కథాజగత్

తెలుగు కథల సంకలనం

వైవిధ్య భరితమైన ఎనిమిది కథల సంకలనం ఈ కథాజగత్. కోడీహళ్లి మురళీ మోహన్ దీనికి సంపాదకులుగా వ్యవహరించాడు. వి.వి.ఎల్.నరసింహారావు, అక్కిరాజు రమాపతిరావు (మంజుశ్రీ) ఈ సంకలనానికి ముందుమాటలు వ్రాశారు. అబ్జక్రియేషన్స్ సాహిత్యసాంస్కృతిక సంస్థ తన రెండవ ప్రచురణగా ఈ పుస్తకాన్ని 2007లో విడుదల చేసింది.[1]

కథాజగత్
Kathajagat
కృతికర్త: గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు, రావి.ఎన్.అవధాని, దోరవేటి,
ఐతా చంద్రయ్య, వాడ్రేవు రమాదేవి,సత్యవాడ (ఓగేటి) ఇందిరాదేవి,
కొంపెల్ల లక్ష్మీసమీరజ,రాధేయ
సంపాదకులు: కోడీహళ్లి మురళీ మోహన్
బొమ్మలు: ఫణి
ముఖచిత్ర కళాకారుడు: ఫణి
దేశం: భారత దేశము
భాష: తెలుగు
ప్రక్రియ: కథాసంకలనం
ప్రచురణ: అబ్జ క్రియేషన్స్ సాహిత్య సాంస్కృతిక సంస్థ
విడుదల: మే, 2007
పేజీలు: 96
ఐ.ఎస్.బి.ఎన్(ISBN): 978-81-7525-813-6

కథల జాబితాసవరించు

కథాజగత్లోని కథల వివరాలు ఇవి.

కథ శీర్షిక రచయిత
బాధ్యత గుండు సుబ్రహ్మణ్యదీక్షితులు
సారాంశం రావి.ఎన్.అవధాని
దోషి దోరవేటి
అభాగ్యాధిపతి ఐతా చంద్రయ్య
కింకర్తవ్యం వాడ్రేవు రమాదేవి
మమతేజోంశ సంభవం సత్యవాడ (ఓగేటి) ఇందిరాదేవి
ఉత్తిష్ఠ భారత కొంపెల్ల లక్ష్మీసమీరజ
అందమైన వంచన రాధేయ

పీఠికలుసవరించు

ఈ కథాసంకలనానికి "పట్టి చదివించి పరమార్థం బోధించే కథలు" అనే శీర్షికతో సాహిత్యబ్రహ్మ వి.వి.ఎల్.నరసింహారావు పీఠిక వ్రాశారు. ఆయన అభిప్రాయం ఇలా ఉంది. "ఈ 'కథాజగత్తు'ను కథావస్తువు దృష్టితో కాని, భాషాప్రయోగ దృష్టితోకాని, కథాకథన శిల్పదృష్టితో కాని పరిశీలించి చూడగా నేటి కథాప్రపంచానికి ఇది విశిష్టమైన కానుకగా నేను భావిస్తున్నాను. పఠితలచేత పట్టి చదివించి, పరమార్థం బోధించే కథలివి. ఆంధ్ర కథాసాహిత్యాన్ని సుపరిపుష్టం చేసే సత్కథలు." "జగత్‌కథ" పేరుతో పీఠికను అందించిన అక్కిరాజు రమాపతిరావు"ఏ రచన అయినా అది చదివే పాఠకుల స్థాయిని బట్టి బాగోగుల సాపేక్షతను ప్రస్తావించాల్సి ఉంటుంది. పాఠకుల స్థాయితోపాటే రచయితల స్థాయి కూడా ఎప్పటికప్పుడు ఎదగాల్సి ఉంటుంది. రచయిత శిల్పం, లోకంపట్ల ఆర్తి,అవగాహన,సాహిత్యస్పందన విస్తరింపచేసుకోవలసి ఉంటుంది." అని అంటారు.

కథల గురించి టూకీగాసవరించు

 1. బాధ్యత: వ్యక్తి తానొక్కడే నిజాయితీపరుడిగా ఉంటే సరిపోదు. మరికొంతమంది అలాంటివాళ్ళను తయారు చేయాలి అని ప్రబోధిస్తుంది ఈ కథ.
 2. సారాంశం: కడుపులో చుక్కపడితేగాని బండెడు చాకిరీతో అలసిన ఒంటికి నిదురపట్టదు. ఈ కథలో సారాంశం ఇదే. హాస్యాన్ని మేళవించినా అడుగడుగునా ఆవేదనే తొంగిచూస్తుంది.
 3. దోషి: నేటి సమాజంలో పేదరికంతో మ్రగ్గుతూ ఆశల పల్లకీలో ఊరేగుతూ కష్టాలు కొనితెచ్చుకొంటున్నవారి పట్ల సానుభూతి రేకెత్తించే కథ.
 4. అభాగ్యాధిపతి: ప్రభుత్వ కార్యాలయాలలోని ఉద్యోగుల బాధ్యతారాహిత్యాన్ని ఎండగట్టే కథ.
 5. కింకర్తవ్యం:తను అమ్మే మందులు నాణ్యమైనవి కావని తెలిసినా ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో నలిగిపోయే ఓ మెడికల్ రెప్రజెంటేటివ్ అంతర్మథనం ఇది.
 6. మమతేజోంశ సంభవం:కుటుంబ బరువుబాధ్యతలు మోసి ఒంటరిగా మిగిలిపోయిన ఒక స్త్రీ అనాథ పిల్లలను చేరదీయడం ఈ కథలోని అంశం.కుటుంబ భావనను విస్తృత పరచుకోవడం, జీవితానికి అర్థం తెలుసుకోవడం వంటి విషయాలు దీనిలో చర్చింపబడ్డాయి.
 7. ఉత్తిష్ఠ భారత!:దేశభక్తి ప్రపూరితం. తన తల్లిని, తండ్రిని, కుటుంబాన్ని, తనవారిని ఎంతగా అభిమానించడం వ్యక్తిలో ఉత్తమ సంస్కారమనిపించుకుంటుందో తాను పుట్టిన దేశాన్ని ప్రేమించడం అంతకన్న ఉదాత్త సంస్కారం అనిపించుకుంటుంది అని చెబుతుంది ఈ కథ.
 8. అందమైన వంచన: సాహిత్య దళారీల అసలు రంగును ఆవిష్కరించే కథ.

అభిప్రాయాలుసవరించు

 • ఈ కథాసంకలనంలోని కథల ఎంపికలో చక్కని ఇతివృత్త వైవిధ్యముంది.'కథారచన, రచయితల బాధ్యత'ను వివరిస్తూ రాసిన మంజుశ్రీగారి విపులమైన పీఠిక ఈ సంకలనానికి ఒక అలంకారం! - ఆంధ్రభూమి సచిత్ర వారపతిక
 • ఇవన్నీ మన దేశమూ, సమాజమూ బాగుపడాలని కోరుకొనేవారు వ్రాసిన కథలు. తెలివిగా ఒడుపుగా నాలుగు వాక్యాలు వ్రాసి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవటం మీద యావగాక, తమలో మెదలిన మంచి భావనలను సృజనాత్మక పద్ధతిలో నలుగురితో పంచుకోవాలన్న ధ్యాస కలిగిన రచనలు - జాగృతి వారపత్రిక
 • ఇందులో ప్రచురించిన కథల్లోని వస్తువులన్నీ దిగువ మధ్యతరగతి, అట్టడుగు వర్గాల చుట్టూ తిరిగేవే. మానవీయ విలువల్ని పెంచేవి కొన్ని. మనిషిలోని కుళ్ళును బయటపెట్టేవి కొన్ని. - ఆంధ్రజ్యోతి దినపత్రిక
 • వేటికవే విభిన్నంగా వైరుధ్యపూరితంగా ఆహ్లాదకరమైన శైలి నిపుణ శిల్ప సౌందర్యంతో అలరిస్తాయి. మొత్తం జగత్తుని కాకున్నా కొంత భాగాన్ని దర్శించి అవగాహన చేసుకున్న అనుభూతికి లోనై ఆలోచనల్లో నిమగ్నమౌతాం.- ఆంధ్రభూమి దినపత్రిక
 • చదివినంత సేపూ చక్కటి అనుభూతి కలిగించి చదివిన తరువాత పాఠకుని ఆలోచింపజేసే మంచి కథలు ఇవి. - నవ్యవీక్లీ

మూలాలుసవరించు

ఇతర లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=కథాజగత్&oldid=2984037" నుండి వెలికితీశారు