కనుపర్తి అబ్బయామాత్యుడు
కనుపర్తి అబ్బయామాత్యుడు 18వ శతాబ్దపు ప్రబంధకవి. ఇతడు గుంటూరు జిల్లా కనుపర్రు గ్రామంలో నివసించాడు. ఆరువేల నియోగి బ్రాహ్మణుడు. కౌండిన్య గోత్రుడు. ఇతని తండ్రి రాయన మంత్రి. తల్లి నరసమాంబ. ఇతని తాత ముత్తాతలు కొండవీటి ప్రభువుల వద్ద మంత్రులుగా పనిచేశారు. కానీ ఇతని కాలం వచ్చేసరికి కొండవీటి సామ్రాజ్యాన్ని తురుష్కులు ఆక్రమించుకున్నారు. ఇతనికి మంగళగిరి నరసింహస్వామి ఇష్టదైవము. ఇతడు రచించిన రెండు ప్రబంధాలను మంగళగిరి నృసింహస్వామికే అంకితమిచ్చాడు. ఈ కవికి సాహిత్యంలోనే కాక సంగీతము, జ్యోతిషము, సాముద్రికము, వైద్యములలో ప్రావీణ్యం వుంది.[1]
రచనలు
మార్చుఇతడు వ్రాసిన రెండు ప్రబంధాలు మాత్రం లభిస్తున్నాయి. మొదటిది అనిరుద్ధ చరిత్రము.[2] దీనిని బాల్యంలో వ్రాశాడు. రెండవ కావ్యము కవిరాజ మనోరంజనము.[3] దీనికే పురూరవశ్చరిత్రము అనే మరొక పేరు ఉంది. మొదటి కావ్యంతో పోల్చితే కవిరాజమనోరంజనము ప్రౌఢంగా, భావగర్భితంగా, అలంకార సహితంగా, ధారాశుద్ధి కలిగి ఉంది. ఇతని రచనలలో వీర, శృంగార రసాలను వర్ణించాడు. ఇతని శైలి మృదుపదగుంఫితమై, మిగుల ధారాళమై అలరారిస్తుంది. ఇతడు తన ప్రబంధాలలో జాతీయాలను విరివిగా వాడాడు. ఇతర ప్రబంధకవుల మాదిరిగనే ఇతడు తన రచనలలో పురము, జలక్రీడ, పుష్పాచయము, వేట, మన్మథవికారములు, శిశిరోపచారములు, ఋతువులు మొదలైన వర్ణనలు చేశాడు.
రచనల నుండి ఉదాహరణములు
మార్చుకం. చదువులకు మేర యెయ్యది,
చదివిన మాత్రంబె చాలు సరసవచస్సం
పదఁ దానేర్చిన కొలఁదిని,
యదనఁ గవితఁ జెప్పి హరికి నర్పింపఁదగున్
కం. భగవంతుని సద్గుణములు,
పొగడు వివేకంబె తమకపూర్వైశ్వర్యం
బగుట నరస్తుతిసేయరు,
జగతిన్ సత్కవులు తుచ్ఛసంపదకొఱకై
మ. హరినామాంకితకావ్య మెట్టిదయిన న్నానందమై సజ్జనా
దరణీయంబగుఁ బుష్పమాలికలలో దారంబుచందంబునన్
నరనామాంకితమైన కావ్యము రసౌన్నత్యస్థమయ్యు న్నిరా
కరణంబై చను హీనజాతి పురుషుం గైకొన్న వేశ్యంబలెన్
చ. కృతులు నిజాంకితంబు లొనరించిన నిష్టధనంబులిచ్చి స
మ్మతిఁ బ్రభువులు కవీశ్వరుల మన్ననసేయుట కీర్తిఁగోరి ని
శ్చితమతి దేవతాస్తుతియె సేయు కవీంద్రులనాదరించి స
త్కృతి యొనరించు సత్ప్రభునికీర్తికిఁ గీర్తి ఘటింపకుండునే.
(అనిరుద్ధ చరిత్రము కావ్యములో అంకితపద్యాల నుండి)
మూలాలు
మార్చు