ఆ అరగంట చాలు
ఆ అరగంట చాలు ప్రసిద్ధి పొందుతున్న రచయిత కస్తూరి మురళీకృష్ణ రాసిన భయానక కథల సంపుటి. ఈ సంపుటి తెలుగు సాహిత్యంలో భయానక కథల తొలి సంపుటిగా ప్రత్యేకత సంతరించుకుంది. వైవిధ్యభరితమైన రచనలు చేసే కస్తూరి మురళీకృష్ణ ఆ క్రమంలోనే భయానక కథలు (హార్రర్ స్టోరీస్) రచించారు.
ఆ అరగంట చాలు | |
"ఆ అరగంట చాలు" పుస్తక ముఖచిత్రం | |
కృతికర్త: | కస్తూరి మురళీకృష్ణ |
---|---|
అంకితం: | రచయిత తల్లికీ, తండ్రికీ, విశ్వనాథ సత్యనారాయణకీ |
ముఖచిత్ర కళాకారుడు: | మహేష్ మాలేకర్ |
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | కథలు |
విభాగం (కళా ప్రక్రియ): | భయానకం(హార్రర్) |
ప్రచురణ: | కె.పద్మ, కస్తూరి ప్రచురణలు |
విడుదల: | 2012 |
పేజీలు: | 128 |
రచన నేపథ్యంసవరించు
కస్తూరి మురళీకృష్ణ వేర్వేరు పత్రికల్లో ప్రచురించిన తన భయానక కథలను కస్తూరి ప్రచురణల సంస్థ ద్వారా సంకలనంగా 2012లో ప్రచురించారు. ఈ సంకలనంలో ప్రచురితమైన కథల్లో అధికభాగం 2010లో ప్రచురితం కాగా 2009, 2008ల్లో రెండేసి కథలు తొలిగా ముద్రితమయ్యాయి. రచయిత కస్తూరి మురళీకృష్ణ ఈ కథలను రాయడం వెనుక ఉన్న ముఖ్య కారణం ఒక మూసలో పడకూడదని, ఎలాంటి ముద్రల్లో ఒదగకూడదనీ ప్రయత్నిస్తూ, విభిన్నమైన కథలు సృజించడంగా చెప్పుకున్నారు. ఆ క్రమంలోనే తెలుగు కథా సాహిత్యం అంతగా పట్టించుకోలేదంటూ భయానక (హార్రర్) కథలు రచనచేశారు. ఈ కథల్లో ఒకటైన నమ్మలేని నిజం నిజ జీవిత అనుభవమని, తన సహోద్యోగి జీవితంలో జరిగినదంటూ రచయిత పేర్కొన్నారు.[1]
కథల జాబితాసవరించు
ఆ అరగంట చాలు కథా సంపుటంలోని కథలు ఇవి:[2]
- ఆ అరగంట చాలు
- ఫాంటమ్ లింబ్
- కలకానిదీ
- ప్రేయసి కౌగిలిలో
- ఊర్మిళ
- ప్రతీకారం
- తెల్లపొగ
- నమ్మలేని నిజం
- చిత్రపటం
- సాలీడు గూడులో...
- నేను చచ్చిపోతానా
- చీకటిలో...
- ఆమె
- యమదూత పిలుపు
- ఆవాహనం
ఇతివృత్తాలుసవరించు
కథా సంపుటంలోని తొలి కథ ఆ అరగంట చాలు సైన్స్ ఫిక్షన్, హార్రర్ వర్గాలకు చెందిన కథ. ఈ కథలోని ఇతివృత్తం గ్రహాంతరవాసుల గురించి ఉంటుంది. ఫాంటమ్ లింబ్ కథ ఇతివృత్తం వైద్యశాస్త్రపరమైన ఫాంటమ్ లింబ్ అంశాన్ని భయానక విషయాలకు ముడిపెట్టి రచించారు. వరుస కలలలో ఒక దయ్యం సెవెన్ సీటర్లో ఉన్నట్టుగా అనుభూతి చెందుతున్న శరత్ కుమార్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీరుకూ, ఆ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేసిన మానసిక వైద్యునికీ మధ్య సాగే కథ కలకానిదీ. మిగిలిన కథల్లో కూడా అనుభూతి ప్రధానంగానే భయానక కథలు రచించారు.
శైలి, శిల్పంసవరించు
హర్రర్ కథలే ఐనా హర్రర్‌తో పాటుగా సైన్స్ ఫిక్షన్, సస్పెన్స్, మేజిక్ రియలిజం వంటి ఇతర విభాగాలు కలిశాయి. ఆ అరగంట చాలు, తెల్లపొగ కథల్లో హర్రర్‌తో పాటుగా సైన్స్ ఫిక్షన్, చీకటి, ఆమె కథల్లో సస్పెన్స్, సాలీడు గూడు, కలకానిదీ వంటి కథల్లో మేజిక్ రియలిజం (మాయా వాస్తవికవాదం) చోటుచేసుకున్నట్టు సమీక్షకులు గుర్తించారు.[3]
ప్రాచుర్యం-విమర్శసవరించు
తెలుగులో తొలి భయానక కథల సంపుటిగా ఆ అరగంట చాలు బహుళ ప్రాచుర్యం పొందింది. పలువురు సమీక్షకులు ఇలా అభిప్రాయపడ్డారు:
- ఏ కథ అయినా చదువుతున్నంతసేపూ ఒక పాఠకుడి ఆలోచనల్లో విచిత్ర ప్రపంచం, సంఘటనలు రూపుదిద్దుకుంటాయి. రచయిత వ్రాసిన కథలు దృశ్యరూపంలో సాక్షాత్కరించినట్లనిపిస్తాయి. చివర్లో వచ్చే ఊహించని ముగింపు ఒక్కసారిగా జలదరింపజేస్తుంది. - కౌముది సాహిత్య పత్రిక.[4]
- రకరకాల హారర్ విభాగాలను పరిచయం చేస్తూ ప్రయోగాత్మకంగా రాసిన కథలివి. ఇలాంటి ప్రయత్నం గతంలో ఎవరూ చేయలేదు. - కె.పి.అశోక్‌కుమార్[5]
- విపరీతమైన రక్తపాతాలు, పుర్రెలు, శవాలు, చేతబడులు, తాంత్రికులు అంటూ అనవసరపు ఆర్భాటాలు లేకుండా కేవలం అనుభూతి ప్రధానమైన హర్రర్ కథలే వుండటం వల్ల కూడా ఈ సంకలనంలో కథలు ఆసక్తికరంగా ఉన్నాయి. చాలా వరకు కథల్లో జరుగుతున్న సంఘటన, సందర్భం మన కళ్ళ ముందు కనపడి చిన్న జలదరింపు లాంటివి కలిగిస్తాయి. అక్షరాలతో ఇది సాధ్యం చెయడం రచయిత ప్రతిభకు నిదర్శనం. - అరిపిరాల సత్యప్రసాద్[6]
మూలాలుసవరించు
- ↑ ఆ అరగంట చాలు(పుస్తకం):మనవి:కస్తూరి మురళీకృష్ణ:పేజీ.5-7
- ↑ ఆ అరగంట చాలు పుస్తకం విషయసూచిక:పే.3
- ↑ వైవిధ్యం, హర్రర్ నేపథ్యం - ఆ అరగంట చాలు:అరిపిరాల సత్యప్రసాద్:పుస్తకం.నెట్:డిసెంబరు 30, 2012
- ↑ కౌముది.నెట్(జాలపత్రిక):పుస్తక పరిచయం:జనవరి 2013
- ↑ "తెలుగులో తొలి భయానక కథలు:కె.పి.అశోక్‌కుమార్:చినుకు పత్రిక:మే 2013". Archived from the original on 2013-09-24. Retrieved 2014-04-16.
- ↑ వైవిథ్యం, హర్రర్ నేపథ్యం - ఆ అరగంట చాలు:అరిపిరాల సత్యప్రసాద్:పుస్తకం.నెట్