కూర్గ్ ప్రావిన్స్
కూర్గ్ ప్రావిన్స్ 1834 నుండి1947వరకు బ్రిటిష్ ఇండియా లోని ఒక ప్రావిన్స్.1947 నుండి 1950 వరకు ఇది భారతదేశ ఆధిపత్యంలో ఉంది. ఈ ప్రావిన్స్కు రాజధానిగా మెర్కా ఉండేది. దీనిని భారత ప్రభుత్వం నియమించిన కమిషనర్, తరువాత చీఫ్ కమిషనర్ నిర్వహించారు. చీఫ్ కమిషనర్ సాధారణంగా బెంగళూరు నివసించేవారు. చీఫ్ కమిషనర్, 1834 నుండి 1881 వరకు, మైసూరు కమిషనరుగా కూడా పనిచేశారు. సాధారణంగా చీఫ్ కమిషనర్ 1881 నుండి 1940 వరకు, మైసూర్ సంస్థానానికి బ్రిటిష్ నివాసిగా ఉండేవారు.[1]
కూర్గ్ ప్రావిన్స్ | |||||
ప్రావిన్స్ , భారతదేశం | |||||
| |||||
Map of Coorg Province in 1876 | |||||
Capital | మెర్కారా | ||||
చరిత్ర | |||||
- | కూర్గ్ యుద్ధం | ఏప్రిల్ 10 1834 | |||
- | భారత స్వాతంత్ర్యోద్యమం | 1947 ఆగష్టు 15 | |||
- | భారత రాజ్యాంగం కింద రాష్ట్రంగా పునర్వ్యవస్థీకరించబడింది | జనవరి 26 1947 | |||
విస్తీర్ణం | 1,582 km2 (611 sq mi) |
కూర్గ్ యుద్ధం తర్వాత కూర్గ్ రాజ్యం రద్దు అయినప్పుడు, దాని భూభాగాలు బ్రిటిష్ ఇండియాలో విలీనం చేసిననప్పుడు, 1834 మే లో కూర్గ్ ప్రావిన్స్ ఏర్పడింది. కూర్గ్ ప్రావిన్స్‌లో కొడవ భాష మాట్లాడే కొడవ తెగకు చెందిన ప్రజలు ఎక్కువగానివసించేవారు. 19వ శతాబ్దంలో, కూర్గ్‌లో అనేక కాఫీ తోటలు ఉండేవి. దీని ఫలితంగా కూర్గ్ బ్రిటిష్ సామ్రాజ్యంలో అతిపెద్ద కాఫీ ఉత్పత్తిదారుల్లో ఒకటిగా మారింది. కూర్గ్‌లోని కొడవప్రజలు వారి ధైర్యసాహసాలకు ప్రసిద్ధి చెందారు. వారు బ్రిటిష్ ఇండియన్ ఆర్మీకి అధిక సంఖ్యలో రిక్రూట్‌లను అందించారు.[2]
1924లో 15 మంది ఎన్నికైన సభ్యులు, ఐదుగురు నియామక సభ్యులుతో కూడిన శాసనమండలి ఏర్పడింది. 1950 జనవరి 26న రిపబ్లిక్ ఆఫ్ ఇండియాగా ఏర్పడినప్పుడు కూర్గ్ ప్రావిన్స్ ఇండియన్ యూనియన్‌లో పార్ట్-సి రాష్ట్రంగా మారింది. 1956లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం, 1956 ప్రకారం, రాష్ట్రం పొరుగున ఉన్న మైసూర్ రాష్ట్రంలో కలపబడింది.
చరిత్ర
మార్చు1834 ఏప్రిల్ 24న కూర్గ్ రాజ్యానికి చెందిన చివరి మహారాజు చిక్క వీరరాజేంద్ర లొంగిపోయిన తరువాత 1834 జూన్‌లో కూర్గ్ ప్రావిన్స్ స్థాపించబడింది. దీనితో కూర్గ్ యుద్ధానికి ముగిసింది. యుద్ధంలో ఈస్ట్ ఇండియా కంపెనీ దళాల కమాండర్-ఇన్-చీఫ్ జనరల్ జేమ్స్ స్టువర్ట్ ఫ్రేజర్ సైనిక నిర్వాహకుడిగా పనిచేసాడు.అతనే తిరిగి కూర్గ్ ప్రావిన్స్ మొదటి కమిషనర్‌గా కూడా పనిచేశాడు. ఫ్రేజర్ 1834 అక్టోబరులో మైసూర్ రాజ్య నివాసిగా నియమించారు. అతని తరువాత కెప్టెన్ లే హార్డీని నియమించారు. లే హార్డీ తరువాత సర్ మార్క్ కబ్బన్ 1834లో మూడవ కృష్ణరాజ వాడియార్ తొలగించన తరువాత, మైసూరు కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 1837లో, తుళు మాట్లాడే గౌడ రైతులచే ప్రేరేపించబడిన ప్రావిన్స్ పశ్చిమభాగంలో ఒక పెద్ద తిరుగుబాటు చెలరేగింది, ఇది సుదీర్ఘమైన చర్యల తరువాత చివరకు అణచివేసారు.జాతీయవాద భావాలకు ఎక్కువగా లొంగని,బ్రిటిష్ వారికి మనుషులు, డబ్బు, రవాణాతో సహాయం చేసిన కొడవ అధిపతులకు భూ మంజూరు, బిరుదులు, కూర్గ్ పతకంతో సత్కరించారు.
1859 వరకు కబ్బన్ పరిపాలన, ప్రాంతీయ పరిపాలన అన్ని శాఖలను సంస్కరించి, శాంతిభద్రతలను కఠినంగా విధించింది. అతను స్థానిక భారతీయులతో రూపొందించిన నమూనా పౌరసేవను ఏర్పాటు చేశాడు. కబ్బన్ తరువాత ఎల్. బి. బౌరింగ్ 1870 వరకు పాలించాడు. బౌరింగ్ తరువాత ఆర్. జె. మీడే, సి. బి. సాండర్స్, జె. డి. గోర్డాన్ పరిపాలించారు. 1834 నుండి 1869 వరకు, నిర్వాహకుడిని "మైసూరు, కూర్గ్ కమిషనర్" గా 1869 నుండి 1881 వరకు మైసూర్, కూర్గ్ల ప్రధాన కమిషనర్‌గా నియమించారు. 1881లో మైసూర్ రాజ్యం పునరుద్ధరించబడినప్పుడు, కూర్గ్ కమిషనర్ మైసూర్ నిర్వాహకుడిగా ఉండటం మానేసి, బెంగళూరు నుండి వ్యవహారాలను నిర్దేశించే ఒక నివాసి పదవిని భర్తీ చేశారు.
1940 జూలై 1న, కూర్గ్, మైసూరు నుండి ఆచరణాత్మకంగా స్వతంత్రంగా మారింది. ఈ ప్రావిన్స్ను నిర్వహించడానికి ప్రత్యేక చీఫ్ కమిషనర్‌గా జె. డబ్ల్యు. ప్రిచార్డును నియమించారు.ప్రిచార్డ్ తరువాత కేటోలి చెంగప్ప ఈ పదవిని నిర్వహించిన మొదటి భారతీయుడు.1947 ఆగస్టు 15న చెంగప్ప చీఫ్ కమిషనర్‌గా ఉన్నప్పుడు కూర్గ్ బ్రిటిష్ పాలన నుండి స్వతంత్రం పొందింది. 1950 జనవరి 26 వరకు ఇది ఒక ప్రావిన్స్‌గా కొనసాగింది, అప్పుడు భారత రాజ్యాంగం ప్రకారం ప్రావిన్సుల స్థానంలో రాష్ట్రాలు ఏర్పడ్డాయి.
పరిపాలన
మార్చుకూర్గ్ యుద్ధం ముగింపులో ఈస్టిండియా కంపెనీ రాష్ట్రాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు, అమర-సుళ్య, పుత్తూరు తాలూకాలు కూర్గ్ నుండి వేరు చేస్, కనరాకు జోడించ.1834 అక్టోబరు లో, కూర్గ్ ప్రావిన్స్ ఏర్పాటుతో కంపెనీ ప్రత్యక్ష పాలన ప్రవేశపెట్టింది. అప్పటి నుండి, కూర్గ్‌ను ఒక కమీషనర్, 1869 నుండి బెంగుళూరులోని ప్రధాన కమీషనర్ పాలించారు. 1881 నుండి, ప్రధాన కమీషనర్ సాధారణంగా మైసూర్ సంస్థానానికి నివాసి. అతను వర్షాకాలంలో ఫ్రేజర్‌పేట్ నుండి, మిగిలిన సంవత్సరంలో మెర్కారాలో ఉండే సూపరింటెండెంట్ ద్వారా తన వ్యవహారాలను నిర్దేశించాడు. సూపరింటెండెంట్ సాధారణంగా మైసూర్ సివిల్ సర్వీస్ యూరోపియన్ అధికారి. 1940 జూలై 1న, ప్రధాన కమీషన్ మైసూర్ రెసిడెన్సీ నుండి వేరుచేసారు. మెర్కారాలో అతని స్థానంలో ప్రత్యేక చీఫ్ కమీషనర్‌ను నియమించింది. కూర్గ్ ప్రావిన్స్ కిగ్గట్నాడ్, మెర్కారా, నంజరాజపట్న, పడినాల్కాడ్, యెడెనాల్కాడ్, యెలుసావిరసీమ్ అనే ఆరు తాలూకాలుగా విభజించబడింది. తాలూకాలను ఇంకా నాడ్స్ లేదా హోబ్లీలగా ఉపవిభజన చేశారు.1878లో కూర్గ్ లో మొత్తం 508 గ్రామాలు, మెర్కారా, విరాజ్పేట్, ఫ్రేజర్పేట్, సోమవారపేట, కొడ్లిపేట్, పొన్నంపేట్ అనే ఆరు పట్టణాలు ఉన్నాయి.
తాలూకా | తాలూకా
ప్రధాన కార్యాలయం |
ప్రాంతం
(చదరపు మైళ్ళలో) |
గ్రామాల
సంఖ్య |
---|---|---|---|
కిగ్గట్నాడ్ | హుదికేరే | 400 | 63 |
మెర్కా | మెర్కా | 209 | 57 |
నంజరాజపట్నం | ఫ్రేజర్పెట్ | 262 | 114 |
పడినాల్క్నాడ్ | నపోక్లు | 413 | 57 |
యెడెనాల్క్నాడ్ | విరాజ్పేట్ | 210 | 49 |
యెలుసావిరసీమ్ | షానివర్సాంతే | 91 | 168 |
కూర్గ్ రెవెన్యూ వ్యవస్థ 1834 ఆగస్టు 30న కల్నల్ ఫ్రేజర్ జారీచేసిన "కూర్గులో జిల్లా కార్యకర్తల ప్రవర్తనకు నియమాలు"అనే పత్రం ఆధారంగా ఉండేది. 1924 వరకు కూర్గ్ సొంత శాసనసభ కలిగిలేదు. 1875 ఫిబ్రవరి 22 నాటి నోటిఫికేషన్ ద్వారా, కూర్గ్ను 1874 నాటి షెడ్యూల్డ్ జిల్లాల చట్టం IVలో చేర్చారు. ఇది కొన్ని అఖిల భారత చట్టాల నుండి కూర్గ్ ప్రావిన్స్ను మినహాయించే అధికారాన్ని ప్రాంతీయ ప్రభుత్వానికి ఇచ్చింది. భూస్వాములకు మరిన్ని హక్కుల కోసం ప్రచారం చేయడానికి 1920లో కూర్గ్ భూస్వాముల సంఘం ఏర్పడింది.1924 జనవరి 28న, 15 మంది ఎన్నికైన, 5గురు నియమించిన సభ్యులతో కూడిన 20 మంది సభ్యుల శాసనసభ స్థాపించబడింది.ఈ శాసనసభ స్వాతంత్ర్యం తరువాత కూడా చిన్న మార్పులతో మనుగడ సాగించింది.1949లో యూరోపియన్ నియోజకవర్గం రద్దు చేయబడినప్పుడు సభ్యుల సంఖ్య రెండు తగ్గింది.
1868 నాటి కూర్గ్ కోర్టుల చట్టం XXV ప్రకారం మిగిలిన బ్రిటిష్ ఇండియాతో పాటు కొంతవరకు న్యాయ వ్యవస్థ ఏర్పాటైంది.ఈ చట్టం ప్రకారం, 1868 డిసెంబరు 1 నుండి, ఒక సుబేదార్ కోర్టు, ఒక దర్యఫట్ కచ్చేరి, ఒక అసిస్టెంట్ సూపరింటెండెంట్ కోర్టు, ఒక సూపరింటైండెంట్ కోర్టు, ఒక సెషన్స్ కోర్టు, ఒక జ్యుడిషియల్ కమిషనర్ల కోర్టు సృష్టించబడ్డాయి.ప్రతి తాలూకాకు ఒక సుబేదార్ కోర్టు ఉండేది.దీనికి ప్రతి తాలూకాలోని సుబేదార్ అధ్యక్షత వహించేవారు. దర్యాఫ్ట్ కచేరికి నలుగురు పంచాయతీదార్ల సహాయంతో స్థానిక న్యాయమూర్తి మొక్తాసిర్ అధ్యక్షత వహించేవాడు.అసిస్టెంట్ సూపరింటెండెంట్స్ కోర్టుకు ఒక ఆంగ్లేయుడు,ఒక భారతీయుడు వరుసగా మేజిస్ట్రేట్, సబ్ మేజిస్ట్రేట్ అధికారాలను కలిగి ఉన్నారు.సూపరింటెండెంట్స్ కోర్టుకు అసలు అధికార పరిధిని ఉపయోగించిన కూర్గ్ సూపరిండెంట్ అధ్యక్షత వహించేవాడు.1862 నవంబరు నుండి 1863 జూలై వరకు కూర్గ్ భాగమైన మైసూరు ప్రక్కనే ఉన్న అష్టగ్రామ విభాగపు సూపరింటెండెంటుకు సెషన్స్ కోర్టు అధ్యక్షత వహించేవాడు.కూర్గ్ జ్యుడిషియల్ కమిషనర్ ఈ ప్రావిన్స్‌లో అత్యున్నత అప్పీలేట్ అధికారం కలిగి ఉన్నారు.ఈ కార్యాలయం 1856లో స్థాపించబడింది.
జనాభా గణాంకాలు
మార్చుచారిత్రికంగా జనాభా | ||
---|---|---|
సంవత్సరం | జనాభా | ±% |
1871 | 1,68,312 | — |
1881 | 1,78,302 | +5.9% |
1891 | 1,73,055 | −2.9% |
1901 | 1,80,607 | +4.4% |
1911 | 1,74,976 | −3.1% |
1921 | 1,63,838 | −6.4% |
1931 | 1,63,327 | −0.3% |
1941 | 1,68,726 | +3.3% |
1871 జనాభా లెక్కల ప్రకారం, కూర్గ్ జనాభా 1,68,312. మొత్తం జనాభాలో హిందువులు 154,474 (91.6%) మంది, ముస్లింలు 11,304, (6.7%) మంది క్రైస్తవులు 2,410 (1.4%) మంది, జైనులు 112 మంది ఉన్నారు. ఇంకా 10 మంది పార్సీలు, ఇద్దరు చైనీయులు కూడా ఉన్నారు. హిందూ మతాన్ని అనుసరించేవారిలో, కొడవులు 26,389 (17 శాతం) మంది ఉన్నారు. మిగిలిన వారు కొడవులు కానివారు. గిరిజన హిందువులు 14,783 (9 శాతం) మంది, సంచార తెగలు, జిప్సీలు 1,344 (0.8 శాతం) మంది ఉన్నారు. బ్రాహ్మణుల రాకకు ముందు అమ్మ కొడవులు, కొడవుల అర్చక వర్గాన్ని కలిగి ఉన్నారని నమ్ముతారు. ముస్లింలు ఎక్కువగా మెర్కారా, పాడినెల్కాడ్, యెడినాల్కాడ్ తాలూకాలలో కేంద్రీకృతమై ఉన్నారు.ఇంకా లబ్బాయి, మాపిలై, పఠాన్, పిండారి వర్గాలకు చెందినవారు ఉన్నారు. కూర్గ్ లోని ముస్లింలు ప్రధానంగా సున్నీలు. 2, 410 మంది క్రైస్తవులలో 181 మంది యూరోపియన్లు, 229 మంది ఆంగ్లో-ఇండియన్లు ఉన్నారు.[3]
అధికార భాష
మార్చుకూర్గ్ ప్రావిన్స్లో అధికారిక భాష కన్నడ అయితే స్థానిక కొడవ ప్రజల మాతృభాష కొడవ తక్. కొడవ తక్ తరచుగా కన్నడ మాండలికం తప్ప మరొకటి కాదని భావించవచ్చు.భాషా శాస్త్రవేత్త రాబర్ట్ కాల్డ్వెల్ కొడవ "పాత కనారీస్ (హాలే కన్నడ, తుళు మధ్య మధ్యలో ఉంది" అని తేల్చి చెప్పారు. కూర్గ్ లో మాట్లాడే ఇతర ముఖ్యమైన భాషలలో తుళు,మలయాళం, ఆంగ్లం, వివిధ గిరిజన భాషలు ఉన్నాయి.
ఆర్థిక వ్యవస్థ
మార్చు1949-50 లో ప్రావిన్స్ మొత్తం అంచనా ఆదాయం రూ. 62.98 లక్షలు అంచనా వ్యయం రూ.87.69 లక్షలు. కూర్గ్ ప్రధాన ఉత్పత్తులు కాఫీ, టీ రబ్బరు. కూర్గ్ భారతదేశంలో అతిపెద్ద తేయాకు ఉత్పత్తిదారులలో ఒకటి, మొత్తం 415 ఎకరాలలో తేయాకు సాగు జరిగేది. కూర్గ్ రాజాల పాలనలో, వరి అత్యంత ముఖ్యమైన పంటగా సాగుచేయబడింది. రాష్ట్రం బ్రిటిష్ పాలనలోకి ప్రవేశించినప్పుడు దాని స్థానంలో కాఫీ పంట వచ్చింది. 1854లో మెర్కారా సమీపంలో మొదటి కాఫీ తోట స్థాపించబడింది.1854 నుండి 1870 వరకు కూర్గ్ లో కాఫీ సాగు వేగంగా విస్తరించింది.1857 లో 579 టన్నుల నుండి 1867 లో 3,000 టన్నులు,1876 లో 4,880 టన్నులకు ఎగుమతులు పెరిగాయి. 1871లో 1870లో పంటకు ఒక వ్యాధి సోకిన కారణంగా కాఫీ ఉత్పత్తి మందగించింది, కానీ 1878,1883 మధ్య ఉత్పత్తి గరిష్ట స్థాయికి చేరుకోవడంతో త్వరగా కోలుకుంది.స్థానిక మార్కెట్లో దిగుమతి చేసుకున్న బ్రెజిలియన్ కాఫీ పోటీ కారణంగా 1879, 1889 మధ్యకాలంలో కాఫీ ధరలు 40 శాతం పడిపోయాయి, అయితే 1890లో బ్రెజిల్ నుండి సరఫరా కొరత ఏర్పడినప్పుడు తిరిగి మార్కెట్ పుంజుకుంది. సంపదలో హెచ్చుతగ్గులతో, కాఫీ కూర్గ్ అత్యంత ముఖ్యమైన ఆదాయ వనరుగా కొనసాగింది.
వరి కూర్గ్ ప్రజల ప్రధాన ఆహార పంట. 1948-49 లో, కూర్గ్ సుమారు 11,800 టన్నుల బియ్యాన్ని మైసూర్ రాష్ట్రానికి, మద్రాస్ ప్రెసిడెన్సీలోని మలబార్ జిల్లాకు ఎగుమతి చేసింది.కేంద్రప్రభుత్వం కేటాయించిన ప్రకారం ప్రతి సంవత్సరం సుమారు 240 టన్నుల గోధుమలను మైసూర్ నుండి దిగుమతి చేసుకునేవారు.కూర్గ్ లో పండించే ఇతర ప్రధాన ఆహార పంటలు నారింజ, ఏలకులు, మిరియాలు.1950 నాటికి 41,182 ఎకరాలలో కాఫీ సాగు, 88,105 ఎకరాలలో వరి,17,924 ఎకరాలలో నారింజ, 4,370 ఎకరాలలో ఏలకులు, 3,180 ఎకరాలలో రబ్బరు, 258 ఎకరాలలో మిరియాలు సాగు చేశారు.
రవాణా, కమ్యూనికేషన్
మార్చుకూర్గ్ లో అనేక శతాబ్దాలనుండి రోడ్లు ఉన్నాయి, కానీ ఈ రోడ్లు ఎద్దుల బండ్లు , ఇతర బండ్లుకు తగినవి కావు. కూర్గ్ లో మొట్టమొదటి రహదారులను బ్రిటిష్ వారు నిర్మించారు. 19వ శతాబ్దంలో కూర్గ్ లో నిర్మించిన రెండు ప్రధాన రహదారులు ఈస్టర్న్ ట్రంక్ రోడ్, నార్తర్న్ ట్రంక్ రోడ్, రెండూ మెర్కారా వద్ద కలుస్తాయి. మైసూరు నుండి ఫ్రేజర్పేట్ వద్ద కూర్గ్ లోకి ప్రవేశించి మెర్కారా వరకు పందొమ్మిదిన్నర మైళ్ళ వరకు నడుస్తుంది.1835 జనవరిలో సాప్పర్స్ అండ్ మైన్స్ కంపెనీ నిర్మాణం ప్రారంభించి 1837లో పూర్తి చేసింది. ఈ రహదారి 1846, 1848 మధ్య పూర్తయింది.ఇది 7 వంపులతో 516 అడుగుల పొడవైన రాతి వంతెన ద్వారా కావేరినది గుండా వెళుతుంది.మెర్కారాను మంగళూరుతో కలిపే సంపాజీ ఘాట్ రహదారి 1837లో రుతుపవనాల తరువాత ప్రారంభించారు. చాలా ఆచరణాత్మక ఇబ్బందులు భరించిన తరువాత పూర్తయింది.కన్నానూరు నుండి మెర్కారా వరకు రహదారి 1849లో పూర్తయింది.1862లో కొడ్లిపేట వరకు విస్తరించబడింది. ఈ రహదారిని 1868లో రాకపోకలకు తెరిచారు. ఉత్తర ట్రంక్ రోడ్డు మెర్కారాను సోమవార్ పేట,కొడ్లిపేట మీదుగా మంజరాబాద్‌తో కలుపుతుంది, ఇది 1869లో పూర్తయింది. 1862లో కూర్గ్ ప్రావిన్స్ కోసం ప్రజా పనుల విభాగం ప్రారంభించారు.ఈ విభాగానికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాయకత్వం వహించారు.
కూర్గ్ లో రైల్వేలైనులు లేవు.అయితే ఎప్పటికప్పుడు వివిధ సూచనలు చేయబడ్డాయి.1902లో, కూర్గ్ రైతులు పశ్చిమ తీరంలో కూర్గ్ను తెలిచెర్రీతో అనుసంధానించే రైల్వే నిర్మాణానికి వైస్రాయ్ లార్డ్ కర్జన్కు పిటిషన్ వేశారు. మైసూరు నుండి తెలిచ్చేరి వరకు ఒక మార్గాన్ని నిర్మించడానికి ఒక పరిశీలన నిర్వహించబడింది, కానీ ఆ ప్రతిపాదన తరువాత నిలిపివేయబడింది.
విద్య.
మార్చు1834లో మెర్కారా, విరాజ్పేటలలో ఆంగ్లం, కనారీ భాషలను బోధించే మొదటి పాఠశాలలు ప్రారంభించారు. దీని తరువాత కిగ్గట్నాడ్ లో ఒక కనారీస్ మాధ్యమిక పాఠశాల ఏర్పడింది. విద్యాశాఖ ఏర్పాటుకు మొత్తం రూ. 90 కేటాయించారు. అయితే, నిధుల కొరత కారణంగా 1842లో కిగ్గట్నాడ్ పాఠశాల మూసివేయబడింది.1855లో, కూర్గ్ లోని మొదటి ప్రొటెస్టంట్ మిషనరీ మోగ్లింగ్ మెర్కారాలో ఒక ఆంగ్ల పాఠశాలను స్థాపించారు.1870 నాటికి, మొత్తం 25 స్థానిక పాఠశాలలు ఏర్పడ్డాయి.వాటిలో ఎక్కువ భాగం మెర్కారాలోని సెంట్రల్ స్కూల్సుకు అనుబంధంగా ఉండేవి. అన్ని తాలూకా ప్రధాన కార్యాలయాలలో ఆంగ్లో-వెర్నాక్యులర్ పాఠశాలలు ఉండేవి.
మూలాలు
మార్చు- ↑ "Welcome to Kodagu District co-operative Bank". www.kodagudccbank.com. Retrieved 2024-08-06.
- ↑ "About: Coorg Province". dbpedia.org. Retrieved 2024-08-06.
- ↑ https://language.census.gov.in/eLanguageDivision_VirtualPath/eArchive/pdf/43512_1931_COO.pdf[permanent dead link]
వెలుపలి లంకెలు
మార్చు- Richter, G (1870). Manual of Coorg- A Gazetteer of the natural features of the country and the social and political condition of its inhabitants. Mangalore: C Stolz, Basel Mission Book Depository. ISBN 9781333863098.