కర్ణ పర్వము ద్వితీయాశ్వాసము
రెండవ అశ్వాసం
మార్చుకర్ణుడికి శల్యుడు సారథ్యం వహించడానికి అంగీకరించిన పిదప సుయోధనుడు కర్ణుని చూసి " కర్ణా ! భీష్ముడు, ద్రోణుడు పాండవులను సంహరిస్తారని ఆశించాను. కాని వారికున్న పాండవపక్షపాతం కారణంగా నా ఆశ నెరవేర లేదు. కనీసం నీవైనా ధర్మరాజును బంధించి పాండవ సైన్యాలను నిర్మూలించి నా మనసుకు ఆనందం కలిగించు " అన్నాడు. కర్ణుడు శల్యునితో " నేను వేయు నారాచములు మొదలగు బాణములు చూసి పాండవులు భయపడతారు. నా భుజబలం చూసి దేవతలు మెచ్చుకుంటారు. నీవు కూడా మెచ్చుకునేలా యుద్ధం చేస్తాను " అన్నాడు.
శల్యసారధ్యము
మార్చుకర్ణుడి మాటలు విన్న శల్యుడు " కర్ణా ! పాండవులు సత్యసంధులు, భుజబల పరాక్రమవంతులు, తేజో మూర్తులు, అస్త్రశస్త్ర పారంగతులు, దివ్యాస్త్రసంపన్నులు, అఖిల శాస్త్రపారంగతులు ఇంద్రునికే భయం కలిగించకలిగిన మహిమాన్వితులు వారిని గురించి నీవు ఇలా మాటాడతగదు. అర్జునుని గాండీవ ధ్వని నీ చెవులు బద్దలు చేస్తుంది, భీముడి గదా నైపుణ్యం నీ కళ్ళను మిరుమిట్లు కొల్పుతుంది. పాండవులు వారి పరాక్రమంతో నిన్ను గజగజలాడించగలరు. అర్జునుడి శరాఘాతానికి నీ రధము కూలుతుంటే, భీముని గధాఘాతాలకు గజసైన్యములు కూలుతున్నప్పుడు, ధర్మరాజు నకులసహదేవులతో చేరి నీ సైన్యాలను చీల్చి చెండుతున్న సమయంలో నీవు ధైర్యంగా నిలిచి ఉంటే నీ మాటలు నమ్మగలను " అన్నాడు. ఆ మాటలు వినీ వననట్లు కర్ణుడు " శల్యా ! నా పరాక్రమము చూపిస్తాను పాండవుల ఎదుటకు రధము పోనిమ్ము. నేను విల్లు ఎక్కుపెడితే దేవేంద్రుడు కూడా నా ముందు నిలువలేడు. అసలు పాడవుల బలం ఏపాటిదని భీష్ముడు, ద్రోణుడు వారి చేతిలో చచ్చారు. నీవు చూస్తూ ఉండు నేను అర్జునుడిని చిటెకెలో సంహరిస్తాను. పాండుకుమారులు ఒక్కుమ్మడిగా నా మీద పడినా నేను జంకక పాడవసైన్యాలను చీల్చి చెండాడి భీష్మ, ద్రోణులు పోయినా సుయోధనుడికి విజయం చేకూర్చడానికి దివ్యాస్త్రసంపన్నుడైన కర్ణుడు ఉన్నాడని నిరూపిస్తాను " అని పగల్భాలు పలికాడు.
శల్యుడు కర్ణుడి ప్రగల్భాలను త్రోసి పుచ్చుట
మార్చుకర్ణుడి మాటలకు శల్యుడు నవ్వుకుని " కర్ణా ! ఎందుకయ్యా ఈ వ్యర్ధ ప్రగల్భాలు. ఎవరైనా వింటే నవ్వగలరు. నీవు ఎప్పటికీ అర్జునుడికి సరిరావు. అది అందరికీ తెలుసు. అర్జునుడి చేతిలో ఓడి పోయిన గంధర్వుడు అంగారపర్వునికన్నా, సుయోధనుడిని బంధించిన చిత్రసేనుడికన్నా, వరాహం కొరకు అర్జునుడితో పోరిన పరమేశరుడికన్నా నీవు ఎందులో గొప్పవాడివి. వారిలో ఎవరికీ సరి పోలని నీవు అర్జునుడిని గెలుస్తానని అనడం నోటి దురదగాక మరేమి. కర్ణా ! ఉత్తర గోగ్రహణ సమయాన అర్జునుడి చేతిలో మీరు పొందిన భంగపాటు అప్పుడే మరిచావా ! లేక అర్జునుడి బాణములు అప్పుడే తుప్పు పట్టాయని అనుకున్నావా ! ఇంతకు ముందులా కాకుండా ప్రాణాలకు తెగించి అర్జునుడితో పోరాడుతానని అన్నావు కదా! అదే నిజమౌతుందేమో ! ఎందుకంటే అర్జునుడి చేతిలో నువ్వు చచ్చినా ! నీ మాట నిలబడుతుంది " అన్నాడు. శల్యుని మాటలకు కర్ణుడికి కోపము కట్టలు తెంచుకున్నా ఆపుకుని " శల్యా ! నీవు అర్జునుడిని పొగడడమే పనిగా పెట్టుకున్నావు. నేను అర్ఝునుడితో యుద్ధము చేస్తున్నప్పుడు ఎవరు పరాక్రమవంతులో చూసి అప్పుడు పొగుడు. అప్పటి వరకు నోరుమూసుకుని రధము నడుపు " అని అన్నాడు. శల్యుడు నవ్వుకుంటూ రథము తోలుతున్నాడు. కర్ణుడు తన పక్కన ఉన్న సైనికులను చూసి " సైనికులారా ! అర్జునుడేడి నాకు చూపించండి. అర్జునుడి రథం ఎక్కడుందో చూపిన వారికి నేను కోరిన కానుకలు ఇస్తాను " అని కర్ణుడు తన శంఖం పూరించాడు. ఆ మాటలకు శల్యుడు పకపకా నవ్వి " కర్ణా ! అర్జునుడిని ఒకరు చూపేదేమిటి నువ్వే చూడగలవు. నీ వద్ద ధనం ఎక్కువగా ఉంటే దానిని సద్వినియోగపరచాలి గాని ఇలా అపాత్రాదానాలు చేయకూడదు. అయినా కర్ణా ! ఎక్కడైనా నక్క సింహాన్ని జయిస్తుందా! అర్జునుడితో స్వయంగా యుద్ధము చేయడము అంటే నీకు నీవే అగ్నిలో ప్రవేశించడమే ! అందుకని ఎల్లప్పుడూ నీ సైన్యమును దగ్గర ఉంచుకో. నేను సుయోధనుడికి మిత్రుడను కనుక ఇదంతా నీకు రుచించకున్నా ఇది చెప్తున్నాను. నా మీద కోపగించక నా మాట విను " అన్నాడు. కర్ణుడు కోపంతో " శల్యా ! నేను నీమాటలకి భయపడను. ఇంద్రుడు అడ్డుపడినా అర్జునుడితో ఒంటరిగా యుద్ధము చేయక వదలను. ముందు రధము పోనిమ్ము " అన్నాడు. కర్ణుడిని ఇంకా ఉడికించాలని శల్యుడు " కర్ణా ! నా మాటలు నీ చెవికి ఎక్కవులే అర్జునుడి గాండీవం నుండి జినించే శబ్దం నీ చెవులు బద్ధలు కొడుతుండగా గాండీవం నుండి వర్షంలా వచ్చి పడే బాణములు నీ మీద పడే వరకు నీకు బుద్ధి రాదులే ! కర్ణా ! అర్జునుడితో ద్వంద యుద్ధము అంటే మాటలా ! సింహముతో జింకపిల్ల, ఏనుగుతో కుందేలు, పులితో నక్క, గ్రద్దతో పాము యుద్ధము చేయడం లాంటిది. నీకు అర్జునుడితో పోరాడగలిగిన బలము, శక్తి, సామర్ధ్యము ఉన్నాయంటావా " అన్నాడు.
కర్ణుడు శల్యుని మీద ఆగ్రహించుట
మార్చుశల్యుడి మాటలకు కర్ణుడి ఆగ్రహం హద్దులు దాటింది. " శల్యా ! ఆపు నీ అధిక ప్రసంగం. గుణవంతుడి నైన నా వంటి వాడి గుణాలు గుణహీనుడవైన నీకేం తెలుసు. అర్జునుడి గురించి నాకు తెలిసినంతగా నీకేం తెలుసు. నాకు క్రిష్ణార్జునుల బలాబలములు తెలుసు కనుకనే నేను వారిని సంహరిస్తానని నమ్ముతున్నాను. నా చేత నిత్యమూ పూజలందుకుంటున్న సర్పముఖాస్త్రము నుండి తప్పించు కొనుటకు కృష్ణార్జునులే కాదు మరెవ్వరికీ సాధ్యము కాదు. అది తప్పితే భార్గవాస్త్రముతో చంపుతాను. కనుక అర్జునుడికి నా చేత చావు తధ్యము. కృష్ణార్జునుల కపిధ్వజము, గాండీవము నన్ను భయపెట్ట లేవు. వెయ్యి మంది కృష్ణులు పది వేల మంది అర్జునులూ వచ్చినా బెదరక పోరాడగలను పాండవపక్షపాతముతో నోటికి వచ్చినట్లు మాట్లాడక రధము పోనిమ్ము ఇంకా ఇలా మాటాడుతూ ఉంటే నీ ప్రాణములు నీ చెంత ఉండవు " అన్నాడు కర్ణుడు. శల్యుడు ఎదో మాట్లాడబోయే సమయంలో " శల్యా ! ఆగు నీవు నీచుడివి, పాపాత్ముడవు, క్షత్రియాధముడవు నీకు దుర్భుద్ధి కాక సద్బుద్ధి ఎలా ఉంటుంది. మీ మద్రదేశం వాళ్ళంతా దుష్టులు, దుర్మార్గులు, మిత్రద్రోహులు. నీకూ ఆ గుణుముల లేకుండా ఉంటాయా ! మీ దేశం వాళ్ళంతా వావి వరసలు లేకుండా ఆడామగా కలుస్తారట కదా ! అది మీకు తప్పు కాదట. పుట్టిన శిశువులకు తల్లి పాలకంటే ముందే మద్యం సేవించే మీకు ఉత్తమ గుణములు ఎలా వస్తాయి. నిత్యమూ మద్యపాన మత్తులో వావివరసలు లేక తిరుగుతూ ఎవరు ఎవరికి పుట్టారో కూడా తెలియని మీకు గుణము శీలము గురించి ఎలా తెలుస్తుంది. నీవు శత్రుపక్షం మేలు కోరే వాడివని నాకు తెలియదా ! యుద్ధమున శత్రువులను తనుమాడి వీర మరణం చెందినా చెందుతాను గాని యుద్ధము చేయుటకు వెనుకాడను. నాకు ఇంకా కోపం తెప్పిస్తే ఈ గధతో నీ తల బద్దలు కొడతాను. రధమును పోనిమ్ము " అన్నాడు.
శల్యుడు కర్ణుని సమాధానపరచుట
మార్చుశల్యుడు " అదేమిటి కర్ణా ! అలా అంటావు ఉన్న మాట చెప్పడంలో తప్పేమిటి. సుయోధనుడికి సాయం చేయ వచ్చాను కనుక అతడికి అతడి మిత్రుడవైన నీకు నాకు తోచిన హితవు చెబుతున్నాను. సారధి అంటే ఏమిటి ? అశ్వముల బలము, రధికుని బలము, రధికుని పరిస్థితి తెలిసి మెలగాలి. సమయస్పూర్తితో రధికుని కాపాడుతుండాలి. ఆయుధప్రయోగము, యుద్ధములో మెళుకువలు తెలిసి ఉండాలి. అన్నీ తెలిసిన నేను నీ హితవు కోరి నాకు తోచిన మాటలు చెప్పడంలో తప్పేమిటి. నీకు కోపం వచ్చినా సారధిగా చెప్పడం నా ధర్మము, నీతి. నేనేం తప్పు చేసానని నా తల బద్దలు కొడతావు. నీవు ఎన్ని చెప్పినా నీ శ్రేయోభిలాషిగా నీకు హితవు చేయక మానను. నీకు ఒక దృష్టాంతం చెప్తాను విను . అది విని నీవు నేను చెప్పినట్లు చేయక పోయినా నాకు బాధ లేదు.
కాకి హంసల కథ
మార్చుఒక దీవిలో ధర్మవర్తనుడైన ఒక వైశ్యుడున్నాడు. అతడు యజ్ఞ యాగాదులు చేసిన సత్కర్ముడు. కరుణా మూర్తి, దాన శీలుడు, శాంతి వంతుడు ఉత్తముడు. అతడు ధనధాన్యములతో శోభిల్లుతున్నాడు. అతడికి అనేక మంది సంతానము ఉన్నారు. వారి ఇంటికి ఒక కాకి వచ్చింది. అతడి కుమారులు ఆ కాకికి తాము తినగా మిగిలిన అన్నము పెట్టి పెంచసాగారు. వారు పెట్టిన ఆహారము తిని బలిసిన ఆ కాకి మిగిలిన పక్షులను నిర్లక్ష్యము చేయసాగింది. కొంత కాలానికి ఆ దీవికి కొన్ని హంసలు వచ్చాయి. అవి చాలా పెద్దవి. వైశ్యకుమారులు కాకిని చూసి " ఓ కాకీ ! ఆ హంసలు చూడు ఆకాశంలో ఎంత అందంగా విహరిస్తున్నాయో. నీవు కూడా అలా విహరించి వాటిని ఓడించాలి " అన్నారు. మూర్ఖులైన వారి మాటలు విని ఆ కాకి హంసలను " నాతో సమానంగా ఎగురగల వారు మీలో ఎవరైనా ఉన్నారా ! " అన్నది. ఆ హంసలు " ఓ కాకి ! మేము మానసరోవరంలో విహరించే హంసలము. మాకు ఎంత దూరం ఎగిరినా అలుపుండదు. నీవేమో మాలో బలవంతులెవరని అడుగు తున్నావు. అసలు కాకులు ఎక్కడైనా హంసలతో సమానంగా ఎగురగలవా " అన్నాయి. కాకి " నేను నూటొక్క రీతుల ఎగురగలను. శతయోజనముల దూరము పోగలను. భూమి నుండి నేరుగా ఆకాశంలోకి ఎగిరి భూమి మీదకు రాగలను. నేను ఎలాంటి హంసనైనా ఓడించగలను " అన్నది. వాటిలో ఒక హంస ముందుకు వచ్చి " నీవు చిత్ర విచిత్ర రీతుల ఎగురగలవా ! అయితే నాతో సమానంగా ఎగురు " అన్నది. అక్కడ ఉన్న మిగిలిన కాకులు వద్దు నీవు హంసతో సమానంగా ఎగుర లేవు " అన్నా వినక ఆ కాకి హంసతో పోటీ పడింది. హంస మెల్లగా ముందుకు పోసాగింది. కాకి వేగంగా ముందుకు వెళ్ళి హంసను దాటి ముందుకు వెళ్ళి తిరిగి హంస వద్దకు వచ్చి " నీవు ఇంకా ఇక్కడే ఉన్నావా " అని చెప్పి ముందుకు సాగింది. ఇది చూసిన కాకులు హంసను గేలి చేసాయి. కొంత సమయానికి కాకికి ఆయాసం వచ్చింది. కాని హంస అలుపెరుగక ముందుకు సాగింది. కాకి హంసతో పోటీ పడ లేక వెనుకబడి " అయ్యో ! అనవసరంగా హంసతో పోటీ పడ్డానే ఎక్కడ దిగుదామన్నా నేల కానరాలేదు. కింద పడ్డానంటే జలచరాలు తినేస్తాయి " అని దిగులుగా ఎగర సాగింది. ఆ కాకిని చూసిన హంస ఇది ఏరకమైన విన్యాసము? నా కంటే వెనుక బడ్డావు ఎందుకు అన్నది. ఎగరడానికి బలం చాలక అంతకంతకు కిందకు పోతూ ఆ కాకి " వైశ్యకుమారులు పెట్టిన ఎంగిలి మెతుకులు తిని కొవ్వెక్కి నాకంటే బల వంతులు లేరని గర్వించాను. గరుత్మంతుని కూడా గెలువగలనని తలిచాను. ఇప్పుడు నా బలమేమిటో తెలిసింది. దయ చేసి నన్ను తీసుకు వెళ్ళి మిగిలిన కాకులతో చేర్చు " అని వేడుకుంది. హంస నీటిలో మునుగబోతున్న కాకిని తన కాళ్ళతో పట్టుకుని ఒడ్డుకు చేర్చింది. " ఇటువంటి తెలివి తక్కువ పని ఇక ఎప్పుడూ చేయకు " అని మిగిలిన కాకులు మందలించాయి .
శల్యుడు కర్ణుడిని హేళన చేయుట
మార్చుకాకి హంసల కథ చెప్పిన శల్యుడు " కర్ణా ! కాకి కథ విన్నావు కదా ! వైశ్యకుమారులు పెట్టిన ఎంగిలి మెతుకులు తిని కాకి గర్వించినట్లు నీవు కూడా కురు కుమారులు పెట్టిన మృష్టాన్నములు తిని గర్వించి హంసతో పోటీ పడిన కాకిలా నీకంటే బలవంతుడైన అర్జునుడిని గెలవగలనని ప్రగల్భములు చెప్తున్నావు. దీని వలన హాని నీకే ఉత్తర గోగ్రహణ సమయాన నీ ముందే నీ తమ్ముని సంహరించి గోవులను మరలించినపుడు నీవేమైనావు? ఘోషయాత్ర సమయాన సుయోధనుడిని వదిలి ఎందుకు పారిపోయావు ? నాడు నిండు సభలో కృషార్జునుల భుజబలం గురించి మహర్షులు చెప్ప లేదా ! ఆ మాటలు విని కూడా నీవు అర్జునుడితో తలపడటానికి సాహసిస్తున్నావు. అర్జునుడితో ఆ పరమశివుడు కూడా పోటీ పడలేడు. కనుక నీకు తగిన వీరులతో పోటీపడుట మంచిది. నీ మంచి కోరి ఇది చెప్తున్నాను " శల్యుడు.
కర్ణుడు శల్యునికి బదులు చెప్పుట
మార్చుశల్యుని మాటలకు " అదేమిటి శల్యా ! నేను కృషార్జునుల బలము తెలియక వారితో యుద్ధముకు తలపడుతున్నానా ! నీవు ఎన్ని చెప్పినా ! కృష్ణార్జునులతో యుద్ధము చేయక మానను. ఈ యుద్ధములో చివరకు నేనో అర్జునుడో ఎవరో ఒకరే మిగలాలి. వ్యర్ధముగా మాటాడక రధము నడుపుము " అని తిరిగి " శల్యా ! నాకు పరశురాముడి కోపము, బ్రాహ్మణ శాపం ఉన్నాయి. లేకున్న నేను అర్జునుడిని లక్ష్యపెట్టను. నేను అస్త్రవిద్య నేర్చుకొనుటకు పరశురాముడి వద్దకు వెళ్ళినపుడు ఆయన నన్ను నా కులము ఏమిటని అడిగాడు. పరశురాముడు బ్రాహ్మణులకు క్షత్రియులకు తప్ప వేరెవరికి అస్త్ర విద్య నేర్పడు కనుక, నేను బ్రాహ్మణుడనని అబద్ధము చెప్పి అస్త్ర విద్య అభ్యసించాను. నాకు ఎన్నో అస్త్రశస్త్రములు నేర్పి బ్రహ్మాస్త్ర ప్రయోగము కూడా నేర్పాడు. బ్రహ్మాస్త్రము మాత్రము అత్యవసర సమయమున ఆపదలో ఉన్నప్పుడు మాత్రము ఉపయోగించమని చెప్పాడు. ఒక నాడు నా గురువు పరశురాముడు అలసి పోయి నా తొడ మీద తల పెట్టి నిద్రిస్తున్నాడు. అప్పుడు ఒక పురుగు నా తొడను తొలవ సాగింది. నేను నా గురువుకు నిద్రా భంగము ఔతుందని బాధను సహించాను. ఆ పురుగు చేసిన గాయం నుండి స్రవించిన రక్తము తగిలి నా గురువు నిద్ర లేచాడు. నా నుండి జరిగిన విషయం తెలుసుకుని నా సహనశక్తికి పరశురాముడు ఆశ్చర్యపడ్డాడు. అప్పుడు నా గురువు " నిజం చెప్పు నీవు బ్రాహ్మణ కుమారుడివా ! బ్రాహ్మణ కుమారుడికి ఇంత సహనశక్తి అరుదు " అని అడిగాడు. నేను భయపడుతూ బ్రాహ్మణుడను కాను సూత కుమారుడనని చెప్పాను. నేను అతడిని అసత్యముతో వంచించినందుకు ఆగ్రహించి పరశురాముడు ఆపద సమయంలో బ్రహ్మాస్త్రము, భార్గవాస్త్రము గుర్తుకు రావని శపించాడు. పరశురాముడి శాపమే కాక నాకు మరొక బ్రాహ్మణ శాపం కూడా తగిలింది. ఒకసారి నేను అస్త్రవిద్యను అభ్యసిస్తుండగా నా బాణము గురి తప్పి ఒక ఆవు దూడకు తగిలి మరణించింది. ఆ బ్రాహ్మణుడు " హోమధేనువు అయిన దూడను చంపావు కనుక నీ ప్రాణములు యుద్ధ భూమిలో హరించబడతాయి అని శపించాడు. నీ రథచక్రములు భీమిలో దిగబడతాయి. నీవు ఎవరిని చంపాలని ఇన్ని అస్త్రవిద్యలు నేర్చావో వారి చేతిలో నీవు సంహరించబడతావు " అన్నాడు. నేను భయపడి " బ్రాహ్మణోత్తమా ! నీవు కోల్పోయిన ధేనువుకు బదులుగా వెయ్యి ఆవులు, ఆరు వందల ఎద్దులు, నూరు రథములు, నూరు మంది స్త్రీలను, ఏడు వందల ఏనుగులను ఇస్తాను. నన్ను శాపవిముక్తుడిని చెయ్యి " అని వేడుకున్నాను. కాని ఆ బ్రాహ్మణుడు నన్ను కరుణించ లేదు " నా శాపముకు తిరుగు లేదు. కాని ఉత్తమ గతులు పొందటానికి నా శాపము అడ్డు రాదు " అన్నాడు. శల్యా ! నేను గురు శాపముకు బ్రాహ్మణ శాపముకు భయపడుతున్నాను కాని కృష్ణార్జునులకు కాదు. శల్యా ! నాకు ఇంకా బ్రహ్మాస్త్రము గుర్తుకు వస్తుంది రధమును అర్జునుడి ముందు నిలుపు " అన్నాడు. అప్పుడు శల్యుడు తనలో తాను " నా పలుకులు విని కర్ణుడు తాను అర్జునుడి చేతిలో మరణించడం తధ్యము అనుకుంటున్నాడు. అందుకే బ్రాహ్మణ శాపము, గురు శాపము, తనలోవున్న లోపాలను గురించి అందరికీ చెప్పాడు. నేను అర్జునుడి బలపరాక్రమములు వివరించడం వలన వీడి మనసు బాగా బలహీన మైంది. ధర్మరాజుకు ఇచ్చిన మాట నెరవేర్చుకున్నట్లే " అనుకున్నాడు.
శల్యుడు కర్ణుడు ఒకరిని ఒకరు నిందించు కొనుట
మార్చుతనను కాకితోను అర్జునుడిని హంసతోను పోల్చడం కర్ణుడికి కోపానికి కారణం అయింది అతడు ఇక సహించ లేక " నీచుడా ! నన్ను ఇలా నీచంగా పోలుస్తావా ! అయినా నీచులకు నీచమైన మాటలే కదా వస్తాయి. అర్జునుడి పరాక్రమము గురించి నిన్ను అడిగానా అనవసంరంగా అర్జునుడిని పొగిడి మిత్రుడినైన నాకు ద్రోహము చేస్తావా ! యుద్ధములో శత్రుపక్షమును పొగిడే వారిని క్షమించ కూడదు. సుయోధనుడు నిన్ను నాకు సూతుడుగా నియమించాడు కనుక ఊరక ఉన్నాను. సుయోధనునితో నా మైత్రి లోకోత్తరమైంది. నీవు నాకు బద్ధ విరోధివి. నీకు బాధ కలించేలా సుయోధనుడికి ఆనందం కలిగించేలా నేను అర్జునుడిని గెలుస్తాను. నా రధము భూమిలో కూరుకు పోక నిలిచిన అర్జునుడిని గెలుచుట నాకు అసాధ్యము కాదు " అన్నాడు. శల్యుడు నవ్వి " కర్ణా ! ఏలనయ్యా ! ఈ వ్యర్ధ ప్రేలాపనలు. నీలాంటి కర్ణులు వేయి మంది అయినా అర్జునుడిని గెలువ లేరు " అన్నాడు. కర్ణుడు కోపము నిగ్రహించుకోలేక పోయాడు. శల్యా ! ఒక రోజు ఒక బ్రాహ్మణుడు బాహ్లిక దేశస్తులు మద్యపాన మదోన్మత్తులని, మాంసభక్షకులని, దిగంబరంగా దురాచారాలు చేస్తారని అని నిందించాడు. వారికంటే మద్ర దేశస్తులు అవినీతి పరులని పేర్కొన్నారు. అలాంటి వారికి రాజువైన నీవు నోరుమూసుకు ఉండుట మంచిది " అన్నాడు. శల్యుడు " కర్ణా ! నీ గురించి తెలియనిదా ! భీష్ముని చేత నీవు అర్ధరధుడవు అనిపించుకోలేదా ! అంగదేశంలో జనులు ఆడవాళ్ళను అమ్ముకుంటారట కదా ! అలాంటి వారికి రాజువైన నీవు నన్ను అంటావా ! ఒకరిని అనే ముందు తమ తప్పు తాము తెలుసుసు కొనుట మంచింది " అన్నాడు. వారి వివాదము విన్న సుయోధనుడు వారి వద్దకు వచ్చి సముచిత మాటలతో సర్ధి చెప్పి ఇరువురను యుద్ధోన్ముఖులను చేసాడు.
శల్యుడుపాండవ పరాక్రమమును శ్లాఘించుట
మార్చుశల్యుడు " కర్ణా ! నీవు అర్జునుడిని జయించినచో నీవే మహారాజువు. మనకు ఈ రోజు దుశ్శకునము కానవస్తున్నాయి. యుద్ధము ఘోరంగా జరగబోయేలా ఉంది. కర్ణా ! అదుగో అర్జునుడి కపిధ్వజము. అర్జునుడు త్రిగర్త వీరులను చీల్చి చెండాడుతున్నాడు. కర్ణా ! ఎందుకైనా మంచిది. అర్జునుడిని గెలుస్తానని మనం మనం అనుకుని సంతోషిద్దాము. పెద్దగా అనకు పరువు పోతుంది. అర్జునుడిని గెలుచుట ఇంద్రునికైనా సాధ్యము కాని పని. కర్ణా అటు చూడు భీముడు, ధర్మరాజు, నకులసహదేవులు, ఉపపాండవులు అరివీర భయంకరులై ఎలా వెలిగి పోతున్నారో. ఎంతైనా పాండవులు ధర్మపరులు కదా ! కనుక ధర్మం ఎప్పుడూ వారినే వరిస్తుంది " అన్నాడు. కర్ణుడు బదులు చెప్పలేదు. సుయోధనుడు యోధులను చూసి " యోధులారా ! మీ బలపరాక్రమము చూపు సమయం ఆసన్నమైంది. అందరూ ప్రాణాల మీద ఆశ విడిచి యుద్ధము చేయండి. విజయమో వీర స్వర్గమో తేల్చుకోండి " అన్నాడు. అశ్వత్థామ " నా తండ్రిని చంపిన ధృష్టద్యుమ్నుని చంపి కాని ఈ కవచమును విప్పను. భీమార్జునులు అడ్డు వచ్చినా వారిని సంహరించి ధృష్టద్యుమ్నుడిని చంపుతాను " అన్నాడు.
యుద్ధారంభం
మార్చుయుద్ధము ఆరంభం అయింది. సుయోధనుడు భీముని తన గజ సైన్యముతో ఎదుర్కొన్నాడు. కర్ణుడు ధర్మరాజును ఎదుర్కొన్నాడు. ధర్మరాజు " అర్జునా ! అటు చూడు కర్ణుడు పఠిష్టమైన వ్యూహముతో ఎదుర్కొన్నాడు. మనము కూడా అతడికి తగు రీతిన బదులు చెప్పాలి " అన్నాడు. అర్జునుడు " అన్నయ్యా ! కర్ణుడిని చంపడం పెద్ద పనే కాదు " అన్నాడు. ధర్మరాజు అయితే నీవు కర్ణుడిని గెలువుము, భీముడు సుయోధనుడిని, నకులుడు వృషసేనుడిని, సహదేవుడు సౌబలునీ, శతానీకుడు దుశ్శాసనుడిని, సాత్యకి కృతవర్మను, ధృష్టద్యుమ్నుడు అశ్వత్థామను, ఉపపాడవులు శిఖండి కలిసి మిగిలిన ధృతరాష్ట్ర పుత్రులను ఎదుర్కొంటారు. నేను కృపాచార్యుడిని ఎదుర్కొంటాను " అన్నాడు. కాని ఆ రోజు యుద్ధము ధర్మరాజు చెప్పినట్లు జరుగ లేదు. ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు తలపడ్డారు. అర్జునుడు కర్ణుడిని ఎదుర్కొన్నాడు. మరొక పక్క సంశక్తులు అర్జునుడిని ఎదుర్కొన్నరు. అర్జునుడు కర్ణుడిని వదిలి సంశక్తులను ఊచకోత కోస్తున్నాడు. సంశక్తులు అర్జునుడిని చుట్టుముట్టారు. అర్జునుడు తన బాణములతో సంశక్తులను చీల్చి చెండాడాడు. కృపాచార్యుడు, కృతవర్మ, సౌబలుడు పాండవులతో పోరుతున్నారు. రక్తం కాలువలు కడుతూ ఉంది. రథములు విరుగుతున్నాయి. గజములు, హయములు చస్తున్నాయి. పదాతిదళముల కళేబరములతో రణభూమి నిండి పోయింది. సుయోధనుడు కర్ణుడికి సాయం వెళ్ళాడు. కర్ణుడు పాంచాల సేనను ఎదుర్కొన్నాడు. పాంచాల సేనకు దీటుగా ఛేది సేన వచ్చి చేరింది. కర్ణుడు వారిని తరిమి తరిమి స్వర్గ ప్రాప్తి కలిగిస్తున్నాడు.
కర్ణుడి విజృంభణ
మార్చుతరువాత కర్ణుడు ధర్మరాజుని ఎదుర్కొన్నాడు. ధృష్టద్యుమ్నుడు కర్ణుడిని ఎదుర్కొన్నాడు. మరొక పక్క ప్రభద్రకులు కర్ణుడిని ఎదుర్కొన్నారు. కర్ణుడు ఏడు బాణములతో ప్రభద్రకులను ఎదుర్కొన్నాడు. అది చూసి పాంచాలురు మహా కోపంతో కర్ణుడి మీదకు వచ్చారు. కర్ణుడు ఇరవై అయిదు బాణములతో ఇరవై అయిదు పాంచాలురను వధించాడు. తరువాత భానుదేవుడు, సేనాబిందు, చిత్రసేనుడు, తపనుడు, శూరసేనుడు అను అయిదుగురు పాంచాలురు కర్ణుడిని ఎదుర్కొనగా కర్ణుడు అయిదు బాణములతో వారిని వధించాడు. కర్ణుడి వెంట అతడి కుమారుడు సుషేణుడు, వృషసేనుడు, సత్యసేనుడు వస్తున్నారు. అప్పుడు ధృష్టద్యుమ్నుడు, శిఖండి, భీముడు, జనమేజయుడు, సాత్యకి, నకుల సహదేవులు, ఉపపాండవులు, కేకయ, మత్స్య యోధులు కర్ణుడిని ఎదుర్కొన్నారు. వారంతా కర్ణుడి మీద అతడి కుమారుల మీద బాణములు గుప్పించారు.
భీమసేనుడు
మార్చుఅది చూసి సుయోధనుడు, దుశ్శాసనుడు, వారి కుమారులు, గజసైన్యముతో వచ్చి భీముని ఎదుర్కొని సుయోధనుడు అతడి మీద శరవర్షం కురిపించాడు. భీముడు వాటిని చిన్నా భిన్నం చేసి సుయోధనుడి మీద పదునైన బాణములు ప్రయోగించాడు. వాటి ధాటికి సుయోధనుడు అతడి సైన్యము నిలువలేక పోయింది. భీముని ధాటకి గజములు కూలుతున్నాయి. హయములు ప్రాణములు కోల్పోతున్నాయి. అప్పుడు కృపాచార్యుడు భీముని ఎదుర్కొన్నాడు. దుశ్శాసనుడు, కర్ణుడి కుమారులు అతడికి సాయంగా వచ్చి భీముని ఎదుర్కొన్నారు. కర్ణుడి కుమారుడు సుషేణుడు భీముని విల్లు విరిచి ఏడు బాణములు అతడి గుండెలో దిగేలా వేసాడు. భీముడు సుషేణుడి విల్లు విరిచి అతడి మీద పదునాలుగు బాణములు వేసాడు. కర్ణుడి మీద పదునాలుగు బాణములు ప్రయోగించాడు. ఇంతలో కర్ణుడి కుమారుడు అత్యసేనుడు భీముని ఎదుర్కొన్నాడు. భీముడు అతడి సారథిని చంపి, ధ్వజమును కొట్టి మరొక పదునైన బాణము వేసి సత్యసేనుడి శిరస్సు ఖండించాడు. తరువాత కృతవర్మ, కృపాచార్యుల ధనస్సును ఖండించి వారిని క్రూరమైన బాణములతో కొట్టాడు. దుశ్శాసనుడి మీద అయిదు బాణాలను సౌబలుడి మీద ఆరు బాణములను వేసి ఉలూకుని అతడి తమ్ముని రథములు విరిచాడు. కర్ణుడి కుమారుడైన సుషేణుడిని చూసి " ఓరి సుషేణా ! ఈ రోజుతో చచ్చావురా ! అంటూ పదునైన బాణములను అతడి మీద ప్రయోగించాడు. కర్ణుడు ఆ బాణములు మధ్యలో తుంచి భీముడి మీద అతి క్రూరమైన మూడు బాణములు వేసాడు. భీముడు తిరిగి సుషేణుడి మీద బాణములు గుప్పించాడు. కర్ణుడు ఆ బాణములను విరిచి భీముని మీద డెబ్భై మూడు బాణములు గుప్పించాడు.
కురు పాండవ యోధుల సమరం
మార్చుఆ సమయంలో నకులుడు కర్ణుడిని ఎదుర్కొన్నాడు. మధ్యలో సుషేణుడు నకులుని మీద బాణవర్షం కురిపించి నకులుని విల్లు విరిచాడు. నకులుడు మరొక విల్లు తీసుకుని సుషేణుడి విల్లు విరిచాడు. సుషేణుడు మరొక విల్లు తీసుకుని నకులుని మీద అరవై బాణములు సంధించాడు. నకులుడికి సాయంగా వచ్చిన సహదేవుడి మీద సుషేణుడు ఏడు బాణములు వేసాడు. నకుల సహదేవులిద్దరూ సుషేణుడితో ఘోరంగా యుద్ధము చేస్తున్నారు. సుషేణుడి తమ్ముడు వృషసేనుడు సాత్యకిని ఎదుర్కొని అతడి మీద డెబ్భై ఏడు బాణములు వేసి అతడి సూతుడి మూడు బాణములు వేసాడు. సాత్యకి ఆగ్రహించి వృషసేనుడి విల్లు విరిచి, హయములను చంపి, పతాకమును విరిచి, అతడి గుండెలకు గురిపెట్టి బాణము వేసి నొప్పించాడు. వృషసేనుడు కత్తి డాలు తీసుకుని సాత్యకిని ఎదుర్కొన్నాడు. సాత్యకి వృషసేనుడి కత్తి డాలు విరిచాడు. అప్పుడు దుశ్శాసనుడు వచ్చి సుషేణుడిని తన రథము మీద ఎక్కించుకుని వెళ్ళాడు.
కర్ణుడి పరాక్రమము
మార్చుకర్ణుడు సాత్యకిని ఎదుర్కొని సాత్యకి రథము కూల్చాడు. సాత్యకి మరొక రథము తీసుకుని కర్ణుడిని ఎదుర్కొన్నాడు. ఇంతలో ఉపపాడవులు, ధృష్టద్యుమ్నుడు, శిఖండి, భీముడు, నకుల సహదేవులు సాత్యకికి సాయంగా వచ్చారు. కర్ణుడికి సాత్యకికి మధ్య ఘోరయుద్ధము జరిగింది. సాత్యకి, ధృష్టద్యుమ్నుడు, ఉపపాడవులు కలిసి కర్ణుడి మీద శరవర్షం కురిపించాడు. కర్ణుడు వారందరి రథములను విరిచి వారిని విరధులను చేసాడు. కర్ణుడు ధర్మరాజును ఎదుర్కొన్నాడు. ఛేదిసైన్యము ధర్మజునికి సాయంగా వచ్చింది. కర్ణుడు వారిని అందరిని తరుముతున్నాడు. ఇంతలో సాత్యకి, శిఖండి మరి కొందరు వీరులు ధర్మజుడికి సాయం వచ్చారు. వారి మధ్య యుద్ధం తీవ్రమైంది. కర్ణుడి పరాక్రమము ముందు పాండవసేనలు వెలవెలబోయాయి. కర్ణుడు ధర్మరాజు ధనస్సును ఖండించి తొంభై బాణములు ప్రయోగించి ధర్మరాజు కవచమును చీల్చాడు. ధర్మరాజు శక్తి ఆయుధమును కర్ణుడి మీద విసిరాడు. కర్ణుడు శక్తి ఆయుధమును ముక్కలు చేసాడు. ధర్మరాజు కర్ణుడి శరీరమంతా బాణములతో కొట్టాడు. కర్ణుడు ధర్మరాజు కేతనము విరిచి అతడి సారథిని చంపాడు. సాత్యకి, శిఖండి కర్ణుడి మీద శరములు గుప్పించారు. కర్ణుడు వారి రథములు విరిచి వారి ధనస్సులు విరిచి ధర్మరాజు శరీరం అంతా వాడి అయిన బాణములు దించాడు. కర్ణుని పరాక్రమము తట్టుకో లేక ధర్మరాజు తన రథమును పక్కకు మళ్ళించి యుద్ధ భూమి నుండి తొలగి పోయాడు. కర్ణుడు ధర్మరాజు వెంట తరిమి పరిహాసంగా " ఓ ధర్మరాజా ! క్షత్రియ కులములో పుట్టావు. ధర్మాధర్మ విచక్షణ తెలిసిన వాడివి ఇలా భీరువులా యుద్ధ భూమిని వదిలి ప్రాణభయంతో పారిపోతగునా ! నీకు రాజ నీతి తెలియదు. నీవు బ్రాహ్మణుడి వలె పిరికి వాడివి. నా వంటి వీరులతో నీవు పోరాడి గెలువ లేవు. నేను నిన్ను చంపను నీకు యుద్ధం ఎందుకు వెళ్ళి యజ్ఞయాగాదులు చేసి జీవించు. కృషార్జునులు ఉన్న చోటుకు వెళ్ళి దాక్కో " అన్నాడు. ధర్మరాజు సిగ్గుతో తలవంచు కుని అక్కడి నుండి వెళ్ళాడు. కర్ణుడు ధర్మరాజును వదిలి అతడి సైన్యమును హతమారుస్తున్నాడు. పాండవ సైన్యము పారిపోయింది. కౌరవ సైన్యము జయజయ ధ్వానాలు చేసాయి.
భీమసేనుడి పరాక్రమము
మార్చుధర్మరాజును కర్ణుడు అవమానించడం చూసిన భీమసేనుడు సాత్యకి ధృష్టద్యుమ్నులతో " నా అన్న భంగపాటు నాకెంతో బాధకలిగించింది. నా అన్నను అవమానించిన కర్ణుడి మీద పగతీర్చుకోవాలి. మీరిద్దరూ ధర్మరాజును కాపాడండి నేను వెళ్ళి కర్ణుడి అంతు చూస్తాను. ఈ రోజు నేనో కర్ణుడో ఎవరో ఒకరే ఉండాలి " అన్నాడు. మహా క్రోధంతో తమ వైపు వస్తున్న భీముని చూసి శల్యుడు " కర్ణా ! అడుగో భీముడు ఆగ్రహంతో వస్తున్నాడు. భీముడు కోపించిన మూడులోకాలు నిలువ లేవు. నీవు అతడిని ఎదుర్కొని నీ బలపరాక్రమలు చూపించు " అన్నాడు. కర్ణుడు " శల్యా ! భీముడు అల్పుడు, అతడు పరాక్రవంతుడా ! అతడిని చంపితే నాకేమి కీర్తి వస్తుంది. అతడిని చంపక యుద్ధము మాత్రము చేస్తాను. అతడి కొరకు అర్జునుడు రావాలి అర్జునుడిని చంపి కీర్తి గడిస్తాను. భీముని ఎదురుగా రధము పోనివ్వు " అన్నాడు. కర్ణుడు భీముని ఎదుర్కొని అతడిపై శరవర్షం కురిపించి అతడి విల్లు తుంచాడు. భీముడు మరొక విల్లందుకుని కర్ణుని వక్షస్థలము మీద గురి చూసి కొట్టాడు. కర్ణుడు భీముని కవచాచ్చి చీల్చాడు. భీముడు ఒక బల్లబాణాన్ని ప్రయోగించి కర్ణుడి వక్షస్థలాన్ని కొట్టి అతడిని మూర్ఛిల్లజేసాడు. భీముడు తన అన్నను తూల నాడిన నాలుకను ఖండిస్తానని ఒక ఖడగం తీసుకుని కర్ణుడి రథము మీదకు లంఘించాడు. శల్యుడు భీముని వారించి " భీమసేనా ! ఆగు కర్ణుడు చావలేదు మూర్చపోయాడు. నీవు అతడి నాలుక కోస్తే రక్తస్రావంతో ప్రాణాలు విడుస్తాడు. అప్పుడు నీ అన్న ప్రతిజ్ఞ నెరవేరదు. కనుక అతడిని వదిలి పెట్టు " అన్నాడు. భీముడు ఆగి " నిజం శల్యా ! నాడు సభలో ధర్మజుడి మాట విని కర్ణుడిని వదిలాను. నేడు నా అన్న ప్రతిజ్ఞ నేరవేరాలని వదిలి వెడుతున్నాను " అన్నాడు. కర్ణుడు భీముని చేత భంగపడటం చూసిన సుయోధనుడు తన తమ్ములను కర్ణుడికి సాయంగా పంపాడు. వెంటనే శృతవర్మ కురుకుమారులను వెంటపెట్టుకుని భీముని ఎదుర్కొని చుట్టుముట్టారు. వారిని చూసి భీముడు మరింత విజృంభించి శ్రుతవర్మను అతడి అనుచరులను ఒకే వేటుకు హతమార్చాడు. వికటుడు, సముడు, గ్రాధుడు, నందుడు, ఉపనందుడు మొదలైన కురుకుమారులను బల్లెంతో హతమార్చాడు. ఇంతలో కర్ణుడు మూర్ఛ నుండి తేరుకుని భీముని విల్లు విరిచాడు. భీముడు తన గదను కర్ణుడి మీద వేసాడు. కర్ణుడు దానిని ముక్కలు చేసి ప్రకాశవంతమైన పది దివ్యాస్త్రములను భీముని మీద ప్రయోగించాడు. భీముడు వాటిని తప్పించుకుని ఒక బాణాన్ని కర్ణుడి వక్షస్థలానికి గురిపెట్టి వేసి అతడి కవచాచ్చి చీల్చాడు. కర్ణుడు భీముని మీద ఇరవై అయిదు బాణలులు ప్రయోగించి అతడి హయములను చంపాడు.
భీముడు గాంధార సైన్యము ఎదుర్కొనుట
మార్చుభీముడు రథము దిగి గదను తీసుకుని కర్ణుడి మీదకు లంఘించి అడ్డు వచ్చిన మూడు వేల మంది అశ్వసైనికులను హతమార్చాడు. రథములను విరుస్తూ, హయములను గజములను కాల్బలంతో చంపుతూ రణభూమి అంతా తానే అయి విహరిస్తున్నాడు. ఇంతలో ఆరు వందల గాంధారసేన భీముని చుట్టుముట్టారు. భీముడు వారి సారధులను, హయములను చంపి, రథములను, కేతనములను విరిచి సర్వనాశనం చేసాడు. శకుని మూడు వేల సైన్యాలను భీముని మీదకు పంపాడు. భీముడు కార్చిచ్చు అడవిని కాల్చినట్లు వారిని హతమార్చి వేరొక రథము ఎక్కి యుద్ధము చేయసాగాడు.
కురు పాండవుల సమరం
మార్చుమధ్యాహ్న సమయం అయింది. కర్ణుడు తిరిగి ధర్మజుని ఎదుర్కొని తన తీవ్రమైన బాణములతో ధర్మజుని సారథిని చంపాడు. సారథి లేని రథాన్ని హయములు ఎటో లాక్కుని వెళ్ళాయి. అది చూసి భీముడు తిరిగి కర్ణుడిని ఎదుర్కొన్నాడు. ఇంతలో సాత్యకి అడ్డుపడి కర్ణుని ఎదుర్కొన్నాడు. ఇరువురు తమ బాణాలతో ఆకాశాన్ని కప్పారు. కర్ణుడికి సాయంగా కృపాచార్యుడు శకుని, కృతవర్మ, అశ్వత్థామ తమ తమ సైన్యములతో వచ్చారు. యుద్ధము ఘోరంగా సాగుతుంది. రథములు కేతనములు విరుగుతున్నాయి, గజములు హయములు కాల్బలములు చనిపోతున్నాయి, రక్తం వరదలై పారుతుంది. తెగిన తలలు, విరిగిన కాళ్ళు చేతులు, తునాతునకలు అయిన ధనస్సులు, రథములు, నేల మీద దొర్లే కిరీటములు ఛత్రములు చామరముల గుట్టలతో రణ భూమి నిండి పోయింది.
అర్జునుడు త్రిగర్త సేనలను ఎదుర్కొనుట
మార్చుతనను ఎదిరించిన త్రిగర్తసేనలతో అర్జునుడు ఘోరంగా యుద్ధము సాగిస్తున్నాడు. సుశర్మ అర్జుడి మీద పది నిశిత శరములు ఉపయోగించి కృష్ణుడి మీద మూడు బాణములు వేసి గాయపరిచాడు. కపిధ్వజమును తెగనరికాడు. కపిధ్వజము మీద ఉన్న హనుమంతుడు బిగ్గరగా అరిచాడు. ఆ అరుపులకు త్రిగర్తలు సైనికులు మూర్ఛపోయి వెంటనే తేరుకుని అర్జునుడిని చుట్టుముట్టారు. అర్జునుడు వారి మీద బాణప్రయోగము చేస్తుంటే కృష్ణుడు అవలీలగా రథమును బయటకు తీసుకు వచ్చాడు. అర్జునుడు సర్పాస్త్రముతో త్రిగర్త సైనికిల కాళ్ళను చేతులను బంధించగా సుశర్మ గరుడాస్త్రమును ప్రయోగించి వారిని బంధవిముక్తులను చేసి అర్జునుడి మీద ఒక దివ్యాస్త్రము ప్రయోగించాడు. ఆ అస్త్రప్రభావానికి అర్జునుడు మూర్ఛిల్లి రథము మీద పడ్డాడు. అర్జునుడు మరణించాడనుకుని కురుసేనలు భేరీ మృదంగాలు మ్రోగించాడు. అర్జునుడు మూర్ఛ నుండి తేరుకుని సుశర్మ మీద బాణములు గుప్పించి సైన్యముపై ఇంద్రాస్త్ర ప్రయోగము చేసాడు. ఇంద్రాస్త్రము నుండి అనేక ఆకృతులు కలిగిన బాణములు వెలువడి త్రిగర్త సైన్యములను బలి తీసుకున్నాయి. పోయిన వాళ్ళు పోగా మిగిలిన పదునాలుగు వేల మంది అర్జునుడిని చుట్టుముట్టారు. అర్జునుడు వారితో భీకరంగా యుద్ధము చేస్తున్నాడు.
కృపాచార్యుని సమరం
మార్చుపాండవ సేనల ధాటికి ఆగ లేక కౌరవ సేనలు పారిపోతున్నాయి. సుయోధనుడు, కృతవర్మ, కృపాచార్యుడు, దుశ్శాసనుడు వారిని యుద్ధోన్ముఖులను చేస్తున్నాడు. కృపాచార్యుడు పాంచాల సేనల మీద శరవర్షం కురిపిస్తూ శిఖండి రథమును విరిచి, సారథిని హయములను చంపాడు. శిఖండి తన రథము దిగి కత్తి డాలు తీసుకుని కృపాచార్యుని ఎదుర్కొన్నాడు. కృపాచార్యుడు శిఖండి మీద బాణములు గుప్పించాడు. ఇంతలో ధృష్టద్యుమ్నుడు కృపాచార్యుని ఎదుర్కొన్నాడు. కృతవర్మ మధ్యలో వచ్చి ధృష్టద్యుమ్నుని ఎదుర్కొన్నాడు. ధర్మరాజు ఉపపాండవులతో అశ్వత్థామను ఎదుర్కొన్నాడు. నకుల సహదేవులు సుయోధనుడిని ఎదుర్కొన్నారు. భీముడు కర్ణుడిని ఎదుర్కొన్నాడు. కృపాచార్యుడు శిఖండి చేతిలో ఉన్న డాలును ఖండించాడు. శిఖండి తన చేతిలో ఉన్న కత్తితో కృపాచార్యునితో యుద్ధము చేస్తున్నాడు. ఇంతలో సుకేతుడు వచ్చి కృపాచార్యుని ఎదుర్కొన్నాడు. శిఖండి అక్కడి నుండి తొలిగి పోయాడు. కృపాచార్యుడు సుకేతుని మీద ఆరు బాణములు ప్రయోగించి అతడి విల్లు ఖండించాడు. సుకేతుడు మరొక విల్లందుకున్నాడు కృపాచార్యుడు దానిని కూడా ఖండించాడు. సుకేతుడు మరొక విల్లందుకుని కృపాచార్యుని విల్లు విరిచి, అతడి అశ్వములను సారథిని కొట్టాడు. కృపాచార్యుడు సుకేతుడి మీద ముప్పది బాణములు ప్రయోగించాడు. ఆ శరముల ధాటికి సుకేతుడు తట్టుకొనలేక పోయాడు. అదను చూసి కృపాచార్యుడు ఒకే బాణంతో అత్సడి శిరస్సు ఖండించాడు. సుకేతుని మరణం చూసి అతడి సైన్యము చెదిరి పోయింది.
ధృష్టద్యుమ్నుడు
మార్చుధృష్టద్యుమ్నుడు కృతవర్మను వక్షస్థలానికి గురిపెట్టి తొమ్మిది బాణములతో కొట్టి కృతవర్మ సారథిని రథమును అశ్వములను ధ్వజమును తన బాణములతో కప్పాడు. కృతవర్మ రథము నుండి దిగి పోయాడు. ధృష్టద్యుమ్నుడు కృతవర్మను వెతుకుతూ అతడి సారథిని చంపాడు. కృతవర్మ నేనిక్కడ ఉన్నాను అని పెద్దగా అరిచాడు. ధృష్టద్యుమ్నుని కృతవర్మ నేల మీద నిలబడి ఒక విల్లందుకుని ఎదుర్కొన్నాడు. కౌరవ వీరుడు అక్కడకు వచ్చి కృతవర్మను రథము మీదకు లాక్కుని తీసుకు వెళ్ళాడు. చేతికి చిక్కిన్మ కృతవర్మ పోగానే ధృష్టద్యుమ్నుడు కౌరవసేనను నాశనం చేయ సాగాడు.
అశ్వత్థామ ధర్మజుల పోరు
మార్చుఅశ్వత్థామతో యుద్ధము చేస్తున్న ధర్మజునికి సాయంగా సాత్యకి వచ్చి చేరాడు. అశ్వత్థామ వారందరిని తన శరపరంపరతో ముంచెత్తాడు. ధర్మరాజు కూడా అశ్వత్థామ మీద బాణవర్షం కురిపించాడు. అశ్వథ్థామ ధర్మజుని విల్లు తుంచి అతడి మీద మూడు బాణంఅములు వేసాడు. సాత్యకి అశ్వత్థామ విల్లు తుంచాడు. అశ్వత్థామ ఒక ఈటెను విసిరి సాత్యకి సారథిని చంపి సాత్యకి మీద బాణములు గుప్పించాడు. సారథి లేని సాత్యకిని రథమును గుర్రములు ఎటో ఈడ్చుకు వెళ్ళాయి. తన మీద శరవర్షం కురిపిస్తున్న పాడవ సేన మీద ఆగ్రహించిన అశ్వత్థామ పాండవసేనను ఊచకోత కోస్తున్నాడు. ఇది విన్న సుయోధనుడు పాండవులు కూడా అశ్వత్థామ చేతిలో హతులైనారని అనుకుని ఆనందించాడు. ఇంతలో ధర్మరాజు అశ్వత్థామను తరమడం చూసి హతాశుడయ్యాడు. ధర్మరాజు అశ్వత్థామను చూసి " గురుపుత్రా అశ్వత్థామా ! నీవు అత్యంత బలశాలివి అస్త్రశస్త్ర పారంగతుడవు నీ పరాక్రమము నా మీద కాక ధృష్టద్యుమ్నుడి మీద చూపు. నీవు బ్రాహ్మణుడవు నీకు జాలి దయ కరుణ కృతజ్ఞత ఏకోశాన లేవు. నీవు బ్రాహ్మణ సహజమైన జపతపాదులను వదిలి విల్లు పట్టి ఇలా యుద్ధము చేయడం ధర్మము కాదు " అన్నాడు. అశ్వత్థామ ఆ మాటలు పట్టించుకొనక ధర్మరాజు మీద బాణములు గుప్పించాడు. అశ్వత్థామ అస్త్రధాటికి ఆగలేక ధర్మరాజు అక్కడి నుండి వెళ్ళాడు.
కురుపాండవ యోధుల సమరం
మార్చుభీమసేనుడితో యుద్ధము చేస్తున్న కర్ణుడు కృపాచార్యుడికి సాయంగా వచ్చాడు. భీముడు కౌరవ యోధులను తనుమాడుతున్నాడు. నకులసహదేవులతో యుద్ధం చేస్తూ సుయోధనుడు సహదేవుని ధ్వజము ఖండించి వారిద్దరి ధనస్సులు విరిచాడు. వారు వేరు ధనస్సులు ధరించి సుయోధనుడి మీద శరములు గుప్పించారు. సుయోధనుడు కోపించి వారిరువురిని బాణములతో కప్పేశాడు. వారు సుయోధనుడి చేతిలో మరణిస్తారని అనుకుంటున్న తరుణంలో ధృష్టద్యుమ్నుడు వేగంగా అక్కడకు వచ్చి వారిని రక్షించాడు. సుయోధనుడు ధృష్టద్యుమ్నుడు మీద అత్యంత తీవ్రమైన బాణము ప్రయోగించి అతడి ధనస్సును ఖండించాడు. ధృష్టద్యుమ్నుడు వేరొక విల్లు తీసుకుని సుయోధనుడి మీద బాణవర్షం కురిపించాడు. సుయోధనుడు ధృష్టద్యుమ్నుని ధనస్సు ఖండించి అతడి నుదుటన పది బాణములు నాటాడు. ఆగ్రహించిన ధృష్టద్యుమ్నుడు వేరొక ధనస్సు అందుకుని సుయోధనుడి ధనస్సు, కేతనము, రథమును విరిచాడు. సుయోధనుడు ఏమాత్రం జంకక ధృష్టద్యుమ్నుని బల్లెము, ఖడ్గం, ధ్వజము, అశ్వములను, సారథిని, కవచమును తునాతునకలు చేసాడు. అది చూసిన ధృష్టద్యుమ్నుడి సోదరుడు అతడిని తన రథము మీదకు లాక్కుని తీసుకు వెళ్ళాడు. అప్పటి వరకు సాత్యకితో పోరుతున్న కర్ణుడు అతడిని విడిచి ధృష్టద్యుమ్నుని వెంబడించాడు. సాత్యకి కర్ణుడిని తరుముతున్నాడు. ధృష్టద్యుమ్నునికి కర్ణుడికి మధ్య యుద్ధం ఘోరంగా సాగింది. వారిరువురికి మధ్యలో వచ్చి కర్ణుడిని ఎదుర్కొన్న ఎనిమిది మంది పాంచాలరాకుమారులను కర్ణుడు యమపురికి పంపాడు. తనను చుట్టుముట్టిన చేధి, పాంచాల వీరులను కర్ణుడు సంహరించి ధర్మరాజు వైపు వెళ్ళసాగాడు. అది చూసిన ఉపపాండవులు, నకులసహదేవులు, ధృష్టద్యుమ్నుడు, శిఖండి, సాత్యకి ఒక్కుమ్మడిగా కర్ణుడిని చుట్టుముట్టారు. మరొక పక్క భీమసేనుడు కౌరవసేనలను నిర్ధాక్షిణ్యంగా సంహరిస్తున్నాడు. అతడి వీరవిహారానికి మారణహోమానికి భయపడి కౌరవయోధులు అతడి ఎదుటకు రావడానికి సాహసించ లేకపోతున్నారు. అర్జునుడు సంశక్తులను సంహరించి మిగిలిన త్రిగర్త సైనికులను తరుముతున్నాడు. త్రిగర్త సైనిలుకు అర్జునుడి ధాటికి పారిపోయారు. అర్జునుడు కర్ణుడి వైపు రథము తోలమన్నాడు. అది చూసిన సుయోధనుడు త్రిగర్త సైనికులను యుద్ధోన్ముఖులను చేసి అర్జునుడితో యుద్ధానికి పంపాడు. కాంభోజసైనికులను తోడు చేసుకుని త్రిగర్తులు అర్జునుడిని ఎదుర్కొని చుట్టుముట్టారు. అర్జునుడు కాంబోజసేనలతో సహా త్రిగర్తల తలలను నరికాడు. రణభూమి అంతా వారి మొండెములతో నిండింది. తనను ఎదుర్కొన్న కాంభోజరాజు సోదరుడిని అర్జునుడు ఒకే బాణంతో అతడి చేతులు నరికాడు. అది చూసి అర్జునుడిని చుట్టుముట్టిన యవనసేనలు అతడి చేతిలో హతమయ్యాయి.
అశ్వత్థామ అర్జునుడిని ఎదుర్కొనుట
మార్చుశ్రీకృష్ణుడి రథ సారథ్యంలో అంతటాతానే అయి యుద్ధము చేస్తున్న అర్జునుడిని అశ్వత్థామ ఎదుర్కొని " అర్జునా ! నువ్వు నాతో యుద్ధము చేయుట లేదు నన్ను నీ అతిధిగా స్వీకరించి యుద్ధమును ఆతిధ్యముగా ఇవ్వు " అన్నాడు. అర్జునుడు కృష్ణుడి వంక చూసాడు. కృష్ణుడు అర్జునుడితో " అశ్వత్థామా ! అర్జునుడితో తనివి తీరా యుద్ధము చేసి సుయోధనుడి రుణం తీర్చుకో " అన్నాడు. వెంటనే అశ్వత్థామ కృష్ణుడి మీద అరవై బాణములు వేసి అర్జునుడి మీద మూడు బాణములు వేసాడు. అర్జునుడు అశ్వత్థామ ధనస్సు విరిచాడు. అశ్వత్థామ మరొక విల్లందుకుని అర్జునుడి శరీరం అంతా శరములు నాటి కృషార్జునులను రథంతో సహా బాణవర్షంలో ముంచాడు. కృష్ణార్జునులకు ఏమైందో తెలియక సైనికులు హాహాకారాలు చేసారు. కృష్ణుడు అర్జునుడి వంక చూసి " అర్జునా ! ఇదేమి వింత అశ్వత్థామ నిన్ను గెలువడమా ! నీ పరాక్రమం నశించిందా ! నీలో అధైర్యం ప్రవేశించిందా ! నీ గాండీవం బలం నశించిందా ! లేక గురుపుత్రుడని జాలి చూపుతున్నావా ! " అన్నాడు. శ్రీకృష్ణుడి మాటలకు రోషం తెచ్చుకుని అర్జునుడు కోపంతో అశ్వత్థామ విల్లు విరిచి, కేతనము విరిచాడు. అశ్వత్థామ వెంటనే ఒక బల్లెము తీసుకున్నాడు. అర్జునుడు దానిని కూడా విరిచాడు. ఇది చూసిన సంశక్తులు అర్జునుడిని చుట్టుముట్టారు. అర్జునుడు వారిని అందరిని క్షణకాలంలో చంపాడు. వారి రథము విరిచి, గజములను అశ్వములను చంపాడు. సంశక్తులకు తోడుగా అంగ, వంగ, కళింగ, నిషాద దేశ సేనలు అర్జునుడిని చుట్టుముట్టాయి. ఇంతలో అశ్వత్థామ మరొక విల్లు రథము సమకూర్చుకుని అర్జునుడిని ఎదుర్కొని కృష్ణార్జునుల మీద అత్యంత క్రూరశరములు ప్రయోగించాడు. అర్జునుడు అశ్వత్థామ శిరము మీద, కంఠము మీద, చేతుల మీద, గుండెల మీద పాదముల మీద శరప్రయోగము చేసాడు. అశ్వత్థామ రథాశ్వముల పగ్గములు ఖండించాడు. రథాశ్వములు అదుపు తప్పి రథమును ఎటో తీసుకు వెళ్ళాయి. అశ్వత్థామ తన రథమును అదుపు చేసుకుంటూ కర్ణుడి వైపు వెళ్ళాడు. అర్జునుడు మిగిలిన సంశక్తుల గర్వము అణచడానికి వెళ్ళాడు. ఇంతలో మగధరాజు దండధారుడు గజమును ఎక్కి పాండవ సైన్యంలో జొరబడి సైన్యమును నాశనం చేయసాగాడు. కృష్ణుడు " అర్జునా ! ముందు వాడి పని పట్టు " అని రథమును దండధారుని వైపు పోనిచ్చాడు. దండధారుడు కూడా అర్జునుడి ఎదురుగా గజమును ఎక్కి నిలిచి వారిపై పదునైన బాణము ప్రయోగించి కృష్ణార్జునుల మీద శరములు గుప్పించాడు. అర్జునుడు ఒకే బాణంతో దండ ధారుని చేతులు రెండు నరికి మరొక బాణంతో అతడి గజమును వధించి అతడి సైన్యములను చెల్లాచెదురు చేసాడు.
పాండ్యరాజు శౌర్యం
మార్చుఅర్జునుడు తిరిగి సంశక్తకసైన్యము మీదకు వెళ్ళాడు. ఇంతలో సుయోధనుడు తన సైన్యముతో కర్ణుడిని చేరాడు. ఇరువురి సేనలు పాండవసేనలను ఎదుర్కొన్నాయి. ఇంతలో పుళింద, బాహ్లిక, ఆంధ్ర, భోజ సైన్యాలు సుయోధనుడికి అండగా నిలిచాయి. అపారమైన సేనావాహినితో సుయోధనుడు, కర్ణుడు పాండవ సైన్యాలను చుట్టుముట్టారు. వారి ధాటికి ఆగలేక పాండవసేనలు పారిపోసాగాయి. పాండ్యరాజు మలయధ్వజుడు కౌరసేనలను కకావికలు చేస్తున్నాడు. అతడిని అశ్వత్థామ ఎదుర్కొన్నాడు. ఇరువురు ఒకరికి ఒకరు తీసిపోకుండా యుద్ధము చేస్తున్నారు. మలయధ్వజుడు అశ్వత్థామ వింటి త్రాటిని తెంచాడు. అశ్వత్థామ మరొక విల్లందుకుని మలయధ్వజుని మీద శరవర్షం కురిపించాడు. అశ్వత్థామ మలయధ్వజుడు వాయవ్యాస్త్రాన్ని సంధించి అశ్వత్థామ వేసిన బాణములను చెల్లాచెదురు చేసి అశ్వత్థామ చక్రరక్షకులను చంపి, అతడి విల్లు విరిచి, చక్రరక్షకులను చంపాడు. అశ్వత్థామ బెదరక మలయధ్వజుడు వేసిన బాణములను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నాడు. ఇంతలో పాండ్యరాజు ఒక ఏనుగును ఎక్కి ఒకే బాణంతో అశ్వత్థామ తలపై ఉండే మణిని కిందపడేలా కొట్టాడు. అశ్వత్థామ కోపం కట్టలు తెంచుకుని వీరావేశంతో ఊగిపోతూ పాండ్యరాజు అనుచరులను అతడి ఏనుగును చంపాడు. పదునైన భల్లబాణంతో పాడ్యరాజు తలనరికాడు. అది చూసి పాడ్యరాజు సేనలు పారిపోయాయి. సుయోధనుడు అశ్వత్థామను పొగడ్తలతో ముంచెత్తాడు. అశ్వత్థామ కర్ణుడికి అండగా వచ్చి పాండవసేనను తనుమాడసాగాడు. అర్జునుడు పాండవసేనకు అండగా వారి మధ్య నిలువగానే అర్జునుడు ఉన్నాడన్న ధైర్యంతో పాండవసైన్యం నిలబడింది. అప్పటికి ధృష్టద్యుమ్నుడు కర్ణునితో పోరుతున్నాడు.
ధృష్టద్యుమ్నుడు అశ్వత్థామల సమరం
మార్చుఅశ్వత్థామ ధృష్టద్యుమ్నుడిని చూసి " ఓరీ బ్రహ్మఘ్నా ! నా తండ్రిని చంపిన పాపానికి నిన్ను చంపక వదలను. ఈరోజుతో నీ ఆయువు నా చేతిలో మూడింది " అని ధృష్టద్యుమ్నుడి మీదకు ఉరికాడు. ధృష్టద్యుమ్నుడు " అశ్వత్థామా ! నన్ను బ్రహ్మఘ్నా అంటున్నావు స్వధర్మము వదిలి పరధర్మాన్ని ఆశ్రయించిన మీరు బ్రాహ్మణులా ! బ్రాహ్మణులను చంపిన పాపం బ్రాహ్మణ కులానికి అపకీర్తి తెచ్చిన నీ తండ్రిని చంపి నేను పుణ్యము సంపాదించుకున్నాను. నీ తండ్రిని చంపిన ఖడ్గం అలాగే ఉంది. దానితో నీ తల నరుకుతాను. అలా ఒకరిని ఒకరు నిందించుకుంటూ ధృష్టద్యుమ్నుడు అశ్వత్థామ వింటిని విరిచాడు. అశ్వత్థామ మరొక విల్లందుకుని ధృష్టద్యుమ్నుని సారధిని, హయములను చంపి అతడి విల్లు, పతాకమును విరిచాడు. ధృష్టద్యుమ్నుడు తన గధను తీసుకున్నాడు. అశ్వత్థామ దానిని కూడా ముక్కలు చేసాడు. ధృష్టద్యుమ్నుడు కత్తి డాలు తీసుకున్నాడు. అశ్వత్థామ వాటిని నరికి ఒక కత్తి తీసుకుని ధృష్టద్యుమ్నుడిని నరకడానికి ముందుకు దూకాడు. అది చూసిన కృష్ణుడు అర్జునా ధృష్టద్యుమ్నుడు ఆపదలో ఉన్నాడు అతడిని రక్షించు అన్నాడు. అర్జునుడు అతి క్రూరమైన బాణము అశ్వత్థామ మీద వేసాడు. ఆ బాణముల ధాటికి తట్టుకోలేని అశ్వత్థామ తిరిగి రధము దగ్గరకు వచ్చాడు. పక్కనే ఉన్న సహదేవుడు ధృష్టద్యుమ్నుడిని తన రధము మీద ఎక్కించుకుని తీసుకు వెళ్ళాడు. అర్జునుడు అశ్వత్థామను మూర్ఛిల్లేలా కొట్టాడు. అశ్వత్థామ రధ సారధి రధమును పక్కకు తీసుకు వెళ్ళాడు.
కురు పాండవయోధుల సమరం
మార్చుఅశ్వత్థామ పరాజయానికి పాండవయోధులు అర్జునుడిని కొనియాడారు. భేరీ మృదంగ నాదాలు మిన్నంటాయి. అది చూసి కర్ణుడు అర్జునుడిని ఎదుర్కొన్నాడు. త్రిగర్తసేనలు అర్జునుడిని కవ్వించాయి. అర్జునుడు " కృష్ణా ! త్రిగర్తలు మనలను కవ్విస్తున్నారు ముందు వారి పని పడతాను. కర్ణుడి సంగతి తరువాత చూడచ్చు. కర్ణుని ఎదుర్కొన్న త్రిగర్తలకు ఓడిన వారిమి ఔతాము " అన్నాడు. కృష్ణుడు రధమును త్రిగర్తల వైపు పోనిచ్చాడు. అర్జునుడు త్రిగర్తసేనలను చీల్చిచెండాడుతున్నాడు. కర్ణుడు ధర్మరాజును ఎదుర్కొన్నాడు. ఇరువురికి నడుమ పోరు ఘోరంగా సాగుతుంది. కర్ణుడు పాండవసేన లోని ప్రముఖులను, రధాశ్వములను, సారధులను వధించి వారి రధములను, కేతనములను విరుస్తున్నాడు. నకులసహదేవులు, సాత్యకి, ఉపపాండవులు కర్ణుడిని ఎదుర్కొన్నారు. కర్ణుడు ఒక్కడే వారిని ఎదుర్కొని వారిని తన బాణ పరంపరతో ముంచెత్తాడు. సుయోధనుడు గజ సైన్యాలను యుద్ధానికి పంపాడు. అంగ, వంగ, పౌండ్రక, మగధ, సుష్మ దేశాలకు చెందిన గజ సైన్యములు పాండవసేనలపై పురికొల్పాడు. గజసైన్యము పాండవసేనలను కాళ్ళతో తొక్కి నాశనం చేయసాగింది. సాత్యకి అత్యంత సాహసంతో వంగరాజును అతడి గజసైన్యమును నాశనం చేసాడు. నకులుడు పౌండ్ర రాజును, సహదేవుడు సుష్మరాజును ససైన్యంగా వధించారు. రాజులు చనిపోగానే గజములు పాండసేనల మీద విజృంభించాయి. నకులుడు అత్యంత శక్తివంతమైన బాణములు వేసి గజసేనలను నిర్మూలిస్తున్నాడు. ధృష్టద్యుమ్నుడు మొదలైన వారు ఏనుగుల గుంపులను హతమారుస్తున్నారు. యుద్ధము తీవ్రమైంది. రధములు విరుగుతున్నాయి. తలలు, కాళ్ళు, చేతులు తెగి పడుతున్నాయి. ఏనుగుల కళేబరాలు కొండల మాదిరి గుట్టలుగా పడ్డాయి. రక్తం ఏరులై పారింది. సుయోధనుడు ధర్మరాజును పట్టడానికి తన అనుయాయులతో వచ్చాడు. సాత్యకి భీమసేనుడు వారిని ఎదుర్కొని ధర్మరాజును కాపాడారు. కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ సుయోధనుడికి సాయంగా వచ్చారు. వారంతా భీముని మీద సాత్యకి మీద శరవర్షం గుప్పించి ధర్మరాజు కవచం ఖండించారు. కర్ణుడు పాండవ సేనలను దునుమాడుతూ అర్జునుడి కొరకు ఎదురు చూస్తున్నాడు. అది చూసి కృష్ణుడు " అర్జునా ! కర్ణుడు నీ కొరకు వెతుకుతున్నాడు. వెళ్ళి అతడిని వధించి సుయోధనుడిని ఒంటరి వాడిని చేసి సామ్రాజ్యలక్ష్మిని వరించు " అన్నాడు. భీమసేనుడు, సాత్యకి, ధృష్టద్యుమ్నులతో చేరి కౌరవ సేనలను తరిమి తరిమి కొడుతున్నాడు. భీముడు తనతో తలపడిన నిషాద రాజకుమారుని ఒకే బాణము వేసి అతడి తలను ఏనుగు తలను ఏక కాలంలో నరికాడు. అది చూసి నిషాద రాజకుమారుడి సైన్యం పారిపోయింది. ప్రళయకాల రుద్రుడి వలె ఉన్న భీముని ఎదిరించడానికి ఎవరికీ సాహసం లేక పోయింది. అది చూసిన దుర్యోధనుడు భీముని అడ్డగించాడు. కర్ణుడు సుయోధనుడికి సాయం వచ్చాడు. కర్ణుడు తన శరములతో శిఖండి విల్లును, కేతనమును ఖండించాడు. శిఖండి అక్కడ నుండి పారిపోయాడు. దుశ్శాసనుడు ధృష్టద్యుమ్నుడు ఒకరికి ఒకరు తీసిపోకుండా యుద్ధము చేస్తున్నారు. నకులుడు కర్ణుడి కుమారుడైన వృషసేనుడి సారథిని చంపాడు. వృషసేనుడి సైన్యము చెదిరి పోయింది. వృషసేనుడు వేరొక సారథిని తీసుకుని యుద్ధానికి వచ్చాడు. సహదేవుడు శకుని కుమారుడైన ఉలూకుడిని తీవ్రంగా గాయపరిచాడు. ఉలూకుడు ఆ దెబ్బకు పారిపోయాడు. సాత్యకి శకుని ఒకరితో ఒకరు తీవ్రంగా పోరుసల్పుతున్నారు. సాత్యకి శకుని రథాశ్వములను చంపగా శకుని రథము దిగి పారిపోయాడు. భీముడు సుయోధనుడిని సారథిని చంపి రథమును విరుగ కొట్టాడు. సుయోధనుడు మరొక రథము ఎక్కి అక్కడి నుండి తొలిగి పోయాడు. యుధామన్యుడు కృపాచార్యుని ఎదుర్కొని అతడి విల్లు విరిచాడు. కృపాచార్యుడు వేరొక విల్లు తీసుకుని యుధామన్యుడి సారథిని చంపి కేతనమును, విల్లును విరిచాడు. యుధామన్యుడు పారిపోయాడు. అశ్వత్థామ అర్జునుడిని ఎదుర్కొన్నాడు. కృష్ణార్జునుల మీద శరములు గుప్పించాడు.అర్జునుడు అశ్వత్థామ మీద అనేక దివ్యాస్త్రాలు సంధించాడు. ధర్మరాజు చిత్రసేనుడిని ఎదుర్కొని భీముడు, నకుల సహదేవులు, ధృష్టద్యుమ్నుడు సుయోధనుడిని అతడి పరివారాన్ని ఎదుర్కొన్నారు. అది చూసి కర్ణుడు సుయోధనుడికి సాయంగా వచ్చి ధర్మరాజు గుండెలకు గురిపెట్టి బాణము వేసాడు. ఆ దెబ్బకు ధర్మరాజు రథము మీద కూలబడి రథమును పక్కకు పోనిమ్మని చెప్పాడు. కౌరవులు ధర్మరాజును తరిమారు. కేకయ, పాంచాల యోధులు వచ్చి ధర్మరాజును రక్షించారు. భీముడు సుయోధనుడితో యుద్ధం చేస్తున్నాడు. కర్ణుడు కేకయ, పాంచాల సేనలను నుగ్గు చేసి ధర్మరాజును తరిమాడు. ధర్మరాజు వెను తిరిగి కర్ణుడి మీద శరవర్షం కురిపించి కర్ణుడి సారథిని హయములను చంపాడు. నకులుడు సహదేవుడు ధర్మరాజుకు సాయంగా వచ్చి కర్ణుడి మీద శరములు గుప్పించారు. కర్ణుడు విజృంభించి ధర్మరాజు తలపాగా కొట్టి అతడి సారథిని చంపాడు. ధర్మరాజు నకులుడి రథము ఎక్కాడు. ఇంతలో శల్యుడు కర్ణుడిని చూసి " కర్ణా ! ఏమిటీ పని నీపరాక్రమము అర్జునుడి మీద చూపాలి కాని ధర్మరాజు మీద కాదు. నీవు పొరపాటున ధర్మరాజును చంపితే అర్జునుడు నిన్ను వధించుట తధ్యం. కనుక ధర్మరాజును వదలి అర్జునుడితో యుద్ధము చెయ్యి. కర్ణా ! అటు చూడు నీ అనుంగు మిత్రుడు సుయోధనుడు భీమసేనుడి చేత చిక్కి నిరాయుధుడయ్యాడు. సుయోధనుడు భీముని చేతిలో మరణించిన నీ శ్రమ వృధా ! నీవు పాండవులను గెలిచినా ప్రయోజనము ఉండదు. కనుక సుయోధనుడిని రక్షించు " అన్నాడు. శల్యుని మాటలు విని కర్ణుడు ధర్మరాజును వదిలి సుయోధనుడి వైపు వెళ్ళాడు. కర్ణుడు తనను విడిచి వెళ్ళగానే ధర్మరాజు నకుల సహదేవులతో తన శిబిరానికి వెళ్ళాడు.