ఉప్పలపాటి వెంకటేశ్వర్లు

ఉప్పలపాటి వెంకటేశ్వర్లు సాంకేతిక శాస్త్ర పరిశోధకుడిగా ప్రవేశించి, అనతికాలంలోనే అపూర్వ విజయాలను సాధించి, గమ్య సాధనలో కార్యదీక్షతో అలుపెరుగని కృషి సల్పిన శాస్త్రవేత్త. ఆయన సాంకేతిక విద్యా జ్ఞానాన్ని జనసామాన్యంలోకి తెచ్చిన వ్యక్తి.

జీవిత విశేషాలు మార్చు

ఆయన కృష్ణా జిల్లా లోని ఘంటసాల (కృష్ణా జిల్లా) గ్రామంలో డిసెంబరు 16, 1927 లో జన్మించారు. ఆయన యు.వి.వర్లు గా సుపరిచితులు. ఆయన హిందూ కాలేజి (బందరు) లో డిగ్రీ పూర్తి చేసి, మద్రాసు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి డి.ఎం.ఐ.టి ఆనర్స్ (బి.టెక్ తో సమానం) డిగ్రీని డిస్టింక్షన్ లో, ద్వితీయ ర్యాంకుతో అందుకున్నారు.[1]

సాధారణ రైతు కుటుంబంలో జన్మించి పేదరికాన్ని చవిచూసిన ఈయన ప్రముఖ శాస్త్రవేత్తగా రూపొందడానికి ప్రాథమిక విద్యాభ్యాసం నుండే అనేక కష్టాలు భరించాడు. డిగ్రీ అందుకున్న తర్వాత, 1954 లో ట్రాంబే (ముంబై) లోని టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చి సంస్థలో అసిస్టెంట్ సైంటిస్ట్ గా చేరారు. ఈ సంస్థలోనే తమ పరిశోధనా కృషికి శ్రీకారం చుట్టారు. నూక్లియర్ సాథన సంపత్తి మీద అధ్యయనం చేసారు. మరుసటి సంవత్సరం 1955 లో కేంద్రప్రభుత్వంనిర్వహనలోని అటమిక్ ఎనర్జీ శాఖలో ప్రవేశించారు.

సేవలు మార్చు

"తారాపూర్" అణు విద్యుత్ కేంద్రంలో చేరి, వివిధ అణుశక్తి పరిశోధనలలో పాలుపంచుకున్నారు. విశిష్ట శిక్షణ నిమిత్తం జపాన్, అమెరికా, బ్రిటన్ దేశాలలో పర్యటించారు. భారతదేశపు మొట్టమొదటి అణురియాక్టరు 'అప్సర" రూపకల్పన, అభివృద్ధి దశలు, ప్రయోగాలు నిమిత్తం నియమితులైన ముగ్గురు సాంకేతిక శాస్త్రవేత్తలలో ఈయన ఒకరుగా కృషి చేశాఅరు. అమెరికా, ఇంగ్లండ్ లలో అణుశక్తి మీద గాడాధ్యయనం చేసిన (1957-58) ఫలితాలు అణుశక్తి మీద ఉన్నత విద్య నేర్పిన అంశాలతో అణు రియాక్టర్ రూపకల్పనకు బాగా ఉపయోగపడ్డాయి. మూడవ రియాక్టరు "జర్లీనా"కు రూపకల్పన చేసి, ప్రయోగించే శాస్త్రవేత్తల బృందానికి సారథ్యం వహించారు. తారాపూర్ అణువిద్యుత్ కేంద్రంలో దాదాపు పుష్కరకాలం పాటు పనిచేశారు. ఈ వ్యవధిలోనే రెండు విభాగాలను కొత్తగా (1963) నెలకొల్పడానికి దోహదపడ్డారు. 1965 తదుపరి కాలంలో ఈయన ఆలోచనలు,ల్ ఊహలు అన్నీ ఉత్పత్తి రంగం మీదకు మళ్ళినాయి. కార్బన్ ఫిల్మ్‌లురెసిస్టర్లు మొదలైన వాటిని స్వదేశీ పరిజ్ఞానంతో తయారచేసే ప్రాథమిక స్థాయి ప్రాజెక్టును రూపొందించారు.

1967 లో ఈయన స్వరాష్ట్రానికి వచ్చేశారు. ఈ సమయంలోనే ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ను నెలకొల్పడాంతో ఆ సంస్థలో నియమితులయ్యారు. ఇ.సి.ఐ.ఎల్ తొలుత బొంబాయిలో ఉండేది. హైదరాబాదుకు తరలించడంలో ఈయన కూడా కృషి జరిపారు. తొలుత రెసిస్టర్స్, కెపాసిటర్స్, విభాగాన్ని స్వయంగా పర్యవేక్షించారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో అవిశ్రాంత పరిశోధనా కృషి చేశారు.

అందుకు అణుశక్తి రంగంలో ఆర్జించిన విశేష అనుభవం బాగా ఉపయోగపడింది. ఈ సంస్థలో పనిచేసిన ఏడేళ్లలో నాలుగు ప్రత్యేక విభాగాలను నెలకొల్పి, వాటికి అధ్పతిగా ఉన్నారు. అప్పట్లోప్రఖ్యాత శాస్త్రవేత్త ఎ.ఎస్.రావు చైర్మన్ గా ఉండేవారు. ఆయన ప్రోత్సాహంతో ఈయన ఎలక్ట్రానిక్స్ సాంకేతిక రంగంలో అవిరామ పరిశోధనలు చేశారు. ఇ.సి.టి.వి. బ్లాం అండ్ వైట్ కు రూపకల్పన చేసి మహోన్నత విజయాన్ని సాధించారు.

ఐసిఐఎల్ సంస్థలో ఈయన 1967లో నెలకొల్పి నేతృత్వం వహించిన రెసిస్టర్స్ అండ్ కెపాసిటర్స్ విభాగం కేవలం ఏడేళ్ళ వ్యవధిలో కోటి రూపాయల ఉత్పత్తిని సాధించి, కేంద్ర ప్రభుత్వ బంగారు పతకాన్ని (1975-76) అందుకున్నారు. ఈ సంస్థలో పనిచేసిన పుష్కర కాలమూ అతి ప్రతిభావంతంగా గడిపారు.

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థలో శాటిలైట్ వ్యవస్థను అధ్యయనం చేసి తిరిగి వచ్చిన తర్వాత ఇ.సి.ఐ.ఎల్.లోనే టీ.వీ సాంకేతిక అభివృద్ధిని సుసాధ్యం చేశారు. ప్రత్యేకంగా టి.వి విభాగాన్ని నెలకొల్పడానికి దోహదపడ్డారు.

మన రాష్ట్రంలో తొలిశ్రేణి బ్లాక్ అండ్ వైట్ టీవీలను రూపొందించిన ఘనత ఈయనకు దక్కింది. ఎలక్ట్రానిక్స్ రంగంలో అద్భుతలను ఆవిష్కరించి, తొలి ఏడాదిలోనే భారీ స్థాయి లాభాలను సమకూర్చారు. తర్వాత కాలంలో ఉత్తర ప్రదేశ్ లోని సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కు మెనేజింగ్ డాఇరక్టరుగా నియమితులయ్యారు. ఈ సంస్థలో కూడా పరిశోధనా కృషి కొనసాహించారు. తత్ఫలితంగా ఈ సంస్థ సౌరశక్తి రంగంలో అగ్రగామిగా భాసిల్లి ఈ రోజున సోలార్ సెల్స్ ఉత్పత్తిలో ప్రపంచం లోని మొదటి ఆరు అగ్రగామి దేశాలలో ఒకటిగా మన దేశాన్ని నిలబెట్టింది.

విదేశాలలో ఖ్యాతి మార్చు

నూక్లియర్ ఇంజనీరింగులో సమున్నత శిక్షణ (బ్రిటన్ లో 1957, అమెరికాలో 1958) పొందిన ఈయన 1963 లో "బేర్" సంస్థ తరపున ఇటలీలో భారీ స్థాయిలో ఒక ఇంజనీరింగ్ ప్రదర్శనను నిర్వహించి మనదేశ ఖ్యాతిని ఇనుమడింపచేశారు. అధ్యయనం, శిక్షణల నిమిత్తం పలుమార్లు వివిధ దేశాలను (1967లోజపాన్, 1972లో తూర్పు ఐరోపా దేశాలు, 1974లో ఎలక్ట్రానిక్స్ కమీసహన్ చైర్మన్ ఓ కలసి బల్గేరియా, పలు సందర్భాలలో అమెరికా, బ్రిటన్ దేశాలు) పర్యటించి విశేషానుభవాన్ని గడించారు. మన కేంద్ర ప్రభుత్వం తరపున పలు విదేశాలతో వివిధ ఒప్పందాలను కుదుర్చుకోవడాంలో, నూతన వ్యవస్థల రూపకల్పన చేయడంలో అమోఘమైన కర్తవ్య నిర్వహణ చేశారు.

అవార్డులు మార్చు

1986లో ప్రారంబించిన యలవర్తి నాయుడమ్మ అవార్డును అందుకుని తొలి శాస్త్రవేత్త ఈయనే. రఘుపతి వెంకటరత్నం అవార్డు గ్రహీత శాస్త్రవేత్తగానే గాక సామాజిక వేత్తగా సహృదయమూర్తిగా అందరి మన్ననలను అందుకున్నారు. తమ స్వగ్రామంలో సాంకేతిక శిక్షణ సంస్థను గ్రామస్తుల సహకారంతో మరో సాంకేతిక విద్యా బోధనా సంస్థను (1997) నెలకొల్పారు. గ్రామీణ విద్యార్థుల అభ్యున్నతికి ఈ సంస్థ ఐ.ఐ.టి, జూనియర్ కాలేజీ విభాగాలతో కృషి చేస్తుంది. ఉపాధి కల్పనా అవకాశాలను కూడా అందిస్తున్నది. పదవీ విరమణ అనంతరం హైదరాబాదులో ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్సు సంస్థ కార్యాకలాపాలను సమున్నతపరిచారు. విజయవాడ శివారు గ్రామం నిడమానూరులో ఇన్ క్యాంప్ లిమిటెడ్ సంస్థను నెలకొల్పి చైర్మన్ గా వ్యవహరించారు. హైదరాబాదులోనే స్థిర నివాసం యేర్పరచుకున్నారు. కాప్రా మ్యునిసిపాలిటీలోని అనుపురం కాలనీ (ఎ ఎస్ రావు నగర్) శేష జీవితం గడుపుతూ 2004 అక్టోబరు 2 తేదీన 77 వ యేట మృతి చెందారు. మన దేశం ఎలక్త్రానిక్స్ అభివృద్ధికి విస్తరణకు దిశా నిర్దేశం చేసిన సాంకేతిక శాస్త్రవేత్తగా ఎలక్ట్రానిక్స్ అణుశక్తి పరిశోధన రంగాలను విశేష కృషి చేసిన జన సామాన్యం శాస్త్ర కీర్తి ప్రతిష్ఠలను ఆర్జించిన ఉప్పలపాటి వెంకటేశ్వర్లు యు.వి.వర్లుగా అంతర్జాతీయ రంగాలను సుప్రసిద్దులయ్యారు.

మూలాలు మార్చు

  1. "కమ్మ ప్రముఖులు". Archived from the original on 2015-08-03. Retrieved 2015-02-08.

ఇతర లింకులు మార్చు