కబీర్ బేడీ
కబీర్ బేడీ (జననం 1946 జనవరి 16) ఒక భారతీయ నటుడు. చలనచిత్రం, టెలివిజన్, థియేటర్ మాధ్యమాలలో ఆయన భారతదేశంతో పాటు యునైటెడ్ స్టేట్స్, అలాగే ఇటలీ ఇతర యూరోపియన్ దేశాలలో కూడా పనిచేస్తాడు.[1] ఆయన తాజ్ మహల్: యాన్ ఎటర్నల్ లవ్ స్టోరీలో షాజహాన్ చక్రవర్తి పాత్రలో, 1980లలో బ్లాక్ బస్టర్ ఖూన్ భరీ మాంగ్ లో విలన్ సంజయ్ వర్మ పాత్రకు ప్రసిద్ధి చెందాడు. పాపులర్ ఇటాలియన్ టీవీ మినిసిరీస్‌లో పైరేట్ సాండోకన్ పాత్రను పోషించినందుకు, 1983 జేమ్స్ బాండ్ చిత్రం ఆక్టోపస్సీలో విలన్ గోబిందా పాత్రకు అతను ఇటలీ, ఐరోపాలో బాగా పేరు పొందాడు. కబీర్ బేడీ దేశంలోని ముంబైలో నివసిస్తున్నారు.[2]
కబీర్ బేడీ OMRI (ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఆఫ్ ది ఇటాలియన్ రిపబ్లిక్) | |
---|---|
జననం | కబీర్ సింగ్ బేడీ 1946 జనవరి 16 |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 1971–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి |
|
పిల్లలు | 3, పూజా బేడితో సహా |
తల్లిదండ్రులు |
|
బాల్యం, విద్య
మార్చుకబీర్ సింగ్ బేడీ బ్రిటీష్ ఇండియాలోని పంజాబ్ ప్రావిన్స్‌లోని లాహోర్‌లో (ప్రస్తుతం పంజాబ్, పాకిస్తాన్‌లో ఉంది) 1946 జనవరి 16న బేడీ వంశానికి చెందిన పంజాబీ ఖత్రీ సిక్కు కుటుంబంలో జన్మించాడు. వీరి కుటుంబం బ్రిటిష్ వలస పాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర్యం కోసం పోరాటానికి అంకితం చేయబడింది. ఆయన ముగ్గురు పిల్లలలో ఒకడు. అతని తండ్రి, బాబా ప్యారే లాల్ సింగ్ బేడీ, రచయిత, తత్వవేత్త. అతని తల్లి, ఫ్రెడా బేడీ, ఇంగ్లాండ్‌లోని డెర్బీలో జన్మించిన బ్రిటీష్ మహిళ, ఆమె టిబెటన్ బౌద్ధమతంలో సన్యాసాన్ని స్వీకరించిన మొదటి పాశ్చాత్య మహిళగా ప్రసిద్ధి చెందింది.[3] ఆయన ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌లోని షేర్‌వుడ్ కాలేజీ, ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో చదువుకున్నాడు.
వ్యక్తిగత జీవితం
మార్చుకబీర్ బేడీకి నాలుగు సార్లు వివాహం జరిగింది. పూజ, సిద్ధార్థ్ (మరణించాడు), ఆడమ్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. అతను ఒడిస్సీ నృత్యకారిణి అయిన ప్రొతిమా బేడిని వివాహం చేసుకున్నాడు. వారి కుమార్తె పూజా బేడీ మ్యాగజైన్/వార్తాపత్రిక కాలమిస్ట్, మాజీ నటి. వారి కుమారుడు సిద్ధార్థ్ కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీలో చదువుతున్న రోజుల్లో స్కిజోఫ్రెనియాతో బాధపడుతూ 1997లో 26 ఏళ్ల వయసులో ఆత్మహత్య చేసుకున్నాడు.
ప్రొతిమాతో వివాహబంధం తెగాక ఆయన పర్వీన్ బాబీతో సంబంధాన్ని ప్రారంభించాడు. వారు పెళ్లి చేసుకోలేదు. ఆ తరువాత బ్రిటిష్ లో జన్మించిన ఫ్యాషన్ డిజైనర్ సుసాన్ హంఫ్రీస్‌ని వివాహం చేసుకున్నాడు. వారి కుమారుడు ఆడమ్ బేడీ అంతర్జాతీయ మోడల్, హలో? కౌన్ హై! అనే థ్రిల్లర్ సినిమాతో హిందీ చలనచిత్ర రంగ ప్రవేశం చేసాడు. సుసాన్ హంఫ్రీస్, కబీర్ బేడీల వివాహం కూడా విడాకులతో ముగిసింది.
1990ల ప్రారంభంలో కబీర్ బేడీ టీవీ, రేడియో ప్రెజెంటర్ నిక్కీ బేడీని వివాహం చేసుకున్నాడు. వారికి పిల్లలు లేరు. అయుతే 2005లో వారు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత, కబీర్ బేడీ బ్రిటీష్ లో జన్మించిన పర్వీన్ దుసాంజ్‌తో సంబంధం కలిగి ఉన్నాడు, ఆమెను తన 70వ పుట్టినరోజుకు ఒకరోజు ముందు కబీర్ బేడి వివాహం చేసుకున్నాడు.
కబీర్ బేడీ మయన్మార్‌లో ప్రభుత్వ వ్యతిరేక పోరాటానికి మద్దతు ఇచ్చాడు. బర్మా క్యాంపెయిన్ యూకే అధికారిక రాయబారి. ఆయన రోటరీ ఇంటర్నేషనల్ సౌత్ ఆసియాకు వారి టీచ్ ప్రోగ్రామ్, భారతదేశం, దక్షిణాసియాలోని టోటల్ లిటరసీ మిషన్‌కు బ్రాండ్ అంబాసిడర్.
గుర్తింపు
మార్చుకబీర్ బేడీ ఐరోపా, భారతదేశం అంతటా అనేక చలనచిత్రాలు, ప్రకటనల ద్వారా ఎన్నో ప్రజాదరణ పొందిన అవార్డులను గెలుచుకున్నాడు.[4]
- 1982 నుండి కబీర్ బేడీ అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌లో ఓటింగ్ సభ్యునిగా ఉన్నాడు.
- ఆయన స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్‌లో ఓటింగ్ సభ్యుడు కూడా.
- 2010 జూన్ 2 నాటి ఇటాలియన్ రిపబ్లిక్ ప్రెసిడెంట్ డిక్రీ ద్వారా, ఆయన అధికారికంగా నైట్ బిరుదు పొందాడు.
- ఆయన ఇటాలియన్ రిపబ్లిక్ అత్యున్నత పౌర గౌరవం అయిన ఇటాలియన్ రిపబ్లిక్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ "కావలీర్" (నైట్) బిరుదును పొందాడు.[5]
- ఆయన భారతదేశంలోని ఒడిశాలోని భువనేశ్వర్‌లోని కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (KIIT) విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ డిగ్రీని అందుకున్నాడు.
మూలాలు
మార్చు- ↑ "Internationally acclaimed Indian actor". IMDb. 1971–2016. Archived from the original on 27 February 2018. Retrieved 28 June 2018.
- ↑ "Residence of Kabir bedi". Archived from the original on 21 December 2015.
- ↑ Mackenzie, Vicki (2017). The Revolutionary Life of Freda Bedi (1st ed.). Boulder, CO: Shambhala Publications. pp. xii. ISBN 9781611804256.
- ↑ "Kabir Bedi: Awards page". Archived from the original on 13 July 2011. Retrieved 20 June 2009.
- ↑ "Knight in shining armour". The Times of India. 11 December 2010. Archived from the original on 20 November 2018. Retrieved 5 June 2016.