ఇండియా గేట్

న్యూఢిల్లీలో విజయోత్సవ తోరణం

యమునా నది తీరాన ఉన్న భారతదేశపు రాజధాని నగరంలో ఉన్న చూడచక్కని ప్రదేశాలలో ఒకటైన ఇండియా గేట్ (India Gate) 9 దశాబ్దాల క్రితం మొదటి ప్రపంచ యుద్ధంలో, అఫ్ఘన్ యుద్ధంలో అమరులైన 90 వేల [1] యుద్ధజవానుల స్మృత్యర్థం నిర్మించిన అపురూప కట్టడం. 42 మీటర్ల ఎత్తు [2] ఉన్న ఈ కట్టడం భరత్‌పూర్ ఎర్రరాయితో నిర్మించబడింది. 1971 నుంచి ఇక్కడ అమర్‌ జవాన్ జ్యోతి కూడా వెలుగుతోంది. ఇండియా గేట్ పరిసరాలలో చూడముచ్చటగా ఉన్న పచ్చిక బయళ్ళు, చిన్నారులు ఆడుకోవడానికి సుందరమైన పార్కు, బోట్‌ క్లబ్ ఉండటమే కాకుండా ఇక్కడి నుంచి నేరుగా రాష్ట్రపతి భవన్ చూడడం మరుపురాని అనుభూతినిస్తుంది.

ఇండియా గేట్

చరిత్ర మార్చు

1914 నుంచి 1918 వరకు జరిగిన మొదటి ప్రపంచ యుద్ధంలో 80 వేల భారత, బ్రిటీష్ జవానులు అమరులైనారు. ఆ తరువాత జరిగిన అఫ్ఘన్ యుద్ధంలో కూడా 10వేల వరకు జవానులు ప్రాణాలర్పించారు. వారి స్మృత్యర్థం ఒక అపురూపకట్టడం ఉండాలనే ఆలోచనే ఈ కట్టడానికి ప్రాణం పోసింది. వాటిపై యుద్ధంలో మరణించిన అమరజవానుల పేర్లు కూడా లిఖించబడ్డాయి. ఢిల్లీలో అనేక కట్టడాలకు రూపకల్పన చేసిన ఎడ్విన్ ల్యుటెన్స్ ఈ కట్టడానికి కూడా రూపకల్పన చేశాడు.[3] 1921, ఫిబ్రవరి 10న డ్యూక్ ఆఫ్ కన్నాట్‌చే పునాదిరాయి వేయబడి దాదాపు 10 సంవత్సరాల నిర్మాణ సమయం తరువాత 1931లో ఇది పూర్తయింది. దీని ప్రారంభ నామం 'ఆలిండియా మెమోరియల్ వార్'. ఈ కట్టడపు ఇరువైపులా పై భాగంలో ఇండియా గేట్ అనే పదాలు స్పష్టంగా కనిపించేటట్లు చెక్కబడింది.

అమర్ జవాన్ జ్యోతి మార్చు

1971లో జరిగిన భారత్-పాక్ యుద్ధం తరువాత ఈ కట్టడం క్రిందిభాగాన అమర్ జవాన్ జ్యోతి వెలుగుతోంది. 1971 నాటి యుద్ధంలో అమరులైన భారత జవానులకు ఇది నివాళులు అర్పిస్తోంది. దీనిని అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ప్రారంభించింది.

బయటి లింకులు మార్చు

మూలాలు మార్చు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-06-13. Retrieved 2008-06-08.
  2. http://www.searchindia.com/search/delhi-pictures/india-gate.html
  3. http://india.gov.in/knowindia/indiagate.php