కిష్కింధకాండ

రామాయణం లో నాల్గవ విభాగం
(కిష్కింధ కాండ నుండి దారిమార్పు చెందింది)

కిష్కింధ కాండ లేదా కిష్కింధాకాండము (Kishkindha Kanda) రామాయణం కావ్యంలో నాల్గవ విభాగం.

భారతీయ వాఙ్మయములో రామాయణం ఆదికావ్యముగాను, దానిని సంస్కృతములో రచించిన వాల్మీకిమహాముని ఆదికవిగాను సుప్రసిధ్ధం. చాలా భారతీయ భాషలలోను, ప్రాంతాలలోను ఈ కావ్యము ఎంతో ఆదరణీయం, పూజనీయం. భారతీయుల సంస్కృతి, సాహిత్యం, ఆలోచనా సరళి, సంప్రదాయాలలో రామాయణం ఎంతో ప్రభావం కలిగి ఉంది. రామాయణంలోని విభాగాలను కాండములు అంటారు. ఒకో కాండము మరల కొన్ని సర్గలుగా విభజింపబడింది. వీటిలో కిష్కింధ కాండ నాల్గవ కాండము. ఇందులో 67 సర్గలు ఉన్నాయి. అరణ్య కాండలో సీతాపహరణం జరిగిన తరువాతి కథ కిష్కింధ కాండలో వస్తుంది. ఇందులోని ప్రధాన కథాంశాలు: రాముని దుఃఖము, హనుమంతుడు రామునకు సుగ్రీవునకు స్నేహము గూర్చుట, వాలి వధ, సీతాన్వేషణ.

సంక్షిప్త కథ మార్చు

కిష్కింధ కాండ కథ సంక్షిప్తముగా ఇక్కడ చెప్పబడింది.

హనుమంతుడు రామ లక్ష్మణులను కలసికొనుట మార్చు

 
అడవిలో రామ లక్ష్మణులను చూచిన హనుమంతుడు.

రామ లక్ష్మణులు శబరి ఆతిధ్యాన్ని స్వీకరించిన తరువాత పంపాసరోవరం అందాలను చూస్తూ ముందుకు సాగారు. విలపిస్తున్న రామునికి లక్ష్మణుడు ధైర్యం చెప్పాడు. క్రమంగా వారు ఋష్యమూక పర్వతాన్ని సమీపించారు.

తన అన్న వాలి కోపానికి గురై తరిమి వేయబడిన సుగ్రీవుడనే వానరుడు తనవారితో కలసి ఆ పర్వతం పైననే సంచరిస్తున్నాడు. మహా ధనుర్ధారులైన రామలక్ష్మణులను చూచి సుగ్రీవుడు భయం చెందాడు. వారిని గురించి తెలిసికోమని హనుమంతుని పంపాడు.

హనుమంతుడు బ్రహ్మచారి రూపంతో వారిని సమీపించి – ఓ పుణ్యపురుషులారా! తమరు వేషధారణను బట్టి తాపసులవలెనున్నారు. ధరించిన ఆయుధాలను బట్టి సర్వ శత్రు సంహారణాదక్షుల వలె ఉన్నారు. నర నారాయణుల వలెను, సూర్యచంద్రులవలెను, అశ్వినీ దేవతలవలెను కనుపిస్తున్నారు. నేను సుగ్రీవుడనే వానరుని మంత్రిని. అతడు తన అన్న ఆగ్రహానికి గురై దీనుడైయున్నాడు. మీ స్నేహాన్ని కోరుతున్నాడు. నేను కామరూపుడను గనుక వటువు వేషంలో మిమ్ములను కలవ వచ్చాను. తమ పరిచయ భాగ్యాన్ని ప్రసాదించండి అని మృదువైన మాటలతో అన్నాడు.

హనుమంతుని మాటలకు, వినయానికి రాముడు ముగ్ధుడయ్యాడు. తన తమ్మునితో ఇలా అన్నాడు – ఈతని మాటలలో ఎక్కడా అనవుసర శబ్దం గాని, అపశబ్దం గాని లేవు. వేదాలను, వ్యాకరణాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసినవాడే ఇలా మాట్లాడగలడు. ఇటువంటి వానిని మంత్రిగా కలిగిన రాజు ఏమయినా సాధించగలడు.

రాముని ఆనతిపై లక్ష్మణుడు తమ రాకకు కారణాన్ని హనుమంతునికి వివరించాడు. కార్యార్ధులమై సుగ్రీవునితో స్నేహం కోరుతున్నామని చెప్పాడు. హనుమంతుడు తన నిజరూపం ధరించి రామలక్ష్మణులను తన భుజాలపై ఎక్కించుకొని సుగ్రీవునివద్దకు తీసికొనివెళ్ళాడు.

శ్రీరామ, సుగ్రీవుల మైత్రి మార్చు

 
శ్రీరాముడు, సుగ్రీవుల మైత్రి

హనుమంతుని ద్వారా వారి వృత్తాంతాన్ని విని సుగ్రీవుడు రామలక్ష్మణులను స్వాగతించి ఆదరించాడు. సీతాపహరణ వృత్తాంతాన్ని విని, సీతమ్మను వెదకడానికి తాను సహాయపడగలన్నాడు. కొద్దిరోజుల క్రితం ఒక స్త్రీ వేరొకరిచే బలాత్కారంగా తీసికొనిపోబడుతూ ఆక్రోశిస్తున్నది. ఆమె జారవిడచిన నగలను వానరులు రామునికి చూపించారు. వాటిని చూచి రాముడు బావురుమన్నాడు. రాముడూ సుగ్రీవుడూ అగ్నిసాక్షిగా మైత్రి నెరపుకొన్నారు.. సీతను వెదకి రామునికి అప్పగిస్తానని సుగ్రీవుడు ప్రతిన బూనాడు.

రాముడు ప్రశ్నించగా సుగ్రీవుడు తనకూ తన అన్నకూ వైరం ఏర్పడిన కారణాన్ని వివరించాడు. కిష్కింధ రాజైన వాలికి సుగ్రీవుడు తమ్ముడు. విధేయుడు. ఒకమారు మాయావి అనే రాక్షసునితో యుద్ధం చేస్తూ వాలి ఒక బిలంలోపలికి వెళ్ళాడు. బిలం వెలుపలే ఉండమని వాలి తన తమ్ముడు సుగ్రీవునికి చెప్పాడు. ఒకమాసం గడచినా వారు వెలుపలికి రాలేదు. రాక్షసుని చేతిలో వాలి మరణించి ఉంటాడని భయపడ్డ సుగ్రీవుడు బిలం ద్వారాన్ని ఒక బండరాతితో మూసి నగరానికి తిరిగివచ్చాడు. మంత్రులు సుగ్రీవుడిని రాజుగా అభిషేకం చేశారు.

వాలి తిరిగివచ్చి సుగ్రీవుడిని నిందించి దండించాడు. అతని భార్య రుమను చేబట్టి సుగ్రీవుని రాజ్యంనుంచి తరిమేశాడు. సుగ్రీవుడు ఋష్యమూక పర్వతంపై తనకు విశ్వాసపాత్రులైన నలుగురు మంత్రులతో తలదాచుకొన్నాడు. మతంగమహర్షి శాపంవలన వాలి ఋష్యమూక పర్వతం సమీపానికి రాడు.

దీనుడైన సుగ్రీవుని కథ విని రాముడు తాను వాలిని సంహరిస్తానని మాట యిచ్చాడు. వాలి అసమాన బల పరాక్రమాల గురించి సుగ్రీవుడు రామునికి వివరించాడు. సుగ్రీవునకు నమ్మకం కలిగించడానికి రాముడు కొండ లాంటి దుందుభి అనే రాక్షసుని కళేబరాన్ని పది క్రోసుల దూరంలో పడేలా తన్నాడు. ఒక్క బాణంతో ఏడు సాల వృక్షాలను ఛేదించాడు. సుగ్రీవుడిని ఆలింగనం చేసుకొని, అతనికి అభయమిచ్చాడు.

సుగ్రీవుడు, వాలి పోరాటం మార్చు

 
వాలి సుగ్రీవుల పోరాటము

రాముడి అండ చూసుకొని సుగ్రీవుడు వాలిని యుద్ధానికి పిలిచాడు. అన్నదమ్ములు భీకరంగా పోరాడారు. రెండు కొండల్లా ఢీకొంటున్న వారిరువురూ ఒకే విధంగా ఉన్నారు. వారిలో వాలి ఎవరో పోల్చుకోలేక రాముడు మౌనంగా ఉండిపోయాడు. క్రమంగా సుగ్రీవుని శక్తి క్షీణించింది. వాలి అతనిని తీవ్రంగా దండించి తరిమేశాడు. లేనిపోని ఆశలు కల్పించి యుద్ధసమయంలో ఉపేక్షించినందుకు రామునితో నిష్ఠూరంగా మొరపెట్టుకొన్నాడు సుగ్రీవుడు.

అసలు కారణం వివరించి రాముడు సుగ్రీవునకు ధైర్యం చెప్పాడు. ఆనవాలుగా ఒక గజపుష్పి లతను సుగ్రీవుని మెడలో అలంకరించాడు. మళ్ళీ సుగ్రీవుడు కిష్కింధకు వెళ్ళి వాలిని యుద్ధానికి కవ్వించాడు. కోపంతో బయలు దేరిన వాలిని అతని భార్య తార వారింప ప్రయత్నించింది. అంతకు ముందే దెబ్బలు తిన్న సుగ్రీవుడు మళ్ళీ యుద్ధానికి రావడానికి అయోధ్యా రాకుమారుల అండయే కారణం కావచ్చు అని హితం పలికింది. కాని వాలి వినలేదు. తనకు ఇక్ష్వాకు రాకుమారులతో వైరం లేదు గనుక ఆ ధర్మపరులు తనకు హాని చేయరన్నాడు. కోపంతో బుసలు కొడుతూ యుద్ధానికి బయలుదేరాడు.

అన్నదమ్ములు మళ్ళీ భీకరంగా పోరాడసాగారు. వాలికి ఇంద్రుడు ఇచ్చిన కాంచనమాలా వర ప్రభావం వలన ఎదురుగా పోరాడే వారి శక్తిలో సగం వాలికి సంక్రమిస్తుంది. కనుక క్రమంగా సుగ్రీవుని బలం క్షీణించసాగింది. ఆ సమయంలోనే రామచంద్రుడు కోదండాన్ని ఎక్కుపెట్టి వజ్రసమానమైన బాణాన్ని వాలి గుండెలపై కొట్టాడు. వాలి హాహాకారాలు చేస్తూ మూర్ఛపోయాడు.

వాలి మరణం మార్చు

 
రాముని బాణం తగిలి కిందపడిన వాలి

కొంత సేపటికి వాలికి తెలివి వచ్చింది. అతని గుండెలనుండి రక్తం ధారలుగా పారుతోంది. ప్రాణాలు కడగడుతున్నాయి. ఎదురుగా రాముడు, అతనికి ఇరుప్రక్కలా లక్ష్మణుడూ, సుగ్రీవుడూ కనుపించారు. నీరసంగా రాముని చూచి వాలి ఇలా నిందించాడు.--

రాముని వాలి నిందించుట మార్చు

రామా! నీవు మహా తేజోవంతుడవు. కాని నీవు చేసిన ఈ నీచమైన పని వలన నీ వంశానికీ, తండ్రికీ అపకీర్తి తెచ్చావు. నేను నీకుగాని, వీ దేశానికి గాని ఏ విధమైన కీడూ చేయలేదు. అయినా నన్ను వధిస్తున్నావు. నీవు సౌమ్య మూర్తిగా నటిస్తున్న మాయమయుడివి. ఇంద్రియ లోభాలకు వశుడవయ్యావు. అన్ని దోషాలు నీలో కనబడుతున్నాయి. నీవు క్షుద్రుడవు, మహాపాపివి.

నా చర్మం, గోళ్ళు, రోమాలు, రక్తమాంసాలు నీకు నిరుపయోగం కనుక నన్ను మృగయావినోదం కోసం చంపావనే సాకు కూడా నీకు చెల్లదు. నీ కపటత్వం గ్రహించే నా ఇల్లాలు తార నన్ను ఎన్నో విధాలుగా వారించింది. కాని పోగాలం దాపురించిన నేను ఆమె హితవాక్యాలను పెడచెవినబెట్టాను.

నా యెదుటపడి యుద్ధం చేసే లావు నీకు లేదు. మధ్యపాన మత్తుడై నిద్రపోయేవాడిని పాము కాటు వేసినట్లుగా చెట్టుమాటునుండి నాపై బాణం వేశావు. ఇందుకు నీకు సిగ్గు కలగడంలేదా! నా సహాయమే కోరి వుంటే క్షణాలమీద రావణుడిని నీ కాళ్ళవద్ద పడవేసి నీ భార్యను నీకు అప్పగించేవాడిని.

నేను చావుకు భయపడేవాడిని కాను. సుగ్రీవుడు నా అనంతరం రాజ్యార్హుడే. కాని ఇలా కుట్రతో నన్ను చంపి నా తమ్ముడికి రాజ్యం కట్టబెట్టడం నీకు తగినపని కాదు. నీ చేతలను ఎలా సమర్ధించుకొంటావు? నా గొంతు ఎండుకు పోతోంది. ఈ బాణం నా ప్రాణాలు హరిస్తున్నది. నిస్సత్తువలో ఎక్కువ మాట్లాడలేను. కాని నీ సమాధానాన్ని వినగలను. – అని వాలి అన్నాడు.

రాముని సమాధానం మార్చు

 
వాలి మరణ సమయంలో రాముని ఉపదేశం - సుమారు 1595 నాటి చిత్రం. LACMA నుండి

వాలి పలుకులను ఆలకించి రాముడు శాంతంగా ఇలా అన్నాడు – ఇంద్ర నందనా! నీ సందేహాలు తీర్చడం నా కర్తవ్యం. అందువలన నీ అంత్యకాలం ప్రశాంతంగా ముగియవచ్చును.

నేను వేట మిష మీద నిన్ను చంపలేదు కనుక భష్యాభక్ష్య విచికిత్స అనవుసరం. ధర్మ రక్షణార్ధమే నిన్ను చంపాను. ప్రభువైన భరతుని ప్రతినిధులం గనుక మా రాజ్యంలో ధర్మహీనులను దండించే బాధ్యతా, హక్కూ మాకున్నాయి. నీ తమ్ముడు జీవించి ఉండగానే అతని భార్యను నీవు వశం చేసుకొన్నావు. నీ ప్రవర్తనలో దుష్టత్వం ఉన్నది. అందుకు మరణ దండనయే సరైన శిక్ష. కనుకనే మన మధ్య ప్రత్యక్ష వైరం లేకున్నా నిన్ను శిక్షించాను. ధర్మానికి శత్రు మిత్ర తత్వాలుండవని కిష్కింధకు రాజైన నీకు తెలుసు.

ఇక చెట్టుమాటునుండి చంపడం గురించి. నీ మెడలోని కాంచనా మాలా వర ప్రభావాన్ని నేను మన్నించాలి గనుక ఉపాయాంతరంగా కూల్చాను. ధర్మ పరాఙ్ముఖుడైన వధ్యుని వధించడానికి యుద్ధ ధర్మాలు వర్తించవు. ఇక నీవు శిక్షార్హుడవు గనుక నీతో నేను నా కార్యాలు సాధించుకో దగదు. అన్యుల సహాయం పైని ఆధారపడేవాడిని కానని నా చరిత్రే చెబుతుంది. కనుక స్వలాభం కోసం నిన్ను వధించాననుకోవడం అవివేకం.

నీ వధకు మరొక అలౌకిక పరమార్ధ కారణం ఉంది. నీవు ఇంద్రుని పుత్రుడవు. సృష్టి కర్త ఆజ్ఞ మేరకు రావణ వధలో వానరులు నాకు సహకరించాలి. కానీ నీవు రావణుడి మిత్రుడవయ్యావు. కనుక నీవు నాకు సహాయ పడితే మిత్ర ద్రోహివవుతావు. రావణుడి పక్షాన ఉంటే పితృద్రోహివవుతావు. అటువంటి మహాపాతకాలు నీకు అంటకుండా నిన్ను రక్షించాను. ఇకనైనా నా చేతలో ధర్మాన్ని తెలిసికొని చిత్త క్షోభను వర్జించి శాంతిని పొందు.

వాలి చివరి కోరికలు మార్చు

 
వాలికి అంత్యక్రియలు చేస్తున్న వానరులు

వాలి ఇలా అన్నాడు– రామా! సర్వజ్ఞుడవైన నీకు బదులు చెప్పగలిగేవాడను కాను. నీ చేతిలో మరణించడం నా పూర్వ జన్మ సుకృతం. గారాబంగా పెరిగిన నా కొడుకు అంగదుని కూడా సుగ్రీవునిలాగానే నీవు రక్షించు. నామీద వున్న ద్వేషంతో సుగ్రీవుడు తారను హింసించకుండా చూడు. నా ప్రేలాపననూ, అపరాధాలనూ మన్నించు.

తరువాత వాలి సుగ్రీవుని పిలచి తన మెడలోని కాంచనమాలను అతనికిచ్చాడు. అంగదుడిని స్వంత కొడుకులాగానే చూసుకోమన్నాడు. తార హితోక్తులను అమలు చేయమన్నాడు. రాఘవుల కార్యాలను అలక్ష్యం చేయవద్దన్నాడు.

పిన తండ్రిని కూడా తండ్రిని లాగానే గౌరవించమని అంగదునికి చెప్పాడు. దేశ కాలాలు గుర్తించి ప్రభువు పట్ల విధేయుడై ఉండాలన్నాడు. ఎవరితోనూ అతి స్నేహమూ, తీవ్ర వైరమూ మంచివికావన్నాడు. అందరి వద్దా సెలవు తీసికొని, నోరు తెరచియే మరణించాడు.

అందరూ గొల్లుమన్నారు. తనను కూడా చంపి భర్త దగ్గరకు పంపమని తార రాముని ప్రాధేయపడింది. సుగ్రీవుడు పశ్చాత్తాపంతో కుమిలి పోయి తాను కూడా మరణిస్తానన్నాడు. అందరినీ ఓదార్చి రాముడు వాలికి అంత్య క్రియలను జరపమన్నాడు. అనంతరం రాముని ఆనతిపై రాజుగా సుగ్రీవుడూ, యువరాజుగా అంగదుడూ అభిషిక్తులయ్యారు. తన వనవాస నియమం ప్రకారం పదునాలుగు సంవత్సరాలు నగరంలో ప్రవేశించకూడదు గనుక రాముడు కిష్కింధకు వెళ్ళలేదు.

శ్రీరాముని వేదన మార్చు

 
పవరాసన పర్వతముపై రామ లక్ష్మణుడు

వర్షఋతువులో అన్వేషణా యత్నం సాధ్యం కాదు గనుక నాలుగు మాసాలపాటు కిష్కింధలో సుఖభోగాలు అనుభవించమని, కార్తిక మాసం రాగానే రావణ వధకు సిద్ధం కావాలని రాముడు సుగ్రీవునకు చెప్పాడు. రామ లక్ష్మణులు ధాతు సంపన్నమైన ప్రస్రవణ పర్వతంపై నివశించసాగారు. ఆ రమణీయ ప్రదేశం వర్షాకాలంలో మరింత సుందరంగా ఉంది. అందువలన రాముడు మరింతగా సీతాస్మరణంతో రోదించ సాగాడు. దుఃఖించేవాడికి సర్వ కార్యాలు చెడుతాయని, ఒక్క నాలుగు నెలలాగితే కార్యసాధన సానుకూలమౌతుందని లక్ష్మణుడు ధైర్యం చెప్పాడు. అందుకు సాంత్వన పొందిన రాముడు తాను విచారాన్ని విడచిపెట్టి పరాక్రమాన్నే అవలంబిస్తానని, శత్రు వధకు సన్నద్ధమౌతానని మాట ఇచ్చాడు.

సుగ్రీవుని పట్ల లక్ష్మణుని ఆగ్రహం మార్చు

 
తన విధేయతను రామునికి తెలపడానికి లక్ష్మణునితో పల్లకిపై వెలుతున్న సుగ్రీవుడు

వర్షాలు వెనుకబడి ఆకాశం నిర్మలమయ్యింది. కాని సుగ్రీవుడు ధర్మార్ధవిముఖుడై రేయింబగళ్ళు కామభోగాలలోనే గడుపుతున్నాడు. ఆ సమయంలో హనుమంతుడు సుగ్రీవుని వద్దకు వెళ్ళి – మహావీరా! నీవు రాజ్యాన్ని యశస్సును పొందడానికి కారణభూతుడైన శ్రీరామ చంద్రుని కార్యాన్ని ఉపేక్షించడం తగదు. మిత్రకార్యాన్ని విస్మరిస్తే అనర్ధాలు తప్పవు. నీ కులాభివృద్ధికి హేతువైన శ్రీరామ చంద్రునికి అప్రియం కలిగించవద్దు. వెంటనే సీతాన్వేషణకు మమ్ములను ఆజ్ఞాపించు – అని హితం పలికాడు. సుగ్రీవునికి కర్తవ్యం స్ఫురణకు వచ్చింది. నీలుని పిలిచి, అన్ని దిశలనుండి వానరులను వెంటనే పిలిపించమన్నాడు. పదిహేను రోజుల్లోపు రాని వానరులకు మరణదండన అని శాసించాడు.

రాముడు సీతా వియోగంతో కుములుతున్నాడు. తాను చేసిన మేలు మరచి అలసత్వం వహించిన సుగ్రీవుని వర్తన రామునికి మరీ బాధ కలిగించింది. అది చూసి లక్ష్మణునికి ఆగ్రహం పెల్లుబుకింది. అగ్ని హోత్రునిలా మండిపడుతూ కిష్కింధకు వెళ్ళాడు. కాలసర్ప సదృశమైన ధనుస్సు ధరించి క్రోధారుణ నేత్రుడై వచ్చిన లక్ష్మణుని చూచి వానరులు భయంతో వణికిపోయారు. అంగదుడు, మంత్రులు లక్ష్మణుని రాకను సుగ్రీవునికి తెలియజేశారు. వినయంతో మెలిగి ఆ రామానుజుని ప్రసన్నం చేసుకోమని హనుమంతుడు హితవు చెప్పాడు.

ముందుగా తార వచ్చి సుగ్రీవుని చాపల్యాన్ని మన్నించమనీ, అతడు తన మిత్ర ధర్మాన్ని తప్పక నెరవేరస్తాడనీ లక్ష్మణునికి ప్రాధేయపడుతూ విన్నవించుకొని అతనిని శాంతింపజేసింది. దానితో సుగ్రీవుడు కాస్త ధైర్యం తెచ్చికొని తన అపరాధాన్ని మన్నించమని వేడుకొన్నాడు. సమస్త వానర గణాలనూ కిష్కింధకు రావాలని ఆజ్ఞాపించాడు. తన సేనా గణంతో లక్ష్మణుని వెంట శ్రీరాముని చెంతకు వెళ్ళి రాముని పాదాలపై బడ్డాడు. అతనిని రాముడు ఆలింగనం చేసుకొన్నాడు. స్నేహితులిద్దరూ కలసి సీతాన్వేషణా పధకాన్ని సిద్ధం చేసుకొన్నారు.

సీతాన్వేషణ ఆరంభం మార్చు

 
సీత హనుమంతుని తన అనుచరుడిగా గురించుటకు వీలుగా తన ఉంగరమును ఇస్తున్న రాముడు
 
సీతాన్వేషణకై వానరులు బయలుదేరుతున్నారు - 17వ శతాబ్దంనాటి చిత్రం

సుగ్రీవుని ఆజ్ఞపై వినతుడనే వానర వీరుడు వేల కొలది సేనతో తూర్పు దిక్కున సీతా మాత అన్వేషణకు వెళ్ళాడు. పడమటి దిక్కుకు సుషేణుడు, ఉత్తర దిశకు శతబలుడు పెద్ద పెద్ద సేనలతో బయలుదేరి వెళ్ళారు. అంగదుడు దక్షిణ దిశాన్వేషణా బృందానికి నాయకుడు. అన్ని దిశలలో వెళ్ళేవారికీ వారు వెతక వలసిన స్థలాలను, తీసికొనవలసిన జాగ్రత్తలను సుగ్రీవుడు వివరించి చెప్పాడు. ఒక మాసం లోపు అన్వేషణ పూర్తి కావాలనీ, సీతమ్మ జాడ తెలిపినవారికి తనతో సమానంగా రాజ్య భోగాలు కల్పిస్తాననీ మాట ఇచ్చాడు. దక్షిణం వైపుకు నిర్దేశించిన బృందంలో అంగదుడు, జాంబవంతుడు, నీలుడు, హనుమంతుడు వంటి మహావీరులున్నారు. దక్షిణ దిశవైపు సీతను తీసికొని పోయిన రాక్షసుడు లంకాధిపతి రావణుడే కావచ్చునని సుగ్రీవుని అభిప్రాయం. అది గ్రహించిన రాముడు తన అంగుళీయాన్ని సీతకు ఆనవాలుగా ఇమ్మని హనుమంతునికిచ్చాడు.

సుగ్రీవుని భౌగోళిక జ్ఞానం రాముని ఆశ్చర్య చకితుని చేసింది. దానికి కారణం అడిగాడు. తాను వాలి వలన భయంతో ప్రాణాలు రక్షించుకోవడానికి భూమండలమంతా తిరిగినందువలన ఆ విధంగా లోక పరిచయం అయ్యిందని సుగ్రీవుడు చెప్పాడు. ఒక మాసం కాలానికి తూర్పు, పడమర, ఉత్తర దిశలుగా వెళ్ళిన వానర సేనలు తమ అన్వేషణ ముగించి తిరిగి వచ్చారు. సీత కానరాలేదని చింతాక్రాంతులై మనవి చేశారు.

దక్షిణ దిశలో సాగిన అన్వేషణ మార్చు

 
సీత గురించి వానరులకు చెబుతున్న సంపాతి

దక్షిణ దిశగా వెళ్ళిన వీరులు ప్రతిచోటా గాలిస్తూ వింధ్య పర్వతం దాటారు. రజత పర్వతంపైని వెదికారు. అప్పటికే సుగ్రీవుడు పెట్టిన నెల గడువు ముగిసింది. దాహార్తులై ఋక్షబిలం అనే ఒక సొరంగంలో ప్రవేశించారు. అందులోంచి బయట పడే మార్గం కానరాలేదు. అక్కడ మేరు సావర్ణి పుత్రిక స్వయంప్రభ తపస్సు చేసుకొంటూ మహా తేజస్వినియై వెలిగిపోతున్నది. వారి కథ విని ఆమె వారికి ఆతిధ్యం ఇచ్చింది. వారిని కనులు మూసుకోమని, తన తపశ్శక్తితో దక్షిణ దిశలో సాగర తీరానికి చేర్చింది.

అంతు లేని సాగరాన్ని చూసేసరికి వారి ఆశ అడుగంటింది. సుగ్రీవుడిచ్చిన గడువు అప్పటికే ముగిసిపోయింది. సీతమ్మ జాడ కానరాలేదు. వట్టిచేతులతో కిష్కింధకు పోలేరు. ఇక మరణమే తమకు శరణమని అంగదుడూ అతని అనుచరులూ ప్రాయోపవేశానికి సిద్ధమయ్యారు. వారిలో వారు జరిగిన విషయాలు నెమరు వేసుకొంటుండగా అక్కడికి సంపాతి అనే మహాకాయుడైన గ్రద్ద వచ్చాడు. వారి ప్రసంగాన్ని పట్టి తన తమ్ముడైన జటాయువు మరణించాడని తెలిసికొని దుఃఖించాడు. రావణుడనే రాక్షసుడు సీతను ఎత్తుకొని పోయి సముద్రంలో నూరు యోజనాల అవతల లంకానగరంలో దాచాడని వారికి చెప్పాడు.

హనుమంతుని సంకల్పం మార్చు

 
సాగరాన్ని చూసి ఆశ్చర్య పోతున్న వానరులు

సీత జాడ తెలిసి సంతోషించిన వానరుల ఉత్సాహం అపార సాగరాన్ని చూడగానే నీరుగారిపోయింది. గజుడు పది ఆమడలు గెంతగలనన్నాడు. గవాక్షుడు ఇరవై ఆమడలూ, గంధమాదనుడు ఏభై ఆమడలూ, మైందుడు అరవై ఆమడలూ, ద్వివిదుడు డెబ్భై ఆమడలూ, సుషేణుడు ఎనభై ఆమడలూ లంఘించగలమన్నారు. వృద్ధుడైన జాంబవంతుడు తొంభై యోజనాలు మాత్రం ఎగురగలనన్నాడు. అంగదుడు నూరు యోజనాలు లంఘించగలను గాని తిరిగిరావడం కష్టమైతే పని చెడుతుందని అన్నాడు.

అంగదుని వారించి జాంబవంతుడు హనుమంతునితో ఇలాగన్నాడు – నాయనా! ఈ కష్టాన్ని తరింపజేయడానికి నిన్ను మించిన సమర్ధుడు లేడు. గరుత్మంతునితో సమానమైన వేగ విక్రమాలు కలవాడవు. నీకు సమానమైన బలం, తేజం, బుద్ధి కుశలత, పరాక్రమం మరెవరికీ లేవు. నీ శక్తి నీకు తెలియదు. నీవు బహువర సంపన్నుడవు. వాయుపుత్రుడవు. ఈ సముద్రం దాటడం నీకు కష్టం కాదు. త్రివిక్రముడివై విజృంభించు, లేవయ్యా ఆంజనేయా! - అని ఉత్సాహపరచాడు.

ఆంజనేయుడు పర్వకాల సముద్రంలా ఉప్పొంగిపోయాడు. దీర్ఘ దేహుడై విజృంభించాడు. అతని ముఖం ధూమం లేని అగ్నిలాగా ప్రకాశించింది. జాంబవంతునికీ, అన్య వానర ప్రముఖులకూ వందనం చేశాడు. అంగదుని ఆశీర్వదించి ఇలా అన్నాడు – మహనీయులారా! మా తండ్రికి సాటియైన నేను అవశ్యం సాగరాన్ని గోష్పదంలా లంఘిస్తాను. నా వేగానికి సాగరం అల్లకల్లోలం అవుతుంది. సీతమ్మను చూచి రామకార్యాన్ని నెరవేరుస్తాను. అవసరమైతే లంకా నగరాన్ని పెళ్ళగించుకువస్తాను. అనేక శుభశకునాలు అగుపడుతున్నాయి. మీరు నిశ్చింతగా ఉండండి. లంఘనా సమయంలో నా పద ఘట్టనకును భూమి తట్టుకోలేదు. కనుక ఈ మహేంద్రగిరిపైనుండి లంఘిస్తాను – అన్నాడు.

కార్య సాధకుడవై తిరిగి రమ్మని జాంబవంతుడు ఆశీర్వదించాడు. మహాకాయుడైన హనుమంతుడు వాయుదేవునికి మ్రొక్కి మహేంద్రగిరిపై కొంతసేపు విహరించాడు. అతడు కాలూనిన చోట పర్వతం బీటలువారి కొత్త సెలయేళ్ళు పుట్టాయి. శత్రు నాశన సమర్ధుడు, అత్యంత వేగగామి అయిన హనుమ లంకాపట్టణం చేరడానికి సంకల్పించి లంకాభిముఖంగా నిలుచున్నాడు.

కొన్ని శ్లోకాలు, పద్యాలు మార్చు

(వివిధ రచనలనుండి)

వానరులు సీత నగలు చూపినపుడు కన్నీళ్ళ పర్యంతమైన రామునికి చూపు ఆనలేదు. చూడమని లక్ష్మణుని అడుగగా అతనిలా అన్నాడు.

నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే
నూపురేత్వభిజానామి నిత్యం పాదాభివందనాత్

కేయూరాలు, కుండలాలను నేను గుర్తించలేను. కాని నిత్యం వదినకు పాదాభివందనం చేయడం వలన ఈ నూపురాలు ఆమెవని చెప్పగలను.

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

వనరులు మార్చు

  • వాల్మీకి రామాయణం – సరళ సుందర వచనం – కొంపెల్ల వేంకటరామ శాస్త్రి
  • ఉషశ్రీ రామాయణం – ఉషశ్రీ

బయటి లింకులు మార్చు