ఎల్.ఆర్.స్వామి (లక్ష్మణయ్యర్ రామస్వామి) సుప్రసిద్ధ రచయిత, అనువాదకుడు.

ఎల్.ఆర్.స్వామి
జననంఎల్.ఆర్.స్వామి
(1944-10-16)1944 అక్టోబరు 16
Indiaత్రిచూర్, త్రిచూర్ జిల్లా, కేరళ రాష్ట్రం
ఉద్యోగంఆంధ్రా పెట్రోకెమికల్స్
ప్రసిద్ధిప్రముఖ మళయాల, తెలుగు రచయిత , అనువాదకుడు
మతంహిందూ
భార్య / భర్తభట్టిప్రోలు నాగసుందరి
తండ్రిటి.కె.లక్ష్మణ అయ్యర్
తల్లిరాజమ్మాళ్

జీవిత విశేషాలు

మార్చు

ఇతడు 1944, అక్టోబరు 16వ తేదీన కేరళ రాష్ట్రంలోని త్రిచూర్ పట్టణానికి సమీపంలో ఉన్న ఒక అగ్రహారంలో టి.కె.లక్ష్మణ అయ్యర్, రాజమ్మాళ్ దంపతులకు జన్మించాడు.[1][2] ఇతని బాల్యం అంతా కేరళలోనే గడిచింది. మాతృభాష తమిళం. మలయాళ మాధ్యమంలో చదువుకున్నాడు. ఉపనయనం తరువాత తండ్రి దగ్గర సంస్కృతం నేర్చుకున్నాడు. కాలేజీ చదువు ముగిసిన తరువాత ముంబైలో రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ అనే కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. అనంతరం విశాఖపట్టణంలోని ఆంధ్రా పెట్రోకెమికల్స్‌లో మెరుగైన ఉద్యోగం రావడంతో తన మకాం విశాఖపట్టణానికి మార్చి అక్కడే స్థిరపడ్డాడు. ముంబైలో ఉన్నప్పుడు హిందీ, విశాఖపట్టణంలో తెలుగు భాషలు నేర్చుకున్నాడు. 1969లో తెలుగమ్మాయి భట్టిప్రోలు నాగసుందరితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు అమ్మాయిలు జన్మించారు. ఇతడు సీనియర్ మేనేజర్‌గా పదవీవిరమణ చేసి ప్రస్తుతం సాహిత్యాధ్యయనానికే పూర్తి సమయాన్ని కేటాయిస్తున్నాడు.

మలయాళ రచయితగా

మార్చు

ఇతడు తొమ్మిదవ తరగతి చదువుతున్నప్పుడు మొట్టమొదటి కవిత 'ఆకలి' వ్రాశాడు. అది వాళ్ల స్కూలు మ్యాగజైన్‌లో ప్రచురింపబడి అందరి ప్రశంసలు అందుకుంది. 10వ తరగతి చదివే సమయంలో ఒక నాటిక వ్రాసి ప్రసిద్ధ మలయాళ వారపత్రిక మాతృభూమి నిర్వహించిన ఏకాంకిల పోటీకి పంపాడు. దానికి ప్రథమ బహుమతి వచ్చింది. ఆ తరువాత ఒక దశాబ్దకాలం 1960-70ల మధ్య మలయాళంలో విరివిగా కవితలు వ్రాసి యువకవిగా గుర్తింపు పొందాడు. ఎం.టి.వాసుదేవన్ నాయర్, పి.కుంజిరామన్, తక్కళి, శంకర్ కురుప్, కేశవదేవ్ వంటి ప్రముఖ మలయాళ రచయితల అభిమానాన్ని చూరగొన్నాడు.

తెలుగు సాహిత్యంలో కృషి

మార్చు

ఉద్యోగరీత్యా మలయాళ సాహిత్యానికి దూరమైన తరువాత ఎంతో కష్టాలను ఎదుర్కొని తెలుగు భాషను నేర్చుకున్నాడు. 1980 నుండి తెలుగు సాహిత్యం అధ్యయనం చేయడం మొదలుపెట్టాడు. ఆధునికాంధ్ర సాహిత్యంతో పాటుగా ప్రాచీన కావ్యాలను కూడా విరివిగా చదివాడు. ఇతడు తెలుగులో మొదటి రచన చేయడం వెనుక ఒక ఆసక్తి కరమైన నేపథ్యం ఉంది. తన సహోద్యోగులతో వాదప్రతివాదాలలో వారు చేసిన సవాల్‌ను స్వీకరించి మొట్టమొదటి కథ జవాబులేని ప్రశ్నను వ్రాశాడు. ఆ కథకు ఆంధ్రజ్యోతి వారపత్రిక నిర్వహించిన కథలపోటీలో ప్రథమ బహుమతి వచ్చింది. అప్పటినుండి సుమారు 200 కథలు, 50 కవితలు తెలుగులో వ్రాశాడు. ఇతడికి విశాఖలోని విశాఖ సాహితి, సహృదయసాహితి, మొజాయిక్ సంస్థలతో సంబంధం ఉంది. చివరి రెండు సంస్థలకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇతని రచనల గురించి పరిశోధనలు జరిపి తెలుగు విశ్వవిద్యాలయంలో ఎం.ఫిల్, పి.హెచ్.డి స్థాయిలో జరిగాయి.

అనువాదకుడిగా

మార్చు

ఇతడు 12 పుస్తకాలు మలయాళం నుండి తెలుగులోనికి, 13 పుస్తకాలు తెలుగు నుండి మలయాళ భాషలోనికి అనువదించాడు. రెండు భాషల్లో కవిత్వం, కథ, నవల అనే ప్రక్రియలకు సంబంధించిన రచనలను అనువాదం చేశాడు. కేంద్ర సాహిత్య అకాడెమీ, నేషనల్ బుక్ ట్రస్ట్, ద్రవిడ విశ్వవిద్యాలయం, కేంద్రీయ విశ్వవిద్యాలయం మొదలైన సంస్థల కొరకు అనువాదాలు చేశాడు. సెంట్రల్ లాంగ్వేజస్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ వారికి తెలుగు - మలయాళ నిఘంటు రచనలో సహకరించాడు. అనేక సెమినార్లు సభలకు హాజరై ఎందరో రచయితలతో, భాషావేత్తలతో, సాహితీవేత్తలతో చర్చలలో పాల్గొన్నాడు.

రచనలు

మార్చు

తెలుగు పుస్తకాలు

మార్చు
  1. గోదావరి స్టేషన్ (కథల సంపుటి)
  2. ఆటవిక రాజ్యం (తమిళ కథల అనువాదం - మూలం: ఆర్.నటరాజన్)
  3. శరీరం ఒక నగరం (మలయాళ కవితల అనువాదం - మూలం: కె.సచ్చిదానందన్)
  4. సామెతల కథలు మినీకథలు (కథల సంపుటి)
  5. కథాకాశం (కథల సంపుటి)
  6. సూఫీ చెప్పిన కథ (మలయాళం నుండి అనువాదం - మూలం: కె.పి.రామనున్ని)
  7. పాండవపురం (మలయాళ నవల మూలం:సేతు)
  8. కథాస్వామ్యం (కథల సంపుటి)
  9. లోగుట్టు పెరుమాళ్ళకెరుక (కథల సంపుటి)
  10. మలయాళ జానపద గేయాలు (అనువాదం - మూలం: కె.అయ్యప్ప పణికర్)
  11. కొండ దొరసాని (అనువాదం మలయాళ నవల - మూలం:నారాయణ్) ISBN 978-81-260-3077-1
  12. కథాకేరళం (మలయాళ కథల అనువాదం)
  13. ముద్రలు (మలయాళ నవల అనువాదం)
  14. బ్రహ్మర్షి శ్రీ నారాయణగురు (అనువాదం మూలం:టి.భాస్కరన్)
  15. కథావారధి (మలయాళ కథల అనువాదం)

మలయాళ పుస్తకాలు

మార్చు
  1. కాలాన్ని నిద్రపోనివ్వను (ఎన్.గోపి కవిత్వం అనువాదం)
  2. శిఖామణి కవిత్వం (అనువాదం)
  3. గురజాడ కథలు (అనువాదం)
  4. మహాకవి శ్రీశ్రీ (మోనోగ్రాఫ్)
  5. కేతు విశ్వనాథరెడ్డి కథలు (అనువాదం)
  6. ఆంధ్రవాజ్మయ చరిత్ర (అనువాదం - మూలం: దివాకర్ల వెంకటావధాని)
  7. పి.విజయలక్ష్మి పండిట్ కవిత్వం (అనువాదం)
  8. ജീവിറ്റമ്മ് എന്നകല - జయంతి పాపారావు కథలు (అనువాదం)

పురస్కారాలు

మార్చు
  1. అభ్యుదయ రచయితల సంఘం విశాఖ శాఖ వారిచే పురిపండా అప్పలస్వామి సాహిత్య పురస్కారం (2013) [3]
  2. కోకిల మాసపత్రిక వారి నుంచి ఉగాది పురస్కారం (1988)
  3. విశాఖ ఫైన్ ఆర్ట్స్ కల్చరల్ అకాడెమీ వారిచే ఉగాది పురస్కారం (2005)
  4. రాయగడ (ఒడిషా) తెలుగు అసోసియేషన్ వారి ఉగాది పురస్కారం (2010)
  5. రాష్ట్రమంత్రి మండలి బుద్ధప్రసాద్ చే సన్మానం (2007)
  6. నల్లిథి సాయి అవార్డు (2008)
  7. శ్రీ ప్రభాసాంబ అవార్డు (2010)
  8. విశాఖ ఆణిముత్యం అవార్డు (2005)

మూలాలు

మార్చు
  1. ఎల్.ఆర్.స్వామి (అక్టోబరు 2014). "రచయితను అవడం అనుకోని ఘటన". పాలపిట్ట. 5 (8–9): 28–30.
  2. మేడా, మస్తాన్‌రెడ్డి (2011-02-09). "నవ్యనీరాజనం". నవ్యవీక్లీ: 19–21. Archived from the original on 24 ఆగస్టు 2011. Retrieved 22 December 2014.
  3. ఎడిటర్ (November 14, 2013). "Puripanda literary award presented to L.R. Swamy". ది హిందూ. Retrieved 22 December 2014.