కట్టెల పొయ్యి

కట్టెలను మండించడం ద్వారా వంటను చేసే పొయ్యిని "కట్టెల పొయ్యి" అంటారు. ఇందులో ఇంధనంగా వంటచెరకు ఉపయోగిస్తారు. వంటలకు ఉష్ణాన్నివ్వడానికి ప్రధాన ఇంధనం కట్టెలు. ఇవి మండినపుడు రసాయన శక్తి ఉష్ణ శక్తి గాను, కాంతి శక్తి గాను మారుతుంది. వెలువడిన ఈ ఉష్ణంతో వంట చేయడానికి చాలా గ్రామాలలో అనాదిగా ఈ పొయ్యిలను ఉపయోగిస్తున్నారు. పూర్వకాలంలో కేవలం కట్టెల పొయి మాత్రం ఒక్కటే అందరి ఆధారం. ప్రతీ ఊర్లో ఇటువంటి పొయ్యిలే వాడేవారు[1]. ఈ పొయ్యి మంట సరిగా మండక భరించరాని ఘాటైన పొగలకు కళ్లు మంటలు పుట్టడం, ఊపిరాడకపోవడం వంటివి సంభవిస్తాయి[2]. కట్టెల పొయ్యి, బొగ్గుల కుంపటిపై వంట చేస్తున్నవారిలో 2017లొ ప్రపంచ వ్యాప్తంగా 40 లక్షలమంది చనిపోయినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది[3].

కట్టెల పొయ్యి
కర్రల పొయ్యి

పూర్వ కాలం నుండి వాడుకసవరించు

ఇప్పుడంటే గీజర్లు, వాటర్ హీటర్స్ వచ్చాయి కానీ అప్పట్లో వేడి నీళ్ళు కావాలంటే కట్టెల పొయ్యి మీద రాగి, ఇత్తడి లేదా అల్యూమినియం లోహాలు లేదా మట్టి పాత్రలన పెట్టి, ఆ పాత్రల్లో నీరు పోసి, క్రిందన కట్టెలు, కొబ్బరి పీచు కానీ, పిడకలు కానీ పెట్టి, వాటిని కాసింత కిరసనాయిలుతో తడిపి, అగ్గిపుల్ల సహాయాన దాన్ని మండించే వారు. ఆ వేడికి కాగిన నీళ్ళను స్నానాలకు వాడుకొనే వారు. అప్పట్లో చాలామంది ఇళ్ళల్లో - చలికాలం వచ్చిందంటే ఇదే తంతు. మరింత పెద్ద కుటుంబాలలో అయితే వారి స్నానపు గదుల్లో కానీ, ఆరు బయట గానీ, పెరడుల్లో గానీ బాత్ రూమ్ ప్రక్కన గానీ మూడు రాళ్ళు వేసి, వాటిల్లో కట్టెలను పేర్చి, వాటిని కిరసనాయిల్ తో వెలిగించి, పైన పెద్ద అండా / డేకిసా / బగోనే / కొప్పెర / పెద్ద పాత్రని ఉంచి నీరు వేడి చేసేవారు.

వంటకొరకు గ్రామాల్లో ఒక వైపుగా వంటచెరకును సిద్ధం చేసుకొని ఉండేవారు. వర్షాకాలంలో తడిచి చెక్కలు నాని మంట సరిగా రాక బాగా పొగ వచ్చేది. ఒక గొట్టం సహాయంతో ఆ నిప్పుల మీదకు నోటితో ఊదుతూ మంటకు ప్రయత్నించే వారు. ఈ తెల్లని పొగ వల్ల ఇల్లంతా వ్యాపించేది. సరిగా మండని కట్టెల వాసన దీనికి అదనంగా ఉండేది. ఈ పొయ్యిలపై వంట చేయడం వలన ఆ వేడి నీటి పాత్రల బాహ్య రూపం అంతా ఆ పొగ వల్ల నల్లగా మసిబారిపోయేది.

పెద్ద కార్యక్రమాలకు వ౦టలు చేయాల్సి వచ్చినప్పుడు గాడిపొయ్యి ఉపయోగించేవారు. తరువాత ఈ గాడిపొయ్యి స్థానంలో గ్యాస్ స్టవ్ వచ్చింది.

ఊదినప్పుడు మంట పెరగడంసవరించు

కొవ్వొత్తిలో ఇంధనం వత్తి గుండా మంటని చేరుకుంటోంది. వత్తి కొసలో, అంటే ఆ ఒక్క చిన్న బిందువు వద్ద, మంటని పక్కకి ఊదేస్తే ఇక మళ్లీ మంట పుట్టదు. కానీ కట్టెల పొయ్యిలో ఇంధనం ఒక్క బిందువు వద్ద లేదు. కట్టె ఉపరితలం మొత్తం ఇంధనానికి మూలం. కనుక ఊదినప్పుడు మంటని పక్కకి తొలగించడం సాధ్యం కాదు. ఎందుకంటే అన్ని కట్టెల మీద మంటని ఒకే సారి తొలగించడం జరగదు. ఊదినప్పుడు ఏర్పడ్డ వాయు ప్రవాహంలో పీడనం  తగ్గుతుంది. దీన్నే వెంచురీ ప్రభావం అంటారు. కనుక కట్టెపొయ్యిలోకి గాలి ఊదినప్పుడు, చుట్టూ ఉన్న గాలి పీడనం కాస్త ఎక్కువగా ఉండడం వల్ల చుట్టుపక్కల గాలి లోపలికి చొచ్చుకొస్తుంది. దాని వల్ల మరింత ఆక్సిజన్ కట్టెలకి లభ్యం అవుతుంది. మంట వృద్ధి చెందుతుంది. కట్టె పొయ్యిలో ఊదినప్పుడు మరొకటి కూడా జరుగుతుంది. మండే కట్టె వల్ల బూడిద పుడుతుంది. ఆ బూడిద పొయ్యిలోనే పేరుకుంటూ ఉంటుంది. కట్టె మీద బూడిద పేరుకుని కట్టె లోపలి ఇంధనానికి, బయట ఉన్న ఆక్సిజన్ కి మధ్య ఓ నిరోధకపు తెరలాగా ఏర్పడి అడ్డుపడుతూ ఉంటుంది.  దీన్నే మనం కాస్త కవితా ధోరణిలో “నివురు గప్పిన నిప్పు” అంటూ వుంటాం[4].

దహనం సమయంలో విడుదలయ్యే కణాలుసవరించు

దహనంలో వెలువడే కణాలను వాటి భౌతిక, రసాయన లక్షణాలు, దహన పరిస్థితుల ఆధారంగా మూడు తరగతులుగా విభజించవచ్చు:

  1. పేలవమైన దహన పరిస్థితుల నుండి విడుదలయ్యే కణాలు ("గనగనలాడే" దహన) కలప నుండి పెద్ద మొత్తంలో మండని సేంద్రియ పదార్ధాలను కలిగి ఉంటాయి, వీటిలో కొన్ని పాలిసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్లు వంటి క్యాన్సర్ కారకాలు ఉండవచ్చు. ఈ కణాలు నీటిలో కరిగేవి.ఊపిరితిత్తుల నుండి త్వరగా తొలగించబడతాయి.
  2. మెరుగైన దహన పరిస్థితులతో ('మంటలతో బర్నింగ్'), కరగని అంతర్భాగం ఉన్న కార్బన్ కణాలు ఏర్పడతాయి. దహన పరిస్థితుల ఆధారంగా కార్బన్ కణాలు ఉపరితలలపై వివిధ రకాల సేంద్రీయ సమ్మేళనాలను కలిగి ఉంటాయి. ఈ కణాలు కరగనివి కాబట్టి ఎక్కువసేపుఊపిరితిత్తులలో ఉండే అవకాశం ఉంది.
  3. పూర్తి దహనంతో, ఉదాహరణకు చిన్న ఉండల పొయ్యిలలో, చెక్కలోని అన్ని సేంద్రియ పదార్థాలు దహన గదిలో విచ్ఛిన్న మవుతాయి. చిమ్నీ నుండి మండే పదార్థాలు (బూడిద) విడుదలవుతాయి. ఇవి ప్రధానంగా పొటాషియం సల్ఫేట్ వంటి నీటిలో కరిగే ఉప్పు కణాలు. ఈ కణాలు ఊపిరితిత్తులలో జమ అయినప్పుడు, అవి ఊపిరితిత్తుల లైనింగ్ ద్రవంలో త్వరగా కరిగిపోతాయి తద్వారా తొలగించబడతాయి[5].

కాలుష్య కారకంసవరించు

మనకు కట్టెలు వృక్షాల నుండి లభిస్తాయి. దాదాపు భూభాగంలో 30% మాత్రమే అడవుల్ని కలిగి ఉన్నాము. వంటచెరకు కోసం చెట్లను కొట్టివేయడం ద్వారా కలప వనరులు చాలా త్వరితంగా అంతరించిపోతున్నాయి. దీనివల్ల వర్షపాతం తగ్గటమే కాక పర్యావరణ కాలుష్యం యేర్పడుతుంది.

ఇంట్లో ఉపయోగించే కట్టె పొయ్యిల ద్వారా 2015లో మనదేశంలో ఐదులక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. కట్టెలు, బొగ్గువంటి ఘనపదార్థాలను మండించడం ద్వారా ఏర్పడే కాలుష్యంతో ఊపిరితిత్తులు, రక్తకణాలు దెబ్బతింటాయని మెడికల్ జర్నల్ లాన్సెంట్ పేర్కొంది. వెంట్రుకల పరిమాణం కంటే మూడు రెట్లు చిన్నగా వుండే కార్బన్ డై యాక్సిడ్ అనే ఈ కాలుష్యకారకం సులభంగా ఊపిరితిత్తుల్లో కలిసిపోతుందని వైద్యులు అంటున్నారు. ఇలా కట్టెల పొయ్యితో ఏర్పడిన కాలుష్యం ద్వారా 2015లో మాత్రం ఐదులక్షల మంది మృతి చెందారని మెడికల్‌ జర్నల్‌ లాన్సెంట్‌ జాబితాలో వెల్లడి అయ్యింది[6].

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం మూడు బిలియన్ల ప్రజలు నేటికీ పొయ్యి మండించడానికి కట్టెలు, బొగ్గు, పేడ, చెత్తలను వాడుతున్నారు. ఇందులో నాలుగు మిలియన్ల ప్రజలు పొయ్యి నుంచి వచ్చే పొగతో కలిగే జబ్బులతో మరణిస్తున్నారు. అలాగే కట్టెలు మండించడం వల్ల వచ్చే పొగబారిన పడేవారిలో దీర్ఘకాలంలో ఊపిరి తిత్తులకు సంబంధించిన జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ. ప్రపంచ జనాభాలో మూడోవంతుమంది కట్టెలను మండించగా వచ్చిన మంటతో వంటలు చేస్తున్నారు, దీనివల్ల అనేక బిలియన్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ గాలిలోకి విడుదల కావడమే కాకుండా, వంటచెరుకు కోసం చెట్లను నరికేయాల్సి వస్తుంది, ఇది ఆందోళన కలిగించే అంశం[2].

మూలాలుసవరించు

  1. "కట్టెల పొయ్యి వాడుతున్నారా ఇంకా! - SMTV Telugu". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 2020-04-04.
  2. 2.0 2.1 "పొగ రాని పొయ్యి లు వచ్చేస్తున్నాయి".
  3. www.andhrajyothy.com https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-579064. Retrieved 2020-04-04. Missing or empty |title= (help)
  4. "మరి కట్టెల పొయ్యిలో ఊదినప్పుడు మంట ఎందుకు పెరుగుతుంది?". శాస్త్ర విజ్ఞానము. Retrieved 2020-04-04.
  5. "Wood-burning stoves: Harmful or safe?". ScienceDaily (in ఇంగ్లీష్). Retrieved 2020-04-04.
  6. selvi. "ఇంట్లో కట్టెల పొయ్యి వెలిగిస్తున్నారా? అయితే జాగ్రత్త సుమా". telugu.webdunia.com. Retrieved 2020-04-04.

బాహ్య లంకెలుసవరించు