యలవర్తి నాయుడమ్మ

భారతీయ రసాయన ఇంజనీర్

యలవర్తి నాయుడమ్మ (సెప్టెంబర్ 10, 1922 - జూన్ 23, 1985) ప్రపంచ ప్రఖ్యాతి చెందిన రసాయన శాస్త్రవేత్త. చర్మ పరిశోధనలలో విశేష కృషి చేసిన మేధావి.

యలవర్తి నాయుడమ్మ
Yelavarthy Nayudamma.jpg
నాయుడమ్మ
జననం
యలవర్తి నాయుడమ్మ

సెప్టెంబర్ 10, 1922
మరణంజూన్ 23, 1985
అట్లాంటిక్ సముద్రము, ఐర్లాండ్ దక్షిణ భాగం
గుర్తించదగిన సేవలు
ప్రపంచ ప్రఖ్యాతి చెందిన రసాయన శాస్త్రవేత్త.

బాల్యం, విద్యాభ్యాసంసవరించు

గుంటూరు జిల్లా యలవర్రు గ్రామములో ఒక వ్యవసాయ కుటుంబములో సెప్టెంబరు 10, 1922 న జన్మించాడు. గ్రామ పాఠశాలలో ప్రాథమిక విద్య అభ్యసించిన పిమ్మట గుంటూరు ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివాడు. 1943 లో కాశీ హిందూ విశ్వవిద్యాలయములో రసాయన టెక్నాలజీలో ఉన్నతవిద్యనభ్యసించి మద్రాసు చర్మ టెక్నాలజీ సంస్థలో ప్రత్యేక విద్య గరపి అదే సంస్థలో అంచెలంచెలుగా ఎదిగి డైరెక్టరు అయ్యాడు. 1958 నుండి 1971 వరకు సుదీర్ఘకాలము డైరెక్టరుగా ఉన్నాడు. తన ఆధ్వర్యములో చర్మపరిశోధనా సంస్థను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళాడు. అమెరికా లోని లీ హై యూనివర్సిటీలో అంతర్జాతీయ చర్మ శుద్ధి అంశం మీద డాక్టరేట్ (పి.హె.డి) డిగ్రీ పొందారు.

పరిశోధనలుసవరించు

అమెరికా లోని చర్మ పరిశుభ్రం చేసే పరిశ్రమలో అఖండ పరిశోధనలు చేసి, అధ్భుత విజయాలను సాధించారు. 1943-45 నడుమ కాలంలో 'ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లెదర్ టెక్నాలజీ' (మద్రాసు) లో శాస్త్రవేత్తగా చేసిన పరిశోధనలు మేళవించగా, [అమెరికా]లో చేసిన పరిశోధనా కృషి ఫలవంతమైనది. తిరిగి మాతృదేశానికి వచ్చి, 1951 లో సెంట్రల్ లెదర్ రీసెర్చ్ యూనివర్సిటీలో శాస్త్రవేత్తగా చేరారు. ఎన్నో నూతన లాభదాయక ప్రణాళికలను రూపొందించి చర్మకార పరిశ్రమను అభివృద్ధి చేశారు. కేంద్ర చర్మ పరిశోధనా సంస్థనూ సాటిలేని పరిశోధనా సంస్థగా రూపొందించారు. ఈ సంస్థ జాతీయ స్థాయికి ఎదిగి పారిశ్రామిక అభివృద్ధి లోనూ, గ్రామీణ అభివృద్ధిలోనూ గణనీయమైన పాత్ర పోషించింది. 1956లో అదే సంస్థకు డైరక్టర్ గా పదోన్నతి పొందారు.

ప్రతిష్టాత్మక హోదాలుసవరించు

సామాన్య రైతు కుటుంబంలో పుట్టి పెరిగి శాస్త్ర సాంకేతిక రంగంలో ఉన్నత శిఖరాలను చేరుకొని మన దేశానికి ఖ్యాతిని ఆర్జించి పెట్టిన ప్రొఫెసర్ నాయుడమ్మ పలు ప్రతిష్ఠాత్మక హోదాలను అందుకున్నారు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (న్యూఢిల్లీ) సంస్థకు డైరక్టరు జనరల్ (1971-77) గా ఉన్నారు. జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (న్యూఢిల్లీ) కి వైస్ ఛాన్సలర్ (1981) గా ఉన్నారు. మద్రాసు యూనివర్సిటీకి గౌరవాచార్యులుగా సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (మద్రాసు) కు డిస్టింగ్విష్ శాస్త్రవేత్తగా (1977) గా పలు సంస్థలలో వివిధ బాధ్యతాయుతమైన పదవులు నిర్వహించారు.

వివిధ రంగాలలో విశేష పరిశోధనలుసవరించు

నాయుడమ్మ ఖనిజాలు, మొక్కలు, ఆల్డిహైడ్స్ మొదలైన వాటి కలయిక నిర్మాణ శైలి రంగాలలో కూడా విశేష పరిశోధనలు చేశారు. ఇవన్నీ తోళ్ళు పదును చేసే వినూత్న ఏజంట్స్ గా వివరించి, అంతర్జాతీయ గుర్తింపును పొందారు. "జన్మచేత రైతును, వృత్తిచేత అస్పృశ్యుడిని" అని తమ చర్మ శాస్త్ర సాంకేతిక పరిశోధనా వృత్తిని గురించి అప్పుడప్పుడు చమత్కరించేవారు. ఈయన పరిశోధనా కృషి ఫలితంగా మన దేశపు చర్మ తయారీ వస్తువులు అనేక వాటికి విదేశాలలో విశేషమైన ఆదరణ, గిరాకీ ఏర్పడ్డాయి. అంతేకాదు విజ్ఞాన వినిమయ కృషిలో అలీన దేశాలకు, ఇతర దేశాలకూ మధ్య రమణీయ సేతువుగా రూపొందారు. ప్రారంభం నుంచి మద్రాసు సి.ఆర్ ఆర్.ఐలో సన్నిహిత సంబంధాలు పెంచుకున్నారు. దాని అభివృద్ధికి అహరహం శ్రమించారు. సంస్థ లోని వివిధ ప్రయోగ శాలలకు నూతన రూపు రేఖలు దిద్దారు. నూతన లాబరేటరీలను ప్రణాళికలను వేసి, డిజైన్ రూపకల్పన చేసి, స్థాపించజేశారు. అత్యాధునిక శైలిలో తోళ్ళ పదునుకు, శుద్ధికి పైలట్ ప్లాంట్ లను దేశ స్థాయిలో తొలిసాగిగా నెలకొల్పడానికి దోహదపడ్డారు. లెదర్ సైన్స్ మాసపత్రికకు చాలాకాలం సంపాదకులుగా ఉన్నారు.

ఈయన 1975 లో ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ, ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఇండియన్ స్టాండర్డ్ ఇన్‌స్టిట్యూట్ సంస్థల ఫెలోషిప్ లను అందుకుని పరిశోధనలలో అగ్రగామిగా భాసిల్లారు. దేశ, విదేశ ప్రఖ్యాత సంస్థలలో గౌరవ సభ్యత్వాన్ని అందుకున్నారు. అమెరికన్ లెదర్ కెమిస్ట్స్ అసోషియేషన్, ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ లెదర్ ట్రేడ్ కెమిస్ట్స్, సొసైటీ ఆఫ్ లెదర్ ట్రేడ్ కెమిస్ట్స్ (బ్రిటన్) మొ.. సంస్థలలో గౌరవ సభ్యులుగా ఉన్నారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమిస్ట్స్కు, అసోషియేషన్ ఆఫ్ లెదర్ కెమిస్ట్స్ మొదలగు ప్రసిద్ధి చెందిన సంస్థలకు అధ్యక్షులుగా వ్యవహరించారు. ఇంటటి ఘనతరమైన హోదాలను నిర్వహించినప్పటికీ, సమావేశాలలో ఇతర సభలలో అపరిచితులతో సందర్బవశాత్తు "నా పేరు నాయుడమ్మ అంటారండీ" అని అతి సాధారణంగా తనను తాను పరిచయం చేసుకునేవారు. ఎంతటి వారినైనా ఈయనలోని నిరాడంబరత్వం, నిశిత మేధస్సు, విషవివేచనానుభవం ఇట్టే ఆకట్టుకునేవి.

ప్రభుత్వ గౌరవ సలహాదారుగాసవరించు

ఈయన లోని నిశిత మేధా శక్తిని, నిరాడంబరతను గుర్తించిన నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ఈయనను రాష్ట్ర ప్రభుత్వ గౌరవ సలహాదారుగా నియమించి గౌరవించారు. ఆ తర్వాత గద్దెనెక్కిన రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఈయనను గౌరవ పదవిలో కొనసాగిస్తూ ఈయన పరిణతను, సుదీర్ఘ అనుభవసారాన్ని వినియోగించుకున్నారు. తమిళనాడు ప్రభుత్వానికి కూడా గౌరవ సలహాదారుగా ఉన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా, సైన్స్, టెక్నాలజీలను ఉపయోగించి, వెనుక బాటుతనాన్ని (ఆర్ధికంగా) రూపుమాపేందుకు వెనుకబడిన జిల్లాల దత్తత కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి అనూహ్యంగా సత్ఫలితాలను సాధించిన ఈ కార్యశీలి పలు విశిష్ట గౌరవాలు అందుకున్నారు.

వ్యక్తిత్వంసవరించు

"సామాన్య మానవుని కోనం విజ్ఞాన శాస్త్రం" అనే ఉత్తమ సదాశయాన్ని ఆచరణలోకి తెచ్చిన ఉదాత్తుడైన నాయుడమ్మ గొప్ప వైజ్ఞానికుడు, విద్యావేత్త, చదువులు ముగించుకొని ఉద్యోగాలలో ప్రవేశించిన తర్వాత కాస్త మంచి జీతమే వస్తుందనుకోగానే సంవత్సరములో ఒక నెలజీతం అందుబాటులో ఉన్న పేద విద్యార్థులకు కేటాయించారు. ఈ సహాయమును దానంగా పరిగణించనూలేదు. తాను సహకరిస్తున్నట్లుగా అన్యులెవరికీ తెలియకుండా గుప్తంగా అందిస్తూ వచ్చారు. ఇంటటి ఉదార మనస్తత్వం వ్యక్తిగత జీవితంలో దెబ్బతిన్నట్లుగా ఆరోపణలు లెకపోలేదు. ఇంగ్లీషు భాషను రమణీయంగా, తెలుగును మరింత తియ్యదనంతో మాట్లాడేవారు. పరిశోధనలు, ఉద్యోగాలకు సంబంధించిన తమ అనుభవాలను సన్నిహితులకు వివరించడంలో కూడా వైజ్ఞానిక సరళిని అనుసరించేవారు. ఈయనతో ఒకసారి సంభాషనలు జరిపినవారు కూడా తమ జీవితంలో ఒక మధుర స్మృతిగా, చిరకాల స్మరణీయ సంఘటనగా మరచిపోలేదు.

పదవులు, పురస్కారాలుసవరించు

ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి వైస్-ఛాన్సలరుగా (1981-1982), భారత శాస్త్ర సాంకేతిక పరిశోధనా సంస్థకు డైరెక్టరు జనరల్ గా పనిచేసి పేరుప్రఖ్యాతులు పొందాడు. 1965 లో ఎం.ఎస్. యూనివర్సిటీ (వడోదర) వారు డాక్టర్ కె.జి.నాయక్ గోల్డ్ మెడల్ ప్రదానం చేశారు. 1971 లో భారత ప్రభుత్వము నుండి పద్మశ్రీ పురస్కారం, రాజలక్ష్మీ సంస్థనుండి శ్రీ రాజా లక్ష్మీ పురస్కారం పొందాడు. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ శాస్త్ర సంస్థలలో సభ్యులుగా ఉన్నాడు.

గేట్ పరీక్ష సిఫారసు కమిటీలోసవరించు

భారతదేశంలో పోస్ట్ గ్రాడ్యుయేషను స్థాయిలో ఇంజనీరింగులో నాణ్యమైన విద్యను అందించే సంకల్పంతో భారత ప్రభుత్వం 1978 లో ఒక సమీక్షా సంఘాన్ని వేసినపుడు దానికి డా. యలవర్తి నాయుడమ్మను చైర్మనుగా నియమించింది. ఆ కమిటీ ఇచ్చిన సిఫారసుల మేరకే నేటి ఇంజనీరింగ్ పట్టభద్రుల యోగ్యతా పరీక్ష (గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఫర్ ఇంజనీరింగ్ - గేట్) పరీక్షను ప్రారంభించారు. [1]

విమాన ప్రమాదంసవరించు

1985 జూన్ 23మాంట్రియల్లో జరిగిన ఒక సదస్సులో పాల్గొని స్వదేశం తిరిగి వస్తూండగా విమానం పేలిపోయి దుర్మరణం పాలయ్యాడు.

నాయుడమ్మ స్మారక సదస్సుసవరించు

ఆంధ్ర ప్రదేశ్ సైన్స్ అకాడమీ అధ్వర్యంలో జాతీయ భూభౌతిక పరిశోధనా సంస్థలో 2006, జూన్ 23 వ తేదీన (హైదరాబాద్) ప్రొఫెసర్ నాయుడమ్మ స్మారక సదస్సు జరిగింది. అందులో శాస్త్ర రంగంలో విశేష కృషీవలులు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ మాజీ సంచాలకులు డాక్టర్ జి. త్యాగరాజన్ కు నాయుడమ్మ స్మారక బంగారు పతకాన్ని బహూకరించారు. ఈ సందర్భంలోనే రాష్ట్ర ఆర్థిక మంత్రి రోశయ్య ప్రసంగిస్తూ ప్రొఫెసర్ నాయుడమ్మ జీవిత విశేషాలు, సాధించిన విజయాలమీద డాక్యుమెంటరీని రూపొందించాలని కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖను కోరతామని గట్టి హామీని ప్రసాదించారు.

ఐ.రా.స. సలహాదారుగాసవరించు

ఐరాస సలహాదారుగా పలు ఆఫ్రికా దేశాలలో తోళ్ళ పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడిన నాయుడమ్మ శాస్త్ర సాంకేతిక రంగంలో ఉన్నత శిఖరాలను చేరుకుని దేశానికి, మరీ ముఖ్యంగా తెలుగు జాతికీ ఎనలేని ఖ్యాతిని ఆర్జించి పెట్టారు.

డా. యలవర్తి నాయుడమ్మ మెమొరియల్ అవార్డ్సవరించు

1986 లో ప్రఖ్యాత శాస్త్రవేత్త డా.వై నాయుడమ్మ సంస్మరణార్థం స్థాపించిన అవార్డును సైన్స్, టెక్నాలజీ, రంగాలలో అపూర్వ ప్రతిభను చూపిన వారికి ప్రతి సంవత్సరం అందిస్తున్నారు.

ఈ అవార్డ్ పొందిన ప్రముఖులు టి.రామస్వామి, ఎ శివతాను పిళ్ళై, నోరి దత్తాత్రేయుడు, శామ్ పిట్రోడా, జీ మాధవన్ నాయర్, కోట హరినారాయణ, వి.కె. ఆత్రే, ఆర్. చిదంబరం, ఆర్.ఎ. మశేల్కర్ జె.ఎస్. బజాజ్, కె. కస్తూరి రంగన్, వర్ఘీస్ కురియన్, ఎస్.జెడ్. ఖాసిం, ఎం.జి. కె.మీనన్, ఎం.ఎస్. స్వామినాథన్ వి.కె. సారస్వత్ (2009) తదితరులు. [2] 2019 కి గానూ ఈ పురస్కారం కి త్రిపురనేని హనుమాన్ చౌదరి ని ఎంపిక చేశారు.

మూలాలుసవరించు

  1. "Report of the review committee on post-graduate education and research in engineering and technology". INDIAN CULTURE (in ఇంగ్లీష్). Archived from the original on 2022-06-24. Retrieved 2022-06-24.
  2. "Missile Man-II, looking ahead and farther". ది హిందూ. 2010-02-23. Archived from the original on 2010-03-01. Retrieved 2010-03-01.