రాధేయ
రాధేయ ప్రముఖ కవి. విమర్శకుడు. తెలుగు కవిత్వంలో ప్రతిష్ఠాత్మకమైన ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు ప్రదాత.[1]
రాధేయ | |
---|---|
జననం | వి.ఎన్.సుబ్బన్న 1955, మే 1 వైఎస్ఆర్ జిల్లాముద్దనూరు మండలం యామవరంగ్రామం |
ప్రసిద్ధి | తెలుగు కవి, సాహితీ విమర్శకుడు, వ్యాసరచయిత |
భార్య / భర్త | సత్యాదేవి |
పిల్లలు | సునీతాదేవి, సతీష్ కుమార్, సృజన |
తండ్రి | ఉమ్మడిశెట్టి గంగిశెట్టి |
తల్లి | నాగమ్మ |
జీవితవిశేషాలు
మార్చుబాల్యం
మార్చురాధేయ 1955, మే 1వతేదీ వైఎస్ఆర్ జిల్లా ముద్దనూరు మండలంలోని యామవరం గ్రామంలో జన్మించాడు. తండ్రి ఉమ్మడిశెట్టి గంగిశెట్టి తల్లి నాగమ్మ ఇద్దరూ చేనేత కార్మికులు. తల్లిదండ్రులు పెట్టిన పేరు సుబ్బన్న. రాధేయ అనే కలం పేరుతో ప్రసిద్ధుడయ్యాడు. బాల్యం నుంచీ ప్రకృతి అన్నా పల్లెపాటలన్నా ఎంతో ఆసక్తిగా ఉండేది.
విద్యాభ్యాసం, ఉద్యోగం
మార్చుప్రాథమిక విద్య యామవరంలోనూ, ఉన్నత పాఠశాల,కాలేజీ చదువులు ముద్దనూరులోనూ చదివాడు. 1975లో నెల్లూరులో బి.యిడి.ట్రైనింగ్ చేశాడు. హిందీభాషలో సాహిత్యరత్న పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. 1982లో ఒక సామాన్య ఉపాధ్యాయునిగా ఉద్యోగం ప్రారంభించాడు. ఉద్యోగంలో వుంటూనే ఉన్నత చదువులు చదవాలనే బలమైన ఆకాంక్షతో ప్రయివేటుగా తెలుగులో ఎం.ఏ.చేశాడు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతి నుండి ఆధునికాంధ్ర కవిత్వానికి సీమకవుల దోహదం అనే అంశం మీద పరిశోధన చేసి 2008లో పిహెచ్‌డి చేయడం జరిగింది.[2] ఉపాధ్యాయునిగా, అంచెలంచెలుగా జూనియర్ లెక్చరర్‌గా, ఆ తరువాత డిగ్రీ కళాశాల అధ్యాపకునిగా పనిచేసి 31 సంవత్సరములు ఉద్యోగ జీవితం పూర్తీ చేసుకొని ఏప్రిల్ 30 2013 తేదీన పదవీ విరమణ చేశాడు. 10వ తరగతి నుండే చిన్న చిన్న కవితలు వ్రాయసాగాడు.
సాహిత్యరంగం
మార్చుచిన్నప్పుడే శ్రీశ్రీ, దేవులపల్లి, కొడవటిగంటి, రావిశాస్త్రి, విశ్వనాథ రచనల్ని చదివేశాడు. శ్రీశ్రీ రాధేయ మీద గొప్ప ప్రభావం చూపాడు. తొలి కవిత 1972 సంవత్సరంలో ‘‘సాహితీ మిత్రదీప్తి’’ జగిత్యాల నుండి వెలువడిన ఒక చిన్న పత్రికలో ‘‘ఇదా నవభారతం’’ అనే శీర్షికన ప్రచురింపబడింది.[3] 1978లో తొలి కవితాసంపుటి 'మరోప్రపంచం కోసం' వెలువడింది. వీరిలోని కవితాశక్తిని గమనించిన సాహితీవేత్త జానమద్ది హనుమచ్ఛాస్త్రి కడపకు పిలిపించి ఆకాశవాణిలో అవకాశం ఇచ్చాడు. కడప జిల్లా రచయితల సంఘంలో సభ్యత్వం కల్పించాడు. రాధేయకు అక్కడ మహామహులైన కవులతో పరిచయాలు ఏర్పడ్డాయి. గజ్జెల మల్లారెడ్డి, రా.రా. మొదలైనవారు రాధేయను ప్రోత్సహించారు. వివిధ పత్రికలలో కవితలు, వ్యాసాలు, సమీక్షలు అచ్చయ్యాయి. చాలా పురస్కారాలు, అవార్డులు రాధేయను వరించాయి. ఈయన రచనలపై శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలలో రెండు ఎం.ఫిల్. పరిశోధనలు, ఒక పి.హెచ్.డి పరిశోధన జరిగాయి. ఇంటి పేరు మీద 'ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు'ను 1988లో ప్రకటించాడు. ప్రతి యేటా ఈ అవార్డు పేరు మీద ఒక కవిని సత్కరిస్తూ వస్తున్నాడు. 2003లో రాజ్‌కోట్(గుజరాత్)లో జరిగిన సర్వభాషా కవిసమ్మేళనంలో పాల్గొని జాతీయకవిగా ఎదిగాడు. రెండవ ప్రపంచ తెలుగురచయితల మహాసభలు, నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు మొదలైన వేదికలపై తన గళాన్ని వినిపించాడు. పాతికకు పైగా కథలు కూడా రాశాడు. ఈయన రచనలు కొన్ని కన్నడ, హిందీ, ఆంగ్లభాషల్లో తర్జుమా అయ్యాయి.
రాధేయ పేరు మీద ఆయన శిష్యులు పెళ్ళూరు సునీల్, సుంకర గోపాల్, దోర్నాదుల సిద్ధార్థలు 'డా||రాధేయ కవితా పురస్కారం'పేరిట 2010 నుండి రాష్ట్రస్థాయి కవితాపోటీలను నిర్వహిస్తున్నారు. అంకే శ్రీనివాస్, ర్యాలిప్రసాద్, సి.హెచ్.వి.బృందావనరావు, మౌనశ్రీ మల్లిక్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
రచనలు
మార్చు- కవితా సంపుటులు
- మరో ప్రపంచంకోసం - 1978
- దివ్యదృష్టి - 1981
- జ్వలనమ్ - 1983
- తుఫాను ముందటి ప్రశాంతి - 1986
- ఈ కన్నీటికి తడిలేదు - 1991
- క్షతగాత్రం - 2003
- మగ్గంబతుకు - 2006
- అవిశ్రాంతం - 2009
- విమర్శ గ్రంథాలు
- కవిత్వం - ఓ సామాజిక స్వప్నం - 2011
- కవిత్వం - ఓ సామాజిక సంస్కారం -2012
- కవిత్వం - ఓ సామాజిక సత్యం - 2013
- కవిత్వం - ఓ సామాజిక చైతన్యం - 2014
పురస్కారాలు
మార్చు- దివ్యదృష్టి (కవితాసంపుటి)కి ఉమ్మెత్తల అవార్డు (వనపర్తి, 1982), భాగ్య అవార్డు (వరంగల్ 1984)
- తుఫాను ముందటి ప్రశాంతి(కవితాసంపుటి)కి పోలిశెట్టి పర్వతరాజు స్మారక అవార్డు (వనపర్తి 1988)
- అవిశ్రాంతం (కవితాసంపుటి)కి శిలపరశెట్టి రాములు నాయుడు స్మారక పురస్కారం (అనకాపల్లి 2010[4]),సృజన సాహితీపురస్కారం (నెల్లూరు 2010), సృజన కవితాపురస్కారం(ఖమ్మం 2010)
- కవిత్వం ఓ సామాజిక సంస్కారం (విమర్శ గ్రంథం)కు కొలకలూరి భాగీరథి విమర్శ పురస్కారం (హైదరాబాదు 2012), కొండేపూడి శ్రీనివాసరావు పురస్కారం (2013)
- మగ్గంబతుకు (దీర్ఘకావ్యం) ఆవంత్స సోమసుందర్ పురస్కారం (2013)
- ప్రొద్దుటూరు పట్టణంలో పౌరసన్మానం (2010)
- స్పందన - అనంతకవుల వేదిక అనంతపురం వారిచే 'చం-స్పందన జీవిత సాఫల్య పురస్కారం' (2013)
- కవిరాజహంస బిరుదు (2008)
ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు
మార్చుఆధునిక తెలుగు కవిత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డును రాధేయ తన ఇంటిపేరు మీద 1988లో స్థాపించాడు. కవిత్వంపట్ల మమకారంతో, కవులపట్ల గౌరవంతో ఉత్తమ కవిత్వాన్ని ప్రోత్సహించాలని, నిబద్ధతగల కవులను సత్కరించాలనే ఆశయంతో ఈ అవార్డును ప్రారంభించాడు. ప్రతి యేటా క్రమంతప్పకుండా ప్రణాళికా బద్ధంగా నిర్వహిస్తున్న ఈ అవార్డుకు ఎనలేని కీర్తిప్రతిష్టలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం ముగ్గురు న్యాయనిర్ణేతలచే ఎంపిక చేయబడిన కవితాసంపుటికి ఈ అవార్డును ప్రకటిస్తారు. ఇప్పటివరకు 26 మంది కవులు ఈ అవార్డును పొంది ఇవాళ కవితారంగంలో అత్యున్నత శ్రేణిలో ఉన్నారు.
ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డుగ్రహీతలు - ఎంపికైన కవితాసంపుటుల జాబితా
- 1988 - సౌభాగ్య - కృత్యాద్యవస్థ
- 1989 - శిఖామణి - మువ్వలచేతికర్ర
- 1990 - సుధామ - అగ్నిసుధ
- 1991 - అఫ్సర్ - ఇవాళ
- 1992 - పాపినేని శివశంకర్ - ఒక సారాంశం కోసం
- 1993 - ఆశారాజు - దిశ
- 1994 - కందుకూరి శ్రీరాములు - వయొలిన్ రాగమో వసంత మేఘమో
- 1995 - దర్భశయనం శ్రీనివాసాచార్య - ముఖాముఖం
- 1996 - చిల్లర భవానీదేవి - శబ్దస్పర్శ
- 1997 - నాళేశ్వరం శంకరం - దూదిమేడ
- 1998 - విజయచంద్ర - ఆహ్వానం
- 1999 - జూపల్లి ప్రేమ్‌చంద్ - ఆవేద
- 2000 - అన్వర్ - తలవంచని అరణ్యం
- 2001 - దాసరాజు రామారావు - గోరుకొయ్యలు
- 2002 - పి.విద్యాసాగర్ - గాలికట్ట
- 2003 - కొప్పర్తి - విషాదమోహనం
- 2004 - మందరపు హైమవతి - నిషిద్ధాక్షరి
- 2005 - అద్దేపల్లి ప్రభు - పారిపోలేం
- 2006 - గంటేడ గౌరునాయుడు - నదిని దానం చేశాక
- 2007 - తైదల అంజయ్య - పునాస
- 2008 - పెన్నా శివరామకృష్ణ - దీపఖడ్గం
- 2009 - యాకూబ్ - ఎడతెగని ప్రయాణం
- 2010 - కోడూరి విజయకుమార్ - అనంతరం
- 2011 - సిరికి స్వామినాయుడు - మంటిదివ్వె[5]
- 2012 - కొండేపూడి నిర్మల - నివురు[6]
- 2013 - శైలజామిత్ర - రాతిచిగుళ్ళు[7]
- 2014 - బాలసుధాకర్ మౌళి -
- 2015 - ఈతకోట సుబ్బారావు - కాకిముద్ద.[8]
- 2016 - బి. ప్రసాదమూర్తి - చేనుగట్టు పియానో
- 2017 - శ్రీసుధ మోదుగు - అమోహం[9]
- 2018 - శ్రీరామ్ పుప్పాల
- 2019 - దేశరాజు- దుర్గాపురం రోడ్[10]
- 2020 - పల్లిపట్టు నాగరాజు - [11]
- 2021 - యార్లగడ్డ రాఘవేంద్రరావు - పచ్చి కడుపు వాసన[12]
- 2022 - వసీర - సెల్ఫీ[13]
- 2023 - బండి నారాయణ - ఒంటికాలు పరుగు
మగ్గంబతుకు(దీర్ఘకావ్యం)
మార్చుతెలుగు చేనేత శ్రామికుల జీవన పోరాటాన్ని అత్యంత వాస్తవికంగా, విమర్శనాత్మకంగా రాధేయ అల్లిన దీర్ఘకావ్యం 'మగ్గంబతుకు'. ఈ కావ్యంలో భారతీయ జీవితంలో చేనేతకున్న ప్రాముఖ్యాన్ని, భారతదేశ చరిత్రలో చేనేత నిర్వహించిన పాత్రను, దాని ప్రస్తుత సంక్షోభాన్ని, దానికి కారణాలను , చేనేత వృత్తిలోని శ్రమను, దానిలోని కళావిలువల్ని అనేక విధాలుగా రాధేయ ఆవిష్కరించాడు. ఈ కావ్యాన్ని పి.రమేష్ నారాయణ Weavers & Looms పేరుతో ఇంగ్లీషులో అనువదించాడు.
ఈ కావ్యంలోని కొన్ని భాగాలు:
"ఈ మగ్గాల శాలలన్నీ మార్చురీ గదులుగా
రూపాంతరం చెందుతున్న
దీనాతిదీన దుఃఖం
ఈ విధ్వంస విషాదానికి
పల్లవి ప్రపంచీకరణానిది
చరణం సామ్రాజ్యవాదానికి
పాపం పాలనా యంత్రాంగానిది"
"మా బాధల గాధలన్నీ
అనుభూతుల వాక్చిత్రాలకు అందవు
శిల్పచమత్కారాలకు లొంగవు"
"తాతల తండ్రుల వారసత్వ వృత్తి
కాళ్ళొచ్చిన పిల్లాడు మొదలుకొని
పళ్ళూడిన ముసలయ్యదాకా
ఈ బతుకు కష్టంలో
అందరూ సమిష్టి కూలీలే
గజం గుడ్డముక్క సైతం
ఇంటిల్లిపాదీ శ్రమఫలితం"
"కదురు కవ్వం ఆడితే
కరువే లేదంటారు.
రైతన్న నేతన్న
ఈ దేశానికి కవల పిల్లలంటారు
రైతన్న కాయకష్టంతో
నేతన్న శరీర కష్టంతో
చెమటతో ఒళ్ళంతా తడిసినా
ఏనాడు కడుపు నిండింది లేదు
తృప్తిగా చేయి కడిగింది లేదు
పత్తిని పండించేవాడు పాడెమీద ఊరేగుతున్నాడు
పత్తిని వస్త్రంగా నేసినవాడూ మగ్గం గిలకకు
ఉరేసుకుంటున్నాడు"
"వలువల విలువలతో
దేశదేశాల మానాభిమానాలు కప్పుతున్నా
ఈ దేశం మాకేమిచ్చింది!
కడుపు నిండా ఆకలి
కళ్ళనిండా చీకటే కదా!"
"సరళీకృతం చేసినా
ఆర్థిక విధానమా నీకు జోహార్లు!
బహుళ జాతి కంపెనీల సామ్రాజ్యవాదమా
దహించేస్తావో ఖననం చేస్తావో నీ ఇష్టం
అయినా
మా శవాలపై పేటెంట్ హక్కులు నీవే కదా!"
మూలాలు
మార్చు- ↑ [1] Who's who of Indian Writers, 1999 Sahitya Academy
- ↑ అవిశ్రాంతమూర్తికి అక్షరాభిషేకం డా.రాధేయ 35 వసంతాల సాహితీ ప్రస్థానం ప్రత్యేక సంచిక
- ↑ [2] Archived 2013-08-16 at the Wayback Machine వాకిలి సాహిత్యపత్రికలో ఎ.ఎ.నాగేంద్ర ఇంటర్వ్యూ
- ↑ [3][permanent dead link] రాధేయకు శిలపరశెట్టి స్మారక పురస్కారం
- ↑ [4][permanent dead link]'సిరికి స్వామినాయుడు'కు ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు
- ↑ [5][permanent dead link] ఉమ్మిడిశెట్టి అవార్డు
- ↑ [6][permanent dead link] శైలజామిత్ర ‘‘రాతిచిగుళ్ళు’’ కు ఉమ్మిడిశెట్టి అవార్డు
- ↑ "ఈతకోట సుబ్బారావుకు ఉమ్మడిశెట్టి అవార్డు".[permanent dead link]
- ↑ "'అమోహం'కు ఉమ్మడిశెట్టి పురస్కారం". Archived from the original on 2018-01-28. Retrieved 2018-06-23.
- ↑ https://lit.andhrajyothy.com/sahityanews/sathyadevi-awards-29074
- ↑ https://www.andhrajyothy.com/2021/editorial/ummadishetti-satyadevi-literary-award-299120.html
- ↑ "'పచ్చి కడుపు వాసన'కు 'ఉమ్మడిశెట్టి సత్యాదేవి' అవార్డు". Sakshi. 2022-02-15. Retrieved 2022-04-01.
- ↑ https://telugu.asianetnews.com/literature/writer-vaseera-wins-ummadishetty-satyadevi-sahithi-award-rprfld