దివాకర్ల వేంకటావధాని
దివాకర్ల వేంకటావధాని (జూన్ 23, 1911 - అక్టోబరు 21, 1986) పరిశోధకుడు, విమర్శకుడు.
దివాకర్ల వేంకటావధాని | |
---|---|
జననం | దివాకర్ల వేంకటావధాని 1911 జూన్ 23 ఆకుతీగపాడు గ్రామం,పెంటపాడు మండలం, పశ్చిమ గోదావరిజిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం |
మరణం | 1986 అక్టోబరు 21 ముంబై |
మరణ కారణం | అధిక రక్తస్రావం |
వృత్తి | ఉపన్యాసకుడు |
ప్రసిద్ధి | కళాప్రపూర్ణ, విద్యాసనాథ, కవిభూషణ |
మతం | హిందూ |
భార్య / భర్త | మహాలక్ష్మి, చంద్రావతి |
పిల్లలు | దివాకర్ల సీతారామశర్మ, దివాకర్ల లలితాభాస్కరశాస్త్రి, చావలి మహాలక్ష్మి, ఆచంట వేంకటలక్ష్మి, గాయత్రి, చుక్కా రాజేశ్వరి, ఏలేశ్వరపు అరుణశ్రీ |
తండ్రి | సుందర రామయ్య |
తల్లి | వేంకమాంబ |
బాల్యం
మార్చుఇతడు దివాకర్ల వంశంలో పరీధావి నామ సంవత్సరం, ఆషాఢ పౌర్ణమి నాడు ఆకుతీగపాడు గ్రామంలో అమ్మమ్మ ఇంట్లో జన్మించాడు. జన్మనక్షత్రం మూల. హరితస గోత్రుడు. వెలనాటి వైదిక బ్రాహ్మణుడు. కృష్ణ యజుర్వేదశాఖకు చెందినవాడు. ఇతని తండ్రి పేరు సుందరరామయ్య, తల్లి పేరు వేంకమ్మ. పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి మండలం యండగండి ఇతని స్వగ్రామం. తిరుపతి వేంకటకవులలో ఒకరైన దివాకర్ల తిరుపతిశాస్త్రి ఇతనికి పినతండ్రి. దివాకర్ల వేంకటావధానికి ఒక తమ్ముడు, ముగ్గురు చెల్లెళ్లు. ఇతడే ఇంటికి పెద్దకొడుకు. బాల్యంలోనే ఇతని ప్రతిభాపాటవాలు వెలుగు చూశాయి. సహజ ధారణాశక్తితో చిన్నప్పుడే తిరుపతి వేంకటకవుల అవధాన పద్యాలను కంఠస్తం చేశాడు. ఎనిమిదవ తరగతి చదివే సమయంలోనే ఇతని పద్యాలు భారతి మాసపత్రికలో ప్రచురితమయ్యాయి.
విద్యాభ్యాసం
మార్చుఇతడు ఇంట్లోనే తన తండ్రి వద్ద సంస్కృతం నేర్చుకున్నాడు. రఘువంశం, ఆంధ్రనామసంగ్రహం చదువుకున్నాడు. తన గ్రామం యండగండిలో ఏడవ తరగతి వరకు చదివాడు. ఆ తర్వాత ఉండిలో సంస్కృతం ప్రథమ భాషగా, తెలుగు ద్వితీయ భాషగా ఉన్నతపాఠశాల విద్య చదివాడు. అనంతరం 1930-31లో బందరు హిందూ కళాశాలలో ఇంటరు చదివాడు. ఆ సమయంలో విశ్వనాథ సత్యనారాయణ ఇంట్లో వుంటూ పేదరికం కారణంగా వారాలు చేసి చదువుకున్నాడు. విశ్వనాథకు ప్రియశిష్యుడిగా వుండి అతడి ఏకవీర నవలను చెబుతుండగా దివాకర్ల వేంకటావధాని వ్రాసేవాడు. విశ్వనాథ, కొడాలి వెంకట సుబ్బారావుల ప్రోద్బలంతో విశాఖపట్టణం వెళ్లి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బి.ఏ. (ఆనర్సు) చేరాడు. అక్కడ పింగళి లక్ష్మీకాంతం, మల్లాది సూర్యనారాయణ శాస్త్రి, గంటి జోగి సోమయాజి ఇతనికి గురువులు. పాటిబండ మాధవశర్మ ఇతని సహాధ్యాయి. బి.ఏ. తరువాత ధర్మవరం రామకృష్ణమాచార్యులు గురించి విమర్శావ్యాసం వ్రాసి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి మొట్టమొదటి ఎం.ఏ (ఆనర్సు) పట్టాను పొందాడు. తెన్నేటి విశ్వనాథం దగ్గర ఆంగ్లభాషా పరిజ్ఞానం సంపాదించాడు. 1942 ప్రాంతాలలో వేదాధ్యయనం మొదలు పెట్టి మహావుత చయనులు వద్ద నమక చమకాలను దశశాంతులు మొదలైనవాటిని వల్లెవేశాడు. 1957లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఖండవల్లి లక్ష్మీరంజనం పర్యవేక్షణలో ఆంధ్ర వాఙ్మయారంభ దశ - నన్నయ భారతము అనే విషయంపై పరిశోధన చేసి పి.హెచ్.డి పట్టాను సాధించాడు.
వివాహం
మార్చుఇతడు తొమ్మిదవ తరగతి చదువుతున్నప్పుడు ఇతనికి మహాలక్ష్మితో వివాహం జరిగింది. అప్పుడు మహాలక్ష్మి వయసు ఎనిమిదేళ్లు మాత్రమే. పెళ్ళి జరిగిన మూడు సంవత్సరాలకే మహాలక్ష్మి విషజ్వరంతో మరణించింది. తరువాత ఇతడు బి.ఏ (ఆనర్సు) రెండవ సంవత్సరంలో ఉండగా చంద్రావతితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ఐదుగురు కుమార్తెలు కలిగారు.
ఉద్యోగపర్వం
మార్చు1934లో అప్పటి ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి డా||సర్వేపల్లి రాధాకృష్ణన్ ఇతడిని విశాఖపట్టణంలోని మిసెస్ ఏ.వి.ఎన్.కళాశాలలో తెలుగుపండితుడిగా నియమించాడు. తరువాత పదోన్నతి పొంది అదే కళాశాలలో ఉపన్యాసకుడిగా పనిచేశాడు.ఆంధ్ర విశ్వవిద్యాలయం బోర్డ్ ఆఫ్ స్టడీస్‌కు అధ్యక్షుడిగా నియమింపబడ్డాడు. 1951లో హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆంధ్రోపన్యాసకుడిగా చేరాడు. 1957లో రీడర్‌గా, 1964లో ప్రొఫెసర్‌గా, తెలుగు శాఖాధ్యక్షుడిగా పదోన్నతి పొందాడు. 1974-1975ల మధ్యకాలంలో ఎమినెంట్ ప్రొఫెసర్‌గా, 1975 నుండి 1978 వరకు యు.జి.సి.ప్రొఫెసరుగా పదవీ బాధ్యతలు నిర్వహించాడు. ఇతడి పర్యవేక్షణలో 15మంది పి.హెచ్.డి, ఒకరు ఎం.ఫిల్ పట్టాలను పొందారు. ఇతని శిష్యగణంలో ఎం.కులశేఖరరావు, ఇరివెంటి కృష్ణమూర్తి, పి.యశోదారెడ్డి, సి.నారాయణరెడ్డి, ముద్దసాని రామిరెడ్డి మొదలైనవారు ఉన్నారు.
సారస్వతరంగం
మార్చుఇతడు నలభైకి మించి గ్రంథాలను రచించాడు. వాటిలో పద్యకృతులు, వచన రచనలు, విమర్శలు, వ్యాఖ్యానాలు, అనువాదాలు, టీకాతాత్పర్యాలు ఉన్నాయి. ఖండవల్లి లక్ష్మీరంజనంతో కలిసి ఆంధ్రమహాభారత సంశోధిత ముద్రణకు విపులమైన పీఠిక వ్రాశాడు. తెలంగాణాలోని మారుమూల గ్రామాలకు పిలవగానే వెళ్లి ఉపన్యాసాల ద్వారా అక్కడి ప్రజలకు తెలుగు భాషాసాహిత్య చైతన్యాన్ని కలిగించాడు. అనేక కవిపండితుల గ్రంథాలకు చక్కని పీఠికలను, సమగ్ర సమీక్షలను అందించి వారిని ప్రోత్సహించాడు. ఇతనికి అనేక సాహిత్య సంస్థలతో సంబంధం ఉండేది. వాటిలో ఆంధ్ర సారస్వత పరిషత్తు, యువభారతి, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, కేంద్ర సాహిత్య అకాడమీ, సంస్కృత భాషా ప్రచార సమితి, ఆర్ష విజ్ఞాన సమితి, సురభారతి, కళాస్రవంతి అనేవి కొన్ని. ఇతడి ఉపన్యాసాలకు జనం వేలకొలది వచ్చేవారు. వసుచరితము గురించి ఇతడు ఉపన్యసిస్తుంటే శ్రోతలు వర్షంలో గొడుగులు పట్టుకుని నిలబడి ఉపన్యాసం విన్నారంటే ఇతని ఉపన్యాస కళ ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు.
రచనలు
మార్చు- ఆంధ్ర వాజ్మయ చరిత్రము,[2] [3]
- Telugu In Thirty 30 Days[4]
- ఆంధ్ర నాటక పితామహుడు- ధర్మవరం రామకృష్ణమాచార్యులు నటనపై సాహితీ విమర్శ గ్రంథం[5]
- శ్రీ ఆంధ్ర మహాభారతము (సభాపర్వము) [6] (సంపాదకత్వము)
- ఆంధ్ర వాజ్మయారంభ దశ (ప్రాఙ్నన్నయ యుగము) [7]
- రాజసందర్శనము[8] (కావ్యము)
- సీతాకళ్యాణము[9] (యక్షగాన నాటకము - సంపాదకత్వము)
- తెలుగు సామెతలు[10] (సంపాదకుడు - పి.యశోదారెడ్డి, మరుపూరు కోదండరామిరెడ్డి లతో కలిసి)
- కౌముదీ మహోత్సవము
- నాగానందము
- కాదంబరి
- వేమన తత్వము
- గురుశిష్యులు
- కిరాతార్జునీయము
- ఆంధ్రభాషాచరిత్ర
- మధువనము
- కలిపరాజయము
- త్రింశతి
- ప్రకృతి విజయము
- శివభక్త విజయము
- శ్రీవిద్యాగద్య రామాయణము
- బల్గేరియా జనచరిత్ర
- నన్నయ కవితావైభవము
- నన్నయ భట్టారకుడు
- నన్నయ భట్టు
- నన్నెచోడుని కుమారసంభవము - భాషాప్రయోగములు
- ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ విశిష్ట సభ్యుల ప్రశంస
- తిరుపతివేంకటకవులు
- పరశురామ పంతుల జీవితము - సాహిత్యము
- పోతన
- POTHANA
- వాల్మీకి-విశ్వనాథ
- ఆదికవి వాల్మీకి
- ఆంధ్రవాజ్మయారంభ దశ - ప్రబంధవాజ్మయము
- మలయాళ వాఙ్మయ చరిత్ర
- సాహిత్యసోపానములు
- భాషాశాస్త్ర విమర్శసూత్రములు
- కవిసమ్రాట్ విశ్వనాథ
- అల్లావుద్దీను వింతలాంతరు
- కృష్ణయజుర్వేదీయ తైత్తరీయ సంహిత
- వ్యాసావళి
- సంస్కృత వ్యాకరణ సంగ్రహము
- విశాలాంధ్రోదాహరణము
- భారతస్వాతంత్ర్యోదాహరణము
- సుందర సందేశము - గేయ సుందరకాండము
- భగవద్గీత యథాతథము
- శివానందలహరి (టీకా తాత్పర్యములు)
- సౌందర్యలహరి (టీకా తాత్పర్యములు)
అవధానములు
మార్చుఇతడు సుమారు 15 అవధానములు చేశాడు. ఇతడు విద్యార్థిగా ఉన్నపుడు బందరు హిందూ కళాశాలలో మొదటి అవధానం చేశాడు. తరువాత ఉండి, మొదటి ప్రపంచతెలుగు మహాసభలలో (హైదరాబాదు), ఆకాశవాణిలో, విద్యుత్‌సౌధ (హైదరాబాదు) లో, కాకినాడ తదితర ప్రాంతాలలో అవధానాలు నిర్వహించాడు.[11]
ఇతడి అవధానాలలో మచ్చుకు రెండు పూరణలు ఇలా ఉన్నాయి.
- సమస్య: ముండను భక్తిభావమున పూజ యొనర్చెను మోక్షసిద్ధికై
పూరణ :
అండజ యానుడన్నను మహాశివుడన్న నెడంద విస్తృతా
ఖండిత భక్తితో గొలిచి గ్రంథములెన్నొ రచించి, సత్ప్రజా
తండము నుద్ధరించిన యుదాత్తుని శంకరు కేశవల్లరీ
ముండను భక్తిభావమున పూజ యొనర్చెను మోక్షసిద్ధికై
- వర్ణన: సమకాలీన సాంఘిక పరిస్థితి
పూరణ:
ఎన్నికలయందనాదృతి, పరీక్షలయం దవినీతి, వింత తా
వన్నెల దుస్తులందు రతి, పాఠ్యములందు విరక్తి, వర్ధిలన్
మన్నుగ బోధకాళియెడ మత్సర భావము, చిత్ర తారలం
దెన్నగరాని ప్రీతి, వెలయించెడు నిప్పటి భాతృబృందముల్
బిరుదములు
మార్చు- కళాప్రపూర్ణ -1977లో
- విద్యాసనాథ
- కవిభూషణ
మరణము
మార్చుఇతడు 1986లో భారతీయ విద్యాభవన్ ముంబై వారి చండీయాగానికి వెళ్లాడు. అక్కడ అతనికి జైన్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స జరిగింది. ఆ సందర్భంలో ఇతడికి అధిక రక్తస్రావము జరిగి 1986, అక్టోబరు 21 తేదీన మరణించాడు.
మూలాలు
మార్చు- ↑ తిరుమల, శ్రీనివాసాచార్య (2012). దివాకరప్రభ (1 ed.). హైదరాబాదు: యువభారతి. p. 17-16.
- ↑ దివాకర్ల, వేంకటావధాని (1958). ఆంధ్ర వాజ్మయ చరిత్రము (2 ed.). హైదరాబాదు: ఆంధ్ర సారస్వత పరిషత్తు.
- ↑ దివాకర్ల, వేంకటావధాని (1958). ఆంధ్ర వాజ్మయ చరిత్రము. హైదరాబాదు: ఆంధ్ర సారస్వత పరిషత్తు.
- ↑ దివాకర్ల, వేంకటావధాని (1976). TELUGU IN THIRTY 30 DAYS (1 ed.). హైదరాబాదు: ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ.
- ↑ వేంకటావధాని, దివాకర్ల. ఆంధ్ర నాటక పితామహుడు. Retrieved 2020-07-12.
- ↑ దివాకర్ల, వేంకటావధాని (1970). ఆంధ్ర మహాభారతము (సభాపర్వము) (1 ed.). హైదరాబాదు: ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ.
- ↑ దివాకర్ల, వేంకటావధాని (1960). ఆంధ్ర వాజ్మయారంభ దశ (1 ed.). హైదరాబాదు: దివాకర్ల వేంకటావధాని.
- ↑ దివాకర్ల, వేంకటావధాని (1946). రాజసందర్శనము (3 ed.). మద్రాసు: ది స్టాండర్డు ఏజెన్సీస్ (మద్రాసు) లిమిటెడ్.
- ↑ దివాకర్ల, వేంకటావధాని. సీతాకళ్యాణము. హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఓరియెంటల్ మ్యాన్యుస్క్రిప్టు లైబ్రరీ అండ్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్.
- ↑ దివాకర్ల, వేంకటావధాని (1974). తెలుగు సామెతలు (మూడవకూర్పు) (1 ed.). హైదరాబాదు: ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ.
- ↑ రాపాక, ఏకాంబరాచార్యులు (2016). "అవధాన విద్యాధరులు". అవధాన విద్యాసర్వస్వము (ప్రథమ ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. pp. 273–277.