ఎర్రకోటపై ఉగ్రవాదుల దాడి - 2000

2000 డిసెంబరు 22 న ఎర్రకోటపై ఉగ్రవాదులు చేసిన దాడి.

2000 డిసెంబర్ 22 రాత్రి ఢిల్లీ లోని ఎర్రకోటపై లష్కరే తోయిబా తీవ్రవాదులు దాడి చేసారు. ఆరుగురు తీవ్రవాదులు పాల్గొని విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఇద్దరు సైనికులు, ఒక సాధారణ పౌరుడు మరణించారు.

ఎర్రకోట, ఢిల్లీ

ముస్లిముల పవిత్ర మాసమైన రంజాన్ నెలలో భారత ప్రభుత్వం కాశ్మీరులో ఏకపక్ష కాల్పుల విరమణను ప్రకటించింది. కాశ్మీరులో శాంతి స్థాపన దిశలో ఇదో ముందడుగు. అయితే తీవ్రవాదులకు ఇది నచ్చలేదు. శాంతి స్థాపనా చర్యలను వ్యతిరేకిస్తామని, తమ దాడులని తీవ్రతరం చేస్తామని లష్కరేతోయిబా బహిరంగంగా ప్రకటించింది.

దాడి అనంతరం తీవ్రవాదులందరూ తప్పించుకున్నారు. సంఘటనా స్థలాన్ని గాలించిన పోలీసులకు దొరికిన ఓ కాగితం ముక్కపై ఉన్న ఓ మొబైల్ నంబరు ఆధారంగా కూపీ లాగగా, అది అష్ఫాక్ అహ్మద్దని తేలింది. డిసెంబర్ 25 రాత్రి ఢిల్లీ పోలీసులు గాజీపూర్ లోని ఒక ఇంటిపై దాడిచేసి అష్ఫాక్‌ను, అతని భార్య రహ్మానా రెహ్మానా యూసఫ్ ఫరూఖీని అరెస్టు చేసారు. అష్ఫాక్ అలియాస్ ఆరిఫ్ పాకిస్థాన్ దేశీయుడు. భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు డబ్బు సాయం చేస్తున్న అంతర్జాతీయ హవాలా వ్యాపార ముఠాలో సభ్యుడు. 2000 జనవరిలో భారత్‌లోకి అడుగుపెట్టాడు. అరెస్టు చేసిన సమయంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న పత్రాలు, టెలిఫోన్ నంబర్ల కాగితాలు, పాస్‌ పుస్తకాలు, ఏటీఎం కార్డులు, అతడు పాక్, సౌదీ అరేబియాలలో డబ్బును సేకరించేవాడని బయట పెట్టాయి.

విచారణలో అష్ఫాక్ ఈ దాడికి సూత్రధారుడని తేలింది. ఇతర తీవ్రవాదులు అబూ షమల్, అబూ సాద్ అలియాస్ అజ్జిద్, అబూ సఖర్, బిలాల్, హైదర్‌లని కూడా తేలింది. అబూ షమల్ అదేరాత్రి జరిగిన పోలీసు కాల్పుల్లో మరణించాడు. అబు సాద్, బిలాల్, హైదర్‌లు ఆ తరువాత వివిధ ఎన్‌కౌంటర్లలో మరణించారు.

కోర్టు తీర్పు

మార్చు

ఈ కేసులో 2005 అక్టోబర్ 31 న ఢిల్లీ అదనపు సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చింది. లష్కరే తోయిబా ఉగ్రవాది మొహమ్మద్ ఆరిఫ్ అలియాస్ అష్ఫాక్‌కు మరణశిక్ష పడింది. అష్ఫాక్‌తో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రపన్నిన నజీర్ అహ్మద్ ఖ్వాసిద్, ఆయన తనయుడు ఫరూక్ అహ్మద్ ఖ్వాసిద్‌లకు జీవిత ఖైదు విధించారు. ప్రధాన నిందితుడికి ఆశ్రయమిచ్చినందుకు ఆయన భార్య రెహ్మానా యూసఫ్ ఫరూఖీకి ఏడేళ్ళ జైలు శిక్ష వేశారు. సహ నిందితులుగా పేర్కొన్న బగర్ మొహసిన్ భగ్వాలా, సదాఖత్ అలీ, మత్లూబ్ అలమ్‌లకు ఐదేళ్ళ ఖైదు విధించారు. ఈ ఎనిమిది మందీ నేరానికి పాల్పడ్డారని అక్టోబరు 24నే ప్రత్యేక కోర్టు జడ్జి నిర్ధారించారు. అష్ఫాక్‌కు ఆశ్రయమిచ్చినందుకు భగ్వాలా, అలీ; నేరపూరిత కుట్రకు, మోసానికి, ఫోర్జరీకి పాల్పడినందుకు మత్లూబ్ అలమ్ శిక్షకు గురయ్యారు. అష్ఫాక్, నజీర్, ఫరూక్‌లకు తలా లక్ష రూపాయలు, మిగిలిన నిందితులకు తలా 20,000 రూపాయల చొప్పున జరిమానా కూడా విధించింది.

ఇవి కూడా చూడండి

మార్చు

భారత్‌లో ఉగ్రవాద ఘటనల జాబితా

బయటి లింకులు

మార్చు
  • Rediff coverage