతో ఉండేది. కూల్ డ్రింక్ బ్రాండ్ కూడా అదే పేరుతో ఉంది. "1950లలో రాజమండ్రిలో మరో సంస్థ బీవీ రాజు పేరుతో డ్రింక్స్ అమ్మడం ప్రారంభించారు అమ్మకాలకు ఇబ్బందైంది. అప్పట్లో రామచంద్రరాజు కోర్టుకు వెళ్లగా ట్రేడ్ మార్క్ లేకపోవడంతో కేసు నిలవలేదు. ట్రేడ్ మార్క్ కోసం మనిషి పేరు కాకుండా వేరే పేరు అవసరం పడింది. దీంతో ఆర్టోస్ అని పెట్టారు. ఎ రామచంద్ర రాజు టానిక్స్ అనే పేరు నుంచి ఆర్టోస్ అనే పదం తీసి పెట్టారు. 1958లో ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ వచ్చింది.ఆర్టోస్ బ్రాండు రామచంద్ర రాజు, జగన్నాథ రాజు సోదరుల భాగస్వామ్యంతో ప్రారంభమైంది. రామచంద్ర రాజు విడిపోయిన తరువాత కూడా ఆయన పేరు కొనసాగించారు. ఆ తరువాత జగన్నాథ రాజు కుమారులు పద్మనాభ రాజు, సత్యనారాయణ రాజులు వ్యాపారం కొనసాగించారు. తరువాత సత్యనారాయణ రాజు కుమారులు జగన్నాథ వర్మ, వీరభద్ర రాజు, పద్మనాభ వర్మలు ప్రస్తుతం భాగస్వాములుగా ఉన్నారు

మొదటి ప్రపంచ యుద్ధ కాలంలోసవరించు

1914 ప్రాంతంలో మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో కాకినాడ పరిసరాల మీదుగా వెళ్తున్న బ్రిటిష్ సైనికులు ఈ సోడాలను చూసి తాగడం ప్రారంభించారు. అది చూసిన స్థానిక ప్రజలు , సోడాలు చెడు కాదని గుర్తించి, వారు కూడా తాగడం మొదలుపెట్టారు.విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న పదార్థాలపైనే కూల్ డ్రింక్ ఉత్పత్తి పూర్తిగా ఆధారపడి ఉండేది. రెండో ప్రపంచ యుద్ధంలో సరకు రవాణాకు ఇబ్బంది ఎదురైంది. దిగుమతులు ఆగిపోయాయి కానీ ఆర్టోస్ మాత్రం ఆగలేదు. ముడి సరుకు ఆగిపోయినా ఉత్పత్తి ఆపకూడదన్న పట్టుదలతో సొంతంగా పళ్ల రసాలతో కొత్త డ్రింకులు తయారు చేయడం ప్రారంభించారు. అటవీ ప్రాంతం నుంచి పెద్ద సంఖ్యలో నారింజ పళ్లు సేకరించి, సిట్రస్ యాసిడ్ బదులు నిమ్మరసం ఉపయోగించారు. పంచదార బదులు బెల్లాన్ని కరిగించి, రెండు మూడుసార్లు రిఫైన్ చేసి, ద్రవరూపంలో మార్చి, లిక్విడ్ స్వీట్‌నర్ తయారు చేశారు.రెండో ప్రపంచ యుద్ధం ముగిసి, భారత్‌కి స్వాతంత్ర్యం వచ్చాక మళ్లీ దిగుమతులు మొదలయ్యాయి. యూరప్‌కు చెందిన కొన్ని సాఫ్ట్ డ్రింకుల కంపెనీలు బొంబాయిలో ఎసెన్స్ తయారు చేసి అమ్మడం మొదలుపెట్టాయి. దీంతో ఆర్టోస్ మళ్లీ కూల్ డ్రింకుల ఉత్పత్తి ప్రారంభించింది. ఒక దశలో ఆర్టోస్ నుంచి దాదాపు 26 ఉత్పత్తులు వచ్చేవి.

ఆర్టోస్ పరిమిత మార్కెట్సవరించు

ప్రస్తుతం ఆర్టోస్ తూర్పుగోదావరి జిల్లానే ప్రధాన మార్కెట్. పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, కృష్ణా జిల్లాల్లో కొద్దిగా విస్తరించింది. 1960లలో ఈ సంస్థ శ్రీకాకుళం నుంచి విజయవాడ వరకూ విస్తరించింది. 1960లో విశాఖపట్నంలో ఒక యూనిట్ కూడా పెట్టారు.ప్రస్తుతం భారీ రీటైల్ కంపెనీలతో ఒప్పందం చేసుకుని మార్కెట్ చేస్తున్నారు. గాజు సీసాల డిస్ట్రిబ్యూషన్ కంటే, ప్లాస్టిక్ సీసాలు (పెట్ బాటిల్స్) సరఫరా సులువు కావడంతో వాటిపై దృష్టిపెట్టింది సంస్థ.[3]

మూలాలుసవరించు

  1. https://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/100-year-old-artos-in-expansion-mode/article19788892.ece
  2. https://www.artos.in
  3. "ఆర్టోస్: ఇది మా కూల్ డ్రింకండీ". www.msn.com. Retrieved 2020-03-29.
"https://te.wikipedia.org/w/index.php?title=ఆర్టోస్&oldid=3124227" నుండి వెలికితీశారు