ఎలుగుబంటి వేషాలు
దసరా ఉత్సవాల ఆ తొమ్మిది రోజులూ రకరకాల వేషాలను ప్రదర్శిస్తారు. అలాగే సంక్రాంతి దినాలలో కూడ విచిత్ర వేషాలను ధరించి ఇంటింటికి తిరిగి ప్రజలనానంద పరిచి, వారి నుండి ధాన్యాన్నీ, డబ్బులనూ వసూలు చేసుకుంటారు. ముఖ్యంగా ఈ వేషాల్లో జంతువులకు సంబందించిన పులి వేషం పిల్లల్నీ పెద్దల్నీ ఎంతో ఆకర్షింస్తుంది. పిల్లలైతే అసలు దగ్గరకు రారు. అలాగే ఎలుగుబంటి వేషం కూడ. ఆనాటి ప్రజలకు వినోద ప్రదర్శనలు ఇలాంటివే. వీటిని అతి నైపుణ్యంతొ కళాత్మకంగా ప్రదర్శిస్తారు. అలాంటి వేషాల్లో ఎలుగు బంటి వేషం కూడ ముఖ్యమైంది. జంతువుల వేషాలను ధరించిన వారు ఆ జంతువుల యొక్క పోకడలనూ విన్యాసాలనూ, గంతులనూ అరుపులనూ చక్కగా అనుకరిస్తారు.
ముఖ్యంగా ఈ ఎలుగుబంటి ముఖాన్ని కాగితపు గుజ్జుతో మోల్డు చేస్తారు. కొంత మంది అట్టలతో తయారు చేస్తారు. పాత్ర ధారి ఈ మూతిని తలకు ధరిస్తాడు. శరీర మంతా జనపనార పీచును నల్లరంగులో ముంచి ఎండబెట్టి దానిని ఒక గుడ్దకు కాళ్ళను, చేతుల్నీ మొత్తం శరీరాన్నంతా ఆక్రమించేటట్లు చక్కగా కుట్టి ధరిస్తారు. ఎలుగు బంటి నడకనూ, చేష్టలనూ చక్కగా చేస్తారు. ఒకోసారి నిజమైన ఎలుగుబంటిని కూడ మచ్చిక చేసి ఆడిస్తారు. ప్రేక్షకులకు సలాం చేయిస్తారు. దాని చేత గంతులు వేయిస్తారు. ఒక కర్రను అడ్డం పెట్టి ఆ కర్రను దాటిస్తారు. దానితో సర్కసు ఫీట్లను చేయిస్తారు. ఒకోసారి దానిని పిల్లల మీదికి ఉరికిస్తారు. దాని నెత్తి మీద దానితో టోపీ పెట్టిస్తారు. అది గంతులు వేసేటప్పుడు ఆ అడుగులను అనుకరిస్తూ డప్పులను వాయిస్తారు. ఈ డప్పుల వాయిద్యంతో ఊరు ఊరంతా ఆ ప్రదేశానికి కదిలి వస్తారు.
అలాగే ఎలుగుబంటి వేషధారులు కూడ నిజమైన ఎలుగుబంటి చేష్టలన్నిటినీ అక్షరాలా అనుకరిస్తారు. నిజమైన ఎలుగు బంటి వెండ్రుకలు జాన పదులకు ఎంతో విలువైనవి. ఆ వెంట్రుకల్ని తాయెత్తులలో చుట్టించి మొలలకు కట్టుకుంటారు పురుషులు. స్త్రీలు ఆ తాయెత్తు లను మంగళసూత్రం త్రాడులో కడతారు. భయపడిన పిల్లలకు తాయెత్తు కట్టితే, చెడు జబ్బులు రావనీ, గాలి చేష్టలు అంటవనీ పెద్దల నమ్మకం. ఎలుగుబంటిని ముఖ్యంగా ఆడించే వారు ఎక్కువ మంది ముస్లింలంటారు ఆర్వీ.యస్ సుందరంగారు .......... జానపద విజ్ఞానం లో. కర్నాటక లో కొడగు లో హరిజనులు, ముస్లింలు ఎలుగు బంటి వేషాలు ధరిస్తారట. దీపావళి, వినాయక చవితి, మొహరం వంటి పండదలకు ఈ వేషాలను ధరిస్తారట.
మూలాలు
మార్చు- తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు వారు 1992 సంవత్సరంలో ముద్రించిన డా. మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి గారు రచించిన తెలుగువారి జానపద కళారూపాలు.