కందాడై శ్రీనివాసన్

(కందాడై శ్రీనివాసన్ (దొరస్వామి అయ్యంగార్ ) నుండి దారిమార్పు చెందింది)

కందాడై శ్రీనివాసన్ ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాకు చెందిన రంగస్థల నటుడు.[1] అతను దొరస్వామి అయ్యంగార్ గా సుపరిచితుడు.

దస్త్రం:Kandadai srinivasan.jpg

జీవిత విశేషాలు

మార్చు

శ్రీనివాసన్ నెల్లూరు పట్టణంలోని రంగనాయకుల పేటలో ఒక వైష్ణవ కుటుంబంలో జన్మించాడు. తిరు వేంగళాచారి అనే సంపన్న వైష్ణవుడు ఇతనిని దత్తత చేసుకొన్నాడు. నెల్లూరు వి.ఆర్. ఉన్నత పాఠశాలలో చదివి, మదరాసులో బి.ఏ.,ఎల్.టి., చదివాడు.

1890 లో తన 16వ యేట నెల్లూరులో ప్రదర్శించబడిన "మర్చెంట్ ఆఫ్ వెనిస్" ఆంగ్ల నాటకంలో "పోర్షియా" పాత్ర ధరించి ప్రేక్షకుల అభిమానాన్ని పొందాడు.[2] సుందర రూపం, నిండైన విగ్రహం, విశాల నేత్రాలు, గంభీరమైన కంఠం స్ఫురద్రూపి అయిన అతను తన నటనతో ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందాడు. మద్రాసు క్రిస్టియన్ కాలేజీలో పండితులుగా పనిచేసిన వేదం వేంకటరాయశాస్త్రి తన విద్యార్థుల చేత ప్రద్రర్శింప జేసిన" శాకుంతల" నాటకంలో దొరస్వామి అయ్యంగార్ కు దుష్యంత పాత్ర ఇచ్చి నటింపజేశాడు. ఆ నాటకంలో కందాడై శఠగోపాచార్యులు శకుంతల పాత్ర పోషించాడు.

మద్రాసు కాలేజీల్లో చదువుతున్న నెల్లూరు విద్యార్థులు నెల్లూరులో 1890 దశాబ్దంలో అమేచర్ డ్రామాటిక్ సొసైటీ , బీజాన్ సొసైటీ అనే రెండు నాటక సంస్థలను స్థాపించి, విలియం షేక్స్‌పియర్ నాటకాలను ప్రదర్శించారు. 1897 బెంగాల్ కరువు సహాయార్థం అమెట్యూర్ సొసైటీ ప్రదర్శించిన నాటకాలలో దొరస్వామి అయ్యంగార్ దుష్యంత పాత్ర ధరించాడు. వేదం వెంకటరాయశాస్త్రి ఈ ప్రదర్శన ఏర్పాటుచేశాడు.1899 లో వేదం ప్రతాపరుద్రీయం నాటకంలో అయ్యంగార్ ప్రతాపరుద్రుడి వేషం వేశాడు. వేదంవారి శిష్యులు నెల్లూరులో "ఆంధ్ర భాషాభిమాని సమాజం" నెలకొల్పి వేసవి సెలవుల్లో గురువుగారి నాగానందం, ఉష, ప్రతాపరుద్రీయం ప్రదర్శనలిచ్చారు. ఈ ప్రదర్శనల్లో యువ అయ్యంగార్ నాయక పాత్రలు ధరించి మెప్పించాడు.

దొరస్వామి అయ్యంగార్ నటనా వైదుష్యానికి మరింత అవకాశం కలిగించేందుకు నెల్లూరులో "సుగుణ విలాస సభ" నెలకొల్పబడింది. అయ్యంగార్ ఈ సమాజ స్థాపకులలో ముఖ్యుడు. ఈ సమాజం ద్వారా ధర్మవరం, తదితర రచయితల నాటకాలు ప్రదర్శిచారు. అయ్యంగార్ నలుడు, చిత్రాఖ్యుడు, హిరణ్యకశిపుడు, రాజరాజ నరేంద్రుడు వంటి పాత్రలను గొప్పగా నటించి మెప్పించాడు.

1910లో నెల్లూరులో "ఆంధ్ర భాషాభిమాని సమాజం" ఏర్పడింది. అప్పటికి అయ్యంగార్ నాటక ప్రదర్శన మర్మాలు- ఆహార్యం, అలంకరణ, రంగస్థల అలంకరణ వంటి అన్ని విభాగాల్లో పరిపూర్ణ జ్ఙానం సంపాదించి, ప్రాచీన అలంకార శాస్త్రాలు అధ్యయనం చేసి, నాటకాలను అద్భుతంగా ప్రదర్శించడం కొనసాగించాడు. "బాలాంధ్ర నాటకసమాజ" ప్రయోయోక్తగా అయ్యంగారికి గొప్పకీర్తి సమకూడింది. దుష్యంతుడు, అనిరుద్దుడు, ప్రతాప, రామదాసు, హరిశ్చంద్రుడు, శ్రీనివాసుడు, రంగారాయుడు పాత్రలను గొప్పగా రక్తికట్టించాడు. ఆ పాత్రల్లో ఆయన చూపిన గాంభీర్యం, హుందాతనము,ఠీవి చూచి రాజులూ, జమీందార్లు కూడా ఆశ్చర్యపోయారు.

తమిళ నాటకాలు

మార్చు

కందాడై, సరస్వతి రంగస్వామి కలిసి తమిళ నాటక రంగస్థలాలమీద తమిళ నాటకాలు ప్రదర్శించారు. రాణి సంయుక్తలో దొరస్వామి అయ్యంగార్, పృధ్వీరాజు వేషం, రాజా త్రివిక్రమదేవవర్మ రచన మానవతిలో "ఉన్మత్త" పాత్రను గొప్పగా రక్తికట్టించాడు. ఆయన పామరజనాన్ని మెప్పించడానికి ఏనాడూ నాటకంలో జావళీలు పాడడం వంటి పనులకు దిగజారి, చప్పట్లు కొట్టించుకోలేదు. అయన నిండైన కంఠంతో పద్యం చదివే విధానం విశిష్టంగా ఉండేది. పద్యం స్పష్టంగా, సుబోధకంగా చదివేవాడు. 1910-18 మధ్య ఆయన పచ్చయప్ప కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసి, మద్రాసు "సుమనోరంజని సభ" సభ్యుడుగా చేరి, తెలుగు, తమిళ నాటకాలలో నటుడుగా, ప్రయోక్తగా అజరామర కీర్తిని ఆర్జించాడు.

ఉద్యోగ జీవితం

మార్చు

మద్రాసు నుంచి నెల్లూరు వచ్చి, కొత్తగా స్థాపించిన నెల్లూరు వి.ఆర్.కళాశాలలో అధ్యాపకుడుగా చేరి, ఖిలాఫత్ ఉద్యమంలో పనిచేస్తూ, అనేక ఉపన్యాసాలు ఇచ్చాడు. అప్పుడు నెల్లూరులో హిందూ, ముస్లింల మధ్య తగాదాలు, విరోధాలు ఉండేవి. ముస్లిం నాయకులతో మాట్లాడి, సామరస్య వాతావరణం నెలకొల్పడానికి కృషిచేశాడు.

జాతీయోద్యమంలో ఉపాధ్యాయ ఉద్యోగం విడిచిపెట్టి, నెల్లూరులో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని, నెల్లూరు పొగతోటలో జరిగిన విదేశీ వస్త్రదహన కార్యక్రమంలో పాల్గొని, తన ఖరీదయిన విదేశీ కోటును, వస్త్రాలను దహనం చేశాడు. ఆ రొజు ఆయన చేసిన ఉపన్యాసానికే, అయననూ, వెన్నెలకంటి రాఘవయ్యనూ జిల్లా కలెక్టరు కామ్సే విచారించి మరల అటువంటి ఉపన్యాసాలివ్వము అని హామీ ఇస్తే, 100/ రుపాయల జుల్మానాతో వదలిపెడతానన్నాడు. ఇద్దరూ అంగీకరించలేదు, 1921 నవంబరు 8న చెరి 500/ జుల్మానా, చెల్లించకపోతే సంవత్సరం సాధారణ జైలుశిక్ష విధించి, "మిమ్మల్ని శిక్షిచడం నాకు చాలా కష్టంగా ఉంది" అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు. దొరస్వామి అయ్యంగార్ వెల్లూరు, కడలూరు, మద్రాసు జైళ్లలో శిక్ష అనుభవించాడు.

జైలు జీవితం ఆయన ఆరోగ్యాన్ని నాశనం చేసింది. 60 పౌండ్ల బరువు కోల్పోయాడు. దగ్గర బంధువులు, "విద్రొహులు" మోసంచేసి ఆయన ఆస్తి కాజేశారు. పూట గడవడం కష్టమైంది. అయినా ఆయన తిలక్ ఫండు కోసం మళ్ళీ ముఖానికి రంగు పులుముకొని, మానవతి నాటకంలో గోపాలరావు పాత్ర ధరించి అనేక ప్రదర్శన లిచ్చాడు. రంగస్థలం మీదనూ, నిజ జీవితంలోను దొరస్వామి అయ్యంగార్ ధీరోదాత్త నాయకుడే. 1925 ఆగష్టు 5వ తారీకున, తన 56 వ ఏట ఆయన జీవిత రంగస్థలంనుంచి శాశ్వతంగా నిష్క్రమించాడు.

ఆధారాలు

మార్చు
  1. Who's Who Of Freedom Struggle In Andhra Pradesh. Editor :Prof Sarojini Regani, Published by A.P.Govt.1982. Volume three, Page 40.
  2. jamin Ryot volumes.
  3. దేశబంధు, నెల్లూరు తెలుగు వారపత్రిక, సంచిక 26-9-1927,
  4. పెన్న ముచ్చట్లు, రచయిత: కాళిదాసు పురుషోత్తం, పల్లవి ప్రచురణలు, విజయవాడ,2018.
  5. కాంగ్రెస్ సేవ, రచయిత: కొమాండూరు పార్థసారథి అయ్యంగారు,1948.
  6. వెన్నెలకంటి రాఘవయ్య స్మృతిశకలాలు, యూత్ కాంగ్రెస్, నెల్లూరు తెలుగు వారపత్రిక. 1974-75 7. పినాకిని తీరంలో మహాత్మా గాంధీ, రచయితలు: ఇ.ఎస్.రెడ్డి, ఆర్.సుందరరావు, వాణి ప్రచురణలు, కావలి.2004.

మూలాలు

మార్చు
  1. "కథామధురం-ఆ'పాత'కథామృతం-2 పొణకా కనకమ్మ | నెచ్చెలి" (in అమెరికన్ ఇంగ్లీష్). 2023-02-09. Retrieved 2023-04-11.
  2. మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి (1965). ఆంధ్ర నాటకరంగ చరిత్రము.