బ్రిటిషు భారతదేశం లోని ప్రెసిడెన్సీలు, ప్రావిన్సులు
భారత ప్రావిన్సులు (పూర్వం బ్రిటిషు ఇండియా ప్రెసిడెన్సీలు, అంతకుముందు ప్రెసిడెన్సీ పట్టణాలు) అన్నవి బ్రిటిషు పరిపాలన కాలంలో భారత ఉపఖండంలోని పరిపాలనా విభాగాలు. వీటన్నిటినీ కలిపి బ్రిటిషు ఇండియా అని పిలిచేవారు. 1612 నుంచి 1947 వరకూ ఇవి ఏదోక రూపంలో ఉన్నాయి, వీటిని మూడుగా విభజించి తెలుసుకోవచ్చు:
- 1612-1757 మధ్యకాలంలో బ్రిటిషు ఈస్టిండియా కంపెనీ మొఘల్ చక్రవర్తులు, స్థానిక పాలకుల అనుమతులు తీసుకుని పలు ప్రదేశాల్లో, అందులోనూ ప్రధానంగా భారతదేశపు తీరప్రాంతంలో వివిధ ఫ్యాక్టరీలు (వాణిజ్య కేంద్రాలు) నెలకొల్పారు. డచ్, ఫ్రెంచి వ్యాపార కంపెనీలు దీని ప్రత్యర్థులు. 18వ శతాబ్ది మధ్యకాలానికి వచ్చేసరికి మూడు "ప్రెసిడెన్సీ పట్టణాలు": మద్రాసు, బొంబాయి, కలకత్తా విస్తీర్ణంలో బాగా పెరిగాయి.
- 1757-1858 వరకూ భారతదేశంలో కంపెనీ పాలన సాగింది, ఈ కాలంలో భారతదేశంలో అత్యధిక ప్రాంతాల మీద కంపెనీ సార్వభౌమత్వాన్ని, నియంత్రణను సాధించింది - ఆ ప్రాంతాలను ప్రెసిడెన్సీలుగా పిలిచారు. ఐతే, క్రమేణా కంపెనీ ప్రభుత్వ వ్యవహారాలు బ్రిటిషు ప్రభుత్వ పర్యవేక్షణకు లోనుకావడం పెరుగుతూ వచ్చింది, కంపెనీ దాని సార్వభౌమత్వాన్ని బ్రిటిషు కిరీటంతో పంచుకోవాల్సివచ్చింది. అలానే భారతదేశంతో వాణిజ్య ప్రయోజనాలను కూడా కోల్పోసాగింది.
- 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత కంపెనీకి మిగిలిన అధికారాలు కూడా బ్రిటిషు కిరీటం పరమయ్యాయి. కొత్త బ్రిటిషు రాజ్ (1858-1947)లో సార్వభౌమత్వం ఎగువ బర్మా వంటి ఇతర ప్రాంతాలకు విస్తరించింది. పరిపాలనా సౌలభ్యం కలిగిస్తూ ప్రెసిడెన్సీలు ప్రావిన్సులగా విభజన అయ్యాయి.[1]
బ్రిటిషు ఇండియా (1793-1947)
మార్చు1608లో మొఘల్ పరిపాలకులు బ్రిటిషు ఈస్టిండియా కంపెనీ వారు సూరత్ (ప్రస్తుత గుజరాత్లో ఉంది) వద్ద చిన్న వాణిజ్య పట్టణాన్ని ఏర్పాటుచేసుకోవడానికి అంగీకరించారు, అది కంపెనీ తొలి ముఖ్యపట్టణంగా ఏర్పడింది. దీని తర్వాత 1611లో శాశ్వత ఫ్యాక్టరీని కోరమాండల్ తీరంలోని మచిలీపట్నంలో నెలకొల్పింది. 1612లో బెంగాల్లో ఫ్యాక్టరీ నెలకొల్పి బెంగాల్లో అప్పటికే వాణిజ్యం చేస్తున్న ఇతర ఐరోపా వాణిజ్య కంపెనీల్లో చేరింది.[2] ఏదేమైనా, 1707లో మరాఠాల చేతిలో, ఆ తర్వాత పర్షియన్ (1739), ఆఫ్ఘాన్ (1761) దండయాత్రల వల్ల అప్పటికే బలహీనమైన మొఘల్ సామ్రాజ్య అధికారం 1757లో ప్లాసీ యుద్ధం, 1764లో బక్సర్ యుద్ధంలో బ్రిటిషు ఈస్టిండియా కంపెనీ చేతిలో మరింత దెబ్బతింది. ఈ రెండు యుద్ధాల తర్వాత బీహార్, బెంగాల్ ప్రాంతాల్లో కంపెనీ పన్నులు స్వీకరించే అధికారాన్ని కలిగిన దివాన్ హోదాని పొందింది. 1793లో బెంగాల్లో స్థానిక పాలన (నిజామత్) రద్దుచేయడం, 1799లో నాలుగవ ఆంగ్లో-మైసూరు యుద్ధంలో మైసూరు సామ్రాజ్య పతనం వంటి పరిణామాలతో కంపెనీ క్రమేణా దాని భూభాగాలను భారతదేశ వ్యాప్తంగా విస్తరించసాగింది.[3] 19వ శతాబ్ది మధ్యకాలానికల్లా, మూడు ఆంగ్లో-మరాఠా యుద్ధాల తర్వాత ఈస్టిండియా కంపెనీ దక్షిణాసియాలో అసమానమైన రాజకీయ, సైనిక అధికారాన్ని కలిగివుంది. ఈ భూభాగంపై సర్వోన్నతాధికారం బ్రిటిషు కిరీటం కలిగివుండగా, కంపెనీ సంరక్షక సంస్థగా కొనసాగింది.[4]
భారతదేశంలో సాగిన ఈస్టిండియా కంపెనీ పాలన బెంగాల్లో ప్రారంభమై పలు ప్రాంతాల్లో జరిగిన 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత భారత ప్రభుత్వ చట్టం 1858తో ముగిసింది.[4] అప్పటి నుంచి యునైటెడ్ కింగ్‌డమ్ వలస భూభాగంగా బ్రిటిషు కిరీటం ప్రత్యక్ష పరిపాలన కిందకు వచ్చింది, 1876 నుంచి భారత సామ్రాజ్యంగా వ్యవహరింపబడింది.[5] భారతదేశం బ్రిటిషు పార్లమెంట్ చేసిన చట్టాల ద్వారా బ్రిటిషు వారు నేరుగా పరిపాలించే ప్రాంతాలను బ్రిటిషు ఇండియాగానూ,[6] పలు జాతులు, ప్రాంతాలకు చెందిన స్థానిక పాలకులు బ్రిటిషు ఆధిపత్యం అంగీకరిస్తూ, కొంతమేరకు అంతర్గత స్వతంత్ర ప్రతిపత్తితో పరిపాలిస్తున్న రాజరిక రాష్ట్రాలు (ప్రిన్స్ లీ స్టేట్స్)గానూ[7] ఏర్పడుతుంది. బ్రిటిషు ఇండియా భారతదేశ విస్తీర్ణంలోనూ, జనాభాలోనూ ప్రధాన భాగం అయింది; ఉదాహరణకు 1910లో బ్రిటిషు ఇండియా దాదాపు 54 శాతం భూభాగం, 77 శాతం జనాభా ఆక్రమించింది.[8] దీనికితోడు భారతదేశంలో పోర్చుగీస్, ఫ్రెంచి ఎక్స్ క్లేవులు ఉండేవి. 1947లో బ్రిటిషు పాలన నుంచి భారత సామ్రాజ్యం స్వాతంత్ర్యం పొందుతూ భారత, పాకిస్తాన్ డొమినియన్లుగా ఏర్పడింది. పాకిస్తాన్ లో తూర్పు బెంగాల్ (ప్రస్తుతం బంగ్లాదేశ్) కలిసివుండేది.
1824 నుంచి 1886 వరకూ బర్మాలో కొద్ది భాగం, 1886 నుంచి 1937 వరకూ బర్మా భూభాగంలో మూడింట రెండు వంతులు, బ్రిటిషు ఇండియాలో భాగంగా ఉండేది.[6] 1937 నాటికి ఈ ఏర్పాటు ముగిసి, బర్మా ప్రత్యేకమైన బ్రిటిషు కాలనీగా పరిపాలన కావడం మొదలైంది. శ్రీలంక (బ్రిటిషు పాలనలో సిలోన్), మాల్దీవులు బ్రిటిషు ఇండియాలో భాగంగా ఉండేవి కాదు. శ్రీలంక బ్రిటిషు సామ్రాజ్య వలస రాజ్యంగానూ, మాల్దీవులు బ్రిటిషు సంరక్షిత రాజ్యంగానూ ఉండేవి. దాని అత్యున్నత స్థితిలో, 20వ శతాబ్ది తొలినాళ్ళ నాటికి, బ్రిటిషు ఇండియా భూభాగం పశ్చిమంలో పర్షియా సరిహద్దుల వరకూ, వాయువ్యంలో ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల దాకా, ఉత్తరాన నేపాల్ సరిహద్దులు, ఈశాన్యంలో టిబెట్ సరిహద్దులు, తూర్పున చైనా, ఫ్రెంచి ఇండో-చైనా (ప్రస్తుతం వియత్నాం), సియాం దేశాల హద్దుల వరకూ విస్తరించివుండేది. బ్రిటిషు ఇండియాలో అరేబియా ద్వీపకల్పానికి చెందిన ఆడెన్ కూడా భాగంగా ఉండేది.[9]
కంపెనీ పరిపాలనలో (1793-1858)
మార్చు1600 డిసెంబరు 31న ఏర్పడిన ఈస్టిండియా కంపెనీ 1611లో కోరమాండల్ తీరంలో మచిలీపట్నం వద్ద, 1612లో పశ్చిమ తీరంలో సూరత్ వద్ద భారతీయ పాలకులతో వాణిజ్య సంబంధాలు ఏర్పరుచుకున్నారు.[10] 1639లో చిన్న వాణిజ్య స్థావరం మద్రాసులో ఏర్పాటుచేసుకున్నారు.[10][10] 1661లో పోర్చుగల్ రాకుమారి కేథరిన్ ఆఫ్ బ్రాగంజాకు, ఇంగ్లాండు రెండవ ఛార్లెస్ రాజుతో వివాహ సందర్భంగా బ్రిటిషు వారికి పోర్చుగీసు వారు కట్నంగా ఇచ్చిన బొంబాయి ద్వీపాన్ని ఈస్టిండియా కంపెనీ వారు బ్రిటిషు ప్రభుత్వం నుంచి లీజుకు తీసుకున్నారు.[10]
ఈలోగా మొఘల్ చక్రవర్తి షాజహాన్ నుంచి బెంగాల్లో వాణిజ్యానికి అనుమతి పొంది, 1640లో హుగ్లీ పట్టణంలో 1640లో ఫ్యాక్టరీ నెలకొల్పారు.[10] దాదాపు అర్థశతాబ్ది తర్వాత పన్ను ఎగవేత కారణంగా మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఈస్టిండియా కంపెనీని హుగ్లీ నుంచి తరమివేశాడు, జాబ్ చర్నాక్ తర్వాత మూడు గ్రామాలను కొనుగోలు చేసి 1686లో కలకత్తాగా పేరుపెట్టి కంపెనీకి కొత్త ముఖ్యపట్టణంగా చేశాడు.[10] 18వ శతాబ్ది మధ్య భాగం నాటికల్లా కోటలు, ఫ్యాక్టరీలు నెలకొన్న మూడు ప్రధాన వ్యాపార కేంద్రాలను మద్రాసు ప్రెసిడెన్సీ (లేదా సెయింట్ జార్జ్ కోట ప్రెసిడెన్సీ), బొంబాయి ప్రెసిడెన్సీ, బెంగాల్ ప్రెసిడెన్సీ (లేక విలియం కోట ప్రెసిడెన్సీ)గా పిలిచేవారు, వీటిని ఒక్కో గవర్నర్ పరిపాలించేవాడు.[11]
ప్రెసిడెన్సీలు
మార్చు-
1700లో మొఘల్ సామ్రాజ్యం, ఐరోపా వ్యాపార కేంద్రాలను సూచిస్తూ భారత ద్వీపకల్పం పటం.
-
1760లో ప్లాసీ యుద్ధం జరిగిన మూడేళ్ళకు మరాఠా సామ్రాజ్యం, ఇతర ప్రధాన రాజ్యాలు.
-
1908లో మద్రాసు ప్రెసిడెన్సీ పట్టణం పటం. 1640లో మద్రాసు సెయింట్ జార్జ్ కోటగా స్థాపితమైంది.
-
1684లో స్థాపించిన బొంబాయి ప్రెసిడెన్సీ పట్టణం (ఇక్కడ చూపించింది 1908 పటం).
-
1690లో విలియం కోటగా స్థాపించిన కలకత్తా ప్రెసిడెన్సీ పట్టణం (ఇక్కడ చూపించింది 1911 పటం).
- మద్రాసు ప్రెసిడెన్సీ: 1640లో స్థాపించింది.
- బొంబాయి ప్రెసిడెన్సీ: 1687లో ఈస్టిండియా కంపెనీ ముఖ్యపట్టణం సూరత్ నుంచి బొంబాయికి తరలివచ్చింది.
- బెంగాల్ ప్రెసిడెన్సీ: 1690లో స్థాపించిది.
1757లో ప్లాసీ యుద్ధంలో రాబర్టు క్లైవు విజయం తర్వాత, కొత్త బెంగాల్ నవాబుతో కీలుబొమ్మ ప్రభుత్వం ఈస్టిండియా కంపెనీ నిర్వహించడం ప్రారంభించింది.[12] ఐతే ఔధ్ నవాబు 1764లో బెంగాల్ దండయాత్ర చేయడం, దాని ఫలితంగా జరిగిన బక్సర్ యుద్ధంలో గెలుపు వల్ల బెంగాల్ పరపాలనకు, పన్ను వసూలు చేసుకునే హక్కులతో దివాని అధికారం 1765 నాడు సంతకం చేసుకున్న ఒప్పందం ప్రకారం 1772లో పొందింది. బెంగాల్ గా వ్యవహరించే ఈ ప్రాంతం ప్రస్తుత బంగ్లాదేశ్, పశ్చిమ బంగ, బీహార్ ప్రాంతాల్లో విస్తరించింది.[12] 1773 నాటికి కంపెనీ బెంగాల్ నిజామత్ (నేర విచారణ, శిక్షాస్మృతి అమలు అధికారం) పొంది బెంగాల్ ప్రెసిడెన్సీలో పూర్తి సార్వభౌమత్వాన్ని సాధించింది.[12] 1773-1785 మధ్యకాలంలో బెంగాల్ ప్రెసిడెన్సీ పశ్చిమ సరిహద్దులో బెనారస్ రాజా భూభాగాలు కలవడం, సాల్‌సెత్ ద్వీపం బొంబాయి ప్రెసిడెన్సీలో కలిసిపోవడం తప్పించి పెద్ద మార్పులేమీ లేవు.[13]
మూడవ ఆంగ్లో-మైసూరు యుద్ధం ఫలితంగా 1792లో మద్రాసు ప్రెసిడెన్సీలో మైసూరు సామ్రాజ్యంలోని భాగాలు కలిశాయి. 1799లో నాలుగవ ఆంగ్లో-మైసూరు యుద్ధంలో మైసూరు పతనం అనంతరం మైసూరు సామ్రాజ్యంలోని చాలా భూభాగాలు మద్రాసు ప్రెసిడెన్సీలో భాగమయ్యాయి.[13] 1801లో కంపెనీ ఆధిపత్యంలో కర్ణాటక ప్రాంతం మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా పరిపాలింపబడింది.[14]
-
1765లో భారతదేశం పటం.
-
1795లో భారతదేశం పటం..
-
1805లో భారతదేశం పటం..
-
1823లో భారతదేశం పటం..
-
1837లో భారతదేశం పటం..
-
1847లో భారతదేశం పటం.
-
1857 భారతదేశ పటం.
-
బెంగాల్, బర్మాలకు బ్రిటిషు వారి విస్తరణ.
కొత్త ప్రావిన్సులు
మార్చు1851 నాటికి, బ్రిటిషు ఈస్టిండియా కంపెనీ భారత ఉపఖండ వ్యాప్తంగా సాధించి, పరిపాలిస్తున్న భూభాగాలన్నిటినీ కేవలం నాలుగు ప్రధాన పరిపాలన విభాగాలుగానే నిర్వహించిసాగింది, అవి:
- కలకత్తా రాజధానిగా బెంగాల్ ప్రెసిడెన్సీ
- బొంబాయి రాజధానిగా బొంబాయి ప్రెసిడెన్స
- మద్రాసు రాజధానిగా మద్రాసు ప్రెసిడెన్సీ
- ఆగ్రా లెఫ్టినెంట్-గవర్నర్ స్థానంగా వాయువ్య ప్రావిన్సులు. అసలు మొదట్లో ఈ స్థానం అలహాబాదులో ఉండేది, కానీ 1834లో ఆగ్రాకు తరలించి, 1868 వరకూ అక్కడే కొనసాగించారు. 1833లో బ్రిటిషు పార్లమెంటు చట్టం 1805లో ఏర్పడిన సీడెడ్ , కాంక్వర్డ్ ప్రావిన్సులను కొత్త ఆగ్రా ప్రెసిడెన్సీగా ప్రెసిడెన్సీ హోదాని ఇస్తూ, కొత్త గవర్నరును నియమించింది. కానీ అది అమలుకు నోచుకోలేదు. 1835లో మరో పార్లమెంటు చట్టం ఈ ప్రాంతాన్ని వాయువ్య ప్రావిన్సులుగా పేరు మార్చి లెఫ్టినెంట్-గవర్నరు పరిపాలించేలా ఏర్పాటుచేస్తూ, 1836 నుంచి సర్ చార్లెస్ మెట్కాఫ్ను ఆ పదవిలో నియమించింది.[15]
1857లో సిపాయిల తిరుగుబాటు జరిగి, భారతదేశంలో కంపెనీ పాలన ముగిసి నేరుగా బ్రిటిషు ప్రభుత్వ పాలన ముగిసేనాటికి ఉన్న పాలనా విభాగాలు, వాటి విస్తరణ ఇలా ఉంది:
- బొంబాయి ప్రెసిడెన్సీ: ఆంగ్లో-మరాఠా యుద్ధాల ఫలితంగా విస్తరించింది.
- మద్రాసు ప్రెసిడెన్సీ: 18వ శతాబ్ది మధ్యకాలం నుంచి ముగిసేనాటికి కర్ణాటక యుద్ధాలు, ఆంగ్లో-మైసూరు యుద్ధాల ఫలితంగా విస్తరించింది.
- బెంగాల్ ప్రెసిడెన్సీ: ప్లాసీ యుద్ధం (1757), బక్సర్ యుద్ధం (1764) ఫలితంగా విస్తరించడం ప్రారంభించింది, రెండు, మూడవ ఆంగ్లో-మరాఠా యుద్ధాల తర్వాత మరింతగా విస్తరించింది.
- పెనాంగ్: మలేసియాలోని పెనాంగ్ 1786 నాటికి బెంగాల్ ప్రెసిడెన్సీలోని రెసిడెన్సీ అయింది, 1805 నాటికి భారతదేశంలో నాలుగవ ప్రెసిడెన్సీగా అవతరించింది, తర్వాతికాలంలో ఈ హోదా నుంచి మార్పుచెంది 1830 వరకూ స్ట్రెయిట్స్ సెటిల్మెంట్స్ లో భాగంగా ఉండేది. మళ్ళీ 1830లో బెంగాల్ ప్రెసిడెన్సీలో రెసిడెన్సీ స్థాయికి మొత్తం స్ట్రెయిట్స్ సెటిల్మెంట్లు మారిపోయాయి. చివరికి 1867లో స్ట్రెయిట్స్ సెటిల్మెంట్లతో పాటు బ్రిటిషు ఇండియా నుంచి విడివడింది.
- సీడెడ్ , కాంక్వర్డ్ ప్రావిన్సులు: 1802లో బెంగాల్ ప్రెసిడెన్సీలో భాగంగా ఏర్పడ్డాయి, 1834 చట్టం ప్రకారం ఆగ్రా ప్రెసిడెన్సీగా చేయాలన్న ప్రతిపాదన వచ్చినా, అమలుకు నోచుకోలేదు.
- అజ్మీర్-మేర్వారా-కేక్రి: 1818లో మూడవ ఆంగ్లో-మరాఠా యుద్ధం పూర్తయ్యాకా గ్వాలియర్ పాలకుడైన సింధియా స్వాధీనం చేశాడు.
- కూర్గ్: 1834లో కంపెనీ పాలిత భారతదేశంలో కలిసిపోయింది.
- వాయవ్య ప్రావిన్సులు: 1836లో అప్పటివరకూ ఉన్న సీడెడ్ , కాంక్వర్డ్ ప్రావిన్సులు (1834లో ఆగ్రా ప్రెసిడెన్సీగా ప్రతిపాదించారు) లెఫ్టినెంట్ గవర్నర్ పాలనలో ఏర్పడింది.
- సింధ్: 1843లో బొంబాయి ప్రెసిడెన్సీలో భాగమైంది.
- పంజాబ్: 1849లో మొదటి, రెండవ ఆంగ్లో-సిక్ఖు యుద్ధాల ఫలితంగా ఆక్రమించిన భూభాగం నుంచి స్థాపించారు.
- నాగ్‌పూర్ ప్రావిన్సు: 1853లో రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం నాగ్‌పూర్ సంస్థానం కంపెనీ పాలనలోకి వచ్చాక ఏర్పడింది. 1861 లో సెంట్రల్ ప్రావిన్సుల్లో కలిసిపోయింది.
- ఔధ్ 1856లో కంపెనీ పాలనలో కలిసిపోయింది, తర్వాత 1905 వరకూ వాయువ్య ప్రావిన్సులు , ఔధ్ లో భాగంగా ఛీఫ్-కమిషనర్ పరిపాలనలో ఉండేది.
-
సీడెడ్ , కాంక్వర్డ్ ప్రావిన్సుల నుంచి 1836లో ఏర్పడ్డ వాయువ్య ప్రావిన్సులు.
-
పంజాబ్ 1849లో కంపెనీ పాలనలో కలిసింది (1907-09 నాటి మ్యాప్).
-
ఔధ్ 1856లో కంపెనీ పాలనలో కలిసింది (1857 నాటి మ్యాప్).
బ్రిటిషు ప్రభుత్వ పరిపాలనలో (1858–1947)
మార్చుచారిత్రక నేపథ్యం
మార్చుప్రభుత్వ పాలనా కేంద్రాలుగా ప్రావిన్సులు అన్న ఆలోచనతో బ్రిటిషు రాజ్ ప్రారంభమైంది. 1834లో ప్రధాన శాసన మండలి (జనరల్ లెజిస్లేటివ్ కౌన్సిల్) ప్రారంభమయ్యే వరకూ, ప్రతీ ప్రెసిడెన్సీ పరిపాలనకీ గవర్నర్, కౌన్సిల్ కలసి దాని పరిపాలనకు రెగ్యులేషన్ల పేరిట చట్టాలు, నిబంధనలు ఏర్పరుచుకునే అధికారం ఉండేది. దాంతో జయించి కానీ, ఒప్పదాల ఫలితంగా కానీ ప్రెసిడెన్సీల్లో కొత్తగా చేరిన భూభాగానికి కానీ, ప్రావిన్సుకి కానీ అప్పటివరకూ ఉన్న ప్రెసిడెన్సీలో అమలవుతున్న రెగ్యులేషన్లే వర్తిస్తాయి. ఐతే కంపెనీ కొత్తగా సంపాదించిన ప్రావిన్సు అప్పటికి ఉన్న మూడు ప్రెసిడెన్సీల్లో దేనిలోనూ చేర్చకుండా ఉన్నట్టైతే, ఆయా ప్రావిన్సులో అధికారులు, ఉద్యోగుల నియామకం గవర్నర్-జనరల్ ఇష్టానికి ఎలాతోస్తే అలా చేయవచ్చు, అక్కడ పరిపాలనకు బెంగాల్, మద్రాస్, బొంబాయి ప్రెసిడెన్సీల్లో అమలవుతున్న రెగ్యులేషన్ల వర్తించేవి కాదు. అలాంటి ప్రావిన్సులను నాన్-రెగ్యులేషన్ ప్రావిన్సులు (నియమపరిధిలో లేని ప్రావిన్సులు) అని పేరొందాయి, 1833 వరకూ అలాంటి ప్రాంతాలకు శాసనాలు చేసే అధికారాన్ని కల్పించే ఏర్పాటు ఏదీ లేదు.[16] ఇలాగే జిల్లాల్లో కూడా నాన్-రెగ్యులేషన్ జిల్లాలు ఉండేవి. గంజాం, వైజాగపట్నం అటువంటి నాన్-రెగ్యులేషన్ జిల్లాలే[17] ఈ కింది ప్రావిన్సులు నాన్-రెగ్యులేషన్ ప్రావిన్సులుగా ఉండేవి:
- అజ్మీర్-మేర్వారా
- సట్లెజ్ సమీప రాజ్యాలు
- సౌగర్, నెర్బుద్దా ప్రాంతాలు
- ఈశాన్య సరిహద్దు ప్రావిన్సు (అస్సాం)
- కూచ్ బీహార్
- నైఋతి సరిహద్దు (చోటా)
- ఝాన్సీ రాజ్యం
- కుమావూన్ ప్రావిన్సు
-
1880లో బ్రిటిషు ఇండియా: మ్యాప్‌లో బ్రిటిషు ఇండియా ప్రావిన్సులు, రాజరిక రాష్ట్రాలు, భారతీయేతర బ్రిటిషు వలస రాజ్యమైన సిలోన్ ఉన్నాయి.
-
ఎగువ బర్మా స్వాధీనం, బలూచిస్తాన్ చేర్పు తర్వాత 1893లో భారతీయ సామ్రాజ్యం.
-
బెంగాల్ విభజన (1905 - 1912) సమయంలో 1909లో బ్రిటిషు రాణి యొక్క భారతీయ సామ్రాజ్యం.
-
బెంగాల్ పునరేకీకరణ, బీహార్, ఒరిస్సా కొత్త ప్రావిన్సు ఏర్పాటు, అస్సాం పున: స్థాపన తర్వాత 1915లో భారతీయ సామ్రాజ్యం.
రెగ్యులేషన్ ప్రావిన్సులు
మార్చు- సెంట్రల్ ప్రావిన్సులు: 1861లో నాగ్‌పూర్ ప్రావిన్సు, సౌగర్, నెర్బుద్దా ప్రాంతాల నుంచి సృష్టించారు. 1903 నుంచి బీరార్ పరిపాలింపబడుతూ ఉన్నా 1936లోనే సెంట్రల్ ప్రావిన్సులు , బీరార్గా పేరు మార్చారు.
- బర్మా: దిగువ బర్మా 1852లో బ్రిటిషు పాలనలో కలిసిపోగా, 1862లో ప్రావిన్సుగా ఏర్పరిచారు, ఎగువ బర్మాను 1886లో దీనిలో చేర్చారు. 1937లో బ్రిటిషు ఇండియా నుంచి విడదీసి, కొత్తగా ఏర్పరిచిన బ్రిటిషు ప్రభుత్వ బర్మా కార్యాలయం స్వతంత్రంగా పరిపాలించే ఏర్పాటుచేశారు.
- అస్సాం ప్రావిన్సు: 1874లో బెంగాల్ నుంచి విడిపోయి ఈశాన్య సరిహద్దు నాన్-రెగ్యులేషన్ ప్రావిన్సుగా ఏర్పడింది. 1905లో బెంగాల్ విభజనలో భాగంగా తూర్పు బెంగాల్ , అస్సాం అన్న కొత్త ప్రావిన్సుగా ఏర్పడింది, 1912లో అస్సాం ప్రావిన్సుగా తిరిగి ఏర్పరిచారు.
- అండమాన్ నికోబార్ దీవులు: 1875లో ప్రావిన్సుగా ఏర్పరిచారు.
- బెలూచిస్తాన్: 1887లో ప్రావిన్సుగా ఏర్పరిచారు.
-
1880 నాటి మ్యాప్‌లో మద్రాసు ప్రెసిడెన్సీ.
-
1880 నాటి మ్యాప్‌లో బొంబాయి ప్రెసిడెన్సీ.
-
1880 నాటి మ్యాప్‌లో బెంగాల్ ప్రెసిడెన్సీ.
-
1880 నాటి మ్యాప్‌లో సెంట్రల్ ప్రావిన్సులు. ప్రావిన్సు 1861లో ఏర్పాటుచేశారు.
-
1908 నాటి సెంట్రల్ ప్రావిన్సులు, బీరార్ మ్యాప్. 1903లో ఈ ప్రావిన్సులో బీరార్ చేరింది.
-
1880 నాటి మ్యాప్‌లో ఆఫ్ఘనిస్తాన్, తుర్కెస్తాన్లతో పాటుగా బెలూచిస్తాన్ కూడా స్వతంత్ర రాజ్యంగా చూపిస్తోంది.
-
1908లో బెలూచిస్తాన్: రాష్ట్రాలతో పాటుగా బ్రిటిషు బెలూచిస్తాన్‌లోని జిల్లాలు, ఏజెన్సీలు చూపుతోంది.
- వాయువ్య సరిహద్దు ప్రావిన్సు: 1901లో పంజాబ్ ప్రావిన్సులోని వాయువ్య జిల్లాల నుంచి ఏర్పాటుచేశారు.
- తూర్పు బెంగాల్ , అస్సాం: 1905లో బెంగాల్ విభజన వల్ల పూర్వపు అస్సాం ప్రావిన్సును, బెంగాల్ ప్రావిన్సు నుంచి విభజించిన తూర్పు బెంగాల్ ప్రాంతాన్ని కలిపి ఏర్పాటుచేశారు. 1912లో బెంగాల్ ప్రావిన్సులో తూర్పు బెంగాల్ ప్రాంతాన్ని కలిపివేశారు, ఈశాన్య ప్రాంతాన్ని అస్సాం ప్రావిన్సుగా తిరిగి ఏర్పాటుచేశారు.
- బీహార్ , ఒరిస్సా: 1912లో బెంగాల్ నుంచి విడదీశారు. 1936లో ఈ ప్రావిన్సు నుంచి విభజించి ఒరిస్సాని ప్రత్యేక ప్రావిన్సుగా ఏర్పాటుచేయగా, ప్రావిన్సుకు బీహార్ అని పేరుమార్చారు.
- ఢిల్లీ: 1912లో భారతదేశానికి రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చినప్పుడు పంజాబ్ నుంచి విడదీశారు.
- ఒరిస్సా: బీహార్-ఒరిస్సా ప్రావిన్సు నుంచి, మద్రాసు ప్రావిన్సు నుంచి కొన్ని ప్రాంతాలను విడదీసి 1936లో ప్రత్యేక ప్రావిన్సుగా ఏర్పరిచారు.
- సింధ్: 1936లో బొంబాయి ప్రావిన్సు నుంచి విడదీసి ఏర్పరిచారు.
- పంత్-పిప్లోడా: 1942లో స్థానిక పరిపాలకుడి నుంచి ఆక్రమించిన భూభాగాలతో ఒక ప్రావిన్సు ఏర్పరిచారు.
ప్రధాన ప్రావిన్సులు
మార్చు20వ శతాబ్ది మొదలయ్యేనాటికి బ్రిటిషు ఇండియాలో గవర్నర్ కానీ, లెఫ్టినెంట్-గవర్నర్ కానీ పరిపాలిస్తున్న ప్రావిన్సులు ఎనిమిది ఉండేవి. ఈ కింది పట్టికలో వాటి విస్తీర్ణం, జనాభా వివరాలు ఉన్నాయి (కానీ వాటిపై ఆధారపడివుండే రాజరిక రాష్ట్రాల విస్తీర్ణం, జనాభా చేర్చలేదు):[18] బెంగాల్ విభజన (1905–1912) కాలంలో కొత్తగా ఏర్పడిన తూర్పు బెంగాల్ , అస్సాం ప్రావిన్సు లెఫ్టినెంట్-గవర్నర్ పాలనలో ఉండేది. 1912లో విభజనను పాక్షికంగా తిరగదోడి, తూర్పు, పశ్చిమ బెంగాల్ ప్రాంతాలను కలిపివేశారు; అస్సాం ప్రావిన్సు మళ్ళీ ఏర్పడింది, కొత్తగా లెఫ్టినెంట్-గవర్నర్ పాలనలో బీహార్ , ఒరిస్సా ప్రావిన్సు ఏర్పడింది.
మూలాలు
మార్చు- ↑ Imperial Gazetteer of India vol. IV 1908, p. 5 (p. 5)
- ↑ Imperial Gazetteer of India vol. II 1908, pp. 452–472
- ↑ Imperial Gazetteer of India vol. II 1908, pp. 473–487
- ↑ 4.0 4.1 Imperial Gazetteer of India vol. II 1908, pp. 488–514
- ↑ Imperial Gazetteer of India vol. II 1908, pp. 514–530
- ↑ 6.0 6.1 Imperial Gazetteer of India vol. IV 1908, pp. 46–57
- ↑ Imperial Gazetteer of India vol. IV 1908, pp. 58–103
- ↑ Imperial Gazetteer of India vol. IV 1908, pp. 59–61
- ↑ Imperial Gazetteer of India vol. IV 1908, pp. 104–125
- ↑ 10.0 10.1 10.2 10.3 10.4 10.5 Imperial Gazetteer of India vol. IV 1908, p. 6
- ↑ Imperial Gazetteer of India vol. IV 1908, p. 7
- ↑ 12.0 12.1 12.2 Imperial Gazetteer of India vol. IV 1908, p. 9
- ↑ 13.0 13.1 Imperial Gazetteer of India vol. IV 1908, p. 10
- ↑ Imperial Gazetteer of India vol. IV 1908, p. 11
- ↑ Imperial Gazetteer of India, vol. V, 1908
- ↑ "Full text of "The land systems of British India : being a manual of the land-tenures and of the systems of land-revenue administration prevalent in the several provinces"". archive.org.
- ↑ Geography of India 1870
- ↑ Imperial Gazetteer of India vol. IV 1908, p. 46